5, ఆగస్టు 2015, బుధవారం

తెలుగు బూతు చానల్స్!!

తెలుగు టీవీ చానల్స్ లో "మీలో ఎవరు కోటీశ్వరుడు, పాడుతా తియ్యగా, సూపర్ సింగర్" లాంటి మంచి  ప్రోగ్రామ్స్ తో పాటు, కొన్ని అభ్యంతరకరమయిన ప్రోగ్రామ్స్ కూడా చెలామణి అవుతున్నాయి. అవి మాములు ప్రోగ్రామ్స్ అయినా సరే,  వాటిని నిర్వహించే యాంకర్ లు చేసే చేష్టలు వాటిని అభ్యంతరకర ప్రోగ్రామ్స్ గా మారుస్తున్నాయి. "అవునా నిజమా? మచ్చుకు కొన్ని చెప్పండి బాబు!" అని మీరు ఎలాగు అడుగుతారు కాబట్టి, పేర్లు చెప్పక తప్పటం లేదు. 

మా టీవీ లో ప్రసారం అయ్యే "మోడ్రన్ మహాలక్ష్మి" లాంటి  కార్యక్రమాలు  ఆడవారికి చాల ఇష్టం. ఎందుకంటే వాటిలో చీరలు, నగలు ఇంకా వారికీ ఇష్టమయిన అలంకారలు ఉంటాయి కాబట్టి. కానీ ఆ ప్రోగ్రాం మీరు పిల్లలతో మాత్రం చూడలేరు. ఎందుకంటే? ఆ ప్రోగ్రాం వ్యాఖ్యాత "అనసూయ" చాల మోడ్రన్ కాబట్టి. ఇవిడా పేరు కు మాత్రమే పాత చింతకాయ పచ్చడి, కాని ఆవిడా చేష్టలన్నీ కొత్తావకాయే. ఎంట్రి  మంచి డాన్సింగ్ నెంబర్ తో ఇస్తుంది. ఆ డాన్స్ చేసేటప్పుడు, చాల సిన్సియర్ గా ఏమి పట్టించుకోదు. చీర జఘన భాగంలో కడుతుందేమో, కాస్త అటుఇటు ఉగగానే నాభి దర్శనం. సినిమాల్లో ఎలాగు తప్పటం లేదు, వాటిని ఫాంటసీ లైఫ్ లో ఉంచుకున్నాం కాబట్టి కాస్త మెరుగు. కాని టీవీ అంటే  వాస్తవం, కనీసం జీవితానికి దగ్గరి తనం అని టీవీ ప్రేక్షకుడు నమ్ముతాడు. ఎందుకంటే అక్కడ కనిపించేది నిజ జీవితంలో  మనుష్యులు కాబట్టి. 

ఇలాంటి ప్రోగ్రామ్స్ కూతురు, తండ్రి లేదా అన్న, చెల్లెలు కలిసి చూడటం వదిలెయ్యండి. కనీసం అయిదారేళ్ళు ఉన్నా మగ పిలల్లలతో తల్లి చూసే ధైర్యం చెయ్యదు. ఒక్క క్షణం కనిపించే ఆ భాగం గురించి కాదండి. తర్వాత జరిగే తంతూ గురించి నేను మాట్లాడేది. "ఏంటి తర్వాత జరిగేది? గేమ్స్ ఆడిస్తుంది!" అంటారు అంతేనా? ఆవిడా కార్యక్రమంలో పాల్గొనే వారిని సంభోదించే తీరు శ్రవణానందకరం సుమీ! మచ్చుకు కొన్ని "ఓసేయ్, ఎంటే". కొద్ది రోజులకు  ఇంకా డోస్ సరిపోవటం లేదని  రేపు ఎప్పుడయినా వీధి లో తిట్టుకునే బూతులు మాట్లాడిన "మోడ్రన్" అనుకొమంటరేమో? "ఓరేయ్, ఓసేయ్, ఎంట్రా, ఎంటే" లాంటి మధ్యరకం (ఒక మోస్తరు) బూతులు విచ్చల విడిగా టీవీ లో వాడేస్తుంటే!  పిల్లలు ఏంటి నేర్చుకోనేది? ఆడవాళ్ళని "ఓసేయ్" అని, మగవాళ్ళను "ఓరేయ్" అని పిలిచినా తప్పులేదు, అది పెద్ద అభ్యంతరకర పదం కాదు అని పిల్లలు నేర్చుకొంటే! సంఘంలో పరస్పర గౌరవం ఇచ్చుకోవాలనే సాదారణ లక్షణం వారికి దూరం చెయ్యటం కదా? 

పాల్గొనే వారితో కలిసి పోవటానికి వారిని "ఓసేయ్, ఎంటే" అనే పిలవాల?  అందులో పాల్గొనే వారికి లేని అభ్యంతరం మీకెందుకు అంటారా?  టీవీ లో కనిపిస్తున్నామని పాపం వారు చేసే పిట్లు, పడే పాట్లు చూస్తే జాలేస్తుంది. డాన్స్ రాకపోయినా, ఒళ్ళు సహకరించక పోయిన, పాడటానికి గొంతు లేక పోయిన, ఎలాగయినా సందడి చెయ్యాలనే  వారి ఆరాటం ఆటవిడుపు. ఇక వారు అభిప్రాయాలూ వెల్లడించి,  అభ్యంతరం పెట్టె  అవకాశం ఉందంటార?

అదే చానెల్ లో మరో ప్రోగ్రాం "అలీ టాకీస్". ఈ ప్రోగ్రాం పెట్టింది ఒక తెలుగు  స్టార్ కామెడియన్ అయిన అలీ గారి పేరు మీద. సినిమాల్లో ఈయన కామెడీ ఎంత అలవోకగా చేస్తాడో, భయట బూతులు అంతే అలవోకగా మాట్లాడేస్తుంటాడు. ఈ అలీ టాకీస్ ఒక హిందీ ప్రోగ్రాం కి అనుసరణ. కానీ అందులో కనిపించే సున్నితమయిన హాస్యం ఇందులో మచ్చుకు దొరకదు.  తెలుగు లో ఈ కార్యక్రమంలో పాత్ర దారుల చేష్టలు పరమ రోతగా ఉంటాయి.  భార్య పాత్రలో అనసూయ,  బామ్మా పాత్రలో తిరుపతి ప్రకాశ్, ఇంకా ఒక తాగుబోతు, బామ్మర్ది పాత్రలో రవి, ఆటలో అరటి పండు పాత్రలో  ఒక్కప్పటి హీరో  సురేష్, ఈ మధ్య సింగర్ మనో,  విళ్ళందరికి బాస్ అలీ.  కామెడీ చెయ్యాలని వీళ్ళు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. ఏది మాట్లాడిన ద్వందర్దాలు తీసి కామెడీ చెయ్యాలని చూస్తారు. భార్య పాత్రలో అనసూయ, భర్త పాత్రలో ఉన్నా ఆలీ తో ఎన్ని నిగూఢమైన బూతులు మాట్లాడుతుందో! అలీ గారు ఎన్ని స్వచ్చమయిన బూతు జోకులెస్తారో!  మీకు ఓపిక ఉంటె చూసి తరించండి ఈ లింక్ నుంచి.  

ఇక బామ్మా పాత్ర దారి తిరుపతి ప్రకాశ్. ఎంత మగవాడని తెలిసిన, ఆడవారి డ్రెస్ వేసుకునేసరికి కాస్త బిడియం, అణుకువ ఆశిస్తాం. కానీ ఇతగాడు అందులో ఒక్కటయినా  పాటించటం మాట దేవుడెరుగు,  జబ్బల వరకు బట్టలు వేసి, జుగుప్స పుట్టేలా చంకలో వెంట్రుకలు ప్రదర్శిస్తుంటాడు. ఇక అతగాడు ముసలి వయసు మీద వేసే బూతు జోకులకు హద్దు అదుపు ఉండదు. ప్రతి వారం ఏదో సినిమా ప్రమోషన్ కోసం వస్తుంటారు హీరో, హీరోయిన్ ఇంకా ఆ సినిమాకు పని చేసిన మిగత నిపుణులు. హీరోయిన్ ను తాకటానికి, లేదా తాకుతూ వీళ్ళు చేసే చేష్టలు చూస్తే వికారం కలుగుతుంది. దాన్ని కామెడి అనుకోమ్మంటే! అంతకన్నా దౌర్బగ్యం ఇంకోటి ఉండదు.

ఈ మధ్య  ఒక్కమ్మాయి నెట్ లో వీడియో విడుదల చేసి ఆలిని "దున్నపోతు" అని తిట్టింది. ఆ అమ్మాయి చెప్పిన మిగత విషయాలు ఎలా ఉన్నా, శ్రీమాన్ అలీ గారి గురించి మాత్రం సరయిన రీతిలోనే మాట్లాడిందని నా అభిప్రాయం. ఒక్కప్పుడు అర్థం కాని భాషలో మాట్లాడి కామెడి చేసే అలీ గారు (ఆయన్ని గౌరవించక పొతే, అభిమానులు అడి పోసుకుంటారు) , తర్వాత ద్వందర్దాలకు దిగజారారు. ఇప్పుడు మాత్రం స్వచ్చమయిన బూతులతో నవ్వులు పుయించాలని చూస్తున్నారు. కాని అవి పుచ్చి పోతూ తన గౌరవాన్ని పలుచన చేస్తున్నాయని గ్రహించలేక పోతున్నారు. మచ్చుకు కొన్ని, సమంతా నడుము బెంజ్ సర్కిల్ లా ఉంటుందని చెప్పటం. నమితాను తిరుపతి లడ్డుతో పోల్చి, "ఆ లావు తట్టుకోవటం నా వాల్ల  కాదమ్మా" అని కామెంట్ చెయ్యటం.  హీరోయిన్ డ్రెస్ లను కామెంట్ చేయటం, ఒక్కటేమిటి కామెడీ చెయ్యటానికి ఆడవారిని ఎన్ని కామెంట్స్ చెయ్యాలో అన్ని చేస్తారు మన డాక్టర్ అలీ గారు.అనుమానంగా ఉంటె మీరే చూడండి ఈ లింక్ ద్వార.

పడ్డవారికి లేని భాధ నీకెందుకు అంటారా? సభ మర్యాద కోసమో లేక పరపతి కి భయపడో లేక ఇండస్ట్రీ లో ఉంటూ గొడవలు పడటం ఎందుకనో అలోచించి  వాళ్ళు భాధను పంటి బిగువున దాచుకోవచ్చు. కానీ సమాజంలో ఉన్నప్పుడు,  నాగరిక స్పృహ అనేది పాటించాలి. మన ముందు ఎవరయినా తప్పు చేసినప్పుడు మనకు తెలిసినా వారి ముందు సున్నితంగా మందలిస్తాం, వారు వెళ్ళి పోయాక, మన ఇష్ట రాజ్యంగా తప్పు చేసిన వారిని  తిట్టినా సరే. ఎందుకు? నాగరిక స్పృహ.  ఇలా బూతులు మాట్లాడితే వారి ముందు మనం చులకన అయిపోతాం అని భయం లేదా సభ్యత కోసం.  ఆ మాత్రం తెలివి, సభ్యత  అయన గారికి లేదా? నన్ను ఎవడెం చేస్తాడు అని పొగర?

మరో ప్రోగ్రాం ఈ టీవీ లో ప్రసారం అయ్యే  "జబర్దస్త్". వర్ధమాన కమెడియన్స్ అందరు కలిసి పోటి పడే కామెడీ షో.  దీనికి న్యాయ నిర్ణేతలుగా మన మెగా బ్రదర్ నాగబాబు, ఒకనాటి అందాల తార, నేటి MLA రోజా గారు.  దీంట్లో చాల మంది కమెడియన్స్ ఉన్నారు. ఒక్కో గ్రూప్ కు ఒక్కో లీడర్. వాళ్ళ పేర్లు చెపితే చాంతాడు అంతవుతుంది. వీళ్లు కామెడీ పేరుతొ ఎంతకు దిగాజారలో అంతకు దిగజారారు. జడ్జి గారి లో దుస్తుల గురించి మాట్లాడటం నుండి యాంకర్ అంగంగా వర్ణన వరకు. మచ్చుకు ఒక బూతు జోక్, షో లో ఒకతన్ని వెళ్ళు లేక్క పెట్టమంటారు. అతను లెక్క పెట్టి పది అంటాడు. తర్వాత ప్యాంటు జేబులో పెట్టుకుని లెక్క పెట్టమంటే అతను లెక్క పెట్టి పదకొండు అంటాడు. దానికి మన మెగా బ్రదర్ విరగబడి నవ్వటం, మన MLA గారు సిగ్గు పడి మొఖం చేతుల్లో దాచుకోవటం. యాధవిధిగా సూపర్, బంపర్ అని చెప్పి  మార్కులు ఇచ్చేసారు. కుటుంబం అంత టీవీ చూస్తూ బోజనాలు చేసే సమయం లో వస్తుంటాయి ఈ షోలు అన్ని. ఇలాంటి షో లు చూస్తూ కుటుంబ సభ్యులు  ఒక్కరి మొఖాలు ఒక్కరు చుసుకోగలరా?  కామెడీ అంటే బూత? అసలు వర్ధమాన కమెడియన్స్ అంటే ఎంత సాధన ఉండాలి? ఎన్ని విషయాలు లేవు  వ్యంగ్యంగా చెప్పటానికి?

ఇక ఈ మధ్య న్యూస్ చానల్స్ రాత్రి పదకొండు దాటిందంటే చాలు! విచ్చల విడిగా బూతు సినిమాలు ప్రసారం చేస్తున్నారు. దానికి అడ్డు, అదుపు లేదు. ఇంకా సినిమా న్యూస్ లో హీరోయిన్ లా విషయం లో వాడే పదజాలం ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా కూడా ఉంటుంది. అందాలూ అరపోసింది,  బొడ్డు సుందరి, నడుము సుందరి,  ఇంకా ఎన్నో ఎన్నెన్నో.  నిజానికి హీరోయిన్ లు సైతం తక్కువ తినలేదు. సినిమాలు లేక పోయే సరికి, నోటికి వచ్చిన చెత్త వాగుడు వాగి న్యూస్ లో ఉండాలని చూస్తున్నారు. న్యూస్ చానెల్స్  దాన్ని కాష్ చేసుకుంటున్నాయి. ఈ మధ్యే హీరోయిన్ ఇలియానా శృంగారం గురించి విచ్చల విడిగా వాగిందని సదరు న్యూస్ చానెల్స్ అన్ని పూసగుచ్చినట్లు న్యూస్ చదివాయి. అ గుమ్మ అలా అంది, అలా చేస్తుందట అని విడమరిచి చెప్పి, ప్రజల కళ్ళు తెరిపించాయి. నైతిక విలువలు విడిచిన ఆ హీరోయిన్ లు నోటికి వచ్చింది వాగటం ఏలా? వాగితే విళ్ళు దాన్ని విడమరిచి వివరించ నెలా? ఎవరికీ ఉపయోగం?

"నీకు నచ్చక పొతే చానెల్ మార్చుకో" అనే ప్రబుద్దులు కూడా ఉన్నారు. ఎందుకు చానెల్ మార్చుకోవాలి? వందలకు వందలు కేబుల్ కి డబ్బులు కడుతున్నప్పుడు, ఏ చానెల్ అయిన చూసే హక్కు  నాకు ఉంది. కోట్లు పెట్టి చానెల్ పెట్టిన వారికీ ఏది ప్రసారం చెయ్యాలో  నిర్ణయించే హక్కు లేదా? అంటారు.  అంతేనా? ఉంది. కానీ సామజిక  భాధ్యత వహిస్తూ చెయ్యాలి. కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం అని ఏది పడితే అది తీసి, సెన్సార్ చెయ్యకుండా,  విడుదల చేసే హక్కు లేన్నట్లే, టీవీ కి కూడా కట్లుబాట్లు, నియంత్రణ ఉండాలి.  ఇది కేవలం వినోదం కోసం, ఆ మాత్రం విచక్షణ ఉండాలి అనే వారు లేక పోలేదు. అసలు కొందరు ఇంకా అడ్డంగా వాదిస్తారు, గాంధీ సినిమా చూసి ఎంత మంది గాంధీ గా మారారు? ఎవ్వరు మారలేదు! అంటే సినిమా ప్రభావం జనం మీద లేదు అంటారు. అలాంటప్పుడు ముకేష్ కథలు ఎందుకు? పొగ తాగటం, మధ్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం అని హీరోలతో చెప్పించటం ఎందుకు? ప్రపంచ వ్యాప్తంగా మానసిక నిపుణులు సినిమా, టీవీ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సినిమాల్లో, టీవీలో చూపించే కొట్టడం, చంపటం చూసిన జనాలు, నిజ జీవితంలో జరిగే సంఘటనలకు కూడా స్పందించటం లేదని, భాధితులకు సహాయం చెయ్యటం లేదని.

ఇక సంవత్సరాల తరబడి వచ్చే కుటుంబ కథ డైలీ సీరియల్స్ లో ఉండే పైశాచికత్వం రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు. అత్త ను ఎలా చంపాలి, కోడలిని ఎలా లొంగ దిసుకోవాలి లేదా ఎలా రాచి రంపాన పెట్టాలి. నూటికి రెండు మూడు తప్ప, ఎ ఒక్క సీరియల్ కూడా కుటుంబ ప్రేమలు, వారి సమస్యలు, వాటిని ఎలా జయించారు అని చూపితే ఓట్టు. ఎంత సేపు ముగ్గురు, నలుగురు పెళ్ళాలు, సవతుల జోరు, అత్త కోడళ్ళ పెత్తనం పోరు. ఇవన్ని  చూస్తు పెరిగే వారికి కుటుంబ ప్రేమలు,  మమకారాలు  ఏం పడుతాయి? పెద్దయ్యాక మనసుల సున్నితత్వం, పరస్పర ప్రేమలు వారిలో ఉంటాయా?

నేను ప్రస్తావించిన కార్యక్రమాలు, ఆ యాంకర్స్ ప్రవర్తన కొందరికి తప్పు కాకా పోవచ్చు. కాని విస్తరిస్తున్న విచ్చల విడితనానికి హద్దులు వెయ్యక పొతే, భవిష్యత్తు తరాలు ఇంకా బరి తెగిస్తారు. అప్పుడు సమాజం లో మనుష్యులకు, అడవిలో జంతువులకు తేడా ఉండదు. అశ్లిలపు వెబ్ సైట్ల మిద నిషేధం విదిస్తున్న ప్రభుత్వం, టీవీ మీద కూడా తప్పని సరి నియంత్రణ చెయ్యాలని  నా అభిప్రాయం.  ఇది నేను ఎవరిని లక్ష్యం చేసుకుని రాయలేదు, కేవలం టీవీ, సినిమా అభిమానిగా వాటి బాగు కోరి రాశాను.  మీ అభిప్రాయాలూ పంచుకోగోరుతాను.

45 వ్యాఖ్యలు:

 1. అయ్యా... సమాజం శతాబ్దాల క్రితంనుంచే కుళ్ళిపోయి ఉంది. లక్షణాలను పబ్లిక్‌గా బయటపెట్టుకోగల ధైర్యం ఇన్నాళ్ళకు వచ్చింది. మనం అంత పవిత్రులమే ఐతే ఇలాంటి కార్యక్రమాలు అంత హిట్టవ్వవుకదా? పోనీలెండి రహస్యకుతికన్నా బహిరంగబూతు మేలైనదే! ఎన్నోకొన్నాళ్ళకి represssion తగ్గి, అన్ని కోరికలూ let off అయ్యాకన్నా మనం కొంచెం సిన్సియర్‌గా తయారవుతాం. అప్పటికైనా మనకు ఇలాంటి కార్యక్రమాలను వెఱ్ఱెత్తిపోయి చూడాల్సిన అవసరం లేకుంటే అదే పదివేలు.

  కొన్నాళ్ళ క్రితం ఒకానొక టీవీలో ప్రసారమైన "సచ్ కా సామ్నా" అదే విషయాన్ని నిరూపించింది. ఇప్పటికీ సోషల్ వెబ్‌సైట్ల్లు, సినిమాలు అదే విషయాన్ని ఋజువుచేస్తున్నాయి. పవిత్రత గురించి గుండెలు బాదుకొనేవాళ్ళు అవేమీ చూడనట్లుగా నటిస్తూ ఇదేదో ఈమధ్యే మొదలైన వ్యహారమని నమ్మడానికి ఇష్టపడుతుంటారు. మళ్ళీ వీళ్ళే సాయంకాలంవేళ గుళ్ళలో గీతగోవిందాన్ని పరవశిస్తూ ఆలపిస్తారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పవిత్రంగా ఉండటం, ఉండక పోవటం అనేది వ్యక్తిగత ఇష్ట అయిష్టాల కిందికి వస్తుంది. నేను చెప్పింది మీ అపవిత్రతను పక్క వారికి పట్టించి, బ్రష్టు పట్టించ వద్దని, నలుగురిలో ఉన్నప్పుడు కాస్త నాలుకను నియంత్రించు కొమ్మని. పనికి మాలిన బూతు కార్యక్రమాలతో, భవిష్యత్తు తరాలను కామందులుగా, కిచకులుగా మార్చ వద్దని. నేను పవిత్రుడను అని చెప్పటం కాదు, నా అపవిత్రతను నా పిల్లలపై రుద్దకూడదు అనే ఆలోచన. మంచి, చెడు అనేవి అది మానవుడి కాలం నుండి కూడాఉన్నాయి. కాని మంచి పాళ్ళు ఎక్కువుండి, చెడు పాళ్ళు తక్కువుండి ఈ మాత్రం ముందుకు సాగింది సమాజం. కాని ఇప్పుడు జరుగుతోంది ఏమిటి? చెడు ఎక్కువ పాళ్ళు ఎక్కువ, మంచి మచ్చుకయినా కానరాక పోతే! భవిష్యత్తు ఏమిటి? అనేది నా అవెధన. దాన్ని నియంత్రిచాలని నా అభిప్రాయం. కాని మీలాంటి వారు పెడర్దాలు తీసి, ఇదిగో ఇలాగె, నువ్వు అంత పవిత్రుడివా? పక్కోడ్ని చూడు! అని, మీ మనసును బయట పెట్టేస్తుంటారు.

   తొలగించు
 2. మీరు రాసింది అక్షర సత్యం... కాని మనలాంటి వారి అవేదన అరణ్య రోదనే... ఎవరు వింటారు? మంచి చెపితే ఈ వ్యాపార ప్రపంచంలో ఎవరికీ పట్టదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కట్టడి చెయ్యాలి అన్న పాపానికి, నువ్వు పెద్ద పవిత్రుడివా అని దాడి చేస్తుంటే ఎం చేస్తాం చెప్పండి? ధన్య వాదాలు, మీ ఆదరణకు.

   తొలగించు
 3. అజ్ఞాత గారు...అందరూ మీలాగా ఉండదు కదండి... మీరన్నట్టు సమాజమంతా కుళ్ళిపోయి ఉంటే, ఎప్పుడో వ్యవస్థ భ్రష్టుపట్టిపోయేది. కనీసం కొద్దిమందయినా నాగరికంగా ఉండడానికి, లేదా సమాజాన్ని నాగరికంగా ఉంచడానికి ప్రయత్నించడం వల్లే, సమాజం ముందుకి వెళుతుంది. అందుకని అలా ప్రయత్నించే వారిని నిరాశ పరచనవసరం లేదనుకుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. జగదీష్

  నేనెలా ఉన్నానో మీకు బాగా తెలుసేం! The system is ccurrupt అన్నమాట మీరే ఒకసారి సమాజాన్నుద్దేశ్యించి రాసినట్లున్నారు ఏదో ఒక వ్యాఖ్యలో. దాన్ని తెలుగులో అనువదిస్తే "వ్యవస్థ భ్రష్టుపట్టింది" అనే అనువదించాల్సుంటుంది. అయినా మన వ్యవస్థ భ్రష్టుపట్టక ఉఛ్ఛస్థితిలో అలరారుతోందనుకొంటే ఇక ఎవరైనా చెయ్యగలిగేదేమీలేదు. కొద్దిమంది వెలుతుర్లో పుణ్యాత్ములుగా చలామణీ అవుతుండడంకాదండీ, మనసావాచాకర్మణా ప్రజల్లో ఎక్కువశాతమ్మంది మీరు నిర్వచించిన "మంచి"ని పాటించడం మీరనుకుంటున్న "నాగరికానికి" గీతురాయి. మన వ్యవస్థ అలా ఎప్పుడూ లేదు. ఎప్పటికీ అలా కాలేదు.

  ముందు మనం హిప్పోక్రసీ వదిలించుకోవాలి. కీర్తనల్లోని బూతుని శృంగారమని నెత్తినమోస్తాం. అదే సామాన్య ప్రజలకయ్యే స్థాయిలో ఉంటే బూతని ఈసడించుకుంటాం. నిషేధించాలని ఆవేశపు రాతలురాస్తాం. మందికి నచ్చినదాన్ని తప్పని/అసహ్యకరమైనదని మీరెలా అనేస్తారు? సహజాతి సహజమైనదాన్ని తప్పని మీరెలా అనేస్తారు?

  ఆ తరువాత మనం వదిలించుకోవాల్సింది రిప్రెషన్ని. చాటుమాటుగా అందరూ చేసేది అదే ఐనా (నాకు అత్యంత పవిత్రులుగా చలామణీ అయ్యేవాళ్ళతో ఫేస్‌బుక్ స్నేహాలున్నాయిలెండి. వాళ్ళు చెప్పేదొకటి, ఫేస్‌బుక్కులో చేసి చచ్చేదొకటి), వెలుతురులోకి రాగానే దాన్నే అసహ్యించుకోవడమనేది తినే తిండిని అసహ్యించుకోవడంలాంటిది. తల్లిని ద్వేషించుకోవడం లాంటిది.


  మీకు నిజాలు తెలియకపోతే తెలుసుకొనే ప్రయత్నం చెయ్యండి అంతేకానీ మనం అందరికన్న పవిత్రులం, ఇప్పుడే వీళ్ళవల్లా, వాళ్ళవల్లా పాడైపోతున్నాం అంటూ చెవులుహోరెత్తించకండి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అయ్యా అజ్ఞాత గారు, సమాజంలో అందరు సత్తె పుసలాగే ఉండాలని నేను చెప్పలేదు, చెప్పబోను. సహజమయింది అని మల మూత్ర విసర్జన బహిరంగంగా చేయ్యనట్లే, శృంగారాన్ని కూడా బహిరంగంగా చెయ్యం. మీరు చెప్పిన కీర్తనలలో బూతు, మీ నాన్న ఉన్నాడా? అనడానికి మీ అమ్మ మొగుడు ఉన్నాడా? అనడానికి తేడా ఉన్నట్లే వాటికీ, మనం టీవీ లోచూసే దానికి ఉన్నంత తేడా ఉంది. ఔను బయాలజీ క్లాసు లో సంపర్కం గురించి చదివేటప్పుడు శాస్త్రీయ నామాలు వాడుతం, అంతే కానీ అవ్వె బాగాలు కదా, అదే కార్యక్రమం కదా అని బరి తెగించి వాడుక భాష లో బోధన చెయ్యం. నేను కట్టడి పెట్టలనన్నాను కాని నిషేధం చెయ్య మానలేదు గా?

   తొలగించు
  2. విషయం భాష గురించో, శాస్త్రీయ పదజాలం గురించో కాదు. ఇంకొకరి sexual escapadesను నిత్యం తలచుకొని ఒకరకమైన vicarious feelingలో మునిగుండడం గురించి. ఇంకొకడి sexual prowessని తలచుకొని మనం మన బుర్రలు exite చేసుకోవడం గురించి. మన బుర్రల్లో ఉన్నదాని గురించి మాట్లాడుతున్నాను. మనమేమో "శాస్త్రీయ" పదజాలంపేరుతో పలాయనం ప్రదర్శిస్తున్నాం. సంస్కృతంలో ఉన్నంత మాత్రాన అది బూతుకాదండీ? మరి దాన్నే ఇంగ్లీషులో రాస్తే అప్పుడేంటండీ? కీర్తనల ఉద్దేశ్యం బయాలజీలోలాగా శరీరాన్ని గురించిన అవగాహన కల్గించడం అని మీకు అనిపిస్తోందన్నమాట. ఇలాకూడా అనుకోవచ్చు అన్న క్రొత్త విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాను. Great!. అన్నట్లు నేను ప్రస్తావించింది "మీ నాన్న ఉన్నాడా? అనడానికి మీ అమ్మ మొగుడు ఉన్నాడా? అనడానికి తేడా" గురించి కాదు. "మీ పితృదేవులు మీ మాతృమూర్తితో ఎన్నిసార్లు శ్రంగారమొనరించుయుంటారు?" అని "శాస్త్రీయం" ఐన కావ్యభాషలో ప్రశ్నించినా.. (అచ్చతెలుగులో ప్రశ్నించినా) ప్రశ్నించిన వాడి intension carry అవుతుంది. ప్రశ్నించినవాడి చెంప పగులుతుంది. ఇప్పుడు మరోసారి చెప్పండి... కీర్తనల్లో లేనిదేమిటి? ఈ కార్యక్రమాల్లో ఉన్నదేమిటి?

   నిర్వచనం ప్రకారం నిషేధం అనేది అత్యంత తీవ్రమైన కట్టడి. మనకి అవేనచ్చుతున్నాయి, అదే మన స్థాయి అంటుంటే మళ్ళీ సుద్దపూసలంటారేంటండీ బాబూ. మీలాంటి వాళ్ళు ఒక పదిశాతమ్మంది ఉండీ సభ్యత, సంస్కారం అంటూ వెలుతుర్లో లెక్చర్లుదంచడంకాదండీ... ఒక్కసారి చీకట్లో ఏంజరుగుతోందో చూడండి. మొత్తం సమాజంలోని బుర్రలన్నీ ఇలాంటి పుళ్ళతో రసి కారుతున్నాయి. మన సమాజం మొదట్నుంచే ఒక leud society. మనదసభ్య సమాజం.

   తొలగించు
  3. తమరు నా రాతలను పూర్తిగా పక్కదోవ పట్టిస్తున్నారు. నేను అంటున్నది సంస్కృతంలో చెపితే ఒప్పు ఇంగ్లీష్ లో చెపితే తప్పు అని కాదు. చెప్పే మాటలను, అడిగే విషయాలను నలుగురిలో ఉన్నప్పుడు సభ్యత కోసం నియంత్రించుకోవాలని. నేను కీర్తనలు, బయాలజీ ని రెండు ఉదాహరణలుగా తీసుకుని నా శక్తి మెరకు నా వాదం వినిపించాలని ప్రయత్నించాను. మీరు చెప్పినట్లు బూతు ఏ భాషలో చెప్పిన బూతే, కాని సభ్య సమాజంలో ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోమని నా రాతల సారాంశం. సమాజం ఎప్పుడో చెడి పోయింది, అందరు వెధవలే, ఇప్పుడు ఎందుకు కట్టుబాట్లు అంటారా? అయితే చట్టాలు, పోలీసులు, న్యాయ స్థానాలు ఎందుకు? ఎవడికి నచ్చింది వాడు పట్టుకు పొండి! ఎవడికి నచ్చిన ఆడదాన్ని వాడు తీసుకుపోండి? అంటే మనిషి మనుగడకు అర్థం ఏంటి? పక్కవాడి రోగం గురించి కాదు నా భాధ, దాన్ని అందరికి వ్యాపింప చేస్తున్నారని, భవిష్యత్తు తరాలను రోగం లోనే తయారు చేస్తున్నారని.

   తొలగించు
  4. ప్రక్కదోవ పట్టించడం కాదు మాస్టారూ.. మీరు పలికిన చిలకపలుకులు అర్ధంలేనివని చెబుతున్నాను. ఒకదాంట్లో బూతును చూడలేనిమనం ఇంకొకదాంట్లో మాత్రమే బూతునుచూస్తున్నామని చెబుతున్నాను. కీర్తనలు/కావ్యాలు/ప్రబంధాలను మరియు బయాలజీ ని ఒక గాటన కట్టి మీరు పెద్ద తప్పిదమే చేశారు. అంగాంగ వర్ణన బయాలజీలో ఉండదు (అలా ఉన్న బయాలజీ పుస్తకాన్ని నేను చూడలేదు). ఎవరో ఒకసారి FBలో రాశారు. ఒక వాన చినుకు పార్వతి నుదిటిపై పడి, మెడనుంచి స్థనాలపైకి జారి అక్కడినుంచి ఎక్కడెక్కడికో జారిందనే వర్ణనున్న పద్యం మనం చదివి "ఆహా ఏమా కవిత్వపు సొగసు!" అని మురిసిపోతాం. నమ్ముతారో లేదో ఇది మాకు ఎనిమిదో తరగతి తెలుగుపాఠం. క్రిందెవరో అన్నారు సంసారమూ... వ్యభిచారమూ.., అంటూ ఏదో... పుణ్యకార్యాలు చేసుకొంటే రంభాసంభోగభాగ్యం (అంటే వేశ్యాసంభోగమే మాస్టారూ) దక్కుతుందని మభ్యపెట్టిన మన సంస్కృతిలో ఏది తప్పుసార్? మళ్ళీ వక్కాణిస్తున్నాను మనది పవిత్రత ముసుగులో రహస్య శ్రంగారాన్ని అనుభవించే నికృష్టపు సమాజం. అత్యంత అశ్లీల మరియు అసభ్య సమాజం. దీనికి పవిత్రత కేవలం ఒక పై ముసుగుమాత్రమే!

   "అయితే చట్టాలు, పోలీసులు, న్యాయ స్థానాలు ఎందుకు? ఎవడికి నచ్చింది వాడు పట్టుకు పొండి! ఎవడికి నచ్చిన ఆడదాన్ని వాడు తీసుకుపోండి?"

   ఇప్పుడు జరుగుతున్నదదికాదూ! మొన్నటి ఉదంతమే తీసుకోండి గానార్జున యూనివర్శిటీలో జరిగిన ఉదంతానికి సంబంధించిన దోషుల్లో ఒక్కరికైనా శిక్షపడుతుందని మీరు నమ్ముతున్నారు?

   అప్పుడు జరిగిందదికాదూ! పరమాత్ముడు అక్బరుని తలదన్నేలా పదహారువేలమందితో haremని ఎలా ఏలాడన్న గాధలనుకదా మనం పారవశ్యంతో గానం చేస్తున్నది మనం గుళ్ళలో.


   మనం చాలా ఎదిగిపోయాంసార్! మనం ఎంచుకున్నదానిలో మాత్రమే బూతును చూడడంలో ఆరితేరుపోయాం.

   తొలగించు
  5. మీ వాదనకి పనికి వచ్చే విషయాలను మాత్రమే పట్టుకోవటంలో మీరు సిద్దహస్తులు. నేను రాసింది ఏంటి? మన మధ్య జరుతున్న వాదన ఏంటి? శృంగారం తప్పు కాదని అతి సహజమయిందని అమ్మ ముందు లేదా చెల్లి ముందు చేస్తామా? వావి వరుసాలు లేకుండా మాట్లాడుతమా? కుటుంబం అంత కలిసి చూసే టీవీ లో బూతు పురాణం ఏంటి? అన్నది నా వాదన. ఒక పిల్లవాడికి రోజు కాస్త పాము విషం ఇస్తే, పెద్దయ్యాక వాడు పాములాగే విష పూరితం అవుతాడంటారు. అలాంటిది వాడి ముందు రోజు బూతులు మాట్లాడి, సెక్స్ ను చూపిస్తే? పెద్దయ్యాక వాడు ఎలా మారుతాడు? వాడిని అలా మార్చే హక్కు మీకు లేదు. బుద్ది తెలిసిన తర్వాత పవిత్రంగా ఉండాల? లేక అపవిత్రంగా ఉండాలా వాడు తెల్చుకుంటాడు.

   శృంగారం అనేది ఆదినుండి కూడా ఉంది. కాని ఇప్పుడది విధిన పడి, మురికి కంపు కొడుతూ, సమాజాన్ని బూతు మయంగా మారుస్తోంది. దాన్ని కాస్త నియంత్రించాలి బాబు అన్నాం, అంతే కాని ఇప్పుడు కొత్తగా చెడి పోయాం అని చెప్పలేదు.

   తొలగించు
  6. Paina vacchina agnyaataadhamuDanu gurthu paTTitini!! (AnukunTaa padaajaalam ni baTTi)
   Regarding post : Good, mine also ....almost same opinion

   తొలగించు
  7. "ఒక పిల్లవాడికి రోజు కాస్త పాము విషం ఇస్తే, పెద్దయ్యాక వాడు పాములాగే విష పూరితం అవుతాడంటారు."

   ఇదెంత నిజమో! మీవాదన కూడా అంతే నిజం! మీరిప్పటికీ వాస్తవాన్ని ఒప్పుకోలేకున్నారు. మన సమాజానికి కావలసిందల్లా let off కోసం ఒక చిన్న stimulus మాత్రమే!. అమ్మచెల్లెళ్ళముందేకాదు, అమ్మచెల్లెళ్ళతోడి శ్రుఇంగారాన్నికూడా మన కావ్యాలూ, ప్రబంధాలూ (అవేకదా మన సంస్కృతికి గీటురాళ్ళు!) రొమాంటిసైజ్ చేశాయన్న విషయం తెలుసుకోవాలిమీరు.

   మన ప్రజలు దేనికోసమైతే (బూతుకోసం) మొహం వాచి ఉన్నారో దాన్ని ఛానెళ్ళవారు అందిస్తున్నారు. ఛానెళ్ళవారిది తప్పనికాదు (అసలామాటకొస్తే ఏది తప్పో ఏది ఒప్పో ఎవరు చెప్పగలరు?). మన స్థాయిని మనం గుర్తించమంటున్నాను.

   నరసిమ్హాజీ!

   తుస్సీ గ్రేట్ హో!!

   తొలగించు
  8. నిజమే నండి! స్థాయిని బట్టి మాట్లాడటమే ఉత్తమం. సెలవ్.

   తొలగించు
 5. రోజ నల్లటి రుబ్బు రోళ్ల లాంటి , నల్లటి చేతి రెట్టలను చుపిస్తూ (స్లీవ్ లెస్ జాకేట్ వేసుకొని) ఈ వయసులో మగ వారిని ఆకట్టుకోవాలనే చేసుకొనే మేకప్, ముసలి ఆంటీలను ఆకట్టుకొంట్టుంది. జాంకయంత సైజు లో బొడ్డు కనిపిస్తూంటే, మగవారికి మటుకు ఫాపం ఈ వయసులోకూడా యాపారం లో అగ్రగామి గా ఉండటానికి పడే కష్టం చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరన్నది నిజమే! పై పోటో లో రోజా ఆంటిని చూడండి, పల్చటి జాకేట్ ధరించి నేను ఇంకా అమ్మాయినే అనుకొంట్టూ, సాగిపోయే కాలంలో పాటుగా జారిపోయిన అందాలను సాన బెట్టుకొంట్టు కిందా మీద పడుతున్నాది :)

   తొలగించు
 6. I watched couple of episodes of "Ali Talking" and then stopped watching it. I could not bear that vulgar comedy.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. సంసారానికి వ్యభిచారానికి ఉన్న తేడా తెలీక రెంటిలో చేసేది ఒకటే అని వాదిస్తూ. రెండూ వేరే అని చెప్తే దాన్ని హిపోక్రసీ అనుక్కోవడం అవివేకమే అవుతుంది. మంచి ఆర్టికల్ చదివాను.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నిజమేనండి. మనలాంటి వాళ్ళ వేదన అరణ్య రోదనే అవుతుంది. ధన్యవాదాలు.

   తొలగించు
  2. అందుకే అన్నారు ఇసుక లోంచి నూనె తీయవచ్చు కానీ మూఢుని మార్చలేము అని. ఐనా తల్లిదండ్రులు పెట్టిన పేరును ధైర్యంగా చెప్పుకోలేని వారి అజ్ఞ్యానపు రాతలను తర్కించాల్సిన అవసరము లేదు గమనించగలరు. వీల్ల పనె సంస్క్రుతి సంప్రదాయాయాలపై దుమ్ము పోయడం.. దేఎనిమీద సమయం వౄధ చేయదం అవసరం.

   తొలగించు
 8. టీవీ చూడటం అంటేనే గొంగట్లో... సామెత గుర్తొస్తోంది. సుమారుగా గత ఐదేళ్ళుగా టీవీ చూడలేదు మరి :)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. బేషయిన పని. మేము కూడా చూడటం తగ్గించేసాం అండి, ముఖ్యంగా పిల్లల ముందు చూడటం లేదు.

   తొలగించు
 9. ఇదివరకు ఈటివి వాళ్ళు కొంత సంయమనం పాటించేవాళ్ళు. ఇప్పుడు ఆ చానల్ కూడ మొహమాటపడటంలేదు. అందులో వచ్చే అలీ ప్రోగ్రాం కూడ అలాగే ఉంటుంది. ఇక జబర్దస్త్ షో ఒక్క నిమిషం చూసినా వికారం వస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఇలాంటి షోలకే రేటింగ్ ఎక్కువట.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నిజమే నండి. ఏ చానెల్ చుసిన ఏమున్నది గర్వ కారణం, అన్నట్లు గా తయారయ్యారు. ధన్యవాదలు.

   తొలగించు
 10. this article is good. telugu tv programs disgusting. rotten stuff.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఒక్కటి మర్చిపోవద్దు , ఇదే జనం అమృతం సీరియల్ ని హిట్ చేసారు .
  కేవలం వేరే గతి లేకా ఇవన్ని చూడాల్సి వస్తుంది , కామెడీ కోసం జనాలు అర్రులు చాస్తున్నారు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జనాలు చూస్తున్నారు, మేము తీస్తున్నాం అని చెప్పుకుంటున్నరు. కాని ఆకలి మీద ఉన్న వాడికి ఏదివడ్డించిన పరమాన్నమే. కాని వడ్డించే వాడు భాద్యత వహించి, ఆరోగ్యానికి పనికి వచ్చేది మాత్రమే వడ్డించాలి. దురదృష్టవ శాత్తు అది ఎవరికీ పట్టదు. ధన్యవాదాలు.

   తొలగించు
 12. అన్ని విలువలు, సామాజిక నియమాలు గాలికొదిలేసిన వ్యాపారాలు మన టీవీ ఛానెళ్ళ ప్రోగ్రాములు. వాటి ద్వారా డబ్బు, గ్లామరు, సంపాదించుకుని సినిమా రంగానికి ఎగబాకడానికి పెద్దవాళ్ళ దృష్టిలో పడితే అవకాశాలు వస్తాయనే ఆశతో వేసే వేషాలు ఇవన్నీ అనిపిస్తుంది. ఎకానమీ వస్త్ర ధారణ, హాస్యం అనుకుంటూ చేసే అసభ్య సంభాషణ వాళ్ళ ప్రయత్నాలకి సహాయం చేస్తాయని వాళ్ళ నమ్మకంలాగుంది. టీవీ మీద కనబడుతుండేసరికి వాళ్ళకి వాళ్ళే "సెలెబ్రిటీలు" అనే పేరు తగిలించుకోవడం కూడానూ. తాము చేసిన సీను / ప్రోగ్రాం బాగా "పండింది" (??) అని డబ్బా కొట్టుకోవడం ఒకటి స్టేజ్ మీద / తెర మీద. పైగా సెలెబ్రిటీలం అని ఫీల్ అయిపోతూ వీళ్ళు చూపించే అహంకారం (వాళ్ళ మాటలోనూ, వాళ్ళు తెర మీద చేసే ఇంటర్వ్యూ ల్లోనూ). కొంతమంది పెళ్ళయిన ఏంకరీమణులు కూడా ఇదే ధోరణి - పెళ్ళైన తర్వాత కాస్త ఒద్దిక గా ఉండాలని పెద్ద వారు చెప్పినప్పటికీ. కానీ ఈ పరుగులో వీళ్ళకి ఇటువంటివేమీ తలకెక్కవు. ఇక వీళ్ళకి తోడు వృద్ధ సినిమా నటులు - ఇంకా లైం లైట్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు, దానికో మార్గం వాళ్ళు ఎంచుకున్నది అసభ్య ప్రోగ్రాములు నిర్వహించడం. సమాజం మట్టి గొట్టుకు పోతే మాకేమిటి అనే నిర్లక్ష్య ధోరణి.
  సాయారాం గారూ మీరు వ్రాసినది అక్షరాలా నిజం, కానీ బాగుచేయలేనంతగా భ్రష్టు పట్టిన ఈ పోకడలు, మనస్తత్వాలు సమీప భవిష్యత్తులో మారే అవకాశాలు దాదాపు శూన్యం. మనస్తత్వాల మీద చెడు ప్రభావం చూపించడానికి ఎక్కువ కాలం అక్కరలేదు, అలా ప్రభావితమయిపోయిన మనస్తత్వాలని తిరిగి బాగు పరచాలంటే మాత్రం కొన్ని తరాలు పడుతుంది.
  ఈ టీవీ షోలు కాకపోతే మిగిలినవి టీవీ సీరియళ్ళు. వాటి సంగతి చెప్పేదేముంది. Between the devil and the deep sea అనే ఆంగ్ల సామెత లాగ తయారయింది ప్రేక్షకుల గతి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీ ప్రతి మాట అక్షర సత్యం. దన్యవాధలు.

   తొలగించు
  2. Sayaram గారూ మరో మాట. ఛానెళ్ళ తీరు, ప్రోగ్రాములు చేసేవారి తీరు మారినా మారకపోయినా, బ్రష్టు ప్రోగ్రాములు కనిపించినప్పుడు వాటి మీద మన అభిప్రాయాలు, విమర్శలు వినిపిస్తూనే ఉండాలి (సమాజానికి జరుగుతున్న హాని దృష్ట్యా). కనీసం ఇంకా ఇంకా రెచ్చిపోకుండానన్నా ఉంటారేమో (ఇది పేరాసే అనుకోండి) ? అందువల్ల మీ బ్లాగులో ఇటువంటి పోస్టులు తప్పక వ్రాస్తుండండి.
   అలాగే, ఈ ప్రోగ్రాములు చేసేవాళ్ళు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లల్లో ఉండే అవకాశాలు ఎక్కువ కాబట్టి విమర్శలు / అభిప్రాయాలు ఆ సైట్లల్లో కూడా వ్రాస్తే ప్రజాభిప్రాయం వాళ్ళ దృష్టికి వెళ్ళే ఛాన్స్ కాస్తన్నా ఉండచ్చు.

   తొలగించు
  3. విన్నకోట నరసింహా రావు గారు, తప్పకుండా రాస్తానండి. అసలు నేను రాసింది కూడా కొద్దిమందయినా కనీసం ఆలోచిస్తారని.

   తొలగించు
 13. ఇండియాలో ఉండడం లేదు కనక తెలియక అడుగుతున్నాను. మన్నించండి. అనేక సందర్భాల్లో కోటి సంతకాల సేకరణ అంటూ వత్తిళ్ళు తెస్తూవుంటారు కదా ఇలాంటి విషయాల్లో ప్రతి నియోజకవర్గంలో కోటి అక్కర్లేదు వేలల్లో సంతకాలు చేసి ప్రజా ప్రతినిధులకి, ఛానళ్ళకి పంపినా చాలా మార్పు రావచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కొనసాగితే తమ వోట్లు ఎన్ని గల్లంతై పోతాయో అనే సందేహం నాయకులకి కలిగించే ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ప్రవాస అజ్ఞాత గారికి,
   మీ సలహా బాగానే ఉంది. గతంలో కొన్ని టీవీ ప్రోగ్రాముల మీద Human Rights Commission వారికి ఫిర్యాదు చేసారు కొంతమంది, కానీ ఫలితం శూన్యం. బహుశా మీరు అమెరికాలో ఉంటున్నారేమో, సమస్యల్ని / నిరసనని / అభ్యంతరాల్ని అక్కడ మీ Congressman కి చెప్పి వారి ద్వారా పరిష్కారానికి ప్రయత్నించడం జరుగుతుంటుందని, కాస్తన్నా ఫలితం ఉంటుందనీ (?) విన్నాను. కానీ ఇక్కడ మేం (నాయకులు, అధికారులు, వ్యాపారులు, కార్పొరేట్లు, మీడియా వారు, ప్రజలు) కొంచెం తోలుమందం మనుష్యులంలెండి. పైగా లోకల్ నాయకుడికి చెప్పినా దాన్ని వాడుకుని అవతలివారి దగ్గర్నుంచి డబ్బు గుంజటానికే ప్రయత్నిస్తాడనే గట్టి అభిప్రాయం / నిరాశ పాతుకుపోయింది సామాన్యప్రజల్లో.

   మీరన్న కోటి సంతకాల సేకరణ కూడా గతంలో ప్రయత్నించారు కానీ నాలుగురోజుల మీడియా హడావుడి, పబ్లిసిటీయే తప్ప ఫలితాన్నిచ్చినట్లుగా లేదు (నాకు గుర్తున్నంతవరకు / తెలిసినంతవరకు. I could be wrong).
   ఆ, ఇంకో రకం పనులు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి - అవేమిటంటే "అవగాహన" కలిగించడానికనే పేరుతో 5k Run లాంటివి నిర్వహించడం, లేదా ఈ అవగాహన పేరు మీద 5-Star హోటెళ్ళల్లో డిన్నర్లు, డాన్సులు ఏర్పాటు చెయ్యడం - ఇటువంటి కార్యక్రమాలు బాగా చేస్తారు !! ఇవి నిర్వహించేది కూడా చాలామటుకు కార్పొరేట్లే :( వీటిల్లో కూడా సోకాల్డ్ "సెలెబ్రిటీ" ల / Page-3 వాళ్ళ హడావుడితో ఆరోజుకి ఓ ఈవెంట్ లా అవుతాయే తప్ప సమస్య పరిష్కారం దిశగా తర్వాత పెద్ద పురోగతేమీ ఉన్నట్లు కనబడదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని వార్తాపత్రికా యజమానుల / సినిమా నటుల / రాజకీయ పార్టీలవే పాప్యులర్ టీవీ ఛానెళ్ళు కూడా !

   నాది నిరాశావాదం లాగా ధ్వనిస్తోందేమో, కానీ చాలా చూసిన అనుభవంతో చెప్పాను. అయినప్పటికీ, మీ సలహా ప్రయత్నించి చూడచ్చు. ఇప్పుడంతా టెక్నాలజీ మయం కాబట్టి ఇలా సంతకాల సేకరణ కోసం Sayaram లాంటి టెక్నికల్ వారు ఎవరైనా ఓ ఆన్లైన్ సైట్ తయారుచేస్తే సులువవుతుంది.

   తొలగించు
 14. ప్రవాస అజ్ఞాత!! టైటిలు బావుందండీ :-)
  విషయం మీడియాకీ, నాయకులకి అప్పచెప్పేస్తే మీరన్నట్టే జరుగుతుందిలెండి. కొన్నాళ్ళు చూసి ప్రజలు వదిలేస్తారనీ, మర్చిపోతారనీ వాళ్ళ అనుభవం నేర్పిన పాఠం. Public memory is short-lived అనేది ఇండియన్ మీడియాలో తరచూ వినబడే మాట. అది రివర్స్ చెయ్యడం ఎలా? అసలు కిటుకు అందులోనే వుందనుకుంటున్నా. నాయక రహిత ఉద్యమాలు బాగా ఎఫెక్టివ్ గా ఉంటాయ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఆలీ విషయంలో మీ వ్యాఖ్యానం బాగుంది . ఇంతక ముందు బాగానే ఉండేవాడు ఆలీ . బూతు జోకులతో , ఆడవారిపై అసభ్య కామెంట్లతో తన హోదా పోగొట్టుకుంటున్నాడు . ఇలాగే ఉంటె అమెరికా అమ్మాయి అన్నట్లు డాక్టరేట్ లాక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఇప్పుడే చదివాను మీ టపానూ దానిపైన జరిగిన చర్చనూ. మీ ఆవేదన అర్థవంతంగానే ఉంది. కాని జనం ఇలాంటి చెత్తను చూస్తూ ఉండబట్టే వాటికి మంచి రేటింగులు దక్కటమూ ఆ ఛానెళ్ళు మరింతగా రెచ్చిపోతూ ఉండటమూ అన్నది కూడా సరైన వాదనే. జనం దృక్పథంలో మార్పు వస్తే ఇలాంటివి చచ్చినట్లు మటుమాయం అవుతాయి. రేటింగు పడిపోయిన ఎంతగొప్ప సాగతీతసీరియల్ ఐనా సరే ఠక్కున మూతబడటంలేదా, అలాగే జనం చూడని ఏ ప్రోగ్రామైనా అంతర్థానం కాక తప్పదు. అలాంటి సుదినం కోసం ఎదురుచూడటం తప్ప చేయగలిగింది ఏమీ కనబడటం లేదు. ఛానెళ్ళ స్వీయనియంత్రణ తగులబడ్డట్లే ఉంది కాబట్టి నానా దరిద్రాల్నీ జనం భరిస్తున్నా వాళ్ళల్లో తగినంతసంఖ్యలో అలాంటివాటిని ఆనందిస్తున్నా అది కొన్నాళ్ళకు ముఖం మొత్తి ఇకచాలు అంటారని ఆశిధ్దాం. మంచిటపాకు (కొంచెం ఆలస్యంగా ఐనా) అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చాలా కృతజ్ఞతలు. మీలాంటి వారి ప్రోత్సాహం ఉరికించే ఇంధనం లాంటిది.

   తొలగించు