2, జనవరి 2018, మంగళవారం

అభ్బా ఛ (మినీ నవల) - 2

ప్రతి ఒక్కరి కళ్ళలో భయం తొణికిసలాడుతోంది. మారు మాట్లాడకుండా అందరు తమ ఒంటికి ఉన్న నగలు, దగ్గరున్న డబ్బులు ఇంకా ఖరీదయిన మొబైల్ ఫోన్ లు అన్ని తమ దగ్గరకు జోలె పట్టుకొని వస్తున్నా దొంగలకు ఇచ్చేస్తున్నారు.  గమిని కూడా తన చెవి పోగులు, మెడలో చైన్ ఇంకా తన ఖరీదయిన మొబైల్ ఫోన్ ఇచ్చేసింది. 

సూట్ వేసుకున్న అంకుల్ దొంగ కు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. "బోంచేసి మూడు గంటలవుతోంది, ఒక్క వంద రూపాయలు ఇవ్వండి సార్, దార్లో బిర్యానీ తింటాను" అని. 

దొంగ టపీ మని ఒక్కటి పీకాడు బట్ట తల మీద.  గమిని కి చాల బాధ అనిపించింది. కోపంగా దొంగతో "హే వై అర్ యు హిట్టింగ్ హిమ్ ? వాట్ హి ఐస్ అస్కింగ్ వెరీ రీసన్ అబుల్" అంది. 

వెంటనే దొంగ "ఒరేయ్ డ్రైవర్ ఇక్కడ లైట్ వెయ్యిరా" అన్నాడు కోపంగా. లైట్ వెలుగు లో గమిని ని చుసిన దొంగ కళ్ళు జిగేల్ మన్నాయి. దొంగ కింద  నుండి పై దాక తేరిపార చూడటం మొదలు పెట్టాడు. తర్వాత "అబ్బో ! ఎం ఇంగ్లీష్ రా నాయనా. గుండె మొత్తం సర్రుమని చిరిగి పోయింది. వెంటనే కుట్లేసు కోవాలి. " అని గమిని ని పైకి లాక్కున్నాడు. 

అప్రయత్నంగా గమిని దొంగ చెంప పగల గొట్టి భయంతో వణుకుతూ  బస్సు గోడకు ఒదిగి పోయింది.  దెబ్బ తిన్న దొంగ "అయ్యయ్యో ! ఏంటి బంగారం దెబ్బ తాకిందా? మరి నాలాంటి బండ వెధవను కొడితే దెబ్బలే తాకుతాయి. దెబ్బలు తాకకుండా నన్ను ఎలా డీల్ చెయ్యాలో నేను నేర్పిస్తాను, నువ్వేమో నాకు ఇంగ్లీష్ నేర్పించు" అని గమిని చెయ్యి పట్టుకుని లాక్కొని పోతున్నాడు బస్సు దిగటానికి. 

గమిని  "ప్లీజ్ సం బాడీ హెల్ప్ మీ, ప్లీజ్ లీవ్ మీ" అని బ్రతిమాలుతూ ఏడుస్తోంది. 

దొంగ  సరదాగా నవ్వుతు  "ఊరుకో బంగారం ! నేను రొమాన్స్ లో  కింగ్,  నువ్వు ఇంగ్లీష్ లో కింగ్.  ఇద్దరం మన విద్యలు నేర్చుకొని విడిపోదాం. గమ్మున రా"  అని బలవంతంగా లాక్కొని పోతున్నాడు. 

అప్పుడే ఒక గంబిరంబున గొంతు "అమ్మాయిని వదిలేయ్ బ్రదర్" అని వినిపించింది. 

గొంతు వచ్చిన వైపు గమిని  ఆశ్చర్యంగా , దొంగ కోపంగా చూశారు. ఆదిత్య తన  సీట్ లోంచి లేస్తున్నాడు.  దొంగ వెటకారంగా "వదలను బ్రదర్" అన్నాడు అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేస్తూ. 

"వదలక పొతే పగులుద్ది బ్రదర్" అన్నాడు ఆదిత్య. 

"ఓర్నీ ! ఈ రోజేంటి ఇంత లక్కీ డే లాగా ఉంది. ఆడకుండానే ఇంగ్లీష్ కు టీచర్, రొమాన్స్ కు  స్టూడెంట్ దొరికింది. ఇప్పుడేమో హీరో తగిలాడు" అన్నాడు వెటకారంగా నవ్వుతు. 

