25, మార్చి 2015, బుధవారం

బాబోయ్ పేస్ బుక్ (హాస్యం) - 1

(వయసు తో సంభందం లేకుండా, అడ మగ తేడ లేకుండా పేస్ బుక్ ఎకౌంటు సొతం చేసుకున్నా ప్రతి ఒక్కరి గురించి సరదాగా నవ్వుకోవటానికి రాసింది. ఎవరిని ఉద్దేశించి రాయలేదు అని మనవి)

పొద్దున్నే బెడ్ మిద నుండి లేవగానే పక్కనే ఉన్నా ఫోన్ చేతిలోకి తీసుకుని పేస్ బుక్ చూస్తే  గాని మిగత పనులు, ఎంత అర్జెంటుగా ఒంటికి,  రెంటికి వచ్చిన సరే, వాయిదా వేసుకునే  సగటు సాఫ్ట్వేర్ ఇంజనీర్  సుజిత్. 3జి ఫోన్ లు చీప్ అయిపోవటం ఏమో గాని ఈ మధ్య అమ్మాయిలు, అబ్బాయిలు, ముసలి, ముతక తేడా లేకుండా పేస్ బుక్ ఫ్రెండ్స్ మీద దయ లేకుండా దండ యాత్ర చేస్తున్నారు. 

ఫోన్ ఓపెన్ చెయ్యగానే ఫేస్బుక్ నోటిఫికేషన్ కనపడింది సుజిత్ కు. అంతే ఆనందంతో గుండె వెయ్యి రెట్లు వేగం పుంజుకుంది. ఓపెన్ చెయ్యగానే  క్యాండీ క్రష్ గేమ్ నోటిఫికేషన్, గుండె బద్దలయిపొయింది. "పని పాట లేని వెధవలందరూ ఫేస్బుక్ లో గేమ్ లు ఆడుకోవటం,  ఏదో పెద్ద ఒలింపిక్ మెడల్ సాధించినట్లు పక్క వాళ్ళకు నోటిఫికేషన్ పంపడం. ఇలాంటి వెధవలందరిని ఫేస్బుక్ లోంచి తరిమెయ్యాలి"  అని బండ బూతులు తిట్టుకున్నాడు.

తమాయించుకుని ఫేస్బుక్  స్క్రోల్ చేస్తుంటే ఏదో వీడియో షేర్ చేశాడు తన ఇంజనీరింగ్ ఫ్రెండ్ విజయ్ గాడు. ఏంటో ఆ వీడియో అని చూస్తే, ఎక్కడో దుబాయ్ లో మనుష్యులను అడ్డంగా నరికే వీడియో అది. అది చూడగానే ఒళ్ళంతా గగురు పొడిచింది సుజిత్ కు.  "వేరి సాడ్" అని సింపుల్ గా రాసి షేర్ చేశాడు దరిద్రుడు. 

"పొద్దు పొద్దున్నే ఇలాంటి కంపరం చూపించిన ఈ వెధవను కసి తీరా తిడితే గాని కోపం చల్లారదు" అనుకుని ఫోన్ చేశాడు విజయ్ కి. 

సుజిత్ ఫోన్ ఎత్తిన విజయ్  "గుడ్ మార్నింగ్ రా మామ. పొద్దున్నే నాకు ఫోన్ చేశావ్,  నీ రోజంతా సూపర్" అన్నాడు ఉషారుగా.  

అందుకు సుజిత్ ఏవగింపుగా "అబ్బా చా! ఏంట్రా పొద్దు పొద్దున్నే ఆ చెత్త విడియోలు? ఎవడ్నో ఎక్కడో నరికితే నువ్వు చూసింది కాకుండా షేర్ చెయ్యటం ఏంట్రా ?" అన్నాడు. 

"ఏంటి మామ? నువ్వు మరి అంత దయలేని వాడివా? మనుష్యులను నడిరోడ్డు మీద నరికితే నీకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంత స్వార్థం పనికి రాదు మామ"  అని చిన్నగా కోప్పడ్డాడు విజయ్. 

"ఒరేయ్ ఆ వీడియో షేర్ చేస్తే నీకేం వచ్చిందిరా? "వేరి సాడ్"  అని టైటిల్ పెట్టి షేర్ చేసి ఏదో ఉద్దరించనని గొప్పగా ఫీల్ అవుతున్నావ్. కాని చుసిన నేను ఎంత డిస్తుర్బ్ అయ్యానో తెలుసా?  ఈ రోజంతా నాకు అదే గుర్తుకొస్తుంది. నేనేం అన్యాయం చేశాన్ రా నీకు?"  ఏడ్చినంత పనిచేసాడు సుజిత్.  

"చూడు మామ! నేను వేరి సాడ్ అని షేర్ చేసినప్పుడే నువ్వు అర్ధం చేసుకొని చూడకుండా ఉండాల్సింది" తప్పంతా సుజిత్ దే అని తేల్చేశాడు. 

"అవును తప్పేరా! నాదే తప్పు. నీలాంటి దయామయుడు, కరుణామయుడు  షేర్ చేసినా వీడియో చూడటం నాదే తప్పు" అని ఫోన్ పెట్టేసాడు సుజిత్. 

పనులు ముగించు కుని ఆఫీసుకు బయలు దేరుతుంటే "సుజిత్ టిఫిన్ చేసి వెళ్ళు" అని ఇడ్లి ప్లేట్ తోఎదురు వచ్చింది సంధ్య. వాళ్ళిద్దరికీ పెళ్ళయి ఏడాది మాత్రమే అవుతుంది. సంధ్య ఇంజనీరింగ్ పూర్తీ చేసింది, ఇప్పుడు జాబు కోసం ట్రయల్స్ వేస్తూ ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటోంది. ఇంకా తప్పదు అని టిఫిన్ చేస్తూ ఫేస్బుక్ చూడసాగాడు.  

సంధ్య ఇడ్లి ప్లేట్ పిక్చర్ అప్లోడ్ చేసి "ఇడ్లి టిఫిన్ చేశాను"  అని పోస్ట్ పెట్టింది.  పెట్టి అయిదు నిమిషాలు అయ్యిందో లేదో అప్పుడే ఇరవై లైక్ లు,  పదిహేను కామెంట్ లు ఉన్నాయి.  ఒక్కో కామెంట్ చదువుతుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది సుజిత్ కు. 

"సో స్వీట్" అని ఒక్కడు, "నోరు ఉరి పోతుంది" అని ఒక్కడు, "నాకు కూడా కావాలి" అని ఇంకొక్కడు. "అమ్మాయి ఏది పెట్టినా సొల్లు కార్చుకుంటూ లైక్ లు కొడుతూ కామెంట్ చెయ్యటమే లక్ష్యంగా ఉంటారు ఈ వెధవలు" అనుకున్నాడు సుజిత్. 

"సంధ్య ! ఏంటి ఇది. ఇడ్లి టిఫిన్ చేసినా కూడా ఫేస్బుక్ లో అప్డేట్ పెట్టాలా? ఏదో పెద్ద బిర్యానీ చేసినట్లు" నిష్టురమాడాడు సుజిత్. 

"మరి అంత కుళ్ళు పనికిరాదు సుజిత్. నువ్వు మాత్రం జిమ్ లో వర్కౌట్ చేసి స్టాటిస్టిక్స్ షేర్ చెయ్యవా?" అంది వెటకారం ఆడుతూ. 

"నేను షేర్ చేసేది వేరేవాళ్ళను ఇన్స్ స్పైర్ చెయ్యటానికి"  

"నేను పెట్టేది నేను ఇన్స్ స్పైర్ కావటానికి. చూడు ఇంత ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది. ఆ లైక్ లు, కామెంట్ లు చూస్తుంటే, నన్ను మించిన అమ్మాయి లేదు అనిపిస్తుంది నాకు" అంది గర్వంగా చేతులు ఎగరేసి. 

ఏమి మాట్లాడలేక ఆఫీసుకు వెళ్ళి పోయాడు సుజిత్. 

********************************************************************************

సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన సుజిత్ కు సంధ్య తనతో సరిగా మాట్లాడటం లేదని చాల లేట్ గా అర్థం అయ్యింది. పొద్దున్న అన్న విషయానికి పెద్దగా ఫీల్ అయినట్లు కూడా లేదు. మరి ఎందుకబ్బా సరిగా మాట్లాడటం లేదు అని  బుర్ర బద్దలు కొట్టున్నాడు, తలకి బొప్పి కట్టింది కానీ విషయం ఇసుమంత కూడా  అర్థం కాలేదు. 

"సంధ్య డార్లింగ్! ఏంటి ఏదో డల్ గా ఉన్నావ్? నీకు ఉషారు వచ్చే ఉపాయం చెప్పనా? ఫీలింగ్ వేరి సాడ్ అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టు. అంతే పని పాట లేని వెధవలందరూ ఎన్ని కామెంట్స్ పెడుతారో చూడు" అన్నాడు విరగబడి నవ్వుతూ. 

సంధ్య నవ్వకపోగా కోపంగా చూసి "అందరు లైక్ లు కొడుతారు, కామెంట్ లు పెడుతారు నా పోస్ట్ లకు,  నువ్వు  తప్ప" అంది నిష్టూరంగా. 

"వేరి సారీ యార్, నీ పేస్ ఫేడ్ అవుట్ కావటానికి కారణం ఫేస్బుక్ అని తెలియదు. ఇంతకూ నేను మిస్ అయినా ఆ ఆణిముత్యం లాంటి పోస్ట్ ఏంటి" అన్నాడు సుజిత్ ఉడికిస్తూ. 

"ఇదిగో ఇదే" అని ఫేస్బుక్ ఓపెన్ చేసింది "Love is like a War, very easy to Start but very hard to Stop"  అని ఉంది పోస్ట్.  దానికి అప్పటికే అరవై లైక్ లు,  నలపై కామెంట్ లు వచ్చాయి. 

అది చూడగానే సుజిత్ "అది కాదు సంధ్య! నాకు కొచెం అర్థం కాలేదు ఆ పోస్ట్. క్లారిటి లేకపోతె నేను....." అని ఏదో చెపుతుంటే.

సంధ్య మధ్యలోనే అందుకుని కోపంగా "నీకు క్లారిటీ కావాలా, లేక నాతొ కాపురం కావాలా?" అంది . 

"ఎయ్ ఏంటి మరి సిల్లీగా! జస్ట్ ఫేస్బుక్ పోస్ట్ కోసం ఇంత సీరియస్ అవుతావ్" సుజిత్ వెటకారం ఒలక పోసాడు. 

"ఫేస్బుక్ అయినా నోట్ బుక్ అయినా, నా అభిప్రాయానికి గౌరవం ఇవ్వటం నీకు రాదు. అందుకే నా పోస్ట్ లైక్ చేయలేదు"  అని ఏడుపు మొదలు పెట్టింది. 

"ఓరి దీని యేషాలు" అని మనసులో అనుకుని, పైకి మాత్రం దినంగా  "ఫేస్బుక్ లో క్లారిటి కోసం కాపురం కూల్చుకున్న మొట్ట మొదటి సన్నాసి గాని నేనే కావటం నాకు ఇష్టం లేదుగాని,  ఇదిగో లైక్, కామెంట్ ఏమని రాయమంటవో నువ్వే చెప్పు" అన్నాడు. 

"Very hard to stop Loving you అని పెట్టు" అంది సంధ్య సిగ్గుపడుతూ. 

తానూ అది రాసి అయిదు నిముషాలు అయిందో లేదో! పది లైక్ లు పడ్డాయి.   "మేడ్ ఫర్ ఈచ్ అదర్, సూపర్ జోడి, ఇద్దరు ఇద్దరే"  లాంటి  కామెంట్స్ రాసాగాయి. 

సుజిత్ కు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. సంధ్య మొహం మాత్రం పది డబ్బాలు మెకప్ పట్టించిన యాంకర్ మొహంల వెలిగి పోసాగింది.

                         *********************************************************************************

ఆఫీసు లో పని చేసుకుంటున్నా సుజిత్ కు తన టీం మేట్ వెంకట్ పింగ్ చేసి "నీతో మాట్లాడాలి అర్జెంటు గా రా" అన్నాడు. 

"సరే ఏంటో"  అని వెళ్ళె సరికి మరో ఫ్రెండ్ కిరణ్ తో కలిసి స్మోకింగ్ జోన్ కు దారి తీసాడు వెంకట్. 

"నేను అసలే పనిలో బిజీ గా ఉంటె అర్జెంటు గా రమ్మని పిలిచి స్మోకింగ్ జోన్ కు వెళ్తావ్ ఏంటి భయ్యా?" అన్నాడు సుజిత్. 

"అంటే నేను పక్క ప్రాజెక్ట్ అనుకున్నావా లేక పని ఉందొ లేదో తెలుసుకోలేని మేనేజర్ అనుకున్నావా?" అన్నాడు వెంకట్ ఆశ్చర్యం నటిస్తూ. 

సిగరెట్ లు తాగటం మొదలు పెట్టిన తర్వాత  వెంకట్ మొహం సీరియస్ గా పెట్టి "అరేయ్ కిరణ్! నిన్ను ఒక విషయం అడగాలి రా! నువ్వు పవన్ కళ్యాణ్ మీద జోక్ లు ఎందుకేస్తున్నావ్ రా?"  అన్నాడు. 

"ఇప్పుడు పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ మీద జోక్ లు వెయ్యటానికి ఏముందిరా విషయం" అన్నాడు కిరణ్ వెటకారంగా. 

"నువ్వు మహేష్ బాబు మీద వేస్తె ఉరుకుంటావా? ఏం చేసాడు రా నీకు పవన్ అన్న"  అన్నాడు వెంకట్  బాధపడుతు. 

"అసలు విషయం ఏంటో క్లియర్ గా చెప్పండ్రా. అటు నుండి ఒక్కడు ఇటు నుండి ఒక్కడు పొగవదులుతుంటే  ఉపిరి తీయటమే కష్టం గా ఉంటే!  మళ్ళి అర్థం కాని సుకుమార్ సినిమా చుపిస్తారెంట్రా నాకు"  సుజిత్ కు చిర్రెత్తుకొచ్చింది. 

"అర్థం కాని సుకుమార్ సినిమా? సూపర్ మామ నువ్వు. అది రా మహేష్ బాబు సినిమా అంటే. అస్సలు అర్థం కాదు"  అని సంబరంగా  చంకలు గుద్దుకున్నాడు వెంకట్. 

"ఓరిని అల్పానందం. ముందు నీ ఏడుపు ఏంటో చెప్పు తర్వాత నవ్వుదువు గాని" అన్నాడు కిరణ్ వెంకట్ ని వెక్కిరిస్తూ. 

"పేస్ బుక్ లో పవన్ కళ్యాణ్ మీద జోక్ లు ఎందుకు షేర్ చేశావ్ రా" కంట్రోల్ తప్పుతున్నాడు వెంకట్. 

"అది నేను క్రియేట్ చెయ్యలేదు, ఎవడో షేర్ చేస్తే లైక్ చేసి షేర్ చేశాను" 

"అదే రా ఎందుకు అని అడుగుతున్నా?"  

"నీకు నిజంగానే తెలియదా?  జోక్ లు ఎందుకు షేర్ చేస్తారు? నవ్వుకోవటానికి" అన్నాడు కిరణ్ పగలపడి నవ్వుతూ. 

"మహేష్ బాబు మీద చేసుకో కావాలంటే. కాని పవన్ కళ్యాణ్ మీద చేస్తే అసలు బాగుండదు అ ఆ ఆఅ " అన్నాడు  వెంకట్ పవన్ కళ్యాణ్ స్టైల్ లో. 

"నా పేస్ బుక్ లో నేను ఏ గొట్టం గాడి మీదయిన జోక్ లు వేస్తా,  షేర్ చేసుకుంటా. ఎవడికయినా నొప్పిగా ఉంటె,  ఇప్పుడే నా ఫ్రెండ్స్ లిస్టు లోంచి డిలీట్ చేస్తా" అని ఫోన్ లో పేస్ బుక్ ఓపెన్ చేశాడు కిరణ్. 

"ఒరేయ్ మామ! ఏంట్రా ఇది!  ఈ  మధ్య ఆటో డ్రైవర్ లు ఇలా  కొట్టుకోవటంలేదు, పోలిటిషియన్స్ తప్ప.  సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు అయి ఉండి హీరోల కోసం పేస్ బుక్ లో కొట్టుకోవటం. మిమల్ని,  మీ గొడవను చూస్తుంటే పేస్ బుక్ మీదే విరక్తి కలుగుతుందిరా" అని  చిరాకుగా వెళ్ళి పోయాడు సుజిత్. 

వెంకట్, కిరణ్ మాత్రం ఒక్కరి పేస్ బుక్ లోంచి ఒక్కరిని డిలీట్ చేసుకుని కోపంగా వెళ్ళి పోయారు.

(ఇంకావుంది)

(రెండవ భాగం కోసం ఇక్కడ నొక్కండి)

7 వ్యాఖ్యలు: