31, జులై 2015, శుక్రవారం

బాబోయ్ పేస్ బుక్ (హాస్యం) -3

(రెండవ భాగం కోసం ఇక్కడ నొక్కండి )

జరిగిన సంఘటనలతో పేస్ బుక్ మీద అయిష్టం పెరిగి పోయింది సుజిత్ కు. అందుకే ఇంతకూ ముందు చుసినంతగా చూడటం లేదు, పెద్ద ఆక్టివ్ గా ఉండటం లేదు.  అది కాకుండా ఈ మధ్య ఆఫీసు లో వర్క్ కూడా ఎక్కువ అవ్వటం తో దానిలో బిజీ అయిపోయాడు.

ఒక రోజు ఆఫీసు నుండి వచ్చిన సుజిత్ తో సంధ్య "అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావ లేదా?" అని కోపంగా అడిగింది .

సుజిత్ బిత్తర పోయి చూసాడు. తర్వాత తేరుకొని "ఇప్పుడు ఏమయింది? జస్ట్ కూర మాడి పోయి ఉంటుంది. దానికే అంత కంగారు పడితే ఎలా!" అన్నాడు సముదాయిస్తూ.

"అడిగినా దానికి సుత్తి కొట్టకుండా సూటిగా సమాధానం చెప్పు" సంధ్య చిరాకు పడింది.

"ఫేస్బుక్ లో ఏదయినా పోస్ట్ పెడితే లైక్ కొట్టలేదా? సారీ నాకు ఆఫీసు లో చాల వర్క్ ఉంది అందుకే ఓపెన్ చెయ్యలేదు. కాని ఇప్పుడే ఓపెన్ చేసి లైక్ మాత్రమే కాదు షేర్ కూడా చేస్తా" అన్నాడు సుజిత్ తప్పు చేసిన వాడిలా.

"నాకేం పనిలేదా ఫేస్బుక్ తప్ప. నేను అడిగేది ఒక్కటి నువ్వు చెప్పేది ఒక్కటి"

"అయ్యో నా ఉద్దేశ్యం అది కాదురా. పాపం నువ్వు ఇంటి పనితో ఎంత బిజీ ఉంటావో నాకు తెలిదా? ఏదో మధ్యలో టైం పాస్ కోసం గంటకోసారి మాత్రమే ఫేస్బుక్ ఓపెన్ చేస్తావ్. అసలు మా కొలీగ్స్ పెళ్ళాలు కొందరు ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటారు, అన్నం తినేటప్పుడు తప్ప"

"ఇన్ని మాటలెందుకు! నన్ను ప్రేమిస్తున్నావా? లేదా?"

"ఆఫీసు నుండి రాగానే అంట్లు తోమేస్తాను.  నువ్వు అడిగితె మ్యాచ్ ఉన్నా రోజు కూడా మా టీవీ లో వందసార్లు వేసిన బ్లాక్ బ్లాస్టర్ మూవీ చూస్తాను. మా ఉరి వంట లో చూసి,  నువ్వు చేసే కొత్త వంటలన్నీ లొట్టా లేసుకుంటూ తింటాను. ప్రతి వారం నాకు చెప్పకుండా సినిమా బుక్ చేసినా వస్తాను. ఆఖరికి  ఏ సినిమా లేక నువ్వు బాలకృష్ణ సినిమాకు తీసుకెళ్తే , సినిమా ఎంత నరకంగా ఉన్న  నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో  అని  నవ్వుతూ చూస్తాను. అది ప్రేమ కదా?"

"చాల్లే గొప్ప. మా నాన్న వంట కూడా చేసే వాడు" అంది తేలికగా కొట్టి పారేస్తూ.

"ప్రేమ కు కొలమానం వంట అని తెలియక నేర్చు కోలేదు. కానీ పేర్లు తెలియని వంట తినటం కూడా ప్రేమే అని నీకెవరు చెప్పలేదా?" దినంగా అడిగాడు.

"అంత ప్రేమ ఉంటె ఫేస్బుక్ లో ఏవో పిచ్చి వీడియోస్ , ఫొటోలు ఎందుకు  షేర్ చేస్తావ్" అని ఏడుపు మొదలు పెట్టింది.

"దయచేసి ట్యాప్ ఓపెన్ చెయ్యకు సంధ్య. సునామినయినా తట్టుకుంటాను కాని నీ కన్నీటి ముసురు మాత్రం తట్టుకోలేను" అన్నాడు చేతులు జోడిస్తూ.

"నేను ఏడిస్తే తట్టుకోలేవా?"

"సునామి అయితే ఒక్కసారే ఉడ్చుకుపోతుంది. కాని నీ ఏడుపు పుండు మీద కారంల మండుతూనే ఉంటుంది"

"అంత తట్టుకోలేని వాడివి మా వాళ్ళ ముందు నా పరువు ఎందుకు తియ్యాలి. ఆ చెత్త ఎందుకు షేర్ చెయ్యాలి" అంది  సంధ్య నిష్టురంగా.

"ఇలాంటివి వస్తాయనే నేను వద్దు మొర్రో అంటున్న వినకుండా, మీ బందువులందరికి నాతొ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్టు  సెలబ్రిటీ పేజి లైక్స్ లా మార్చింది నువ్వు.  అయినా నీ పరువు పోయే పని ఎం చేశాను నేను. ఈ రోజు ఫేస్బుక్ ఓపెన్ చెయ్యలేదని చెప్పను కదా?" అన్నాడు సుజిత్ వస్తున్నా కోపాన్ని పంటి బిగువున దాచుకుంటూ.

"ఆ కంపరాన్ని నేను చెప్పటం దేనికి నువ్వే  చూడు" అని లాప్టాప్ ఓపెన్ చేసి చూపించింది.

తన వాల్ మీద షేర్ అయినా వీడియో, కొన్ని హీరోయిన్ ఫొటోస్ చూసి బుర్ర తిరిగి పోయింది సుజిత్ కు. వాటిల్లో తనను ఎవరో ట్యాగ్ చేశారు. ఎవరా? అని చూస్తే తన విలేజ్ ఫ్రెండ్ రాజు  గాడు. ఏదో ఈ సేవ సెంటర్ నడిపిస్తుంటాడు. వీడికి ఇదేం పోయే కాలం నన్ను ట్యాగ్ చేశాడు.

"సంధ్య నువ్వే చూడు. ఎవడో సన్నాసి గాడు నన్ను ట్యాగ్ చేశాడు. అంతే కాని నేను షేర్ చెయ్యలేదు" అన్నాడు అమాయకంగా మొహం పెట్టి.

"ట్యాగ్ చెయ్యటం అంటే నీకు తెలుసు, నాకు తెలుసు. కాని మా వాళ్ళకు తెలియదు కదా?" అసహనం వ్యక్తం చేసింది సంధ్య.

"వాళ్ళకు ట్యాగ్ చెయ్యటం అంటే తెలియక పోవటం నా తప్ప? అలాంటి మట్టి బుర్రలకు నాతో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎందుకు పెట్టించావ్. ఒక్కొక్కళ్ళు రాసే ఇంగ్లీష్ చదువుతుంటే ఫేస్బుక్ మీదే విరక్తి కలిగి ఓపెన్ చెయ్యటమే మానేసాను. కేవలం నువ్వు పెట్టె కొటేషన్ లు, వంటల ఫోటోలు లైక్ చెయ్యటానికి ఓపెన్ చేస్తున్నాను. నా ప్రమేయం లేకుండా ఏదో జరిగితే  నన్ను తప్పు పట్టడం ఎంతవరకు న్యాయం" సుజిత్ ఆవేశ పడ్డాడు.

"నీ గురించి నీకు తెలియాలంటే, నీ స్నేహితులను చూడు. నీ ఫ్రెండ్స్ ను చూస్తేనే తెలుస్తుంది......" సంధ్య మూతి వంకరలు తిప్పింది.

"కొటేషన్  బాగుంది. నువ్వేనా రాసింది? ఇకేందుకు ఆలస్యం ఫేస్బుక్ లో పెట్టు,  ఉన్నారుగా పనిలేని నీ చెంచ గాల్లు" సుజిత్ అక్కసు వెళ్ళగక్కాడు.

"ఫేస్బుక్ లైక్ ల కోసం నేను కష్టపడే పనిలేదు. నేను గుడ్ మార్నింగ్ కొడితే చాలు సునామి పుడుతుంది. ఇక్కడ టాపిక్ నీ వాళ్ల నాకు వస్తున్నా బ్యాడ్ నేమ్ గురించి"

సుజిత్ కోపంతో ఫోన్ తీసి రాజు కు కాల్ చేసాడు.

"సుజిత్ మామ. ఎట్లున్నావ్ రా?  ఈ రోజు  భలే తాటి కల్లు దొరికింది" అన్నాడు రాజు ఉషారుగా.

"తాటి కల్లు.......నాకు తెలుసురా తాటి కల్లు తాగి  ఫేస్బుక్ లో కోతిలాగా కొంపలు ముంచావని. ఆ ఫోటోలు, వీడియో లు నువ్వు చూసింది  కాకుండా! నన్ను ఎందుకు ట్యాగ్ చేశావ్ రా" అన్నాడు సుజిత్ కోపంగా.

"మొన్ననే మా బామ్మర్ది గాడు చెప్పిండు. మన ఫోటో లు, వీడియో లు ఎవరయినా కంపల్సరి చూడాలంటే టాగ్  చెయ్యాలని" అన్నాడు రాజు అమాయకంగా.

"టాగ్ కాదురా ట్యాగ్. అయినా కంపల్సరి చూడటానికి అవేమన్నా నీ పెళ్ళి ఫోటో లా? వీడియో ఎమన్నా నీ కొడుకు  పుట్టిన రోజు దా?"

" అ ఫోటోలు  బాగా నచ్చాయి మామ. నీకు తెలుసుగదా నాకు ఎదన్న నచ్చితే అందరకి పంచి పెడుతా"

"పంచి పెట్టటానికి అవ్వెమన్నా పల్లిలా?  చెత్త ఫోటోలు.  మరి ఆ వీడియో లో  ఎందుకు ట్యాగ్ చేశావ్ రా!"

"హైదరబాద్ లో మసాజ్ సెంటర్ అని చెప్పి దందా చేస్తున్నారట! నువ్వుఅక్కడే ఉంటావ్ గాని, ఏది అడిగినా తెలవదంటావ్ . అందుకే మనోళ్ళ తోటి నిన్ను కూడా టాగ్ చేసిన"

"నీ పుణ్యమాని మా ఆవిడకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికి  తెలిసి పోయింది. నా పరువు మూసి  నది మురికి లో కలిసి పోయింది"

"ఓరిని......భార్యకు, అత్తగారింటొల్లకు భయపడుతార్ర? మనం అంటే మా వోళ్లకు జుజుబి"

"కాని మా ఇంట్లో,  వాళ్ళంటే నాకు జుజుబి.  మా ఆవిడా మీ ఆవిడా లాగ  పదవ తరగతి ఫెయిల్ అవ్వలేదు రా. ఇంజనీరింగ్ హైదరాబాద్ లో చదివింది. హక్కుల గురించి, లెక్కల గురించి ఎన్ని గంటలయినా మాట్లాడుతుంది "

సంధ్య కు గర్వంగా ఉంది, సుజిత్ అలా భయపడుతుంటే.

"అట్లా కాదురా....." అని రాజు ఏదో చెప్పబోతుంటే వీడు ఇంకా ఎం మాట్లాడి ఎం చేస్తాడో అని మధ్యలోనే కట్ చేసాడు సుజిత్.

"ఒరేయ్......ఇంకోసారి ఇలాంటివి పెట్టి దయచేసి నా కాపురం కూల్చే సంఘ సేవ మాత్రం చెయ్యకు రా" అని ఫోన్ పెట్టేసాడు సుజిత్.

 సంధ్య కాస్త శాంతించింది. నెమ్మదిగా "సర్లే మా వాళ్ళందరికీ ట్యాగ్ చెయ్యటం అంటే ఏంటో వివరిస్తాను. ఇందులో నీ ప్రమేయం ఏది లేదని అర్థమయ్యేలా చెపుతాను. ఇందక నేను చెప్పిన కొటేషన్ ఫేస్బుక్ లో పెట్టాను, లైక్ చెయ్యు. ఇలోగా నేను టీ తీసుకొస్తా నీకు" అని కిచెన్ లోకి వెళ్ళింది.

సుజిత్ కు  ఒళ్ళుమండి నెత్తి కొట్టు కున్నాడు. "ఎప్పుడో ఒక్కరోజు ఈ ఫేస్బుక్ ఎకౌంటు డిలీట్ చేస్తే గాని ఈ తల నొప్పులు తప్పవు" అనుకున్నాడు.

(అయిపొయింది)