ఇలోగా మరో దొంగ అక్కడికి చేరుకొని "ఏంట్రా ! హీరో అంటున్నావ్? హీరోలు క్యారవాన్ లో, స్టూడియో లో  ఉంటారు గాని,  ఇలా బస్సు లో,  ఈ అడవిలో ఎందుకుంటారు రా? తింగరి సన్నాసి" అని ఆదిత్య పై పంచ్ విసిరాడు కోపంగా. 

రెప్ప పాటులో తప్పించుకున్న ఆదిత్య, ఒంగి ఒక్క బలమయిన పంచ్ దొంగ ఆయువు పట్టు మీద ఇచ్చాడు. అంతే వాడు గిల గిల కొట్టుకుంటూ స్పృహ కోల్పోయాడు. ఒక్కసారిగా మొదటి దొంగ గమిని ని వదిలి దూరంగా జరిగాడు భయపడుతూ. 

"నువ్వు బంగారం తీసుకెళ్తావా, డబ్బులు తీసుకెళ్తావా లేదా మొబైల్ ఫోన్ లు తీసుకెళ్తావా ? నిన్ను ఎవడు ఆపాడు. కానీ అమ్మాయిని వదలక పొతే వాడిలాగే పడుకుంటావ్" అన్నాడు ఆదిత్య బెదిరిస్తూ. 

దొంగకు ఏంచెయ్యాలో తెలియటం లేదు. కానీ వాడి అహం మాత్రం దెబ్బతింది. ఇంతవరకు తమకు ఎదురే లేదు, ఇలాంటి వాడు ఎప్పుడు తగ్గల్లేదు. కోపంగా "అసలు ఎవడ్రా నువ్వు ? దీన్ని తీసుకెళ్తే నీకేంట్రా?" అన్నాడు. 

"నువ్వే చెప్పావ్ కదరా, హీరో అని. ప్రస్తుతానికి హీరోనే అనుకో" అన్నాడు నింపాదిగా. 

అది వినగానే దొంగ కత్తితో దాడి చెయ్యటానికి ముందుకొస్తుంటే, మరో దొంగ చెయ్యి పట్టుకొని అపి "ఇప్పుడు వాణ్ణి కొట్టటం కన్న ఇక్కడనుండి తప్పించు కోవటం ముఖ్యం. జరిగింది చాలు,  దాన్ని వదిలేసి పద" అన్నాడు. 

దానికి వాడు "ఇంగ్లీష్ లో రొమాన్స్ నేర్చుకోవాలని ఎంతో  ఆశపడ్డాను రా" అని బాధపడుతూ గమిని వంక ఆబగా చూస్తూ కింద పడ్డ దొంగని పట్టుకొని బయలు దేరాడు. దొంగలు దిగి పోగానే బస్సు బయలు దేరింది. 

గమిని ఆదిత్య దగ్గరికి వచ్చి "చాల చాల థాంక్స్ ఫర్ సేవింగ్ మీ" అంది షేక్ హ్యాండ్ ఇస్తూ.

దానికి ఆదిత్య "పోనీలెండి, మీ లాంటి హై క్లాస్ వాళ్ళను కాపాడే అదృష్టం దక్కింది మాకు" అన్నాడు పారవశ్యం నటిస్తూ .  గమిని చిన్నగా నవ్వి తన సీట్ దగ్గరికి వచ్చింది.

ఇలోగా సూట్  అంకుల్  గమిని పక్కన చేరి "ఈ రాబరీ, ఫైట్ ఇవ్వన్నీ చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. వీడు కూడా ఆ దొంగల మనిషేనేమో ! ఒక్కసారి ఆలోచించు. ఒక్క దెబ్బ పడగానే ఆ దొంగోడు ఆలా మూర్ఛ పోయాడు.  ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా అంత ఘోరంగా తియ్యటం లేదు ఫైట్లు" అన్నాడు కళ్ళు పెద్దవి చేసి.

గమిని లో అనుమానం మొదలయింది. లోపల అనుకున్నట్లుగా పైకి ఇలా అంది "మరి నన్నెందుకు కాపాడినట్లు" అని.

"ఎవరికి విడి మీద అనుమానం రాకూడదని " అన్నాడు అంకుల్.

"ఎక్కడో లాజిక్ కొడుతోంది నాకు...... అసలు"  అని ఎదో చెప్పా బోయేంతలో అంకుల్ అడ్డుకొని ఇలా అన్నాడు.

"లాజిక్ లు తియ్యటానికి  మనం పోలీసులం కాదు, ప్రయాణీకులం. సాటి ప్రయాణికుల్ని అనుమానించటం మనకు టికెట్ తో ఇచ్చిన హక్కు"  ఆలా అంకుల్ చెపుతున్న మాటలతో గమిని లో అనుమానం పెరిగి పోయింది. ఆదిత్య ను అదే పనిగా పరిశీలించటం మొదలు పెట్టింది. అవ్వేవిఁ పట్టని ఆదిత్య కళ్ళు మూసుకుని పడుకున్నాడు.

ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత మళ్ళి బస్సు ఆగింది.  సూట్ అంకుల్ కు చిర్రెత్తు కొచ్చింది. "ఇప్పటికే ఉన్నందంతా ఊడ్చి ఇచ్ఛం. ఇంకా ఎం ఉందని మళ్ళి బస్సు ఎక్కర్రా, ఎదవల్లారా?" అన్నాడు కోపంగా.

దాంతో యస్ ఐ కర్కశంగా "పోలీసులనే   వెధవలు అంటున్నాడు. ఎవడ్రా వాడు" అన్నాడు.

దాంతో బయపడ్డ అంకుల్ "ఆబ్బె నేను కాదు సార్ నేను కాదు. మిమల్ని అస్సలు కాదు" అన్నాడు కంగారు పడుతూ.

నేరుగా యస్ ఐ అంకుల్ దగ్గరికొచ్చి "నీ గొంతు విని చెప్పేస్తా రా,  అది నువ్వే అని. ఇంతకు ఎం పేరు నిది? బాగా ఫ్రాస్ట్రేట్ అయి ఉన్నావ్" అడిగాడు గంబిరంగా.

"కన్మణి సార్"

"అదేం పేరు"

"నా పేరే సార్. తమిళ్ పేరు"

"తెలుగు బాగా మాట్లాడుతున్నావ్. మరి తమిళ్ పేరేంటి ?"

"మా తాత తెలుగు రాష్టం ఏర్పడిన కూడా ఆంధ్ర యెల్లి పోకుండా చెన్నై లోనే సెటిల్ అయిపోయాడు. మా నాన్న ఇంకో మెట్టెక్కి  కుటుంబంలో అందరికి అసలు సిసలు  తమిళ్ పేర్లు పెట్టి పునాది ఇంకా గట్టిగా చేశాడు. ఇంట్లో చాల విచిత్రంగా తమిళ్ పేర్లతో తెలుగు లో మాట్లాడుకుంటాం మేము"   అన్నాడు కన్మణి అంకుల్ సరదాగా నవ్వుతు.

"ఇంతకూ ఎం చేస్తుంటావ్" అడిగాడు  యస్ ఐ కుతూహలంగా.

"ఇంట్లోనా లేక ఆఫీస్ లోన"  కన్మణి అంకుల్ సీరియస్ గా అడిగాడు.

"కాదు ! బస్సు లో రా . ఇక్కడ సీరియస్ గా ఎంక్వయిరీ జరుగుతుంటే కామెడీ చేస్తావా" అని ఒక పీకు పీకాడు యస్ ఐ.

"ఏంటి సార్ ఇది? జోక్ గా అడిగితె సీరియస్ గా కొడుతారు. ప్రతి ఒక్కళ్ళకు చేతిలో సెల్ ఫోన్ లాగ అయిపోయాను. అసలే  దొంగలు పడి జేబు లో చిల్లి గవ్వ లేకుండా తీసుకున్నారు. దొంగలతో సంబంధం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడే హాయిగా నిద్ర పోతున్నారు" అన్నాడు కన్మణి అంకుల్ ఆదిత్య సీట్ వైపు చూపిస్తూ.

"ఏంటి వాగుతున్నావ్? అతనికి దొంగలతో సంభందం ఏంటి?" ఆతృతగా అడిగాడు యస్ ఐ.

"నిజం సార్. ఒక్క దెబ్బతో దొంగను మూర్ఛ పోగొట్టాడు. చెప్పమ్మా ! ఆలా సైలెంట్ గా ఉండిపోతావే" అన్నాడు కన్మణి అంకుల్ గమిని వంక చూస్తూ.

"అంటే సార్. ఒక్క దొంగ నన్ను అల్లరి పెడుతుంటే, నన్ను కాపాడటానికి ఆ దొంగను కొట్టాడు"  అంది గమిని చిన్నగా నసుగుతూ.

దాంతో యస్ ఐ ఆదిత్య వైపు చూసి "హలో హీరో. ఒకసారి ఇలా రా" అని చిటికేసి పిలిచాడు. ఆదిత్య జరగ బోయేది ముందే ఊహించినట్లుగా నింపాదిగా తన సీట్ లోంచి  లేచి పోలీస్ ల వైపు రాసాగాడు.

(ఇంకావుంది)

2 వ్యాఖ్యలు: