28, ఏప్రిల్ 2016, గురువారం

నాన్న !
తండ్రినయ్యాక తెలిసింది,  నాన్న
నీ  అనుభూతి ఏమిటో
నీకు నా విలువేంతో

నేను ఓడిపోతుంటే తెలిసింది
నన్ను ఎన్నిసార్లు గెలిపించావో

నేను ఓర్పుగా ఉన్నపుడు అనిపిస్తుంది
నిన్ను ఎంత విసిగించానో

నాపై బరువు పెరుగుతుంటే గుర్తించాను
నువ్వెంత బాధ్యత మోసవో
మా బతుకులు ఇంత  తేలిక చేశావని

దూర దేశానికి వలస పోయిన నీకు
కాలం ఎంత భారమయిందో కదా!

నీ కండలు కరిగించి, కూడా బెట్టిన సొమ్ము
నా విలాసాలకు విసిరి వేసాను
నీ నెత్తుటి చెమటను
స్నేహితులకు బీరుగా పోసాను

నీ తిట్టు లో తివ్రతనె చూశాను
దానిలో అర్థతను మరిచాను

బుద్దిగా ఉండమని తిడితే !
బద్ద శత్రువని భ్రమ పడ్డాను
"నీ సంగతి తర్వాత" అని కక్ష గట్టాను
కాని ఓడిపోయాను

నీ భాద, భాధ్యత నాకు తెలిసింది
సగంలోనే నా ప్రయాణం అలసింది
ఎలా చేశావు నాన్న? ఇంతటి దూర ప్రయాణం!