5, ఆగస్టు 2015, బుధవారం

తెలుగు బూతు చానల్స్!!

తెలుగు టీవీ చానల్స్ లో "మీలో ఎవరు కోటీశ్వరుడు, పాడుతా తియ్యగా, సూపర్ సింగర్" లాంటి మంచి  ప్రోగ్రామ్స్ తో పాటు, కొన్ని అభ్యంతరకరమయిన ప్రోగ్రామ్స్ కూడా చెలామణి అవుతున్నాయి. అవి మాములు ప్రోగ్రామ్స్ అయినా సరే,  వాటిని నిర్వహించే యాంకర్ లు చేసే చేష్టలు వాటిని అభ్యంతరకర ప్రోగ్రామ్స్ గా మారుస్తున్నాయి. "అవునా నిజమా? మచ్చుకు కొన్ని చెప్పండి బాబు!" అని మీరు ఎలాగు అడుగుతారు కాబట్టి, పేర్లు చెప్పక తప్పటం లేదు. 

మా టీవీ లో ప్రసారం అయ్యే "మోడ్రన్ మహాలక్ష్మి" లాంటి  కార్యక్రమాలు  ఆడవారికి చాల ఇష్టం. ఎందుకంటే వాటిలో చీరలు, నగలు ఇంకా వారికీ ఇష్టమయిన అలంకారలు ఉంటాయి కాబట్టి. కానీ ఆ ప్రోగ్రాం మీరు పిల్లలతో మాత్రం చూడలేరు. ఎందుకంటే? ఆ ప్రోగ్రాం వ్యాఖ్యాత "అనసూయ" చాల మోడ్రన్ కాబట్టి. ఇవిడా పేరు కు మాత్రమే పాత చింతకాయ పచ్చడి, కాని ఆవిడా చేష్టలన్నీ కొత్తావకాయే. ఎంట్రి  మంచి డాన్సింగ్ నెంబర్ తో ఇస్తుంది. ఆ డాన్స్ చేసేటప్పుడు, చాల సిన్సియర్ గా ఏమి పట్టించుకోదు. చీర జఘన భాగంలో కడుతుందేమో, కాస్త అటుఇటు ఉగగానే నాభి దర్శనం. సినిమాల్లో ఎలాగు తప్పటం లేదు, వాటిని ఫాంటసీ లైఫ్ లో ఉంచుకున్నాం కాబట్టి కాస్త మెరుగు. కాని టీవీ అంటే  వాస్తవం, కనీసం జీవితానికి దగ్గరి తనం అని టీవీ ప్రేక్షకుడు నమ్ముతాడు. ఎందుకంటే అక్కడ కనిపించేది నిజ జీవితంలో  మనుష్యులు కాబట్టి. 

ఇలాంటి ప్రోగ్రామ్స్ కూతురు, తండ్రి లేదా అన్న, చెల్లెలు కలిసి చూడటం వదిలెయ్యండి. కనీసం అయిదారేళ్ళు ఉన్నా మగ పిలల్లలతో తల్లి చూసే ధైర్యం చెయ్యదు. ఒక్క క్షణం కనిపించే ఆ భాగం గురించి కాదండి. తర్వాత జరిగే తంతూ గురించి నేను మాట్లాడేది. "ఏంటి తర్వాత జరిగేది? గేమ్స్ ఆడిస్తుంది!" అంటారు అంతేనా? ఆవిడా కార్యక్రమంలో పాల్గొనే వారిని సంభోదించే తీరు శ్రవణానందకరం సుమీ! మచ్చుకు కొన్ని "ఓసేయ్, ఎంటే". కొద్ది రోజులకు  ఇంకా డోస్ సరిపోవటం లేదని  రేపు ఎప్పుడయినా వీధి లో తిట్టుకునే బూతులు మాట్లాడిన "మోడ్రన్" అనుకొమంటరేమో? "ఓరేయ్, ఓసేయ్, ఎంట్రా, ఎంటే" లాంటి మధ్యరకం (ఒక మోస్తరు) బూతులు విచ్చల విడిగా టీవీ లో వాడేస్తుంటే!  పిల్లలు ఏంటి నేర్చుకోనేది? ఆడవాళ్ళని "ఓసేయ్" అని, మగవాళ్ళను "ఓరేయ్" అని పిలిచినా తప్పులేదు, అది పెద్ద అభ్యంతరకర పదం కాదు అని పిల్లలు నేర్చుకొంటే! సంఘంలో పరస్పర గౌరవం ఇచ్చుకోవాలనే సాదారణ లక్షణం వారికి దూరం చెయ్యటం కదా? 

పాల్గొనే వారితో కలిసి పోవటానికి వారిని "ఓసేయ్, ఎంటే" అనే పిలవాల?  అందులో పాల్గొనే వారికి లేని అభ్యంతరం మీకెందుకు అంటారా?  టీవీ లో కనిపిస్తున్నామని పాపం వారు చేసే పిట్లు, పడే పాట్లు చూస్తే జాలేస్తుంది. డాన్స్ రాకపోయినా, ఒళ్ళు సహకరించక పోయిన, పాడటానికి గొంతు లేక పోయిన, ఎలాగయినా సందడి చెయ్యాలనే  వారి ఆరాటం ఆటవిడుపు. ఇక వారు అభిప్రాయాలూ వెల్లడించి,  అభ్యంతరం పెట్టె  అవకాశం ఉందంటార?

అదే చానెల్ లో మరో ప్రోగ్రాం "అలీ టాకీస్". ఈ ప్రోగ్రాం పెట్టింది ఒక తెలుగు  స్టార్ కామెడియన్ అయిన అలీ గారి పేరు మీద. సినిమాల్లో ఈయన కామెడీ ఎంత అలవోకగా చేస్తాడో, భయట బూతులు అంతే అలవోకగా మాట్లాడేస్తుంటాడు. ఈ అలీ టాకీస్ ఒక హిందీ ప్రోగ్రాం కి అనుసరణ. కానీ అందులో కనిపించే సున్నితమయిన హాస్యం ఇందులో మచ్చుకు దొరకదు.  తెలుగు లో ఈ కార్యక్రమంలో పాత్ర దారుల చేష్టలు పరమ రోతగా ఉంటాయి.  భార్య పాత్రలో అనసూయ,  బామ్మా పాత్రలో తిరుపతి ప్రకాశ్, ఇంకా ఒక తాగుబోతు, బామ్మర్ది పాత్రలో రవి, ఆటలో అరటి పండు పాత్రలో  ఒక్కప్పటి హీరో  సురేష్, ఈ మధ్య సింగర్ మనో,  విళ్ళందరికి బాస్ అలీ.  కామెడీ చెయ్యాలని వీళ్ళు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. ఏది మాట్లాడిన ద్వందర్దాలు తీసి కామెడీ చెయ్యాలని చూస్తారు. భార్య పాత్రలో అనసూయ, భర్త పాత్రలో ఉన్నా ఆలీ తో ఎన్ని నిగూఢమైన బూతులు మాట్లాడుతుందో! అలీ గారు ఎన్ని స్వచ్చమయిన బూతు జోకులెస్తారో!  మీకు ఓపిక ఉంటె చూసి తరించండి ఈ లింక్ నుంచి.  

ఇక బామ్మా పాత్ర దారి తిరుపతి ప్రకాశ్. ఎంత మగవాడని తెలిసిన, ఆడవారి డ్రెస్ వేసుకునేసరికి కాస్త బిడియం, అణుకువ ఆశిస్తాం. కానీ ఇతగాడు అందులో ఒక్కటయినా  పాటించటం మాట దేవుడెరుగు,  జబ్బల వరకు బట్టలు వేసి, జుగుప్స పుట్టేలా చంకలో వెంట్రుకలు ప్రదర్శిస్తుంటాడు. ఇక అతగాడు ముసలి వయసు మీద వేసే బూతు జోకులకు హద్దు అదుపు ఉండదు. ప్రతి వారం ఏదో సినిమా ప్రమోషన్ కోసం వస్తుంటారు హీరో, హీరోయిన్ ఇంకా ఆ సినిమాకు పని చేసిన మిగత నిపుణులు. హీరోయిన్ ను తాకటానికి, లేదా తాకుతూ వీళ్ళు చేసే చేష్టలు చూస్తే వికారం కలుగుతుంది. దాన్ని కామెడి అనుకోమ్మంటే! అంతకన్నా దౌర్బగ్యం ఇంకోటి ఉండదు.

ఈ మధ్య  ఒక్కమ్మాయి నెట్ లో వీడియో విడుదల చేసి ఆలిని "దున్నపోతు" అని తిట్టింది. ఆ అమ్మాయి చెప్పిన మిగత విషయాలు ఎలా ఉన్నా, శ్రీమాన్ అలీ గారి గురించి మాత్రం సరయిన రీతిలోనే మాట్లాడిందని నా అభిప్రాయం. ఒక్కప్పుడు అర్థం కాని భాషలో మాట్లాడి కామెడి చేసే అలీ గారు (ఆయన్ని గౌరవించక పొతే, అభిమానులు అడి పోసుకుంటారు) , తర్వాత ద్వందర్దాలకు దిగజారారు. ఇప్పుడు మాత్రం స్వచ్చమయిన బూతులతో నవ్వులు పుయించాలని చూస్తున్నారు. కాని అవి పుచ్చి పోతూ తన గౌరవాన్ని పలుచన చేస్తున్నాయని గ్రహించలేక పోతున్నారు. మచ్చుకు కొన్ని, సమంతా నడుము బెంజ్ సర్కిల్ లా ఉంటుందని చెప్పటం. నమితాను తిరుపతి లడ్డుతో పోల్చి, "ఆ లావు తట్టుకోవటం నా వాల్ల  కాదమ్మా" అని కామెంట్ చెయ్యటం.  హీరోయిన్ డ్రెస్ లను కామెంట్ చేయటం, ఒక్కటేమిటి కామెడీ చెయ్యటానికి ఆడవారిని ఎన్ని కామెంట్స్ చెయ్యాలో అన్ని చేస్తారు మన డాక్టర్ అలీ గారు.అనుమానంగా ఉంటె మీరే చూడండి ఈ లింక్ ద్వార.

పడ్డవారికి లేని భాధ నీకెందుకు అంటారా? సభ మర్యాద కోసమో లేక పరపతి కి భయపడో లేక ఇండస్ట్రీ లో ఉంటూ గొడవలు పడటం ఎందుకనో అలోచించి  వాళ్ళు భాధను పంటి బిగువున దాచుకోవచ్చు. కానీ సమాజంలో ఉన్నప్పుడు,  నాగరిక స్పృహ అనేది పాటించాలి. మన ముందు ఎవరయినా తప్పు చేసినప్పుడు మనకు తెలిసినా వారి ముందు సున్నితంగా మందలిస్తాం, వారు వెళ్ళి పోయాక, మన ఇష్ట రాజ్యంగా తప్పు చేసిన వారిని  తిట్టినా సరే. ఎందుకు? నాగరిక స్పృహ.  ఇలా బూతులు మాట్లాడితే వారి ముందు మనం చులకన అయిపోతాం అని భయం లేదా సభ్యత కోసం.  ఆ మాత్రం తెలివి, సభ్యత  అయన గారికి లేదా? నన్ను ఎవడెం చేస్తాడు అని పొగర?

మరో ప్రోగ్రాం ఈ టీవీ లో ప్రసారం అయ్యే  "జబర్దస్త్". వర్ధమాన కమెడియన్స్ అందరు కలిసి పోటి పడే కామెడీ షో.  దీనికి న్యాయ నిర్ణేతలుగా మన మెగా బ్రదర్ నాగబాబు, ఒకనాటి అందాల తార, నేటి MLA రోజా గారు.  దీంట్లో చాల మంది కమెడియన్స్ ఉన్నారు. ఒక్కో గ్రూప్ కు ఒక్కో లీడర్. వాళ్ళ పేర్లు చెపితే చాంతాడు అంతవుతుంది. వీళ్లు కామెడీ పేరుతొ ఎంతకు దిగాజారలో అంతకు దిగజారారు. జడ్జి గారి లో దుస్తుల గురించి మాట్లాడటం నుండి యాంకర్ అంగంగా వర్ణన వరకు. మచ్చుకు ఒక బూతు జోక్, షో లో ఒకతన్ని వెళ్ళు లేక్క పెట్టమంటారు. అతను లెక్క పెట్టి పది అంటాడు. తర్వాత ప్యాంటు జేబులో పెట్టుకుని లెక్క పెట్టమంటే అతను లెక్క పెట్టి పదకొండు అంటాడు. దానికి మన మెగా బ్రదర్ విరగబడి నవ్వటం, మన MLA గారు సిగ్గు పడి మొఖం చేతుల్లో దాచుకోవటం. యాధవిధిగా సూపర్, బంపర్ అని చెప్పి  మార్కులు ఇచ్చేసారు. కుటుంబం అంత టీవీ చూస్తూ బోజనాలు చేసే సమయం లో వస్తుంటాయి ఈ షోలు అన్ని. ఇలాంటి షో లు చూస్తూ కుటుంబ సభ్యులు  ఒక్కరి మొఖాలు ఒక్కరు చుసుకోగలరా?  కామెడీ అంటే బూత? అసలు వర్ధమాన కమెడియన్స్ అంటే ఎంత సాధన ఉండాలి? ఎన్ని విషయాలు లేవు  వ్యంగ్యంగా చెప్పటానికి?

ఇక ఈ మధ్య న్యూస్ చానల్స్ రాత్రి పదకొండు దాటిందంటే చాలు! విచ్చల విడిగా బూతు సినిమాలు ప్రసారం చేస్తున్నారు. దానికి అడ్డు, అదుపు లేదు. ఇంకా సినిమా న్యూస్ లో హీరోయిన్ లా విషయం లో వాడే పదజాలం ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా కూడా ఉంటుంది. అందాలూ అరపోసింది,  బొడ్డు సుందరి, నడుము సుందరి,  ఇంకా ఎన్నో ఎన్నెన్నో.  నిజానికి హీరోయిన్ లు సైతం తక్కువ తినలేదు. సినిమాలు లేక పోయే సరికి, నోటికి వచ్చిన చెత్త వాగుడు వాగి న్యూస్ లో ఉండాలని చూస్తున్నారు. న్యూస్ చానెల్స్  దాన్ని కాష్ చేసుకుంటున్నాయి. ఈ మధ్యే హీరోయిన్ ఇలియానా శృంగారం గురించి విచ్చల విడిగా వాగిందని సదరు న్యూస్ చానెల్స్ అన్ని పూసగుచ్చినట్లు న్యూస్ చదివాయి. అ గుమ్మ అలా అంది, అలా చేస్తుందట అని విడమరిచి చెప్పి, ప్రజల కళ్ళు తెరిపించాయి. నైతిక విలువలు విడిచిన ఆ హీరోయిన్ లు నోటికి వచ్చింది వాగటం ఏలా? వాగితే విళ్ళు దాన్ని విడమరిచి వివరించ నెలా? ఎవరికీ ఉపయోగం?

"నీకు నచ్చక పొతే చానెల్ మార్చుకో" అనే ప్రబుద్దులు కూడా ఉన్నారు. ఎందుకు చానెల్ మార్చుకోవాలి? వందలకు వందలు కేబుల్ కి డబ్బులు కడుతున్నప్పుడు, ఏ చానెల్ అయిన చూసే హక్కు  నాకు ఉంది. కోట్లు పెట్టి చానెల్ పెట్టిన వారికీ ఏది ప్రసారం చెయ్యాలో  నిర్ణయించే హక్కు లేదా? అంటారు.  అంతేనా? ఉంది. కానీ సామజిక  భాధ్యత వహిస్తూ చెయ్యాలి. కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం అని ఏది పడితే అది తీసి, సెన్సార్ చెయ్యకుండా,  విడుదల చేసే హక్కు లేన్నట్లే, టీవీ కి కూడా కట్లుబాట్లు, నియంత్రణ ఉండాలి.  ఇది కేవలం వినోదం కోసం, ఆ మాత్రం విచక్షణ ఉండాలి అనే వారు లేక పోలేదు. అసలు కొందరు ఇంకా అడ్డంగా వాదిస్తారు, గాంధీ సినిమా చూసి ఎంత మంది గాంధీ గా మారారు? ఎవ్వరు మారలేదు! అంటే సినిమా ప్రభావం జనం మీద లేదు అంటారు. అలాంటప్పుడు ముకేష్ కథలు ఎందుకు? పొగ తాగటం, మధ్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం అని హీరోలతో చెప్పించటం ఎందుకు? ప్రపంచ వ్యాప్తంగా మానసిక నిపుణులు సినిమా, టీవీ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సినిమాల్లో, టీవీలో చూపించే కొట్టడం, చంపటం చూసిన జనాలు, నిజ జీవితంలో జరిగే సంఘటనలకు కూడా స్పందించటం లేదని, భాధితులకు సహాయం చెయ్యటం లేదని.

ఇక సంవత్సరాల తరబడి వచ్చే కుటుంబ కథ డైలీ సీరియల్స్ లో ఉండే పైశాచికత్వం రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు. అత్త ను ఎలా చంపాలి, కోడలిని ఎలా లొంగ దిసుకోవాలి లేదా ఎలా రాచి రంపాన పెట్టాలి. నూటికి రెండు మూడు తప్ప, ఎ ఒక్క సీరియల్ కూడా కుటుంబ ప్రేమలు, వారి సమస్యలు, వాటిని ఎలా జయించారు అని చూపితే ఓట్టు. ఎంత సేపు ముగ్గురు, నలుగురు పెళ్ళాలు, సవతుల జోరు, అత్త కోడళ్ళ పెత్తనం పోరు. ఇవన్ని  చూస్తు పెరిగే వారికి కుటుంబ ప్రేమలు,  మమకారాలు  ఏం పడుతాయి? పెద్దయ్యాక మనసుల సున్నితత్వం, పరస్పర ప్రేమలు వారిలో ఉంటాయా?

నేను ప్రస్తావించిన కార్యక్రమాలు, ఆ యాంకర్స్ ప్రవర్తన కొందరికి తప్పు కాకా పోవచ్చు. కాని విస్తరిస్తున్న విచ్చల విడితనానికి హద్దులు వెయ్యక పొతే, భవిష్యత్తు తరాలు ఇంకా బరి తెగిస్తారు. అప్పుడు సమాజం లో మనుష్యులకు, అడవిలో జంతువులకు తేడా ఉండదు. అశ్లిలపు వెబ్ సైట్ల మిద నిషేధం విదిస్తున్న ప్రభుత్వం, టీవీ మీద కూడా తప్పని సరి నియంత్రణ చెయ్యాలని  నా అభిప్రాయం.  ఇది నేను ఎవరిని లక్ష్యం చేసుకుని రాయలేదు, కేవలం టీవీ, సినిమా అభిమానిగా వాటి బాగు కోరి రాశాను.  మీ అభిప్రాయాలూ పంచుకోగోరుతాను.