6, నవంబర్ 2015, శుక్రవారం

మరో కోణం - 1

మేనేజర్ రూం నుండి భయటకు వస్తున్నా సతీష్ ను ఓర కంటగా చూసి కొంటెగా నవ్వింది మైథిలి.  దానికి అతను కూడా కింది పెదవిని పంటితో కొరికి చిలిపిగా నవ్వాడు. ఇదంతా చూస్తున్న వెంకట్ కడుపు మంట తో రగిలి పోయాడు.  అర్జెంటు గా ఈ డెవలప్మెంట్ ను ఆపెయ్యాలి అనుకుని సతీష్ తో "రారా మామ ఒక్క దమ్ము కొట్టి వద్దం" అన్నాడు మైథిలికి వినపడేలాగ. 

అది వినగానే సతీష్  మైథిలి వంక చూశాడు. తన  మొఖం  కోపంతో ఎర్రగా కంది పోయింది. సతీష్  ఏదో తప్పు చేసినట్లుగా దీనంగా మొఖం పెట్టి ఆమె వంక చూశాడు.  అది చూడగానే వెంకట్ కు ఇంకా మండి పోయింది. "సిగరెట్ అనగానే, చిన్న పిల్లాడికి  లాలిపప్  ఇచ్చినట్లు ఫీల్ అయ్యే వాడివి! ఇప్పుడు ఏదో హోం వర్క్ ఇచ్చినట్లు మొఖం పెట్టావ్?" అన్నాడు వ్యంగంగా.

సతీష్ వస్తున్నా కోపాన్ని దిగమింగుకుని భయటకు దారి తీసాడు. సిగరెట్ అంటిస్తున్న వెంకట్ తో "ఏంట్రా లోపల ఎక్కువ చేస్తున్నావ్? వచ్చే వరకు ఆగలేవా!"  అన్నాడు కోపంగా.

దానికి వెంకట్ పగలపడి నవ్వి "ఫీల్ అయ్యావ మామ! పోరిలకు భయపడుడు ఏందిరా? అమ్మాయిలే సిగరెట్ గుప్పు గుప్పు మని ....."

"తనకు ఇష్టం లేదురా నేను సిగరెట్ తాగటం" అన్నాడు సతీష్ మధ్యలోనే అందుకుని.

వెంకట్ ఆశ్చర్య పోయి "ఇది ఎప్పటినుండి రాజా! అయినా ఎప్పుడు ఫేస్బుక్, లింక్డిన్ చూస్తూ కుర్చుంటావ్. ఎప్పుడు మాట్లాడవు రా" అన్నాడు ఎగతాళిగా.

"మొన్ననే ఒక ఇష్యూ వస్తే చాట్ విండో లో పింగ్ చేసింది. ఇష్యూ రిసాల్వ్ అయిపోయాక చిన్నగా మొదలు పెట్టా. నీ డ్రెస్ బాగుంది దగ్గరి నుండి"  సతీష్ గొంతులో  గర్వం తోణికిస లాడింది.

"వారం రోజులు లీవ్ పెట్టినందుకు బాగానే డెవలప్ చేశావ్ రా.  రూం కి పనిమనిషి రాక పోయిన వచ్చి చెప్పేవాడివి! మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు రా నాకు" సతీష్ మొఖం కోపం తో ఎర్రబడింది.

"వచ్చిందే ఈ రోజు మళ్ళి చెప్పలేదని ఏడుపా? అయినా ఫ్రెండ్ కు ఏమయినా చెప్పొచ్చు కాని అమ్మాయిని లైన్ లో పెట్టె విషయం మాత్రం చెప్పకూడదు. అయితే చెడగోడుతారు లేదా తన్నుకు పోతారు" నీతి బోధ చేశాడు సతీష్.

"సర్లే! మాట్లాడినందుకే ఏదో పడి పోయినట్లు ఫీల్ అయిపోకు. అది అసలే పరమ ఫాస్ట్" వెంకట్ నిరుత్సాహ పరచాలని  చూశాడు.

"నిన్ననే కంపెనీ బస్సు లో వెళ్ళకుండా నన్ను హాస్టల్ దగ్గర దింపమంది. మధ్యలో బారిస్టలొ కాఫీ తాగం"  ఊరిస్తూ చెప్పాడు సతీష్.

"సర్లే  నేను తానూ ఆఫీసు లో చాల సార్లు తాగం కాఫీ" వెంకట్ తననుతాను సంబాళించుకున్నాడు.

"ఓరిని అల్ప సంతోషం తగలేట్టా. హాస్టల్ లో డ్రాప్ చేసిన తర్వాత గుడ్ నైట్ చెపుతూ కిస్ చేసింది అంటే చచ్చి పోతావేమో" అన్నాడు సతీష్ ఉషారుగా.

వెంకట్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తానూ విన్నది నిజమేనా అని అనుమానంగా "ఏంటి? కిస్ చేసిందా? ఎక్కడ చేసింది?  బుగ్గ మీద!" ఆత్రంగా అడిగాడు.

"ఇప్పుడు పార్టు తో పనేంట్రా?"

"ఈ మధ్య కిస్ చేసే బాగాన్ని బట్టి అర్థం మారుతుంది మామ"

"అయితే లవర్స్ ఎక్కడ చేసుకుంటారో అక్కడే చేసింది. హ్యాపీ యా?"

అది వినగానే వెంకట్ సిగరెట్ దమ్ము గుండేలా నిండ పిల్చి  బెంచి మిద  నీరసంగా  కూలబడి పోయాడు. ఏమి మాట్లాడకుండా.

కొద్దిసేపటికి తేరుకుని "నా అబ్సేన్స్ లో ఎంత పెద్ద స్టొరీ నడిపినావ్ మామ. నువ్వు గ్రేట్ రా.  కత్తిలాంటి ఫిగర్ ను పడేశావ్" అన్నాడు వెంకట్ అసూయగా.

"నువ్వు ఉంటె సాగనిస్తావా? అందుకే నువ్వు లేనప్పుడు మొదలు పెట్టా"  సతీష్ నిష్టురమాడాడు.

"అరేయ్ నీకు ఇష్టం ఉంది అంటే నేనే హెల్ప్ చేసేవాణ్ణి రా. అయిందేదో అయింది కనీసం పార్టి ఇవ్వురా"

"పార్టి ఇవ్వక పొతే ఆపుతావా నీ ఏడుపు. లేక పొతే రేపే విడిపోతం మేము" అని లోపలికి దారి తీసాడు సతీష్.

****************************************************************************************

సతీష్, అతని  రూం మెట్ కిరణ్ మరియు వెంకట్ ముగ్గురు మందు తాగటానికి కూర్చున్నారు.

"కిరణ్! నీకో విషయం తెలుసా? మీ వాడు కాజల్ లాంటి తెలుగమ్మాయిని పడేసాడు" అన్నాడు సతీష్ ఊరిస్తూ.

"ఎవరు  మైథిలి యేనా ఇంకా వేరే అమ్మాయా?"   ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్ .

వెంకట్  షాక్ అయిపోయి "నీకెలా తెలుసు తన పేరు" అన్నాడు.

సతీష్, కిరణ్ వంక గుర్రుగా చూసి "రూం చూస్తానంటే తీసుకొచ్చాను మామ. కొద్దిసేపు ఉండి పోయింది" అన్నాడు తేలికగా.

వెంకట్ సోడా కలపలేదని కూడా చూసుకోకుండా గ్లాస్ ఖాళీ చేసి, సిగరెట్ దమ్ము గుండేలా నిండా పిల్చాడు.

"మన కంపెనీ కే బ్యూటీ రా! భలే పడేసావ్. లక్కీ ఫెల్లో మామ నువ్వు" వెంకట్ కడుపు రగిలి పోయింది.

"మా వాడి కన్నా కూడా నువ్వే ఎక్కువ గా మాట్లాడే వాడివట తనతో. మరి నువ్వెందుకు ట్రై చెయ్యలేదు బాస్" కిరణ్ పుండు మీద కారం చల్లాడు.

"నాకు ఇంటరెస్ట్ లేదు బ్రో. లేక పొతే మనకు పడని అమ్మాయిలా? ఏదో కొంచెం జుట్టు పల్చగా అయింది ఈ మధ్య టెన్షన్ ఎక్కువయి. కాలేజీ లో మొత్తం మనదే హవా" పాత రోజులు గుర్తుతెచ్చుకొని గర్వపడ్డాడు వెంకట్.

"టీం లో కూడా నీదేనంట కదా హవా!" కిరణ్ ఇంకా రెచ్చగొట్టాడు.

"మా మేనేజర్ గాడు పరమ పాల్తూ గాడు. ప్రతి దానికి నన్నే. ఎవరు ఏ షిఫ్ట్ లో రావాలి, ఏ ఎవరు టాస్క్ చెయ్యాలి మనమే డిసైడ్ చెయ్యాలి.  మైథిలి కూడా మంచి రేటింగ్ రావాలని చాల సార్లు అడిగేది, నా గురించి మన మేనేజర్ కు చెప్పు అని. ఏమిరా సత్తి మన గురించి చెప్పలేదా మీ వాడికి"  వెంకట్ రెచ్చి పోతున్నాడు.

"సతీష్ కు ఆన్ సైట్ కూడా నువ్వే ఇప్పించావ?" వెళకొలమడాడు  కిరణ్.

వెంకట్ నమ్మలేనట్లుగా చూశాడు. "ఇదెప్పుడు తెలిసింది మామ?" అన్నాడు నిర్ఘంతపోయి.

"ఈ రోజు మధ్యాహ్నం తెలిసింది. అదేరా నువ్వు సిగరెట్ సిగరెట్ అని మైథిలి ముందు అరిచావ్ చూడు అప్పుడు"

"ఏంట్రా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నావ్ ఈ రోజు. కత్తిలాంటి అమ్మాయి, ఇప్పుడు ఏకంగా ఆన్ సైట్" అని వస్తున్నా దుఃఖాన్ని దిగమింగుకున్నాడు వెంకట్.

"అన్నింటికీ నీకే క్రెడిట్ మామ. రిలీజ్ లో  నువ్వు వారం రోజులు లీవ్ పెట్టడం ఏంటో గాని, అన్ని ఇష్యూ లకు మైథిలి నన్నే అడిగేది. అలా తను వర్కౌట్ అయింది. నీకు నైట్ షిఫ్ట్ లు ఇష్టం లేదని చెప్పి ఎప్పుడు నన్ను పంపే వాడివి.  USA లో ఉండే క్లైంట్ గాడి తో మంచి రాపో అయింది. నేను అక్కడికి వస్తే బాగుంటుంది కదా అన్నాను. అంతే! నన్ను ఆన్ సైట్ పంపుమని మన మేనేజర్ గాడి కి మెయిల్ వెళ్ళింది" వివరించాడు సతీష్.

వెంకట్ కు ఒళ్లంతా నీరసం ఆవహించింది. తమాయించుకుని "వెల్ డన్ మై బాయ్. ఐ యాం వేరి ప్రౌడ్ అఫ్ యూ"  నవ్వలేక నవ్వాడు.

మనసులో మాత్రం "పని తప్పించుకోవటానికి వారం రోజులు సెలవు పెడితే అమ్మాయి పోయింది. నైట్ షిఫ్ట్ లకు పంపి విణ్ణీ బకార చేస్తున్న అనుకుంటే ఆన్ సైట్ పోయింది" అనుకున్నాడు.

మరో సారి  సోడా కలపని మందు కొట్టేసాడు. ఆ రోజు ఎంత తాగిన ఎక్కలేదు వెంకట్ కు.

(ఇంకావుంది)

(రెండవ భాగం కోసం ఇక్కడ నొక్కండి. )

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి