1, అక్టోబర్ 2017, ఆదివారం

నా బరువు ! నా ఇష్టం !!

ఆఫీస్ నుండి ఇంట్లో కి  అడుగు పెట్టగానే, ఏ విధమయిన సువాసనలు లేక పోయే సరికి రఘురాం కు మండి పోయింది . వెంటనే భార్యతో "ఏంటి భయట వర్షం పడుతుంది, ఎగ్ బజ్జి నో లేక మిర్చి బజ్జి నో చెయ్యమని చెప్పాను కదా ఫోన్ చేసి ! ఎందుకు చెయ్యలేదు ?"  కోప్పడ్డాడు. 

దానికి సౌమ్య సౌమ్యంగా "నిన్ననే కదండీ సాయంత్రం వచ్చేటప్పుడు చాట్, సమోసా అని ఇంటికి తెచ్చుకుని మరి లాగించారు. మళ్ళి ఈ రోజు బజ్జిలు, మిర్చి లు అంటూ రెడీ అయిపోయారు" అంది. 

"అంటే ! సంపాదించే వాడికి కనీసం కావాల్సింది తినే హక్కు లేదా? లేక పని  తప్పించుకునే తెలివి తేటల?"

"ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను అనే కదా మీ ఏడుపు ? కానీ నేను చెప్పేది పని తప్పించు కోవటానికి కాదు. మీ ఆరోగ్యం గురించి బెంగపడి మాట్లాడుతున్నాను" 

"ఏమైంది ఇప్పుడు నా ఆరోగ్యానికి ? లేని పోని సాకులతో నా సరదాలు, చిన్న చిన్న కోరికలు కూడా చంపేస్తున్నావ్. నీకు అంత ఇబ్బంది గా ఉంటె వచ్ఛే టప్పుడు నేనే తెచ్చుకునే వాణ్ణి కదా !" అంటూ బయటకి దారి తీసాడు.

"దయచేసి ఆగండి ! ఆ రోడ్డు మీద చెత్త ఆయిల్ తో, నాసి రకం పిండితో చేసే వాటి కన్న నేను ఇంట్లో నే చేస్తాను. నాకు ఒక్క పదిహేను నిముషాలు ఇవ్వండి" అని బ్రతిమాలుతూ కిచెన్ లోకి దారి తీసింది.

రఘురాం చిరాకు పడుతూనే "ఈ బుద్ది ముందే ఉండాలి" అని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి సోఫా లో కూలబడ్డాడు.

ఏడేళ్ల కొడుకు రోషన్ తండ్రి దగ్గరికి వచ్చి "డాడి    మన  అపార్ట్మెంట్ లో  అందరు క్రికెట్ ఆడుతున్నారు, వన్ కిడ్ అండ్ వన్ డాడ్, గ్రూప్స్ ఫార్మ్ చేసి టీమ్స్ చేస్తున్నారు. మనం కూడా ఎదో టీం లో ఉందాం, ప్లీజ్" అన్నాడు బ్రతిమాలుతూ.

ఒక్కసారిగా తనను తాను చూసుకున్నాడు. పైకి కొండలాగా లేచిన పొట్ట, బెలూన్ లాగా ఉబ్బి పోయిన ఒళ్ళు తో తాను ఇప్పుడు క్రికెట్ ఎక్కడ అడగలడు. అందుకే "నాన్న !  డాడి ఎప్పుడు బిజీ గా ఉంటాడు కదా ! క్రికెట్ ఆడటం కుదరదు. నువ్వు ఇంకేదయినా గేమ్ ఆడుకో" అని చెప్పాడు.

కానీ తన కొడుకు కళ్ళల్లో నిరాశను, ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి  ఆ పసి వాడు పడుతున్న యాతన తన చూపును  మాత్రం దాటి పోలేదు. అయినా సంబాళించుకుని సౌమ్య తెచ్చిన బజ్జిలు లాగించటం మొదలు పెట్టాడు.

సౌమ్య మాత్రం కొడుకు పుట్టిన తర్వాత కూడా నాజూకుగానే ఉంది. ఎప్పటికప్పుడు బరువు చూసుకుంటూ తప్పకుండా వాకింగ్ , చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఇంకా అందంగానే ఉంది.  నిజానికి పెళ్ళయిన కొత్తలో సౌమ్య కంటే రఘురామె అందంగా ఉన్నాడని అనేవారు అందరు. కానీ రాను రాను ఒంటి మీద శ్రద్ధ తగ్గించి పంటి కిందకి రుచిగా ఉంటె చాలు అనుకోవటం మొదలు పెట్టాడు. కొన్ని  సంవత్సరాలకు  మోడల్ లాగా ఉండేవాడు కాస్త ఓడల తయారయ్యాడు.  నాజూకుగా ఉన్న భార్య పక్కన తనను చుస్తే జనాలు నవ్వుకుంటారని బయటకు వెళ్ళటమే మానేసాడు. దానికి తోడు ఎం చెయ్యాలో తెలియక ఏది పడితే అది తినటం అలవాటు చేసుకున్నాడు. 

ఒకరోజు కొడుకు భాధ పడలేక ఫ్యామిలీ తో సినిమాకు వెళ్ళాడు. అక్కడ కొందరు కాలేజీ స్టూడెంట్స్ సౌమ్యను చూస్తూ సైట్ కొడుతున్నారు. తర్వాత టికెట్స్ తీసుకోని వచ్చిన రఘురాం ను చూసి " ఇంత మంచి ఫిగర్ కు ఈ బోడం గాడు ఏంట్రా? అసలు ఎలా తట్టుకుంటోంది రా వీడి బరువు?  కాదు మామ మిషన్ ఇంపాసిబుల్  రా !"  ఇలా అసహ్యంగా మాట్లాడుకుంటుంటే ఎం చెయ్యలేక భార్య, కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళి పోయాడు.  

మరుసటి రోజు ఆఫీస్ లో లంచ్ టైం లో తన కోలిగ్ మరియు క్లాసుమేట్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అయినా కిరణ్ తో తన భాధను వెళ్లగక్కుకున్నాడు.

"కొంచెం లావుగా ఉంటె మంచి  పెళ్ళాం ఉండకూడదా ? అసలు ఏంట్రా ఈ జనాల తీరు? నా ఒళ్ళు నా ఇష్టం" అన్నాడు అసహనంగా.

"ఇప్పుడు నిన్ను ఎవరు  ఎం అన్నారు రా ? నీకేంట్రా అందగాడివి"  అన్నాడు కిరణ్ నవ్వుతు.

"వెటకారం ఆడింది చాలు. అవునురా  ఒక్కప్పుడు నేను బాగానే ఉండే వాడిని. ఇప్పుడు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. అందుకే కాస్త రిలాక్స్ అయ్యాను"

"రిలాక్స్ ! ఏ విధంగా? ఒంటి మీద శ్రద్ధ లేకుండా ఏది పడితే అది తినటం రిలాక్స్ అనుకుంటున్నావా?"

"ఇప్పుడు సిక్స్ పాక్స్ చేసి? నోరు కట్టేసుకుని ఎవరిని ఇంప్రెస్ చెయ్యాలి"

"సిక్స్ పాక్స్ ! ఒరేయ్ నిన్ను చూస్తే తినటానికి మాత్రమే పుట్టినట్టు ఉన్నావ్. అలాగే బిహేవ్ చేస్తున్నావ్. మొన్న టీం లంచ్ లో అందరం మెనూ తెచ్చుకుని లైట్ గా ఆర్డర్ చేసుకుందాం అంటే బఫె కావాలని పట్టు పట్టి అన్ని ఐటమ్స్ టెస్ట్ చెయ్యాలని అందరిని వెయిటింగ్ లో పెట్టావ్. అమ్మాయిలు ఏమన్నారో తెలుసా? ఇంకోసారి రఘురాం ను తీసుకురాకండి అని మాట్లాడుకున్నారు. నీకు చెపితే బాధపడుతావ్ లేదా గొడవ పడుతావ్ అని చెప్పలేదు."


రఘురాం మొహం కందగడ్డలా అయిపొయింది సిగ్గుతో. ఉక్రోషంగా "నువ్వేదో కాస్త సన్నగా ఉన్నానని పోజులు కొట్టకు రా. ఒక్కపుడు నీకంటే నేను బాగుండే వాడిని, అమ్మాయిలు నన్నే ఎక్కువ ఇష్టపడేవారు."

"నిజమేరా నా కన్న నువ్వే గొప్ప అందగాడివి. కానీ ఇప్పుడేమైంది" కిరణ్ శాతంగా అడిగాడు.

"అప్పుడంటే అమ్మాయిలను ఇంప్రెస్ చెయ్యాలి అందుకే కాస్త బాగా మెయిటైన్ చేసే వాడిని. ఇప్పుడు అంత అవసరం ఏంట్రా?" చిరాకుగా సమాధానం చెప్పాడు రఘురాం.

"ఎవరో తెలియని వారిని ఇంప్రెస్ చెయ్యటానికి అంత కష్టపడితే,  తెలిసిన నీ భార్యను ఇంప్రెస్ చెయ్యటానికి మాత్రం ఓపిక లేదు అసలు అవసరం లేదు. అంతేనా?"

"పెళ్ళాన్ని ఇంప్రెస్ చెయ్యటం ఏంట్రా? మతి ఉండే మాట్లాడుతున్నావా?"

"తనకు మాత్రం తన భర్త అందంగా ఉండాలని కోరిక ఉండదా ? అందరు తమ జంటను చూసి ముచ్చట పడాలని కోరుకోదా? తనకు నీ మీద ఎంత ప్రేమ లేక పొతే ఇప్పటికి అందంగా కనపడాలని తపన పడుతుంది చెప్పు"

"ఏంట్రా కొత్త అర్థాలు చెపుతున్నావ్! అందంగా కనపడాలనుకోవటం తన ఇష్టం. నా కోసం ఎదో త్యాగం చేసినట్లు మాట్లాడుతావ్?" అసహనం వ్యక్తం చేశాడు రఘురాం.

"తానూ కూడా నీలాగే ఒంటి మీద శ్రద్ధ లేకుండా ఎలా పడితే ఆలా తిని, ఒళ్ళు పెంచుకుని  నిన్ను నీ కొడుకును చూసుకునే ఓపిక లేక గాలికి వదిలేస్తే బాగుంటుంది. అంతేనా?" సూటిగా ప్రశ్నించాడు కిరణ్.

"ఒరేయ్ నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను కదరా? అసలు నా భార్య పిల్లలకు వచ్చిన ప్రాబ్లెమ్ ఏంటో నాకింకా అర్థం కాలేదు" ఆశ్చర్యం వ్యక్తం చేశాడు రఘురాం.

"వాళ్లకు వచ్చిన ప్రాబ్లెమ్? ఎప్పుడయినా నీ కొడుకు తో కలిసి ఆడుకున్నావా? నీ భార్య తో ప్రేమగా ఉండి ఎన్నాళ్లు అవుతుందో గుర్తుందా?"

రఘురాం కు మౌనమే శరణ్యమైంది.  "నువ్వు బెడ్ రూమ్ లో పెట్టె గురకలు నీ భార్య గుండె వేగాన్ని ఎంత పెచుతున్నాయో నీకు తెలుసా? అడ్డమయిన తిండి తిని ఎక్కడ తమను అర్థాంతరంగా వదిలి పోతాడో అని ఎన్ని సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పిన విన్నావా?"  బాధగా ప్రశ్నించాడు కిరణ్.

రఘురాం కు కోపం కట్టలు తెంచుకుంది. "అది తన మాట నేను వినటం లేదని నీకు చెపుతోందా?"  అన్నాడు ఊగిపోతూ.

"హలో అంత సిన్ లేదు. ఆ మాత్రం ఊహించలేని సన్నాసిని కాదు. తను నాకేం చెప్పలేదు. నువ్వు అనవసరంగా తనను తిట్టటం కొట్టటం చెయ్యద్దు" అన్నాడు కిరణ్ నిర్లక్ష్యంగా.

"అసలు ఏంట్రా ఇప్పుడు ప్రాబ్లెమ్. ఐ లవ్ మై ఫామిలీ. ఎదో కాస్త లావుగా ఉన్నాను దానికి అంత ప్రాబ్లెమ్ ఏంట్రా? డాక్టర్ డాక్టర్ అని చంపేస్తుంది దానికి నువ్వు కూడా వంత పాడుతావ్"  రఘురాం చిరాకు పడ్డాడు.

"వాళ్ళను లవ్ చేస్తున్నావా? అది నీ చేతల్లో కనపడటం లేదు. నీ ఫామిలీ ని నువ్వు లవ్ చేస్తే నీ ఆరోగ్యం కాపాడుకో ముందు. కొంచెం లావుగా ఉన్నాను అంటున్నావ్. లావుగా ఉన్న వాళ్ళు అందరు అనారోగ్య వంతులు అని నేను చెప్పటం లేదు. కానీ ఈ లావు నీకు పుట్టుకతో వచ్చింది కాదు. మధ్యలో వచ్చింది. కేవలం నువ్వు అవసరానికి మించి తినటం వాళ్ళ వచ్చింది. మందు, సిగరెట్ కన్నా భయంకరమయిన జబ్బు తిండిపోతూ తనం రా ! " అన్నాడు కిరణ్.

"నా లావుకు నా ప్రేమకు సంబంధం ఏంట్రా?"  బాధపడుతూ అడిగాడు రఘురాం.

"ఒరేయ్ ఒకప్పుడు మన తాతల కాలంలో అన్ని ఒళ్ళు వంచి పని చేసుకునే వారు. కానీ ఇప్పుడు ఆఫీస్ కు వచ్చామంటే లేచే పని లేదు. హాయిగా కార్ ఎక్కం అంటే ఇంటికి వచ్చే దాకా సుఖం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒంటి మీద శ్రద్ధ లేకుండా ఏది పడితే అది తిని, ఒంట్లో కొవ్వు పెంచుకుంటే, అసలే హై ప్రెషర్ లో  ఉండే  మన జాబ్ లకు,  నా వాళ్ళ కాదు మొర్రో అని మన గుండె కొద్దీ సేపు ఆగిపోతే,  మన వెనుక ఉన్న వారి జీవితాలు రోడ్డు మీద పడుతాయ్ అన్న విషయం నీకు అర్థం కాలేదా?" సూటిగా ప్రశ్నించాడు కిరణ్.

 రఘురాం కళ్ళలో తడి. "మామ ఒకప్పుడు మనం ఒంటరి వాళ్ళం. కానీ ఇప్పుడు ఒకరికి భరోసా ఇచ్ఛే వాళ్ళం. మన జీవితాలు మన కంటే కూడా మన వాళ్ళకు అవసరం. నీకు ఫామిలీ ఏర్పడగానే నీ జీవితం మీద నీ హక్కును కోల్పోయావ్. కానీ అందులోనే ఉందిరా ఆనందం.  నా ఒళ్ళు నా ఇష్టం అనుకుంటే నీకు కుటుంబం అంటే ప్రేమ లేదను కోవాలి లేదా వాళ్లంటే చిన్న చూపయినా ఉందనుకోవాలి"

"ఏమి తోచక మొదలయిన తిండి వ్యాపకం ఎక్కడ ఆపాలో తెలియక, ఎలా అదిగిమించాలో అర్థం కాక, అసలు ఎందుకు చెయ్యాలో అంతుపట్టక నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడే చెపుతున్నా, ఒకప్పటి హ్యాండ్సమ్ రఘురాం ను చూస్తావ్" అన్నాడు రఘురాం దృఢ నిశ్చయంతో.

మన చుట్టూ ఎంతో మంది రఘురాం లు ఇంకా అలాగే ఉన్నారు, కుటుంబాలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు.