31, డిసెంబర్ 2017, ఆదివారం

అభ్బా ఛ (మినీ నవల) - 1

హైదరాబాద్ బస్టాండ్ రాత్రి పది గంటల ప్రాంతం, జనంతో కిక్కిరిసి పోయిఉంది ప్రతి ప్లాటుఫామ్. వచ్చి పోయే బస్సు లతో హడావిడి ప్రతి ఒక్కరి మొహంలో గందరగోళం తాండవిస్తోంది, ఎక్కడ తామెక్కె బస్సు ఊడాయిస్తుందో ఈ హడావిడిలో అని. 

అప్పుడే ఆటో దిగి బస్టాండ్ లోకి అడుగు పెట్టాడు ఆదిత్య. తాను చెన్నై వెళ్ళటానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న బస్సు ఏ ప్లాటుఫామ్ మీదికి వస్తుందో వెతుక్కుంటూ  వెళ్ళి, అక్కడే ఒక్క రాతి బెంచ్ మీద ఖాళీ ఉంటె, చేతిలో బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. 

"ఎందుకనో ఈ ప్లాటుఫామ్ మీద ఎక్కువ జనం లేరు,  మిగతా ప్లాటుఫామ్ లో లాగా. బహుశా రిజర్వేషన్ బస్సు లు మాత్రమే ఇక్కడికి వస్తాయనుకుంటా !" అని మనసులో అనుకున్నాడు ఆదిత్య. 

వెయిట్ చేసిన కొద్దీ సేపటికి బస్సు రానే వచ్చింది. అంతే జనం ఒక్కసారిగా బస్సు మీద దాడి చేసేసారు, చివరగా ఎక్కేవారితో  ఫైన్ కట్టించుకుంటాం అని ఆర్టీసీ వారు ప్రకటించినట్లు. ఆదిత్య మాత్రం తనకు రిజర్వేషన్ ఉందన్న ధీమాతో తాపీగా అక్కడే కూర్చున్నాడు. హడావిడి అంత తగ్గి పోయాక ఎక్కి తనకు కేటాయించిన సీట్ లో కూర్చుని, ఐఫోన్ లో పాటలు వినసాగాడు. 

కొద్దిసేపయితే బస్సు కదుల్తుంది అనగా ఎవరో అమ్మాయి ఆదిత్య దగ్గరికి వచ్చి "ఎక్స్ క్యూస్ మీ, మీరు అక్కడ విండో సీట్ లో కూర్చుంటారా మీ సీట్ నాకిచ్చి ?" అంది సన్నిహితంగా. 

ఒక్కసారిగా తల పైకెత్తి అమ్మాయి వంక చూశాడు ఆదిత్య. చామన ఛాయా రంగులో,  నాజూకయినా శరీరాకృతితో ,  అందమయిన మొహంతో,  టి-షర్ట్, స్కిన్ టైట్ జీన్స్ వేసుకుని ఉంది. ఇంకేం కావాలి అమ్మాయి కి ఏదయినా సాదించటానికి ?  అందులోకి ఆదిత్య లాంటి యువకుడికి "కాదు" అని చెప్పటానికి కారణం ఉంటె మాత్రం ఆగుతాడా? అలాగే అనుకున్న అమ్మాయి వెనక నుండి తన బ్యాగ్ లు తెచ్చు కోవటానికి అన్నట్లు కదిలింది తన సీటు దగ్గరికి. 

ఒక్కసారిగా ఆదిత్య చెప్పిన సమాధానం విని దిగ్బ్రాంతికి లోనయింది. "సారి అండి, నాకు ఇక్కడ కంఫర్ట్ గా ఉంది. అక్కడికి రావటం కుదరదు" అని. 

దాంతో అమ్మాయికి కోపం నషాళానికి ఎక్కి పోయింది. "హలో ఏంటండీ ! ఇదేమయిన విండో సీటా ? ఎక్స్చేంజ్ చేసుకోవటానికి అంత రాద్ధాంతం చేస్తున్నారు  !" అని అడగాలనుకొని ఆరిచేసింది. 

ఆదిత్య మాత్రం సహనం కోల్పోకుండా "చూడండి, మీరు నన్ను సీట్ మార్చుకుంటారా ? అన్నారు నేను కోను అన్నాను. ఇందులో నేను చేసిన రాద్ధాంతం  ఏంటో ! మీరు అడిగితె ఏదయినా ఒప్పుకోవాలనుకునే ఈ సిద్ధాంతం ఏంటో ! నాకు తెలియాల్సిన  అవసరం లేదు అని మీరు అనుకున్న, తెలుసుకోవాలన ఇంట్రెస్ట్ నాకు కూడా లేదు.  విషయాన్నీ విస్తరు వేయకుండా, వెళ్ళి పోండి" అన్నాడు చిరాకుగా. 

దెబ్బ తిన్న ఆడ పులిలా మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది. అందరు  ఆడపిల్లలాగే  అబ్బాయిలను తిట్టటానికి, లేదా నోరు మూయించటానికి ఖచ్చితంగా వాడే పదునయినా ఆయుధం ఇంగ్లీష్ లో మొదలు పెట్టింది (పాపం సాగనికి సగం  అబ్బాయిలు,  వీళ్ళు ఇంగ్లీష్ మొదలు పెట్టగానే జంప్ అయిపోతూ ఉంటారు) "కంట్రీ బృట్స్ , ఐ డోంట్ నో వేర్ దే కామ్ ఫ్రామ్. డోంట్ ఈవెన్ నో హౌ టూ రెస్పెక్ట్ విమెన్" అంటూ రుసరుసలాడి పోయింది. 

ఆదిత్య మాత్రం "మీ టికెట్ చూపించండి" అన్నాడు సౌమ్యంగా. కొంచెం మెత్తపడింది అమ్మాయి మనోడు దార్లోకొస్తున్నాడు అనుకోని, "ఇట్ ఇస్ అల్సొ ఒరిజినల్ మిస్టర్" అని తన టికెట్ ఇచ్చింది అతనికి.  

టికెట్ తీసుకుంటూ "వీటిని కూడా డూప్లికేట్ చేసే దిక్కుమాలిన చీటర్ ఎవడయినా ఉంటాడా ?  ఒరిజినల్ అని బిల్డప్ ఇవ్వకపోతే" అని టికెట్ లో పేరు పైకి చదివాడు ఆదిత్య "జెమినీ" అంటూ. 

ఆదిత్య మాటలకూ, తను చదివిన పేరుకు పక్క సీటు వాళ్ళు, ముందు, వెనుక సీటు వాళ్ళు పక పక మని నవ్వారు. అవమానం, ఘోర పరాభవం. కాలేజీ లో మూడు సార్లు మిస్ కాలేజీ బ్యూటీ టైటిల్ విన్నర్ అండ్ కాబోయే డాక్టర్ కి,  ఒక మిడిల్ క్లాస్ ఫెలో (ఎలా తెలిసి పోయింది అనుకోకండి, అమ్మాయిలు కొన్ని ఆలా డిసైడ్ చేసేస్తారు), ఈ లో మిడిల్ క్లాస్ గుంపు ముందు (మళ్ళి ఆలా డిసైడ్ చేసేసింది),  ఒక మిడిల్ క్లాస్ తుప్పు పట్టిన డొక్కు బస్సు ల్లో (పాపం బస్సు కు ఎం తుప్పు పట్ట లేదు, ఉన్నంతలో ఆర్టీసీ వాళ్ళు మంచి బస్సే వేశారు) ఇంతటి ఇన్సల్ట్. 

కోపంతో ఊగిపోతూ "హే యు ఇలిటరేట్ ఇడియట్, ఇట్స్ నాట్ జెమినీ టివి  ఆర్ ఈ టివి ఆర్ మా టివి. మై నేమ్ ఇస్ గమిని. G A M I N I, రీడ్ ప్రాపర్లి.  సిల్లీ తెలుగు టివి బ్యాచ్" అంటూ తిట్టటం మొదలు పెట్టింది. 

ఆదిత్య కూడా కోపంగా "హే యు. జస్ట్ హోల్డ్ యువర్ టాంగ్ అండ్ షట్ అప్. ఇట్స్ అప్ టూ మీ టు ఎక్స్చేంజ్ ది సీట్ ఆర్ నాట్. ఐ యం నాట్ ఇంట్రెస్టేడ్, జస్ట్ గెట్ ది హెల్ ఔట్ అఫ్ హియర్" అన్నాడు. 

అతనలా మాట్లాడుతాడని ఊహించని గమిని కొంచెం దిగ్బ్రాంతికి లోనయింది. అయినా సరే ఎలాగయినా  తనదే పై మాట కావాలని "అబ్బో ! పాపం  కష్టపడింది చాలు. వొకాబులరీ అంత అయిపోయి ఉంటుంది తెలుగు లోకి రామ్మా  బట్లర్ ఇంగ్లీష్ ఆపేసి" అంది వెక్కిరిస్తూ.

దానికి ఆదిత్య ఏమాత్రం తగ్గకుండా "దీని బాబు  ఎదో ఆంగ్లో ఇండియన్ అయినట్లు బిల్డప్ ఇస్తోంది. ఆ అరుపులు చూసి చెప్పేయొచ్చు బండి మీద పుల్ల ఐస్ అమ్ముకునే పుల్కా అని" అన్నాడు.

ఇంక లాభం లేదు. సోషల్ సపోర్ట్ కి వెళ్ళి పోవాల్సిందే,  వీడి పని పట్టాల్సిందే. తన సీటుకి  కాస్త దగ్గరలో ఉన్న ఒక్క పెద్దయానికి వెళ్ళి కంప్లైంట్ చేసిందిలా "చూడండి అంకుల్ ! ఆడపిల్లనని కూడా చూడకుండా ఎంత ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నాడో? ఎవరు కూడా ఏమి మాట్లాడటం లేదు" అంది ఏడుపు మొహం పెట్టి.

అమ్మాయి లు అడిగితె అబ్బాయిలే కాదు, అప్పుడప్పుడు అంకుల్స్  కూడా టెంప్ట్ అయిపోయి ఫైటింగ్ కు రెడీ అయిపోతారు. సర్రుమని సీట్ లోంచి లేచాడు సూట్ వేసుకున్న బట్టతలా అంకుల్.  "ఎవడ్రా ఇక్కడ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు ఏడిపిస్తున్నారట ? బస్సుల్లో ఉన్నాం కాబట్టి బతికి పోతాం అనుకోవద్దు. మా వాడు అసలే ఈ ఏరియా యస్ ఐ, ఒక ఫోన్ చేస్తే చాలు బాడీ లో ఒక్క  పార్టు నుండి మరో  పార్టు కు సిగ్నల్ లేకుండా చెయ్యగల్డు" అన్నాడు హుంకరిస్తూ.

అందుకు ఆదిత్య సౌమ్యంగా "అంకుల్ మీకు విషయం పూర్తిగా తెలుసో లేదో నన్ను చెప్పనీయండి" అన్నాడు.

"ఓహో ! ఆ రౌడీ రాస్కేల్ వి నువ్వేనా ?  హైటూ, బాడీ, ఒత్తయిన జుట్టు ఉన్న  ప్రతి వాడు హీరో అనుకోవటం, అమ్మాయిలని ఏడిపిస్తూ,  అడిగిన పెద్దవాళ్లని  అంకుల్ పెంకుల్ అని ఇన్సల్ట్ చెయ్యటం. మర్యాదగా సారీ చెప్పు" అన్నాడు సూట్ అంకుల్.

"మీ ఏజ్ వాళ్ళను తాత అంటే బాధ పడాలి గాని అంకుల్ అంటే కాంప్లిమెంటే కదండీ ! అయినా,  ముందు జరిగిన విషయం ఒక్కసారి వినండి లేదా మీరయినా నా తప్పేంటో చెప్పండి" అన్నాడు ఆదిత్య.

"ఏంటి ! నువ్వు నన్ను అంకుల్ అంటే కాంప్లిమెంటా ? తాత అంటే ఒప్పుకోవాలా ?  అయినా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చాక ఇంకా తప్పొప్పుల లెక్కలుండవ్. మగాడు ఎంతో పెద్ద తప్పు చేస్తే గాని ఆడవాళ్ళు నోరు విప్పి చెప్పారు" అన్నాడు సూట్ అంకుల్ టై వదులు చేస్తూ.

"అదిగో చూశారా ! మీరు చెప్పే మాటల్లోనే తెలిసిపోతుంది మీ ఏజ్ ఏంటో ! ఎప్పుడో మీ కాలంలో ఉండే సీత, లక్ష్మి క్యారెక్టర్ ల గురించి చెప్పటం కాదు,  ఇప్పుడు ఉండే లేడిలకు కేడీలకు పెద్ద తేడా లేదన్నా  సంగతి,  మీకు తెలీదన్న విషయం,  నాకు తెలుసనీ,  మీకు తెలుసనీ, నాకు తెలిసిన నేనేం పట్టించుకోనని మీరు తెలుసుకుంటే  మంచిది"  అన్నాడు వెటకారంగా.

"ఏయ్ ఏయ్ ఏంటి ఎదో వంకర టింకరగా మాట్లాడితే వదిలేస్తాం అనుకోకు. అసలు  మా వాడు  వచ్చాడంటే సిగ్నల్స్ రాకుండా చెయ్యగలడు" అని ట్రెండీ వార్నింగ్ ఇచ్చాడు సూట్ అంకుల్.

"ఇందాకట్నుంచి సిగ్నల్స్ సిగ్నల్స్ అని తెగ వార్నింగ్ లు ఇస్తున్నావ్. మీ వాడు పోలీసా లేక మొబైల్ మెకానిక్ ఆ ? అమ్మాయి హెల్ప్ అడిగితె గోచి కూడా పికిచ్చే రకం కాదు మనం. వెళ్ళి సీట్ లో సెటిల్ ఆవ్వు, అసలే బస్సు కదిలేలా ఉంది.  స్పీడ్ కి పడిపోతే   మళ్ళి  అదో గోల"  అన్నాడు ఆదిత్య పెడసరంగా.

దానికి పక్క వాళ్ళందరూ పక పక మని నవ్వారు. అంకుల్ కోపంగా "ఏంటయ్యా ఇది ! ఒక రౌడీ ఫెలో ఒక అమ్మాయిని ఏడిపిస్తూ, అడ్డొచ్చిన నన్ను తిడుతూంటే నవ్వటానికి సిగ్గు లేదు ? మీ ఇంట్లో ఆడవాళ్లను రేపు ఎవడో ఇలాగె రేప్ చేస్తాడు, అప్పుడు కూడా ఇలాగె నవ్వండి" అన్నాడు.

అంతలో ఒక పెద్దావిడ కోపంగా  సీట్ లోంచి లేచి అంకుల్ చొక్కా పట్టుకుని రెండు చెంపలపై  టపీ టపీ మని పీకింది.  గమిని, అంకుల్ నివ్వెర పోయి చూస్తుండి పోయారు. "నీ వయసేంటి, మాట్లాడే మాటలేంటి. అసలు ఆ అబ్బాయి తన సీట్ ఇవ్వాలో యివ్వకూడదో అతని ఇష్టం. మధ్యలో నువ్వొచ్చి కెలికింది కాకుండా, అందరి ఇళ్ళలో ఆడ పిల్లల్ని రేప్ చెయ్యాలా ?" అంది ఇంకా ఆవేశ పడుతూ.

అంకుల్ షాక్ తిన్నాడు. అందరు పెద్దావిడని సమర్థిస్తూ అంకుల్ ని "మర్యాదగా  వెళ్ళి కూర్చో లేకపోతె రన్నింగ్ బస్ దిగాల్సి ఉంటుంది" అని బెదిరించారు.

సీటు  దగ్గరికి వెళ్ళాక నెమ్మదిగా అడిగాడు అంకుల్ గమినిని "సీట్ ఏంటామ్మా ? అసలు జరిగిన గొడవేంటి ?" అని.

గమిని చిన్నగా నసుగుతూ "అంటే నైట్ టైమ్ నాకు విండో సీట్ అంటే భయం, అందుకే తన సీట్  మార్చుకొమ్మంటే కుదర్దు అన్నాడు. గొడవ పెడితే లేస్తాడని.... ఇలా"  అని ఆపేసింది.

"చాల బాగుంది తల్లి. నీ లాభం నువ్వు చూసుకున్నవ్, వాడి సీటు వాడు చూసుకున్నాడు. మధ్యలో ముసలి దాంతో ఉత్తి పుణ్యానికి తన్నులు తిన్న సన్నాసిని నేను. అసలు నువ్వు ఆ తింగరి వెధవనే సీటు కోసం ఎందుకు అడిగావ్" అడిగాడు నిట్టూరుస్తూ.

"బస్సు లో అతను ఒక్కడే  యంగ్ గా, హ్యాండ్సమ్ గా  ఉన్నాడు. అమ్మాయి అడిగితె తప్పకుండా ఒప్పుకుంటాడని అనుకున్నాను" అంది అమాయకంగా.

"మరి హెల్ప్ కోసం నా దగ్గరికే ఎందుకు వచ్చావ్ ? బస్సు లో నేను మాత్రమే బకరా లాగా కనిపించినా ?" అడిగాడు  కుమిలిపోతూ .

"అయ్యో లేదంకుల్. అందరిలో మీరు డిగ్నిఫైడ్ గా కనిపించారు, సూట్,  టై కట్టుకుని" అంది గమిని.

"పెళ్ళికి వచ్చి,  డ్రెస్ మార్చుకొనే టైం లేక అలాగే బస్సు ఎక్కేసాను. అంత  నా ఖర్మ. ఇంకా పడుకో తల్లి" అని రెండు చేతులతో దండం పెట్టి ,  కళ్ళు మూసుకుని పడుకున్నాడు.

బస్సు కదలటం మొదలయింది. గమిని కిటికీ వైపు చూడకుండా, ఇటు వైపు తిరిగి పడుకుంది.  ఆదిత్యను తిట్టుకుంటూ. ఆలా రెండు గంటలు ప్రయాణం చేసిన బస్సు ఒక అడవి ప్రాంతం లో ఆగిపోయింది. వెంటనే హడావిడిగా ఆరుగురు మొహానికి  ముసుగులు కట్టుకున్న మనుష్యులు బస్సు ఎక్కారు.

అందులో ఒక్కడు "మర్యదగా మీ దగ్గర ఉన్న నగలు, డబ్బులు, ఖరీదయిన మొబైల్ ఫోన్ లు అన్ని మరో మారు అడగకుండా ఇచ్చేయండి" అని హుంకరించాడు. వాళ్ళందరి చేతులలో కత్తులు తళ తళ మెరిసిపోతున్నాయి.

(ఇంకావుంది)