27, మార్చి 2015, శుక్రవారం

బాబోయ్ పేస్ బుక్ (హాస్యం) -2

(మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి)

ఆఫీసులో పని లేక పోయినా, ఏదోపొడి చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చే నూటికి 80 శాతం సాఫ్ట్ బాబుల లాగానే సుజిత్ కూడా greatandhra.com, idlebrain.com లో సినిమా న్యూస్ చదువుతూ,  linkedin లో పక్క వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తూ, "ఈ రోజు ఇంకా ఎప్పుడు అయిపోతుందిరా దేవుడా"  అనుకుంటున్నా సమయంలో తన ఫోన్ మోగింది. 

ఫోన్ లో  పేరు చూడగానే,  వీకెండ్ రోజు ప్రొడక్షన్ బగ్ వచ్చినంత ఇరిటేట్ అయిపోయాడు. "ఎత్తక పొతే ఈ వెధవ వాట్సప్ లో సెంటిమెంట్ మెసేజ్ లతో చంపుతానే ఉంటాడు" అనుకుని ఫోన్ ఎత్తి "హల్లో రా మామ" అన్నాడు ప్రేమగా. 

"అలాగే ఉంటది రా! మీరు ఇప్పుడు సాఫ్ట్ వెరు  మేము పనికి రాని అండర్ వెరు. మమల్ని ఎందుకు కలుస్తారు" అన్నాడు సుబ్బారావు తన విలేజ్ పద్దతిలో. 

సుజిత్ "అరేయ్! నీకు దండం పెడుతా, ఆఫీసు లో ఉన్నాను. ఇలాంటి భాష మాట్లాడి నా నోరు చెడగొట్టకు రా"  అని బ్రతిమాలడు. 

"ఇట్స్ ఓకే మాన్. వాట్ అబౌట్ ది పార్టీ"  

"ఓహో ! ఉంటె అమెరికా రేంజ్ లో ఉంటావు లేక పొతే అనకాపల్లికి పడి పోతావ్. మాములు హైదరాబాద్ రేంజ్ లో ఉండరన్న మాట సారు"  

"పార్టి గురించి  నేను టాక్ చేస్తుంటే టాపిక్ చేంజ్ చేసి రేంజ్, ఎక్ష్ చేంజ్ అని స్ట్రేంజ్ గా మాట్లాడ్తవేంటి మామ" సుబ్బారావు రజని లెవెల్లో రెచ్చి పోయాడు. 

"అరేయ్ మామ! ఎక్కడయినా పార్టి ఇవ్వమని పిడించే వాళ్ళను చూశాను. కానీ పార్టికి రమ్మని పీడించే వాణ్ణి నిన్నే చూశాను రా. డబ్బులు ఎక్కువయితే గుడి దగ్గర ముష్టి వాళ్ళకు దానం చెయ్ రా. కానీ పెళ్ళయిన నన్ను వదిలేయ్ రా"  నీరసంగా పలికాడు సుజిత్. 

"అలా అనకు మామ. నాకు డబ్బులు ఎక్కువయి కాదు రా. లవ్వు ఎక్కువయి పార్టీ ఇస్తున్నా. ఒక్క గంట వచ్చి పో మామ. నాకు నువ్వు సురేష్ గాడు తప్ప ఎవరు ఉన్నారు. మనం ఎంత మంచి ఫ్రెండ్స్ రా ఇంజనీరింగ్ లో" అన్నాడు సుబ్బారావు ఏడుస్తున్నట్లుగా. 

"ఒరేయ్,  ఒరేయ్ ఇప్పుడు ఇంజనీరింగ్ రోజులు గుర్తుచేసి నన్ను ఏడిపించకు. నీ తమిళ డైలాగులు ఆపి పార్టి కి ఏర్పాట్లు చెయ్" సుజిత్ తప్పదని డిసైడ్ అయిపోయాడు. 

సుజిత్, సుబ్బారావు ఇంకా సురేష్ ముగ్గురు బీర్స్ తో చీర్స్ చెప్పుకుని కబుర్లలో మునిగి పోయారు. 

"ఏంట్రా!  ఇంజనీరింగ్ లో ఎవడయినా బిర్యానీ తినిపిస్తానంటే ఎగ్జామ్స్ ఉన్నా కూడా,  రోజంతా వాడితోనే ఉండే వాడివి, ఇప్పుడు వెంటపడి మరి పార్టి ఇస్తున్నావ్? లవ్వు, పువ్వు అని కొవ్వేకిన  మాటలు మాట్లాడుతున్నావ్" అన్నాడు సుజిత్ ఆటపటిస్తూ. 

సుబ్బారావు మొఖం సిగ్గుతో,  అమ్మాయి చాచి కొట్టినంత ఎర్రగా మారి పోయింది.  అంతలోనే తమాయించుకుని "నాకు ఒక్కసారి ఫోన్ చెయ్ మామ. స్పీకర్ లో పెట్టు డయల్ చేసి" అని సురేష్ కు సైగ చేశాడు. 

నెంబర్ డయల్ చెయ్యగానే కాలర్ రింగ్ టోన్ "ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందొ తారక, నాలో అల్లరి అల్లరి ఆశలు రేపే గోపిక" అని వస్తూంటే మనోడు కళ్ళు మూసుకుని పరవశంలో మునిగి పోయాడు. 

"మురారి పాటలు మేము సిడి అరిగి పోయేదాక విన్నాం గాని విషయం చెప్పు సుబ్బి" అన్నాడు సుజిత్. 

"ఇంకా అర్థం కాలేదా మామ నీకు. I am in Love మామ. Deeply, Truly, Madly"

"ఎవరు!  మీ ఉళ్ళొ  సత్తెమ్మ?  నీతో పాటు టెన్త్ వరకు చదివింది అన్నావ్" అడిగాడు  సురేష్ ఆశ్చర్యంగా. 

"అంటే! మా రేంజ్ సత్తెమ్మ, మల్లమ్మ దగ్గరే ఆగిపోతుందని నువ్వు ఫిక్స్ అయిపోయావ" కోపంతో ఉగిపోయాడు సుబ్బారావు. 

"సారీ మామ! నువ్వే కదరా తాగినప్పుడు చాల సార్లు సమాంత  కన్నా మా సత్తెమ్మ సూపర్ ఉంటాది అన్నావ్. అందుకే దాంతోనే అడ్జస్ట్ అయిపోయావేమో అనుకున్నా. ఇంతకూ నీ లవర్ ఎవరు మామ" కన్ను కొడుతూ కొంటెగా అడిగాడు  సురేష్. 

సుబ్బారావు "అనసూయ" అని సిగ్గుపడి,  వెంటనే "టీవీ యాంకర్ కాదు" అన్నాడు.

"అబ్బో తమరి పేస్ వాల్యు కి యాంకర్ అనసూయ కూడానా. ఇంతకూ ఎవరు మామ? కూరగాయల బండోడి కూతురా?"

"ఎయ్ అపురా! నీ కామెడీ లెంగ్త్ ఎక్కువయింది గాని, మామ నువ్వు చెప్పు రా. ఎక్కడ కలిసావ్ అమ్మాయిని"  సుజిత్ ఉత్సాహపరిచాడు.

"అందుకే మామ నువ్వంటే నాకు పిచ్చి. తనను పేస్ బుక్ లో కలిసాను" అని సిగ్గుపడ్డాడు సుబ్బారావు.

"పేస్ బుక్ లో ఎలా రా? అమ్మాయిది ఇండియానెనా  లేక ఏ ఆఫ్రికా నో,  యుగండనా"  సురేష్ కు అనుమానం.

సుబ్బారావు కోపంగా "ప్రేమలో ఉన్నాను కాబట్టి బీరు  పోసి  వదిలేస్తున్నా. లేకపోతె నార తిసెవాణ్ణి" అని వెంటనే సుజిత్ వైపు తిరిగి "ఒక రోజు నేను క్యాసువల్ గా క్యాండీ క్రష్ ఆడుతుంటే,  ఏదో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది మామ. నేను ఎవడో మన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అనుకున్నా. కాని అమ్మాయి పేరు చూసి షాక్ అయిపోయా. మళ్ళి అంతలోనే మనోడే ఎవడయినా అమ్మాయి పేరుతో అడుకోవలనుకుంటున్నడెమో అనుకున్నా.  మనమే రివర్స్ లో ఆడుకుందాం అనుకుని రిక్వెస్ట్ అక్సేప్ట్ చేశా. వెంటనే "హాయ్" అని  చాటింగ్ మొదలయింది. అలా మొదలయిన  చాటింగ్ వారం రోజులు నడిచింది."

"మధ్యలో బ్రేక్ లేకుండానా?" సురేష్ డౌట్ వ్యక్తం చేశాడు.

"నీ  CID సిరియల్ డౌట్స్ అపురా. వాణ్ణి ఫ్లో లో చెప్పుకు పోనీ" సుజిత్ చిరాకు పడ్డాడు.

"వారం తర్వాత చాటింగ్ చెయ్యటానికి నా దగ్గర టాపిక్ లన్ని అయిపోయాయి.  ఎం మాట్లాడాలో తెలియక కన్ఫ్యూషన్ లో నిన్ను చూడాలనిపిస్తుంది అన్నాను. నా బంగారం ఎంత స్పోర్టివో తెలుసా మామ, వెంటనే నువ్వేం భాదపడకు రా నేను నా ఫోటో పంపిస్తాను అని తన ఫోటో మెయిల్ చేసింది"  సుబ్బారావు కు దుఖం ఆగడం లేదు.

"ఫోటో పంపటానికి స్పోర్టివ్ నెస్ ఎందుకు? మేకప్ కిట్ ఉండాలి గాని" సురేష్ పంచ్ ను ఆపుకోలేక పోయాడు.

అవ్వేవి పట్టించుకునే స్తితిలో లేడు సుబ్బారావు "ఫోటో చూసి, ఇంత అందమయిన అమ్మాయి నాకు పడి పోవటం ఏంటి దేవుడా అని బోరుమని ఏడ్చేశాను మామ"

"అబ్బో ! తర్వాత ఎడుద్దువు గాని. స్టొరీ కంటిన్యూ చెయ్" సురేష్ చిరాకు పడ్డాడు.

"రెండు రోజుల తర్వాత, నీతో మాట్లాడాలని ఉంది అన్నాను. అంతే! నీ నెంబర్ చెప్పు నేను కాల్ చేస్తా అని మిస్ కాల్ చేసింది" సుబ్బారావు సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు.

"ఇదంతా చూస్తుంటే! ఎప్పుడెప్పుడు వీడికి ఫోటో పంపాలి, ఎప్పుడెప్పుడు వీడితో మాట్లాడాలి అని అమ్మాయే కరువచ్చిన దానిల  ఎదురుచూస్తున్నట్లు ఉంది" అనుమానం వ్యక్తం చేశాడు సురేష్.

"తన వాయిస్ సునీత వాయిస్ కన్నా స్వీట్ మామ. ఫోన్ లోనే అలా ఉందంటే నేరుగా ఇంకా ఎంత బాగుంటుందో" సుబ్బారావు కళ్ళు తుడుచుకున్నాడు.

"మధ్యలో సునీత ఎవరు మామ" సురేష్ నిజంగానే కాన్ప్యుస్ అయ్యాడు.

"ఒరేయ్ ఇందాకటి నుండి చూస్తున్నాను. నా లవ్ స్టొరీ ని కామెడీ స్టొరీ చెయ్యాలని ట్రయల్స్ మిద ట్రయల్స్ ఎస్తున్నావ్. సునీత అంటే ఇంకో అమ్మాయి కాదు. మన సింగర్ సునీత, ఆమె వాయిస్ కన్నా బాగుంది అంటున్నాను" సుబ్బారావు తట్టుకోలేక పోయాడు.

"వాడి సంగతి వదిలేయ్ మామ. తర్వాత ఏమయింది చెప్పు" అని కుతూహల పడ్డాడు సుజిత్.

"ఫోన్ లో కబుర్లు,  పేస్ బుక్ లో  లవ్ కొటేషన్ లు. ఈ మధ్యే పర్సనల్ గా కూడా చాల  దగ్గర అయిపోయాం" సుబ్బారావు ట్రాన్స్ లో ఉండి చెప్పుతున్నాడు.

"అంటే! పర్సనల్ గా కలుసుకున్నార? ఎక్కడ మామ! ఎం చేశావు రా" బీర్ తాగుతున్నా కూడా సురేష్ కు గొంతులో తడారి పోయింది.

"ఛీ ! బ్లాడి కామిష్టి ఫెల్లో.  పర్సనల్ గా దగ్గర అవ్వటం అంటే ఒకరి కష్టాలు ఒకరం షేర్ చేసుకున్నాం, ఓదార్చుకున్నాం"

"ఓదార్పు దగ్గర అగిపొయరా?  లేక! సహాయా,  సహకారాలు కూడా అందించుకున్నారా" సుజిత్ మనసు కీడు శంకించింది.

"డబ్బుదేముంది మామ. ప్రేమ ముఖ్యం. పాపం కాలేజీ ఫీజు కు కష్టంగా ఉందంటే జస్ట్ ఫిఫ్టీ తౌసండ్ పంపాను. మళ్ళి ఇచ్చేస్తాను అని ఒక్కటే చెప్పటం"  సుబ్బారావు జాలి పడ్డాడు.

"ఒక్కసారి అమ్మాయి ఫోటో చూపించు మామ" సుజిత్ లో ఏదో అనుమానం.

"షుర్ మామ! అందుకేగా పిశాచంలా వెంటపడి మరి పార్టికి పిలిచింది" అని మొబైల్ లో ఉన్నా అమ్మాయి ఫోటో చూపించాడు.

ఫోటో చూడగానే సుజిత్ కు మతిపోయినంత పనయింది. "ఏంట్రా! హిందీ హీరోయిన్ పరీణితి చోప్రా ఫోటో చూపిస్తావ్" అన్నాడు.

"మామ! అమ్మాయి హీరోయిన్ లా ఉంటుంది కాని హీరోయిన్ కాదు, మై లవర్  అనసూయ. హీరోయిన్ లు మేకప్ వేసుకుని, డిసైనర్  డ్రెస్ లు వేసుకుంటారు" సుబ్బారావు గర్వపడ్డాడు.

"ఒరేయ్ మెంటల్. పరిణీతి చోప్రా మేకప్ లేకుండా, చుడిదార్ వేసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసినా ఫోటో ఇది. దాన్నే పంపి  నిన్ను మోసం చేశారు"

"అందుకేరా,  ఎప్పుడు తెలుగు సినిమాలు,  డబ్బింగ్ సినిమాలే  కాకుండా  అప్పుడప్పుడు హిందీ సినిమాలు చూడురా అని చెప్పేది" అన్నాడు సురేష్ నవ్వపుకుంటూ.

"నేను ఇప్పుడే ఫోన్ చేస్తా రా, నా  బంగారానికి" నెంబర్ డయల్ చేసి స్పీకర్ అన్ చేశాడు సుబ్బారావు.

అవతలి నుండి "ఏంట్రా  ఇంకా పడుకోలేదా?" అని హస్కీ వాయిస్.

"లేదు బంగారం. నిజం తెలిసే సరికి  నిద్ర రావటం లేదు" అన్నాడు  సుబ్బారావు సీరియస్ మూడ్ లో.

"నిద్ర దూరం చేసే నిజం కన్నా,  అందమయిన కలలిచ్చే అబద్దమే గొప్పది కదా!"

"అంటే నువ్వు పంపిన  ఫోటో అబద్దం అంటావు, అంతేనా?"

"అద్దంలో కనిపించే మనం అబద్దం కానప్పుడు,  నేను పంపిన ఫోటో కూడా అబద్దం కాదు"

"సీరియల్స్ లో లాగ మాట్లాడి నన్ను కన్ప్యుస్ చెయ్యకు. స్ట్రెయిట్ గా మాట్లాడు"

"మేకప్ లేని పరిణితి చోప్రా ఎలా ఉంటుందో, మేకప్ వేస్తె నేను అలాగే ఉంటాను"

"అలాంటప్పుడు నీ ఫొటోనే పంపచ్చు కదా? ఎవరిదో ఎందుకు"

"ఈ మధ్య కొంచెం లావయ్యాను. కాని వర్కౌట్ మొదలు పెట్టాను. ఖచ్చితంగా జీరో సైజు కాకపోయినా కనీసం థర్టీ సిక్స్ కి తగ్గిపోతాను"

"అంటే వర్కౌట్ పూర్తీ కాకుండానే,  నన్ను వర్కౌట్ చేశావా? దొంగ మొఖం  దాన!"

"నాది దొంగ మొఖం  అయితే నీది పోలీస్ మొఖమా?   బట్టతల ఉన్నా నీకు పరిణితి చోప్రా కావాలా?"

"నాకు బట్టతల ఉంది గాని నీలాగా బానెడు పొట్ట లేదు"

"కష్టపడితే నేను పొట్ట తగ్గించ గలను, కాని నువ్వు ఎంత కష్టపడ్డ జుట్టు పెంచగలవా? ముందు ప్రేమించటం నేర్చుకోరా"

"నిన్ను వదిలి పెట్టాను. రేపే పోలీస్ కంప్లైంట్ ఇస్తా"  సుబ్బారావు కోపంతో ఉగిపోతున్నాడు.

"ఇది నాకు కొత్త కాదురా. వాళ్ళు ఎంక్వయిరీ చేసే లోపు నా ఎకౌంటు ఉండదు, ఫోన్ నెంబర్ ఉండదు. అన్ని ఫేక్, నాలాగే" అని లైన్ కట్ అయిపోయింది.

సుబ్బారావు కోపంతో మళ్ళి డయల్ చేశాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ అని మెసేజ్. నీరసంతో అలాగే కుప్పకూలి పోయాడు.

"ఒరేయ్ మామ. ఎంత లవ్ చెయ్యాలనిపిస్తే మాత్రం పేస్ బుక్ లో లవ్ ఏంట్రా? కనీసం ఒక్కమాట మాకు చెప్పి ఉంటె ఇంత దూరం వచ్చేది కాదు కదరా?" సుజిత్ ఒదారుస్తున్నాడు.

"నిజమే రా.  కాని నేను మికేదో సర్ప్రైస్ ఇవ్వాలని ఇలా అడ్వాన్సు అయిపోయాను. సురేష్, ఇప్పుడు హ్యాపీ యా మామ" సుబ్బారావు కు దుఖం ఆగటం లేదు.

"ఒరేయ్ ఏంట్రా వీడు. నేనేదో సరదాగా ఎడిపించాను మామ. నిజంగా వేరి సారీ రా" సుబ్బారావు ను గట్టిగా హత్తుకున్నాడు సురేష్ ఓదారుస్తూ.

"దేనికి రా ఏడుపు ఇప్పుడు. సత్తెమ్మకు ఇంకా పెళ్ళి కాలేదు కద" అన్నాడు సుజిత్ ఆటపటిస్తూ.

సుబ్బారావు నవ్వలేక నవ్వాడు.

(ఇంకాఉంది)

(మూడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి)

5 వ్యాఖ్యలు: