13, నవంబర్ 2015, శుక్రవారం

(అ) ధైర్యం
ఎత్తు పల్లం ఉండేది గతి
కష్టసుఖం కలిగేది స్థితి
సిద్ది తోనే పోయేది మతి
ఆపైన  చేరేది  అశాంతి
అప్పుడే కావాలి  శ్రాంతి

చీకటికి ఒక  రూపం లేదు
వెలుగు అరిపోవటం తప్ప
భయం బ్రతికేది
ధైర్యం లేదన్న ధైర్యం తో కదా ?
సూర్యుడస్తమించకా !
సూర్యోధయం రాదా ?

నిన్నగా  మారె తెగింపులో
సగం ఉన్న చాలు
రేపు అనే దీపానికి
ఊపిరుధగలవు

సానకు వెరవని  వజ్రం
కొలిమిని దాటినా కనకం
విలువకు అంతుందా ?

శ్రమ తెలిసిన వాడికి
పలితంతో పనేముంది
అనుభవం గడించే వాడికి
తెలివికి కొదువె ముంది

శ్రమతో చెమట చిందితే
నుదుటి రాత చెదరదా ?
ఉన్నత లక్ష్యం నీదైతె
ఆపజయం అదిరి పడదా ?
విజయం నిన్ను చేరదా !


6, నవంబర్ 2015, శుక్రవారం

మరో కోణం - 1

మేనేజర్ రూం నుండి భయటకు వస్తున్నా సతీష్ ను ఓర కంటగా చూసి కొంటెగా నవ్వింది మైథిలి.  దానికి అతను కూడా కింది పెదవిని పంటితో కొరికి చిలిపిగా నవ్వాడు. ఇదంతా చూస్తున్న వెంకట్ కడుపు మంట తో రగిలి పోయాడు.  అర్జెంటు గా ఈ డెవలప్మెంట్ ను ఆపెయ్యాలి అనుకుని సతీష్ తో "రారా మామ ఒక్క దమ్ము కొట్టి వద్దం" అన్నాడు మైథిలికి వినపడేలాగ. 

అది వినగానే సతీష్  మైథిలి వంక చూశాడు. తన  మొఖం  కోపంతో ఎర్రగా కంది పోయింది. సతీష్  ఏదో తప్పు చేసినట్లుగా దీనంగా మొఖం పెట్టి ఆమె వంక చూశాడు.  అది చూడగానే వెంకట్ కు ఇంకా మండి పోయింది. "సిగరెట్ అనగానే, చిన్న పిల్లాడికి  లాలిపప్  ఇచ్చినట్లు ఫీల్ అయ్యే వాడివి! ఇప్పుడు ఏదో హోం వర్క్ ఇచ్చినట్లు మొఖం పెట్టావ్?" అన్నాడు వ్యంగంగా.

సతీష్ వస్తున్నా కోపాన్ని దిగమింగుకుని భయటకు దారి తీసాడు. సిగరెట్ అంటిస్తున్న వెంకట్ తో "ఏంట్రా లోపల ఎక్కువ చేస్తున్నావ్? వచ్చే వరకు ఆగలేవా!"  అన్నాడు కోపంగా.

దానికి వెంకట్ పగలపడి నవ్వి "ఫీల్ అయ్యావ మామ! పోరిలకు భయపడుడు ఏందిరా? అమ్మాయిలే సిగరెట్ గుప్పు గుప్పు మని ....."

"తనకు ఇష్టం లేదురా నేను సిగరెట్ తాగటం" అన్నాడు సతీష్ మధ్యలోనే అందుకుని.

వెంకట్ ఆశ్చర్య పోయి "ఇది ఎప్పటినుండి రాజా! అయినా ఎప్పుడు ఫేస్బుక్, లింక్డిన్ చూస్తూ కుర్చుంటావ్. ఎప్పుడు మాట్లాడవు రా" అన్నాడు ఎగతాళిగా.

"మొన్ననే ఒక ఇష్యూ వస్తే చాట్ విండో లో పింగ్ చేసింది. ఇష్యూ రిసాల్వ్ అయిపోయాక చిన్నగా మొదలు పెట్టా. నీ డ్రెస్ బాగుంది దగ్గరి నుండి"  సతీష్ గొంతులో  గర్వం తోణికిస లాడింది.

"వారం రోజులు లీవ్ పెట్టినందుకు బాగానే డెవలప్ చేశావ్ రా.  రూం కి పనిమనిషి రాక పోయిన వచ్చి చెప్పేవాడివి! మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు రా నాకు" సతీష్ మొఖం కోపం తో ఎర్రబడింది.

"వచ్చిందే ఈ రోజు మళ్ళి చెప్పలేదని ఏడుపా? అయినా ఫ్రెండ్ కు ఏమయినా చెప్పొచ్చు కాని అమ్మాయిని లైన్ లో పెట్టె విషయం మాత్రం చెప్పకూడదు. అయితే చెడగోడుతారు లేదా తన్నుకు పోతారు" నీతి బోధ చేశాడు సతీష్.

"సర్లే! మాట్లాడినందుకే ఏదో పడి పోయినట్లు ఫీల్ అయిపోకు. అది అసలే పరమ ఫాస్ట్" వెంకట్ నిరుత్సాహ పరచాలని  చూశాడు.

"నిన్ననే కంపెనీ బస్సు లో వెళ్ళకుండా నన్ను హాస్టల్ దగ్గర దింపమంది. మధ్యలో బారిస్టలొ కాఫీ తాగం"  ఊరిస్తూ చెప్పాడు సతీష్.

"సర్లే  నేను తానూ ఆఫీసు లో చాల సార్లు తాగం కాఫీ" వెంకట్ తననుతాను సంబాళించుకున్నాడు.

"ఓరిని అల్ప సంతోషం తగలేట్టా. హాస్టల్ లో డ్రాప్ చేసిన తర్వాత గుడ్ నైట్ చెపుతూ కిస్ చేసింది అంటే చచ్చి పోతావేమో" అన్నాడు సతీష్ ఉషారుగా.

వెంకట్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తానూ విన్నది నిజమేనా అని అనుమానంగా "ఏంటి? కిస్ చేసిందా? ఎక్కడ చేసింది?  బుగ్గ మీద!" ఆత్రంగా అడిగాడు.

"ఇప్పుడు పార్టు తో పనేంట్రా?"

"ఈ మధ్య కిస్ చేసే బాగాన్ని బట్టి అర్థం మారుతుంది మామ"

"అయితే లవర్స్ ఎక్కడ చేసుకుంటారో అక్కడే చేసింది. హ్యాపీ యా?"

అది వినగానే వెంకట్ సిగరెట్ దమ్ము గుండేలా నిండ పిల్చి  బెంచి మిద  నీరసంగా  కూలబడి పోయాడు. ఏమి మాట్లాడకుండా.

కొద్దిసేపటికి తేరుకుని "నా అబ్సేన్స్ లో ఎంత పెద్ద స్టొరీ నడిపినావ్ మామ. నువ్వు గ్రేట్ రా.  కత్తిలాంటి ఫిగర్ ను పడేశావ్" అన్నాడు వెంకట్ అసూయగా.

"నువ్వు ఉంటె సాగనిస్తావా? అందుకే నువ్వు లేనప్పుడు మొదలు పెట్టా"  సతీష్ నిష్టురమాడాడు.

"అరేయ్ నీకు ఇష్టం ఉంది అంటే నేనే హెల్ప్ చేసేవాణ్ణి రా. అయిందేదో అయింది కనీసం పార్టి ఇవ్వురా"

"పార్టి ఇవ్వక పొతే ఆపుతావా నీ ఏడుపు. లేక పొతే రేపే విడిపోతం మేము" అని లోపలికి దారి తీసాడు సతీష్.

****************************************************************************************

సతీష్, అతని  రూం మెట్ కిరణ్ మరియు వెంకట్ ముగ్గురు మందు తాగటానికి కూర్చున్నారు.

"కిరణ్! నీకో విషయం తెలుసా? మీ వాడు కాజల్ లాంటి తెలుగమ్మాయిని పడేసాడు" అన్నాడు సతీష్ ఊరిస్తూ.

"ఎవరు  మైథిలి యేనా ఇంకా వేరే అమ్మాయా?"   ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్ .

వెంకట్  షాక్ అయిపోయి "నీకెలా తెలుసు తన పేరు" అన్నాడు.

సతీష్, కిరణ్ వంక గుర్రుగా చూసి "రూం చూస్తానంటే తీసుకొచ్చాను మామ. కొద్దిసేపు ఉండి పోయింది" అన్నాడు తేలికగా.

వెంకట్ సోడా కలపలేదని కూడా చూసుకోకుండా గ్లాస్ ఖాళీ చేసి, సిగరెట్ దమ్ము గుండేలా నిండా పిల్చాడు.

"మన కంపెనీ కే బ్యూటీ రా! భలే పడేసావ్. లక్కీ ఫెల్లో మామ నువ్వు" వెంకట్ కడుపు రగిలి పోయింది.

"మా వాడి కన్నా కూడా నువ్వే ఎక్కువ గా మాట్లాడే వాడివట తనతో. మరి నువ్వెందుకు ట్రై చెయ్యలేదు బాస్" కిరణ్ పుండు మీద కారం చల్లాడు.

"నాకు ఇంటరెస్ట్ లేదు బ్రో. లేక పొతే మనకు పడని అమ్మాయిలా? ఏదో కొంచెం జుట్టు పల్చగా అయింది ఈ మధ్య టెన్షన్ ఎక్కువయి. కాలేజీ లో మొత్తం మనదే హవా" పాత రోజులు గుర్తుతెచ్చుకొని గర్వపడ్డాడు వెంకట్.

"టీం లో కూడా నీదేనంట కదా హవా!" కిరణ్ ఇంకా రెచ్చగొట్టాడు.

"మా మేనేజర్ గాడు పరమ పాల్తూ గాడు. ప్రతి దానికి నన్నే. ఎవరు ఏ షిఫ్ట్ లో రావాలి, ఏ ఎవరు టాస్క్ చెయ్యాలి మనమే డిసైడ్ చెయ్యాలి.  మైథిలి కూడా మంచి రేటింగ్ రావాలని చాల సార్లు అడిగేది, నా గురించి మన మేనేజర్ కు చెప్పు అని. ఏమిరా సత్తి మన గురించి చెప్పలేదా మీ వాడికి"  వెంకట్ రెచ్చి పోతున్నాడు.

"సతీష్ కు ఆన్ సైట్ కూడా నువ్వే ఇప్పించావ?" వెళకొలమడాడు  కిరణ్.

వెంకట్ నమ్మలేనట్లుగా చూశాడు. "ఇదెప్పుడు తెలిసింది మామ?" అన్నాడు నిర్ఘంతపోయి.

"ఈ రోజు మధ్యాహ్నం తెలిసింది. అదేరా నువ్వు సిగరెట్ సిగరెట్ అని మైథిలి ముందు అరిచావ్ చూడు అప్పుడు"

"ఏంట్రా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నావ్ ఈ రోజు. కత్తిలాంటి అమ్మాయి, ఇప్పుడు ఏకంగా ఆన్ సైట్" అని వస్తున్నా దుఃఖాన్ని దిగమింగుకున్నాడు వెంకట్.

"అన్నింటికీ నీకే క్రెడిట్ మామ. రిలీజ్ లో  నువ్వు వారం రోజులు లీవ్ పెట్టడం ఏంటో గాని, అన్ని ఇష్యూ లకు మైథిలి నన్నే అడిగేది. అలా తను వర్కౌట్ అయింది. నీకు నైట్ షిఫ్ట్ లు ఇష్టం లేదని చెప్పి ఎప్పుడు నన్ను పంపే వాడివి.  USA లో ఉండే క్లైంట్ గాడి తో మంచి రాపో అయింది. నేను అక్కడికి వస్తే బాగుంటుంది కదా అన్నాను. అంతే! నన్ను ఆన్ సైట్ పంపుమని మన మేనేజర్ గాడి కి మెయిల్ వెళ్ళింది" వివరించాడు సతీష్.

వెంకట్ కు ఒళ్లంతా నీరసం ఆవహించింది. తమాయించుకుని "వెల్ డన్ మై బాయ్. ఐ యాం వేరి ప్రౌడ్ అఫ్ యూ"  నవ్వలేక నవ్వాడు.

మనసులో మాత్రం "పని తప్పించుకోవటానికి వారం రోజులు సెలవు పెడితే అమ్మాయి పోయింది. నైట్ షిఫ్ట్ లకు పంపి విణ్ణీ బకార చేస్తున్న అనుకుంటే ఆన్ సైట్ పోయింది" అనుకున్నాడు.

మరో సారి  సోడా కలపని మందు కొట్టేసాడు. ఆ రోజు ఎంత తాగిన ఎక్కలేదు వెంకట్ కు.

(ఇంకావుంది)

(రెండవ భాగం కోసం ఇక్కడ నొక్కండి. )

5, ఆగస్టు 2015, బుధవారం

తెలుగు బూతు చానల్స్!!

తెలుగు టీవీ చానల్స్ లో "మీలో ఎవరు కోటీశ్వరుడు, పాడుతా తియ్యగా, సూపర్ సింగర్" లాంటి మంచి  ప్రోగ్రామ్స్ తో పాటు, కొన్ని అభ్యంతరకరమయిన ప్రోగ్రామ్స్ కూడా చెలామణి అవుతున్నాయి. అవి మాములు ప్రోగ్రామ్స్ అయినా సరే,  వాటిని నిర్వహించే యాంకర్ లు చేసే చేష్టలు వాటిని అభ్యంతరకర ప్రోగ్రామ్స్ గా మారుస్తున్నాయి. "అవునా నిజమా? మచ్చుకు కొన్ని చెప్పండి బాబు!" అని మీరు ఎలాగు అడుగుతారు కాబట్టి, పేర్లు చెప్పక తప్పటం లేదు. 

మా టీవీ లో ప్రసారం అయ్యే "మోడ్రన్ మహాలక్ష్మి" లాంటి  కార్యక్రమాలు  ఆడవారికి చాల ఇష్టం. ఎందుకంటే వాటిలో చీరలు, నగలు ఇంకా వారికీ ఇష్టమయిన అలంకారలు ఉంటాయి కాబట్టి. కానీ ఆ ప్రోగ్రాం మీరు పిల్లలతో మాత్రం చూడలేరు. ఎందుకంటే? ఆ ప్రోగ్రాం వ్యాఖ్యాత "అనసూయ" చాల మోడ్రన్ కాబట్టి. ఇవిడా పేరు కు మాత్రమే పాత చింతకాయ పచ్చడి, కాని ఆవిడా చేష్టలన్నీ కొత్తావకాయే. ఎంట్రి  మంచి డాన్సింగ్ నెంబర్ తో ఇస్తుంది. ఆ డాన్స్ చేసేటప్పుడు, చాల సిన్సియర్ గా ఏమి పట్టించుకోదు. చీర జఘన భాగంలో కడుతుందేమో, కాస్త అటుఇటు ఉగగానే నాభి దర్శనం. సినిమాల్లో ఎలాగు తప్పటం లేదు, వాటిని ఫాంటసీ లైఫ్ లో ఉంచుకున్నాం కాబట్టి కాస్త మెరుగు. కాని టీవీ అంటే  వాస్తవం, కనీసం జీవితానికి దగ్గరి తనం అని టీవీ ప్రేక్షకుడు నమ్ముతాడు. ఎందుకంటే అక్కడ కనిపించేది నిజ జీవితంలో  మనుష్యులు కాబట్టి. 

ఇలాంటి ప్రోగ్రామ్స్ కూతురు, తండ్రి లేదా అన్న, చెల్లెలు కలిసి చూడటం వదిలెయ్యండి. కనీసం అయిదారేళ్ళు ఉన్నా మగ పిలల్లలతో తల్లి చూసే ధైర్యం చెయ్యదు. ఒక్క క్షణం కనిపించే ఆ భాగం గురించి కాదండి. తర్వాత జరిగే తంతూ గురించి నేను మాట్లాడేది. "ఏంటి తర్వాత జరిగేది? గేమ్స్ ఆడిస్తుంది!" అంటారు అంతేనా? ఆవిడా కార్యక్రమంలో పాల్గొనే వారిని సంభోదించే తీరు శ్రవణానందకరం సుమీ! మచ్చుకు కొన్ని "ఓసేయ్, ఎంటే". కొద్ది రోజులకు  ఇంకా డోస్ సరిపోవటం లేదని  రేపు ఎప్పుడయినా వీధి లో తిట్టుకునే బూతులు మాట్లాడిన "మోడ్రన్" అనుకొమంటరేమో? "ఓరేయ్, ఓసేయ్, ఎంట్రా, ఎంటే" లాంటి మధ్యరకం (ఒక మోస్తరు) బూతులు విచ్చల విడిగా టీవీ లో వాడేస్తుంటే!  పిల్లలు ఏంటి నేర్చుకోనేది? ఆడవాళ్ళని "ఓసేయ్" అని, మగవాళ్ళను "ఓరేయ్" అని పిలిచినా తప్పులేదు, అది పెద్ద అభ్యంతరకర పదం కాదు అని పిల్లలు నేర్చుకొంటే! సంఘంలో పరస్పర గౌరవం ఇచ్చుకోవాలనే సాదారణ లక్షణం వారికి దూరం చెయ్యటం కదా? 

పాల్గొనే వారితో కలిసి పోవటానికి వారిని "ఓసేయ్, ఎంటే" అనే పిలవాల?  అందులో పాల్గొనే వారికి లేని అభ్యంతరం మీకెందుకు అంటారా?  టీవీ లో కనిపిస్తున్నామని పాపం వారు చేసే పిట్లు, పడే పాట్లు చూస్తే జాలేస్తుంది. డాన్స్ రాకపోయినా, ఒళ్ళు సహకరించక పోయిన, పాడటానికి గొంతు లేక పోయిన, ఎలాగయినా సందడి చెయ్యాలనే  వారి ఆరాటం ఆటవిడుపు. ఇక వారు అభిప్రాయాలూ వెల్లడించి,  అభ్యంతరం పెట్టె  అవకాశం ఉందంటార?

అదే చానెల్ లో మరో ప్రోగ్రాం "అలీ టాకీస్". ఈ ప్రోగ్రాం పెట్టింది ఒక తెలుగు  స్టార్ కామెడియన్ అయిన అలీ గారి పేరు మీద. సినిమాల్లో ఈయన కామెడీ ఎంత అలవోకగా చేస్తాడో, భయట బూతులు అంతే అలవోకగా మాట్లాడేస్తుంటాడు. ఈ అలీ టాకీస్ ఒక హిందీ ప్రోగ్రాం కి అనుసరణ. కానీ అందులో కనిపించే సున్నితమయిన హాస్యం ఇందులో మచ్చుకు దొరకదు.  తెలుగు లో ఈ కార్యక్రమంలో పాత్ర దారుల చేష్టలు పరమ రోతగా ఉంటాయి.  భార్య పాత్రలో అనసూయ,  బామ్మా పాత్రలో తిరుపతి ప్రకాశ్, ఇంకా ఒక తాగుబోతు, బామ్మర్ది పాత్రలో రవి, ఆటలో అరటి పండు పాత్రలో  ఒక్కప్పటి హీరో  సురేష్, ఈ మధ్య సింగర్ మనో,  విళ్ళందరికి బాస్ అలీ.  కామెడీ చెయ్యాలని వీళ్ళు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. ఏది మాట్లాడిన ద్వందర్దాలు తీసి కామెడీ చెయ్యాలని చూస్తారు. భార్య పాత్రలో అనసూయ, భర్త పాత్రలో ఉన్నా ఆలీ తో ఎన్ని నిగూఢమైన బూతులు మాట్లాడుతుందో! అలీ గారు ఎన్ని స్వచ్చమయిన బూతు జోకులెస్తారో!  మీకు ఓపిక ఉంటె చూసి తరించండి ఈ లింక్ నుంచి.  

ఇక బామ్మా పాత్ర దారి తిరుపతి ప్రకాశ్. ఎంత మగవాడని తెలిసిన, ఆడవారి డ్రెస్ వేసుకునేసరికి కాస్త బిడియం, అణుకువ ఆశిస్తాం. కానీ ఇతగాడు అందులో ఒక్కటయినా  పాటించటం మాట దేవుడెరుగు,  జబ్బల వరకు బట్టలు వేసి, జుగుప్స పుట్టేలా చంకలో వెంట్రుకలు ప్రదర్శిస్తుంటాడు. ఇక అతగాడు ముసలి వయసు మీద వేసే బూతు జోకులకు హద్దు అదుపు ఉండదు. ప్రతి వారం ఏదో సినిమా ప్రమోషన్ కోసం వస్తుంటారు హీరో, హీరోయిన్ ఇంకా ఆ సినిమాకు పని చేసిన మిగత నిపుణులు. హీరోయిన్ ను తాకటానికి, లేదా తాకుతూ వీళ్ళు చేసే చేష్టలు చూస్తే వికారం కలుగుతుంది. దాన్ని కామెడి అనుకోమ్మంటే! అంతకన్నా దౌర్బగ్యం ఇంకోటి ఉండదు.

ఈ మధ్య  ఒక్కమ్మాయి నెట్ లో వీడియో విడుదల చేసి ఆలిని "దున్నపోతు" అని తిట్టింది. ఆ అమ్మాయి చెప్పిన మిగత విషయాలు ఎలా ఉన్నా, శ్రీమాన్ అలీ గారి గురించి మాత్రం సరయిన రీతిలోనే మాట్లాడిందని నా అభిప్రాయం. ఒక్కప్పుడు అర్థం కాని భాషలో మాట్లాడి కామెడి చేసే అలీ గారు (ఆయన్ని గౌరవించక పొతే, అభిమానులు అడి పోసుకుంటారు) , తర్వాత ద్వందర్దాలకు దిగజారారు. ఇప్పుడు మాత్రం స్వచ్చమయిన బూతులతో నవ్వులు పుయించాలని చూస్తున్నారు. కాని అవి పుచ్చి పోతూ తన గౌరవాన్ని పలుచన చేస్తున్నాయని గ్రహించలేక పోతున్నారు. మచ్చుకు కొన్ని, సమంతా నడుము బెంజ్ సర్కిల్ లా ఉంటుందని చెప్పటం. నమితాను తిరుపతి లడ్డుతో పోల్చి, "ఆ లావు తట్టుకోవటం నా వాల్ల  కాదమ్మా" అని కామెంట్ చెయ్యటం.  హీరోయిన్ డ్రెస్ లను కామెంట్ చేయటం, ఒక్కటేమిటి కామెడీ చెయ్యటానికి ఆడవారిని ఎన్ని కామెంట్స్ చెయ్యాలో అన్ని చేస్తారు మన డాక్టర్ అలీ గారు.అనుమానంగా ఉంటె మీరే చూడండి ఈ లింక్ ద్వార.

పడ్డవారికి లేని భాధ నీకెందుకు అంటారా? సభ మర్యాద కోసమో లేక పరపతి కి భయపడో లేక ఇండస్ట్రీ లో ఉంటూ గొడవలు పడటం ఎందుకనో అలోచించి  వాళ్ళు భాధను పంటి బిగువున దాచుకోవచ్చు. కానీ సమాజంలో ఉన్నప్పుడు,  నాగరిక స్పృహ అనేది పాటించాలి. మన ముందు ఎవరయినా తప్పు చేసినప్పుడు మనకు తెలిసినా వారి ముందు సున్నితంగా మందలిస్తాం, వారు వెళ్ళి పోయాక, మన ఇష్ట రాజ్యంగా తప్పు చేసిన వారిని  తిట్టినా సరే. ఎందుకు? నాగరిక స్పృహ.  ఇలా బూతులు మాట్లాడితే వారి ముందు మనం చులకన అయిపోతాం అని భయం లేదా సభ్యత కోసం.  ఆ మాత్రం తెలివి, సభ్యత  అయన గారికి లేదా? నన్ను ఎవడెం చేస్తాడు అని పొగర?

మరో ప్రోగ్రాం ఈ టీవీ లో ప్రసారం అయ్యే  "జబర్దస్త్". వర్ధమాన కమెడియన్స్ అందరు కలిసి పోటి పడే కామెడీ షో.  దీనికి న్యాయ నిర్ణేతలుగా మన మెగా బ్రదర్ నాగబాబు, ఒకనాటి అందాల తార, నేటి MLA రోజా గారు.  దీంట్లో చాల మంది కమెడియన్స్ ఉన్నారు. ఒక్కో గ్రూప్ కు ఒక్కో లీడర్. వాళ్ళ పేర్లు చెపితే చాంతాడు అంతవుతుంది. వీళ్లు కామెడీ పేరుతొ ఎంతకు దిగాజారలో అంతకు దిగజారారు. జడ్జి గారి లో దుస్తుల గురించి మాట్లాడటం నుండి యాంకర్ అంగంగా వర్ణన వరకు. మచ్చుకు ఒక బూతు జోక్, షో లో ఒకతన్ని వెళ్ళు లేక్క పెట్టమంటారు. అతను లెక్క పెట్టి పది అంటాడు. తర్వాత ప్యాంటు జేబులో పెట్టుకుని లెక్క పెట్టమంటే అతను లెక్క పెట్టి పదకొండు అంటాడు. దానికి మన మెగా బ్రదర్ విరగబడి నవ్వటం, మన MLA గారు సిగ్గు పడి మొఖం చేతుల్లో దాచుకోవటం. యాధవిధిగా సూపర్, బంపర్ అని చెప్పి  మార్కులు ఇచ్చేసారు. కుటుంబం అంత టీవీ చూస్తూ బోజనాలు చేసే సమయం లో వస్తుంటాయి ఈ షోలు అన్ని. ఇలాంటి షో లు చూస్తూ కుటుంబ సభ్యులు  ఒక్కరి మొఖాలు ఒక్కరు చుసుకోగలరా?  కామెడీ అంటే బూత? అసలు వర్ధమాన కమెడియన్స్ అంటే ఎంత సాధన ఉండాలి? ఎన్ని విషయాలు లేవు  వ్యంగ్యంగా చెప్పటానికి?

ఇక ఈ మధ్య న్యూస్ చానల్స్ రాత్రి పదకొండు దాటిందంటే చాలు! విచ్చల విడిగా బూతు సినిమాలు ప్రసారం చేస్తున్నారు. దానికి అడ్డు, అదుపు లేదు. ఇంకా సినిమా న్యూస్ లో హీరోయిన్ లా విషయం లో వాడే పదజాలం ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా కూడా ఉంటుంది. అందాలూ అరపోసింది,  బొడ్డు సుందరి, నడుము సుందరి,  ఇంకా ఎన్నో ఎన్నెన్నో.  నిజానికి హీరోయిన్ లు సైతం తక్కువ తినలేదు. సినిమాలు లేక పోయే సరికి, నోటికి వచ్చిన చెత్త వాగుడు వాగి న్యూస్ లో ఉండాలని చూస్తున్నారు. న్యూస్ చానెల్స్  దాన్ని కాష్ చేసుకుంటున్నాయి. ఈ మధ్యే హీరోయిన్ ఇలియానా శృంగారం గురించి విచ్చల విడిగా వాగిందని సదరు న్యూస్ చానెల్స్ అన్ని పూసగుచ్చినట్లు న్యూస్ చదివాయి. అ గుమ్మ అలా అంది, అలా చేస్తుందట అని విడమరిచి చెప్పి, ప్రజల కళ్ళు తెరిపించాయి. నైతిక విలువలు విడిచిన ఆ హీరోయిన్ లు నోటికి వచ్చింది వాగటం ఏలా? వాగితే విళ్ళు దాన్ని విడమరిచి వివరించ నెలా? ఎవరికీ ఉపయోగం?

"నీకు నచ్చక పొతే చానెల్ మార్చుకో" అనే ప్రబుద్దులు కూడా ఉన్నారు. ఎందుకు చానెల్ మార్చుకోవాలి? వందలకు వందలు కేబుల్ కి డబ్బులు కడుతున్నప్పుడు, ఏ చానెల్ అయిన చూసే హక్కు  నాకు ఉంది. కోట్లు పెట్టి చానెల్ పెట్టిన వారికీ ఏది ప్రసారం చెయ్యాలో  నిర్ణయించే హక్కు లేదా? అంటారు.  అంతేనా? ఉంది. కానీ సామజిక  భాధ్యత వహిస్తూ చెయ్యాలి. కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం అని ఏది పడితే అది తీసి, సెన్సార్ చెయ్యకుండా,  విడుదల చేసే హక్కు లేన్నట్లే, టీవీ కి కూడా కట్లుబాట్లు, నియంత్రణ ఉండాలి.  ఇది కేవలం వినోదం కోసం, ఆ మాత్రం విచక్షణ ఉండాలి అనే వారు లేక పోలేదు. అసలు కొందరు ఇంకా అడ్డంగా వాదిస్తారు, గాంధీ సినిమా చూసి ఎంత మంది గాంధీ గా మారారు? ఎవ్వరు మారలేదు! అంటే సినిమా ప్రభావం జనం మీద లేదు అంటారు. అలాంటప్పుడు ముకేష్ కథలు ఎందుకు? పొగ తాగటం, మధ్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం అని హీరోలతో చెప్పించటం ఎందుకు? ప్రపంచ వ్యాప్తంగా మానసిక నిపుణులు సినిమా, టీవీ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సినిమాల్లో, టీవీలో చూపించే కొట్టడం, చంపటం చూసిన జనాలు, నిజ జీవితంలో జరిగే సంఘటనలకు కూడా స్పందించటం లేదని, భాధితులకు సహాయం చెయ్యటం లేదని.

ఇక సంవత్సరాల తరబడి వచ్చే కుటుంబ కథ డైలీ సీరియల్స్ లో ఉండే పైశాచికత్వం రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు. అత్త ను ఎలా చంపాలి, కోడలిని ఎలా లొంగ దిసుకోవాలి లేదా ఎలా రాచి రంపాన పెట్టాలి. నూటికి రెండు మూడు తప్ప, ఎ ఒక్క సీరియల్ కూడా కుటుంబ ప్రేమలు, వారి సమస్యలు, వాటిని ఎలా జయించారు అని చూపితే ఓట్టు. ఎంత సేపు ముగ్గురు, నలుగురు పెళ్ళాలు, సవతుల జోరు, అత్త కోడళ్ళ పెత్తనం పోరు. ఇవన్ని  చూస్తు పెరిగే వారికి కుటుంబ ప్రేమలు,  మమకారాలు  ఏం పడుతాయి? పెద్దయ్యాక మనసుల సున్నితత్వం, పరస్పర ప్రేమలు వారిలో ఉంటాయా?

నేను ప్రస్తావించిన కార్యక్రమాలు, ఆ యాంకర్స్ ప్రవర్తన కొందరికి తప్పు కాకా పోవచ్చు. కాని విస్తరిస్తున్న విచ్చల విడితనానికి హద్దులు వెయ్యక పొతే, భవిష్యత్తు తరాలు ఇంకా బరి తెగిస్తారు. అప్పుడు సమాజం లో మనుష్యులకు, అడవిలో జంతువులకు తేడా ఉండదు. అశ్లిలపు వెబ్ సైట్ల మిద నిషేధం విదిస్తున్న ప్రభుత్వం, టీవీ మీద కూడా తప్పని సరి నియంత్రణ చెయ్యాలని  నా అభిప్రాయం.  ఇది నేను ఎవరిని లక్ష్యం చేసుకుని రాయలేదు, కేవలం టీవీ, సినిమా అభిమానిగా వాటి బాగు కోరి రాశాను.  మీ అభిప్రాయాలూ పంచుకోగోరుతాను.

31, జులై 2015, శుక్రవారం

బాబోయ్ పేస్ బుక్ (హాస్యం) -3

(రెండవ భాగం కోసం ఇక్కడ నొక్కండి )

జరిగిన సంఘటనలతో పేస్ బుక్ మీద అయిష్టం పెరిగి పోయింది సుజిత్ కు. అందుకే ఇంతకూ ముందు చుసినంతగా చూడటం లేదు, పెద్ద ఆక్టివ్ గా ఉండటం లేదు.  అది కాకుండా ఈ మధ్య ఆఫీసు లో వర్క్ కూడా ఎక్కువ అవ్వటం తో దానిలో బిజీ అయిపోయాడు.

ఒక రోజు ఆఫీసు నుండి వచ్చిన సుజిత్ తో సంధ్య "అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావ లేదా?" అని కోపంగా అడిగింది .

సుజిత్ బిత్తర పోయి చూసాడు. తర్వాత తేరుకొని "ఇప్పుడు ఏమయింది? జస్ట్ కూర మాడి పోయి ఉంటుంది. దానికే అంత కంగారు పడితే ఎలా!" అన్నాడు సముదాయిస్తూ.

"అడిగినా దానికి సుత్తి కొట్టకుండా సూటిగా సమాధానం చెప్పు" సంధ్య చిరాకు పడింది.

"ఫేస్బుక్ లో ఏదయినా పోస్ట్ పెడితే లైక్ కొట్టలేదా? సారీ నాకు ఆఫీసు లో చాల వర్క్ ఉంది అందుకే ఓపెన్ చెయ్యలేదు. కాని ఇప్పుడే ఓపెన్ చేసి లైక్ మాత్రమే కాదు షేర్ కూడా చేస్తా" అన్నాడు సుజిత్ తప్పు చేసిన వాడిలా.

"నాకేం పనిలేదా ఫేస్బుక్ తప్ప. నేను అడిగేది ఒక్కటి నువ్వు చెప్పేది ఒక్కటి"

"అయ్యో నా ఉద్దేశ్యం అది కాదురా. పాపం నువ్వు ఇంటి పనితో ఎంత బిజీ ఉంటావో నాకు తెలిదా? ఏదో మధ్యలో టైం పాస్ కోసం గంటకోసారి మాత్రమే ఫేస్బుక్ ఓపెన్ చేస్తావ్. అసలు మా కొలీగ్స్ పెళ్ళాలు కొందరు ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటారు, అన్నం తినేటప్పుడు తప్ప"

"ఇన్ని మాటలెందుకు! నన్ను ప్రేమిస్తున్నావా? లేదా?"

"ఆఫీసు నుండి రాగానే అంట్లు తోమేస్తాను.  నువ్వు అడిగితె మ్యాచ్ ఉన్నా రోజు కూడా మా టీవీ లో వందసార్లు వేసిన బ్లాక్ బ్లాస్టర్ మూవీ చూస్తాను. మా ఉరి వంట లో చూసి,  నువ్వు చేసే కొత్త వంటలన్నీ లొట్టా లేసుకుంటూ తింటాను. ప్రతి వారం నాకు చెప్పకుండా సినిమా బుక్ చేసినా వస్తాను. ఆఖరికి  ఏ సినిమా లేక నువ్వు బాలకృష్ణ సినిమాకు తీసుకెళ్తే , సినిమా ఎంత నరకంగా ఉన్న  నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో  అని  నవ్వుతూ చూస్తాను. అది ప్రేమ కదా?"

"చాల్లే గొప్ప. మా నాన్న వంట కూడా చేసే వాడు" అంది తేలికగా కొట్టి పారేస్తూ.

"ప్రేమ కు కొలమానం వంట అని తెలియక నేర్చు కోలేదు. కానీ పేర్లు తెలియని వంట తినటం కూడా ప్రేమే అని నీకెవరు చెప్పలేదా?" దినంగా అడిగాడు.

"అంత ప్రేమ ఉంటె ఫేస్బుక్ లో ఏవో పిచ్చి వీడియోస్ , ఫొటోలు ఎందుకు  షేర్ చేస్తావ్" అని ఏడుపు మొదలు పెట్టింది.

"దయచేసి ట్యాప్ ఓపెన్ చెయ్యకు సంధ్య. సునామినయినా తట్టుకుంటాను కాని నీ కన్నీటి ముసురు మాత్రం తట్టుకోలేను" అన్నాడు చేతులు జోడిస్తూ.

"నేను ఏడిస్తే తట్టుకోలేవా?"

"సునామి అయితే ఒక్కసారే ఉడ్చుకుపోతుంది. కాని నీ ఏడుపు పుండు మీద కారంల మండుతూనే ఉంటుంది"

"అంత తట్టుకోలేని వాడివి మా వాళ్ళ ముందు నా పరువు ఎందుకు తియ్యాలి. ఆ చెత్త ఎందుకు షేర్ చెయ్యాలి" అంది  సంధ్య నిష్టురంగా.

"ఇలాంటివి వస్తాయనే నేను వద్దు మొర్రో అంటున్న వినకుండా, మీ బందువులందరికి నాతొ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్టు  సెలబ్రిటీ పేజి లైక్స్ లా మార్చింది నువ్వు.  అయినా నీ పరువు పోయే పని ఎం చేశాను నేను. ఈ రోజు ఫేస్బుక్ ఓపెన్ చెయ్యలేదని చెప్పను కదా?" అన్నాడు సుజిత్ వస్తున్నా కోపాన్ని పంటి బిగువున దాచుకుంటూ.

"ఆ కంపరాన్ని నేను చెప్పటం దేనికి నువ్వే  చూడు" అని లాప్టాప్ ఓపెన్ చేసి చూపించింది.

తన వాల్ మీద షేర్ అయినా వీడియో, కొన్ని హీరోయిన్ ఫొటోస్ చూసి బుర్ర తిరిగి పోయింది సుజిత్ కు. వాటిల్లో తనను ఎవరో ట్యాగ్ చేశారు. ఎవరా? అని చూస్తే తన విలేజ్ ఫ్రెండ్ రాజు  గాడు. ఏదో ఈ సేవ సెంటర్ నడిపిస్తుంటాడు. వీడికి ఇదేం పోయే కాలం నన్ను ట్యాగ్ చేశాడు.

"సంధ్య నువ్వే చూడు. ఎవడో సన్నాసి గాడు నన్ను ట్యాగ్ చేశాడు. అంతే కాని నేను షేర్ చెయ్యలేదు" అన్నాడు అమాయకంగా మొహం పెట్టి.

"ట్యాగ్ చెయ్యటం అంటే నీకు తెలుసు, నాకు తెలుసు. కాని మా వాళ్ళకు తెలియదు కదా?" అసహనం వ్యక్తం చేసింది సంధ్య.

"వాళ్ళకు ట్యాగ్ చెయ్యటం అంటే తెలియక పోవటం నా తప్ప? అలాంటి మట్టి బుర్రలకు నాతో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎందుకు పెట్టించావ్. ఒక్కొక్కళ్ళు రాసే ఇంగ్లీష్ చదువుతుంటే ఫేస్బుక్ మీదే విరక్తి కలిగి ఓపెన్ చెయ్యటమే మానేసాను. కేవలం నువ్వు పెట్టె కొటేషన్ లు, వంటల ఫోటోలు లైక్ చెయ్యటానికి ఓపెన్ చేస్తున్నాను. నా ప్రమేయం లేకుండా ఏదో జరిగితే  నన్ను తప్పు పట్టడం ఎంతవరకు న్యాయం" సుజిత్ ఆవేశ పడ్డాడు.

"నీ గురించి నీకు తెలియాలంటే, నీ స్నేహితులను చూడు. నీ ఫ్రెండ్స్ ను చూస్తేనే తెలుస్తుంది......" సంధ్య మూతి వంకరలు తిప్పింది.

"కొటేషన్  బాగుంది. నువ్వేనా రాసింది? ఇకేందుకు ఆలస్యం ఫేస్బుక్ లో పెట్టు,  ఉన్నారుగా పనిలేని నీ చెంచ గాల్లు" సుజిత్ అక్కసు వెళ్ళగక్కాడు.

"ఫేస్బుక్ లైక్ ల కోసం నేను కష్టపడే పనిలేదు. నేను గుడ్ మార్నింగ్ కొడితే చాలు సునామి పుడుతుంది. ఇక్కడ టాపిక్ నీ వాళ్ల నాకు వస్తున్నా బ్యాడ్ నేమ్ గురించి"

సుజిత్ కోపంతో ఫోన్ తీసి రాజు కు కాల్ చేసాడు.

"సుజిత్ మామ. ఎట్లున్నావ్ రా?  ఈ రోజు  భలే తాటి కల్లు దొరికింది" అన్నాడు రాజు ఉషారుగా.

"తాటి కల్లు.......నాకు తెలుసురా తాటి కల్లు తాగి  ఫేస్బుక్ లో కోతిలాగా కొంపలు ముంచావని. ఆ ఫోటోలు, వీడియో లు నువ్వు చూసింది  కాకుండా! నన్ను ఎందుకు ట్యాగ్ చేశావ్ రా" అన్నాడు సుజిత్ కోపంగా.

"మొన్ననే మా బామ్మర్ది గాడు చెప్పిండు. మన ఫోటో లు, వీడియో లు ఎవరయినా కంపల్సరి చూడాలంటే టాగ్  చెయ్యాలని" అన్నాడు రాజు అమాయకంగా.

"టాగ్ కాదురా ట్యాగ్. అయినా కంపల్సరి చూడటానికి అవేమన్నా నీ పెళ్ళి ఫోటో లా? వీడియో ఎమన్నా నీ కొడుకు  పుట్టిన రోజు దా?"

" అ ఫోటోలు  బాగా నచ్చాయి మామ. నీకు తెలుసుగదా నాకు ఎదన్న నచ్చితే అందరకి పంచి పెడుతా"

"పంచి పెట్టటానికి అవ్వెమన్నా పల్లిలా?  చెత్త ఫోటోలు.  మరి ఆ వీడియో లో  ఎందుకు ట్యాగ్ చేశావ్ రా!"

"హైదరబాద్ లో మసాజ్ సెంటర్ అని చెప్పి దందా చేస్తున్నారట! నువ్వుఅక్కడే ఉంటావ్ గాని, ఏది అడిగినా తెలవదంటావ్ . అందుకే మనోళ్ళ తోటి నిన్ను కూడా టాగ్ చేసిన"

"నీ పుణ్యమాని మా ఆవిడకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికి  తెలిసి పోయింది. నా పరువు మూసి  నది మురికి లో కలిసి పోయింది"

"ఓరిని......భార్యకు, అత్తగారింటొల్లకు భయపడుతార్ర? మనం అంటే మా వోళ్లకు జుజుబి"

"కాని మా ఇంట్లో,  వాళ్ళంటే నాకు జుజుబి.  మా ఆవిడా మీ ఆవిడా లాగ  పదవ తరగతి ఫెయిల్ అవ్వలేదు రా. ఇంజనీరింగ్ హైదరాబాద్ లో చదివింది. హక్కుల గురించి, లెక్కల గురించి ఎన్ని గంటలయినా మాట్లాడుతుంది "

సంధ్య కు గర్వంగా ఉంది, సుజిత్ అలా భయపడుతుంటే.

"అట్లా కాదురా....." అని రాజు ఏదో చెప్పబోతుంటే వీడు ఇంకా ఎం మాట్లాడి ఎం చేస్తాడో అని మధ్యలోనే కట్ చేసాడు సుజిత్.

"ఒరేయ్......ఇంకోసారి ఇలాంటివి పెట్టి దయచేసి నా కాపురం కూల్చే సంఘ సేవ మాత్రం చెయ్యకు రా" అని ఫోన్ పెట్టేసాడు సుజిత్.

 సంధ్య కాస్త శాంతించింది. నెమ్మదిగా "సర్లే మా వాళ్ళందరికీ ట్యాగ్ చెయ్యటం అంటే ఏంటో వివరిస్తాను. ఇందులో నీ ప్రమేయం ఏది లేదని అర్థమయ్యేలా చెపుతాను. ఇందక నేను చెప్పిన కొటేషన్ ఫేస్బుక్ లో పెట్టాను, లైక్ చెయ్యు. ఇలోగా నేను టీ తీసుకొస్తా నీకు" అని కిచెన్ లోకి వెళ్ళింది.

సుజిత్ కు  ఒళ్ళుమండి నెత్తి కొట్టు కున్నాడు. "ఎప్పుడో ఒక్కరోజు ఈ ఫేస్బుక్ ఎకౌంటు డిలీట్ చేస్తే గాని ఈ తల నొప్పులు తప్పవు" అనుకున్నాడు.

(అయిపొయింది)

21, జూన్ 2015, ఆదివారం

తండ్రి మనసునువ్వు పుట్టింది మొదలు
నాలో పెద్దరికాన్ని లేపావు
నా భాద్యతను పెంచావు
నా భాల్యం తిరిగి తెచ్చావు
నన్ను నా తండ్రిని చేశావు

నా మనసుకు కలవరం
ఏదో తెలియని పలవరం
నన్ను ముంచింది
పెద్దవాడినన్న బెంగ తోలచింది
నీ బోసి నవ్వు ముందు
నా యవ్వనం అలసింది
తండ్రి నన్న గర్వం గెలిచింది

పని నుంచి ఇంటికి రాగానే
నన్ను అంటుకు తిరిగే నువ్వు
క్షణ కాలం కానరాక పొతే
ప్రాణాని కై వెతుకులాట
తట్టుకోలేను రా నీ దోబూచులాట

విసుగు తో నాన్న మందలిస్తే
మనసు చిన్న చేసుకోకు
నాన్నను మర్చి పోకు
నాన్న ప్రాణం నీలో ఉంది
నువ్వు లేకుంటే
నాన్నకు ఇంకేముంది

మాయదారి జ్వరం నీకు సోకినపుడు
మీ అమ్మ శోకం లో మునిగినప్పుడు
నాన్న దైర్యం చూసి అబ్బురపడకు
మీ అమ్మను మభ్యపెట్టి
ఎన్ని దేవులకు మొక్కనో
ఎన్ని దురలవాట్లు వదిలేసానో
నీ పసి మనసుకు తెలుపలేను
నువ్వు నీరసిస్తే క్షణం నిలవలేను

నువ్వు తప్పు చేస్తే మందలించి
మొండిగా ఉంటె దండించి
నేనంటే భయం పెట్టింది
నా గొప్ప కోసం కాదు
దాంట్లో ఎ సంతోషం లేదు
నీతో ప్రేమగా ఉన్నా క్షణం ముందు
దేనికి విలువ లేదు

నువ్వు ఎందులో వెనుకబడ్డ
నేను ఓడిపోయినా భావన,
నువ్వు దిగులు పడితే
నాలో పట్టుదల,
పెరిగి పోతాయి !
నీకు అన్ని  అందించాలని
నీకై ఎన్నో సాదించాలని
నాన్న ఇంటి పట్టున లేడని
ఆపార్ధం చేసుకోకు
నువ్వంటే ఇష్టం లేదని అనుకోకు

నాకన్నా నువ్వు గొప్పగా ఉండాలని
కోరినవన్నీ నీకు దొరకాలని
నీకు దొరకకుండా యంత్రంగా మారాను
కాని మనసు లేని యంత్రాన్ని కాను
నువ్వు లేకుంటే
నా జీవితంలోకి రాకుంటే
ఈ నాన్న ఇలా ఉండేవాడు కాదు
ఏ  మాత్రం ఎదిగే వాడు కాదు

నా కన్నా గొప్పగా ఎదగాలని
నిండుగా నువ్వు వెలగాలని
నన్ను మించిన తండ్రివి కావాలని
ఈ తండ్రి ఆశ
తీరుస్తావు కదూ !!2, జూన్ 2015, మంగళవారం

తెలంగాణ కోరిక తిరని

తెలంగాణకు తెల్లారింది
గుండె కోత చల్లారింది 
అర్ధ శతాబ్దాతపు  పోరాటం 
సొంత గూటికై  ఆరాటం 
ఇన్నాళ్ళకు తీరింది 
కొత్త బాసలు చేసింది
తీపి ఆశలు రేపింది

ఇకనయిన వలసలు అలసిపోని
ఆకలి కేకలు సమసి పోని
యువత  పనితో సతమతమయి పోని
బాల్యం కలలు మిగలక పోని
ప్రతి ఇంటా ప్రజా సేవకుడు  పుట్టి
అధికారం పలుచనయి పోని
కులం, మతం చులకనయి పోని
ప్రాంతల గ్రహణం ప్రతిభను విడి
వెలుగు చూడని , తన స్థానని నిలుపని

విషం కక్కి అచేతనం చేసె అవని
అక్కర తిరి పోని
రేపటికి రెక్కలు చక్కబడి పోని
మూలపడిన మగ్గాలు పగ్గాలు తొడగని
చితికి పోయిన కార్మికుడు
సిగ్గును కాపాడని
కాలన్ని సవాలు చేసే రైతు పుట్టని
నిలువ నీరుతో  సాగు సాగాని
పాడి పంటతో సిరులు పండని
ఆత్మహత్యలకు ఆయువు నిండని

హేళనయిన భాష ఘోష తిరని
అలుపులేక నిస్సిగ్గుగా  పలుకని
తన మాధుర్యం లోకానికి  తెలుపని
మాసిపోతున్న దాయము తిరిగి రాని
పరాయి ప్రభావం పారిపోని
ఈ నెత్తురు లక్షణం ఎప్పటికి నిలిచిపోని

ఈ ధైర్యం ఇంకా రెట్టింపు కాని
ఈ పోరాటం ఇకముందు కూడ సాగని
ప్రతి కోరిక అలసిపోక తిరని
అనుకున్న లక్ష్యాలు చేరని
ఈ కొత్త రాష్ట్రం ఆదర్శంగా మారని
తెలంగాణ కోరిక తిరని


27, మార్చి 2015, శుక్రవారం

బాబోయ్ పేస్ బుక్ (హాస్యం) -2

(మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి)

ఆఫీసులో పని లేక పోయినా, ఏదోపొడి చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చే నూటికి 80 శాతం సాఫ్ట్ బాబుల లాగానే సుజిత్ కూడా greatandhra.com, idlebrain.com లో సినిమా న్యూస్ చదువుతూ,  linkedin లో పక్క వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తూ, "ఈ రోజు ఇంకా ఎప్పుడు అయిపోతుందిరా దేవుడా"  అనుకుంటున్నా సమయంలో తన ఫోన్ మోగింది. 

ఫోన్ లో  పేరు చూడగానే,  వీకెండ్ రోజు ప్రొడక్షన్ బగ్ వచ్చినంత ఇరిటేట్ అయిపోయాడు. "ఎత్తక పొతే ఈ వెధవ వాట్సప్ లో సెంటిమెంట్ మెసేజ్ లతో చంపుతానే ఉంటాడు" అనుకుని ఫోన్ ఎత్తి "హల్లో రా మామ" అన్నాడు ప్రేమగా. 

"అలాగే ఉంటది రా! మీరు ఇప్పుడు సాఫ్ట్ వెరు  మేము పనికి రాని అండర్ వెరు. మమల్ని ఎందుకు కలుస్తారు" అన్నాడు సుబ్బారావు తన విలేజ్ పద్దతిలో. 

సుజిత్ "అరేయ్! నీకు దండం పెడుతా, ఆఫీసు లో ఉన్నాను. ఇలాంటి భాష మాట్లాడి నా నోరు చెడగొట్టకు రా"  అని బ్రతిమాలడు. 

"ఇట్స్ ఓకే మాన్. వాట్ అబౌట్ ది పార్టీ"  

"ఓహో ! ఉంటె అమెరికా రేంజ్ లో ఉంటావు లేక పొతే అనకాపల్లికి పడి పోతావ్. మాములు హైదరాబాద్ రేంజ్ లో ఉండరన్న మాట సారు"  

"పార్టి గురించి  నేను టాక్ చేస్తుంటే టాపిక్ చేంజ్ చేసి రేంజ్, ఎక్ష్ చేంజ్ అని స్ట్రేంజ్ గా మాట్లాడ్తవేంటి మామ" సుబ్బారావు రజని లెవెల్లో రెచ్చి పోయాడు. 

"అరేయ్ మామ! ఎక్కడయినా పార్టి ఇవ్వమని పిడించే వాళ్ళను చూశాను. కానీ పార్టికి రమ్మని పీడించే వాణ్ణి నిన్నే చూశాను రా. డబ్బులు ఎక్కువయితే గుడి దగ్గర ముష్టి వాళ్ళకు దానం చెయ్ రా. కానీ పెళ్ళయిన నన్ను వదిలేయ్ రా"  నీరసంగా పలికాడు సుజిత్. 

"అలా అనకు మామ. నాకు డబ్బులు ఎక్కువయి కాదు రా. లవ్వు ఎక్కువయి పార్టీ ఇస్తున్నా. ఒక్క గంట వచ్చి పో మామ. నాకు నువ్వు సురేష్ గాడు తప్ప ఎవరు ఉన్నారు. మనం ఎంత మంచి ఫ్రెండ్స్ రా ఇంజనీరింగ్ లో" అన్నాడు సుబ్బారావు ఏడుస్తున్నట్లుగా. 

"ఒరేయ్,  ఒరేయ్ ఇప్పుడు ఇంజనీరింగ్ రోజులు గుర్తుచేసి నన్ను ఏడిపించకు. నీ తమిళ డైలాగులు ఆపి పార్టి కి ఏర్పాట్లు చెయ్" సుజిత్ తప్పదని డిసైడ్ అయిపోయాడు. 

సుజిత్, సుబ్బారావు ఇంకా సురేష్ ముగ్గురు బీర్స్ తో చీర్స్ చెప్పుకుని కబుర్లలో మునిగి పోయారు. 

"ఏంట్రా!  ఇంజనీరింగ్ లో ఎవడయినా బిర్యానీ తినిపిస్తానంటే ఎగ్జామ్స్ ఉన్నా కూడా,  రోజంతా వాడితోనే ఉండే వాడివి, ఇప్పుడు వెంటపడి మరి పార్టి ఇస్తున్నావ్? లవ్వు, పువ్వు అని కొవ్వేకిన  మాటలు మాట్లాడుతున్నావ్" అన్నాడు సుజిత్ ఆటపటిస్తూ. 

సుబ్బారావు మొఖం సిగ్గుతో,  అమ్మాయి చాచి కొట్టినంత ఎర్రగా మారి పోయింది.  అంతలోనే తమాయించుకుని "నాకు ఒక్కసారి ఫోన్ చెయ్ మామ. స్పీకర్ లో పెట్టు డయల్ చేసి" అని సురేష్ కు సైగ చేశాడు. 

నెంబర్ డయల్ చెయ్యగానే కాలర్ రింగ్ టోన్ "ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందొ తారక, నాలో అల్లరి అల్లరి ఆశలు రేపే గోపిక" అని వస్తూంటే మనోడు కళ్ళు మూసుకుని పరవశంలో మునిగి పోయాడు. 

"మురారి పాటలు మేము సిడి అరిగి పోయేదాక విన్నాం గాని విషయం చెప్పు సుబ్బి" అన్నాడు సుజిత్. 

"ఇంకా అర్థం కాలేదా మామ నీకు. I am in Love మామ. Deeply, Truly, Madly"

"ఎవరు!  మీ ఉళ్ళొ  సత్తెమ్మ?  నీతో పాటు టెన్త్ వరకు చదివింది అన్నావ్" అడిగాడు  సురేష్ ఆశ్చర్యంగా. 

"అంటే! మా రేంజ్ సత్తెమ్మ, మల్లమ్మ దగ్గరే ఆగిపోతుందని నువ్వు ఫిక్స్ అయిపోయావ" కోపంతో ఉగిపోయాడు సుబ్బారావు. 

"సారీ మామ! నువ్వే కదరా తాగినప్పుడు చాల సార్లు సమాంత  కన్నా మా సత్తెమ్మ సూపర్ ఉంటాది అన్నావ్. అందుకే దాంతోనే అడ్జస్ట్ అయిపోయావేమో అనుకున్నా. ఇంతకూ నీ లవర్ ఎవరు మామ" కన్ను కొడుతూ కొంటెగా అడిగాడు  సురేష్. 

సుబ్బారావు "అనసూయ" అని సిగ్గుపడి,  వెంటనే "టీవీ యాంకర్ కాదు" అన్నాడు.

"అబ్బో తమరి పేస్ వాల్యు కి యాంకర్ అనసూయ కూడానా. ఇంతకూ ఎవరు మామ? కూరగాయల బండోడి కూతురా?"

"ఎయ్ అపురా! నీ కామెడీ లెంగ్త్ ఎక్కువయింది గాని, మామ నువ్వు చెప్పు రా. ఎక్కడ కలిసావ్ అమ్మాయిని"  సుజిత్ ఉత్సాహపరిచాడు.

"అందుకే మామ నువ్వంటే నాకు పిచ్చి. తనను పేస్ బుక్ లో కలిసాను" అని సిగ్గుపడ్డాడు సుబ్బారావు.

"పేస్ బుక్ లో ఎలా రా? అమ్మాయిది ఇండియానెనా  లేక ఏ ఆఫ్రికా నో,  యుగండనా"  సురేష్ కు అనుమానం.

సుబ్బారావు కోపంగా "ప్రేమలో ఉన్నాను కాబట్టి బీరు  పోసి  వదిలేస్తున్నా. లేకపోతె నార తిసెవాణ్ణి" అని వెంటనే సుజిత్ వైపు తిరిగి "ఒక రోజు నేను క్యాసువల్ గా క్యాండీ క్రష్ ఆడుతుంటే,  ఏదో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది మామ. నేను ఎవడో మన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అనుకున్నా. కాని అమ్మాయి పేరు చూసి షాక్ అయిపోయా. మళ్ళి అంతలోనే మనోడే ఎవడయినా అమ్మాయి పేరుతో అడుకోవలనుకుంటున్నడెమో అనుకున్నా.  మనమే రివర్స్ లో ఆడుకుందాం అనుకుని రిక్వెస్ట్ అక్సేప్ట్ చేశా. వెంటనే "హాయ్" అని  చాటింగ్ మొదలయింది. అలా మొదలయిన  చాటింగ్ వారం రోజులు నడిచింది."

"మధ్యలో బ్రేక్ లేకుండానా?" సురేష్ డౌట్ వ్యక్తం చేశాడు.

"నీ  CID సిరియల్ డౌట్స్ అపురా. వాణ్ణి ఫ్లో లో చెప్పుకు పోనీ" సుజిత్ చిరాకు పడ్డాడు.

"వారం తర్వాత చాటింగ్ చెయ్యటానికి నా దగ్గర టాపిక్ లన్ని అయిపోయాయి.  ఎం మాట్లాడాలో తెలియక కన్ఫ్యూషన్ లో నిన్ను చూడాలనిపిస్తుంది అన్నాను. నా బంగారం ఎంత స్పోర్టివో తెలుసా మామ, వెంటనే నువ్వేం భాదపడకు రా నేను నా ఫోటో పంపిస్తాను అని తన ఫోటో మెయిల్ చేసింది"  సుబ్బారావు కు దుఖం ఆగడం లేదు.

"ఫోటో పంపటానికి స్పోర్టివ్ నెస్ ఎందుకు? మేకప్ కిట్ ఉండాలి గాని" సురేష్ పంచ్ ను ఆపుకోలేక పోయాడు.

అవ్వేవి పట్టించుకునే స్తితిలో లేడు సుబ్బారావు "ఫోటో చూసి, ఇంత అందమయిన అమ్మాయి నాకు పడి పోవటం ఏంటి దేవుడా అని బోరుమని ఏడ్చేశాను మామ"

"అబ్బో ! తర్వాత ఎడుద్దువు గాని. స్టొరీ కంటిన్యూ చెయ్" సురేష్ చిరాకు పడ్డాడు.

"రెండు రోజుల తర్వాత, నీతో మాట్లాడాలని ఉంది అన్నాను. అంతే! నీ నెంబర్ చెప్పు నేను కాల్ చేస్తా అని మిస్ కాల్ చేసింది" సుబ్బారావు సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు.

"ఇదంతా చూస్తుంటే! ఎప్పుడెప్పుడు వీడికి ఫోటో పంపాలి, ఎప్పుడెప్పుడు వీడితో మాట్లాడాలి అని అమ్మాయే కరువచ్చిన దానిల  ఎదురుచూస్తున్నట్లు ఉంది" అనుమానం వ్యక్తం చేశాడు సురేష్.

"తన వాయిస్ సునీత వాయిస్ కన్నా స్వీట్ మామ. ఫోన్ లోనే అలా ఉందంటే నేరుగా ఇంకా ఎంత బాగుంటుందో" సుబ్బారావు కళ్ళు తుడుచుకున్నాడు.

"మధ్యలో సునీత ఎవరు మామ" సురేష్ నిజంగానే కాన్ప్యుస్ అయ్యాడు.

"ఒరేయ్ ఇందాకటి నుండి చూస్తున్నాను. నా లవ్ స్టొరీ ని కామెడీ స్టొరీ చెయ్యాలని ట్రయల్స్ మిద ట్రయల్స్ ఎస్తున్నావ్. సునీత అంటే ఇంకో అమ్మాయి కాదు. మన సింగర్ సునీత, ఆమె వాయిస్ కన్నా బాగుంది అంటున్నాను" సుబ్బారావు తట్టుకోలేక పోయాడు.

"వాడి సంగతి వదిలేయ్ మామ. తర్వాత ఏమయింది చెప్పు" అని కుతూహల పడ్డాడు సుజిత్.

"ఫోన్ లో కబుర్లు,  పేస్ బుక్ లో  లవ్ కొటేషన్ లు. ఈ మధ్యే పర్సనల్ గా కూడా చాల  దగ్గర అయిపోయాం" సుబ్బారావు ట్రాన్స్ లో ఉండి చెప్పుతున్నాడు.

"అంటే! పర్సనల్ గా కలుసుకున్నార? ఎక్కడ మామ! ఎం చేశావు రా" బీర్ తాగుతున్నా కూడా సురేష్ కు గొంతులో తడారి పోయింది.

"ఛీ ! బ్లాడి కామిష్టి ఫెల్లో.  పర్సనల్ గా దగ్గర అవ్వటం అంటే ఒకరి కష్టాలు ఒకరం షేర్ చేసుకున్నాం, ఓదార్చుకున్నాం"

"ఓదార్పు దగ్గర అగిపొయరా?  లేక! సహాయా,  సహకారాలు కూడా అందించుకున్నారా" సుజిత్ మనసు కీడు శంకించింది.

"డబ్బుదేముంది మామ. ప్రేమ ముఖ్యం. పాపం కాలేజీ ఫీజు కు కష్టంగా ఉందంటే జస్ట్ ఫిఫ్టీ తౌసండ్ పంపాను. మళ్ళి ఇచ్చేస్తాను అని ఒక్కటే చెప్పటం"  సుబ్బారావు జాలి పడ్డాడు.

"ఒక్కసారి అమ్మాయి ఫోటో చూపించు మామ" సుజిత్ లో ఏదో అనుమానం.

"షుర్ మామ! అందుకేగా పిశాచంలా వెంటపడి మరి పార్టికి పిలిచింది" అని మొబైల్ లో ఉన్నా అమ్మాయి ఫోటో చూపించాడు.

ఫోటో చూడగానే సుజిత్ కు మతిపోయినంత పనయింది. "ఏంట్రా! హిందీ హీరోయిన్ పరీణితి చోప్రా ఫోటో చూపిస్తావ్" అన్నాడు.

"మామ! అమ్మాయి హీరోయిన్ లా ఉంటుంది కాని హీరోయిన్ కాదు, మై లవర్  అనసూయ. హీరోయిన్ లు మేకప్ వేసుకుని, డిసైనర్  డ్రెస్ లు వేసుకుంటారు" సుబ్బారావు గర్వపడ్డాడు.

"ఒరేయ్ మెంటల్. పరిణీతి చోప్రా మేకప్ లేకుండా, చుడిదార్ వేసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసినా ఫోటో ఇది. దాన్నే పంపి  నిన్ను మోసం చేశారు"

"అందుకేరా,  ఎప్పుడు తెలుగు సినిమాలు,  డబ్బింగ్ సినిమాలే  కాకుండా  అప్పుడప్పుడు హిందీ సినిమాలు చూడురా అని చెప్పేది" అన్నాడు సురేష్ నవ్వపుకుంటూ.

"నేను ఇప్పుడే ఫోన్ చేస్తా రా, నా  బంగారానికి" నెంబర్ డయల్ చేసి స్పీకర్ అన్ చేశాడు సుబ్బారావు.

అవతలి నుండి "ఏంట్రా  ఇంకా పడుకోలేదా?" అని హస్కీ వాయిస్.

"లేదు బంగారం. నిజం తెలిసే సరికి  నిద్ర రావటం లేదు" అన్నాడు  సుబ్బారావు సీరియస్ మూడ్ లో.

"నిద్ర దూరం చేసే నిజం కన్నా,  అందమయిన కలలిచ్చే అబద్దమే గొప్పది కదా!"

"అంటే నువ్వు పంపిన  ఫోటో అబద్దం అంటావు, అంతేనా?"

"అద్దంలో కనిపించే మనం అబద్దం కానప్పుడు,  నేను పంపిన ఫోటో కూడా అబద్దం కాదు"

"సీరియల్స్ లో లాగ మాట్లాడి నన్ను కన్ప్యుస్ చెయ్యకు. స్ట్రెయిట్ గా మాట్లాడు"

"మేకప్ లేని పరిణితి చోప్రా ఎలా ఉంటుందో, మేకప్ వేస్తె నేను అలాగే ఉంటాను"

"అలాంటప్పుడు నీ ఫొటోనే పంపచ్చు కదా? ఎవరిదో ఎందుకు"

"ఈ మధ్య కొంచెం లావయ్యాను. కాని వర్కౌట్ మొదలు పెట్టాను. ఖచ్చితంగా జీరో సైజు కాకపోయినా కనీసం థర్టీ సిక్స్ కి తగ్గిపోతాను"

"అంటే వర్కౌట్ పూర్తీ కాకుండానే,  నన్ను వర్కౌట్ చేశావా? దొంగ మొఖం  దాన!"

"నాది దొంగ మొఖం  అయితే నీది పోలీస్ మొఖమా?   బట్టతల ఉన్నా నీకు పరిణితి చోప్రా కావాలా?"

"నాకు బట్టతల ఉంది గాని నీలాగా బానెడు పొట్ట లేదు"

"కష్టపడితే నేను పొట్ట తగ్గించ గలను, కాని నువ్వు ఎంత కష్టపడ్డ జుట్టు పెంచగలవా? ముందు ప్రేమించటం నేర్చుకోరా"

"నిన్ను వదిలి పెట్టాను. రేపే పోలీస్ కంప్లైంట్ ఇస్తా"  సుబ్బారావు కోపంతో ఉగిపోతున్నాడు.

"ఇది నాకు కొత్త కాదురా. వాళ్ళు ఎంక్వయిరీ చేసే లోపు నా ఎకౌంటు ఉండదు, ఫోన్ నెంబర్ ఉండదు. అన్ని ఫేక్, నాలాగే" అని లైన్ కట్ అయిపోయింది.

సుబ్బారావు కోపంతో మళ్ళి డయల్ చేశాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ అని మెసేజ్. నీరసంతో అలాగే కుప్పకూలి పోయాడు.

"ఒరేయ్ మామ. ఎంత లవ్ చెయ్యాలనిపిస్తే మాత్రం పేస్ బుక్ లో లవ్ ఏంట్రా? కనీసం ఒక్కమాట మాకు చెప్పి ఉంటె ఇంత దూరం వచ్చేది కాదు కదరా?" సుజిత్ ఒదారుస్తున్నాడు.

"నిజమే రా.  కాని నేను మికేదో సర్ప్రైస్ ఇవ్వాలని ఇలా అడ్వాన్సు అయిపోయాను. సురేష్, ఇప్పుడు హ్యాపీ యా మామ" సుబ్బారావు కు దుఖం ఆగటం లేదు.

"ఒరేయ్ ఏంట్రా వీడు. నేనేదో సరదాగా ఎడిపించాను మామ. నిజంగా వేరి సారీ రా" సుబ్బారావు ను గట్టిగా హత్తుకున్నాడు సురేష్ ఓదారుస్తూ.

"దేనికి రా ఏడుపు ఇప్పుడు. సత్తెమ్మకు ఇంకా పెళ్ళి కాలేదు కద" అన్నాడు సుజిత్ ఆటపటిస్తూ.

సుబ్బారావు నవ్వలేక నవ్వాడు.

(ఇంకాఉంది)

(మూడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి)

25, మార్చి 2015, బుధవారం

బాబోయ్ పేస్ బుక్ (హాస్యం) - 1

(వయసు తో సంభందం లేకుండా, అడ మగ తేడ లేకుండా పేస్ బుక్ ఎకౌంటు సొతం చేసుకున్నా ప్రతి ఒక్కరి గురించి సరదాగా నవ్వుకోవటానికి రాసింది. ఎవరిని ఉద్దేశించి రాయలేదు అని మనవి)

పొద్దున్నే బెడ్ మిద నుండి లేవగానే పక్కనే ఉన్నా ఫోన్ చేతిలోకి తీసుకుని పేస్ బుక్ చూస్తే  గాని మిగత పనులు, ఎంత అర్జెంటుగా ఒంటికి,  రెంటికి వచ్చిన సరే, వాయిదా వేసుకునే  సగటు సాఫ్ట్వేర్ ఇంజనీర్  సుజిత్. 3జి ఫోన్ లు చీప్ అయిపోవటం ఏమో గాని ఈ మధ్య అమ్మాయిలు, అబ్బాయిలు, ముసలి, ముతక తేడా లేకుండా పేస్ బుక్ ఫ్రెండ్స్ మీద దయ లేకుండా దండ యాత్ర చేస్తున్నారు. 

ఫోన్ ఓపెన్ చెయ్యగానే ఫేస్బుక్ నోటిఫికేషన్ కనపడింది సుజిత్ కు. అంతే ఆనందంతో గుండె వెయ్యి రెట్లు వేగం పుంజుకుంది. ఓపెన్ చెయ్యగానే  క్యాండీ క్రష్ గేమ్ నోటిఫికేషన్, గుండె బద్దలయిపొయింది. "పని పాట లేని వెధవలందరూ ఫేస్బుక్ లో గేమ్ లు ఆడుకోవటం,  ఏదో పెద్ద ఒలింపిక్ మెడల్ సాధించినట్లు పక్క వాళ్ళకు నోటిఫికేషన్ పంపడం. ఇలాంటి వెధవలందరిని ఫేస్బుక్ లోంచి తరిమెయ్యాలి"  అని బండ బూతులు తిట్టుకున్నాడు.

తమాయించుకుని ఫేస్బుక్  స్క్రోల్ చేస్తుంటే ఏదో వీడియో షేర్ చేశాడు తన ఇంజనీరింగ్ ఫ్రెండ్ విజయ్ గాడు. ఏంటో ఆ వీడియో అని చూస్తే, ఎక్కడో దుబాయ్ లో మనుష్యులను అడ్డంగా నరికే వీడియో అది. అది చూడగానే ఒళ్ళంతా గగురు పొడిచింది సుజిత్ కు.  "వేరి సాడ్" అని సింపుల్ గా రాసి షేర్ చేశాడు దరిద్రుడు. 

"పొద్దు పొద్దున్నే ఇలాంటి కంపరం చూపించిన ఈ వెధవను కసి తీరా తిడితే గాని కోపం చల్లారదు" అనుకుని ఫోన్ చేశాడు విజయ్ కి. 

సుజిత్ ఫోన్ ఎత్తిన విజయ్  "గుడ్ మార్నింగ్ రా మామ. పొద్దున్నే నాకు ఫోన్ చేశావ్,  నీ రోజంతా సూపర్" అన్నాడు ఉషారుగా.  

అందుకు సుజిత్ ఏవగింపుగా "అబ్బా చా! ఏంట్రా పొద్దు పొద్దున్నే ఆ చెత్త విడియోలు? ఎవడ్నో ఎక్కడో నరికితే నువ్వు చూసింది కాకుండా షేర్ చెయ్యటం ఏంట్రా ?" అన్నాడు. 

"ఏంటి మామ? నువ్వు మరి అంత దయలేని వాడివా? మనుష్యులను నడిరోడ్డు మీద నరికితే నీకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంత స్వార్థం పనికి రాదు మామ"  అని చిన్నగా కోప్పడ్డాడు విజయ్. 

"ఒరేయ్ ఆ వీడియో షేర్ చేస్తే నీకేం వచ్చిందిరా? "వేరి సాడ్"  అని టైటిల్ పెట్టి షేర్ చేసి ఏదో ఉద్దరించనని గొప్పగా ఫీల్ అవుతున్నావ్. కాని చుసిన నేను ఎంత డిస్తుర్బ్ అయ్యానో తెలుసా?  ఈ రోజంతా నాకు అదే గుర్తుకొస్తుంది. నేనేం అన్యాయం చేశాన్ రా నీకు?"  ఏడ్చినంత పనిచేసాడు సుజిత్.  

"చూడు మామ! నేను వేరి సాడ్ అని షేర్ చేసినప్పుడే నువ్వు అర్ధం చేసుకొని చూడకుండా ఉండాల్సింది" తప్పంతా సుజిత్ దే అని తేల్చేశాడు. 

"అవును తప్పేరా! నాదే తప్పు. నీలాంటి దయామయుడు, కరుణామయుడు  షేర్ చేసినా వీడియో చూడటం నాదే తప్పు" అని ఫోన్ పెట్టేసాడు సుజిత్. 

పనులు ముగించు కుని ఆఫీసుకు బయలు దేరుతుంటే "సుజిత్ టిఫిన్ చేసి వెళ్ళు" అని ఇడ్లి ప్లేట్ తోఎదురు వచ్చింది సంధ్య. వాళ్ళిద్దరికీ పెళ్ళయి ఏడాది మాత్రమే అవుతుంది. సంధ్య ఇంజనీరింగ్ పూర్తీ చేసింది, ఇప్పుడు జాబు కోసం ట్రయల్స్ వేస్తూ ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటోంది. ఇంకా తప్పదు అని టిఫిన్ చేస్తూ ఫేస్బుక్ చూడసాగాడు.  

సంధ్య ఇడ్లి ప్లేట్ పిక్చర్ అప్లోడ్ చేసి "ఇడ్లి టిఫిన్ చేశాను"  అని పోస్ట్ పెట్టింది.  పెట్టి అయిదు నిమిషాలు అయ్యిందో లేదో అప్పుడే ఇరవై లైక్ లు,  పదిహేను కామెంట్ లు ఉన్నాయి.  ఒక్కో కామెంట్ చదువుతుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది సుజిత్ కు. 

"సో స్వీట్" అని ఒక్కడు, "నోరు ఉరి పోతుంది" అని ఒక్కడు, "నాకు కూడా కావాలి" అని ఇంకొక్కడు. "అమ్మాయి ఏది పెట్టినా సొల్లు కార్చుకుంటూ లైక్ లు కొడుతూ కామెంట్ చెయ్యటమే లక్ష్యంగా ఉంటారు ఈ వెధవలు" అనుకున్నాడు సుజిత్. 

"సంధ్య ! ఏంటి ఇది. ఇడ్లి టిఫిన్ చేసినా కూడా ఫేస్బుక్ లో అప్డేట్ పెట్టాలా? ఏదో పెద్ద బిర్యానీ చేసినట్లు" నిష్టురమాడాడు సుజిత్. 

"మరి అంత కుళ్ళు పనికిరాదు సుజిత్. నువ్వు మాత్రం జిమ్ లో వర్కౌట్ చేసి స్టాటిస్టిక్స్ షేర్ చెయ్యవా?" అంది వెటకారం ఆడుతూ. 

"నేను షేర్ చేసేది వేరేవాళ్ళను ఇన్స్ స్పైర్ చెయ్యటానికి"  

"నేను పెట్టేది నేను ఇన్స్ స్పైర్ కావటానికి. చూడు ఇంత ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది. ఆ లైక్ లు, కామెంట్ లు చూస్తుంటే, నన్ను మించిన అమ్మాయి లేదు అనిపిస్తుంది నాకు" అంది గర్వంగా చేతులు ఎగరేసి. 

ఏమి మాట్లాడలేక ఆఫీసుకు వెళ్ళి పోయాడు సుజిత్. 

********************************************************************************

సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన సుజిత్ కు సంధ్య తనతో సరిగా మాట్లాడటం లేదని చాల లేట్ గా అర్థం అయ్యింది. పొద్దున్న అన్న విషయానికి పెద్దగా ఫీల్ అయినట్లు కూడా లేదు. మరి ఎందుకబ్బా సరిగా మాట్లాడటం లేదు అని  బుర్ర బద్దలు కొట్టున్నాడు, తలకి బొప్పి కట్టింది కానీ విషయం ఇసుమంత కూడా  అర్థం కాలేదు. 

"సంధ్య డార్లింగ్! ఏంటి ఏదో డల్ గా ఉన్నావ్? నీకు ఉషారు వచ్చే ఉపాయం చెప్పనా? ఫీలింగ్ వేరి సాడ్ అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టు. అంతే పని పాట లేని వెధవలందరూ ఎన్ని కామెంట్స్ పెడుతారో చూడు" అన్నాడు విరగబడి నవ్వుతూ. 

సంధ్య నవ్వకపోగా కోపంగా చూసి "అందరు లైక్ లు కొడుతారు, కామెంట్ లు పెడుతారు నా పోస్ట్ లకు,  నువ్వు  తప్ప" అంది నిష్టూరంగా. 

"వేరి సారీ యార్, నీ పేస్ ఫేడ్ అవుట్ కావటానికి కారణం ఫేస్బుక్ అని తెలియదు. ఇంతకూ నేను మిస్ అయినా ఆ ఆణిముత్యం లాంటి పోస్ట్ ఏంటి" అన్నాడు సుజిత్ ఉడికిస్తూ. 

"ఇదిగో ఇదే" అని ఫేస్బుక్ ఓపెన్ చేసింది "Love is like a War, very easy to Start but very hard to Stop"  అని ఉంది పోస్ట్.  దానికి అప్పటికే అరవై లైక్ లు,  నలపై కామెంట్ లు వచ్చాయి. 

అది చూడగానే సుజిత్ "అది కాదు సంధ్య! నాకు కొచెం అర్థం కాలేదు ఆ పోస్ట్. క్లారిటి లేకపోతె నేను....." అని ఏదో చెపుతుంటే.

సంధ్య మధ్యలోనే అందుకుని కోపంగా "నీకు క్లారిటీ కావాలా, లేక నాతొ కాపురం కావాలా?" అంది . 

"ఎయ్ ఏంటి మరి సిల్లీగా! జస్ట్ ఫేస్బుక్ పోస్ట్ కోసం ఇంత సీరియస్ అవుతావ్" సుజిత్ వెటకారం ఒలక పోసాడు. 

"ఫేస్బుక్ అయినా నోట్ బుక్ అయినా, నా అభిప్రాయానికి గౌరవం ఇవ్వటం నీకు రాదు. అందుకే నా పోస్ట్ లైక్ చేయలేదు"  అని ఏడుపు మొదలు పెట్టింది. 

"ఓరి దీని యేషాలు" అని మనసులో అనుకుని, పైకి మాత్రం దినంగా  "ఫేస్బుక్ లో క్లారిటి కోసం కాపురం కూల్చుకున్న మొట్ట మొదటి సన్నాసి గాని నేనే కావటం నాకు ఇష్టం లేదుగాని,  ఇదిగో లైక్, కామెంట్ ఏమని రాయమంటవో నువ్వే చెప్పు" అన్నాడు. 

"Very hard to stop Loving you అని పెట్టు" అంది సంధ్య సిగ్గుపడుతూ. 

తానూ అది రాసి అయిదు నిముషాలు అయిందో లేదో! పది లైక్ లు పడ్డాయి.   "మేడ్ ఫర్ ఈచ్ అదర్, సూపర్ జోడి, ఇద్దరు ఇద్దరే"  లాంటి  కామెంట్స్ రాసాగాయి. 

సుజిత్ కు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. సంధ్య మొహం మాత్రం పది డబ్బాలు మెకప్ పట్టించిన యాంకర్ మొహంల వెలిగి పోసాగింది.

                         *********************************************************************************

ఆఫీసు లో పని చేసుకుంటున్నా సుజిత్ కు తన టీం మేట్ వెంకట్ పింగ్ చేసి "నీతో మాట్లాడాలి అర్జెంటు గా రా" అన్నాడు. 

"సరే ఏంటో"  అని వెళ్ళె సరికి మరో ఫ్రెండ్ కిరణ్ తో కలిసి స్మోకింగ్ జోన్ కు దారి తీసాడు వెంకట్. 

"నేను అసలే పనిలో బిజీ గా ఉంటె అర్జెంటు గా రమ్మని పిలిచి స్మోకింగ్ జోన్ కు వెళ్తావ్ ఏంటి భయ్యా?" అన్నాడు సుజిత్. 

"అంటే నేను పక్క ప్రాజెక్ట్ అనుకున్నావా లేక పని ఉందొ లేదో తెలుసుకోలేని మేనేజర్ అనుకున్నావా?" అన్నాడు వెంకట్ ఆశ్చర్యం నటిస్తూ. 

సిగరెట్ లు తాగటం మొదలు పెట్టిన తర్వాత  వెంకట్ మొహం సీరియస్ గా పెట్టి "అరేయ్ కిరణ్! నిన్ను ఒక విషయం అడగాలి రా! నువ్వు పవన్ కళ్యాణ్ మీద జోక్ లు ఎందుకేస్తున్నావ్ రా?"  అన్నాడు. 

"ఇప్పుడు పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ మీద జోక్ లు వెయ్యటానికి ఏముందిరా విషయం" అన్నాడు కిరణ్ వెటకారంగా. 

"నువ్వు మహేష్ బాబు మీద వేస్తె ఉరుకుంటావా? ఏం చేసాడు రా నీకు పవన్ అన్న"  అన్నాడు వెంకట్  బాధపడుతు. 

"అసలు విషయం ఏంటో క్లియర్ గా చెప్పండ్రా. అటు నుండి ఒక్కడు ఇటు నుండి ఒక్కడు పొగవదులుతుంటే  ఉపిరి తీయటమే కష్టం గా ఉంటే!  మళ్ళి అర్థం కాని సుకుమార్ సినిమా చుపిస్తారెంట్రా నాకు"  సుజిత్ కు చిర్రెత్తుకొచ్చింది. 

"అర్థం కాని సుకుమార్ సినిమా? సూపర్ మామ నువ్వు. అది రా మహేష్ బాబు సినిమా అంటే. అస్సలు అర్థం కాదు"  అని సంబరంగా  చంకలు గుద్దుకున్నాడు వెంకట్. 

"ఓరిని అల్పానందం. ముందు నీ ఏడుపు ఏంటో చెప్పు తర్వాత నవ్వుదువు గాని" అన్నాడు కిరణ్ వెంకట్ ని వెక్కిరిస్తూ. 

"పేస్ బుక్ లో పవన్ కళ్యాణ్ మీద జోక్ లు ఎందుకు షేర్ చేశావ్ రా" కంట్రోల్ తప్పుతున్నాడు వెంకట్. 

"అది నేను క్రియేట్ చెయ్యలేదు, ఎవడో షేర్ చేస్తే లైక్ చేసి షేర్ చేశాను" 

"అదే రా ఎందుకు అని అడుగుతున్నా?"  

"నీకు నిజంగానే తెలియదా?  జోక్ లు ఎందుకు షేర్ చేస్తారు? నవ్వుకోవటానికి" అన్నాడు కిరణ్ పగలపడి నవ్వుతూ. 

"మహేష్ బాబు మీద చేసుకో కావాలంటే. కాని పవన్ కళ్యాణ్ మీద చేస్తే అసలు బాగుండదు అ ఆ ఆఅ " అన్నాడు  వెంకట్ పవన్ కళ్యాణ్ స్టైల్ లో. 

"నా పేస్ బుక్ లో నేను ఏ గొట్టం గాడి మీదయిన జోక్ లు వేస్తా,  షేర్ చేసుకుంటా. ఎవడికయినా నొప్పిగా ఉంటె,  ఇప్పుడే నా ఫ్రెండ్స్ లిస్టు లోంచి డిలీట్ చేస్తా" అని ఫోన్ లో పేస్ బుక్ ఓపెన్ చేశాడు కిరణ్. 

"ఒరేయ్ మామ! ఏంట్రా ఇది!  ఈ  మధ్య ఆటో డ్రైవర్ లు ఇలా  కొట్టుకోవటంలేదు, పోలిటిషియన్స్ తప్ప.  సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు అయి ఉండి హీరోల కోసం పేస్ బుక్ లో కొట్టుకోవటం. మిమల్ని,  మీ గొడవను చూస్తుంటే పేస్ బుక్ మీదే విరక్తి కలుగుతుందిరా" అని  చిరాకుగా వెళ్ళి పోయాడు సుజిత్. 

వెంకట్, కిరణ్ మాత్రం ఒక్కరి పేస్ బుక్ లోంచి ఒక్కరిని డిలీట్ చేసుకుని కోపంగా వెళ్ళి పోయారు.

(ఇంకావుంది)

(రెండవ భాగం కోసం ఇక్కడ నొక్కండి)

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

నా బ్లాగ్ పుట్టిన రోజు

(సరిగ్గా అయిదు సంవత్సరాల కిత్రం పిబ్రవరి 13 2009 లో నా బ్లాగ్ మొదలు పెట్టాను. ఈ రోజు నా బ్లాగ్ పుట్టినా సందంర్బంగా నా పెరడిలలో వచ్చే పాత్రలు రాజు, యాదగిరి నన్ను ఇంటర్వ్యూ చేస్తే!)

రాజు: అసలు బ్లాగ్ ఎప్పుడు? ఎందుకు మొదలు పెట్టినావ్?

నేను: చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర చదివి కథలు రాయాలని అనిపించేది.   అలాగే పెద్దయ్యాక ఆంధ్రభూమి, స్వాతి చదివి నవలలు రాయాలని అనిపించేది. అలా ఒక రోజు అనుకోకుండా కూడలి చూసి నేను కూడా బ్లాగ్ రాయాలని 2009 పిబ్రవరి 13 తేదిన "హృదయ స్వగతం" అని బ్లాగ్ మొదలు పెట్టాను. 

రాజు: అంటే చిన్నప్పటి నుండే కాపీ కొట్టాలని కోరిక అన్న మాట. 

యాదగిరి: మరి అట్లా తీసి పారేయ్యకు మామ. కొన్ని పేరడీలు బాగానే రాశాడు కదా!

రాజు: ఏది మల్టీ స్టార్ మీద రాశాడు దాని గురించా? సెకండ్ పార్ట్ చూశావ! ఎంత చెత్తగా ఉంటాదో. 

నేను: ఫస్ట్ పార్ట్ అంత క్లిక్ అవుతుందని అనుకోలేదు. ఆ పోస్ట్  ప్రతి బ్లాగ్ గ్రూప్ లో టాప్ లో ఉండేసరికి దాన్ని కాష్ చేసుకోవాలని తొందర తొందర గా ఫ్లో లో రాసుకుంటూ పోయాను. మళ్ళి మార్చాను కదా! కాస్త బెటర్ అయింది. దాన్ని కూడా చాల మంది కామెంట్ చేశారు. 

రాజు: దిన్నె తొందర పాటు, తెలివి తక్కువ తనం అంటారు. 

యాదగిరి: సినిమాల మిద నువ్వు రాసేటి కామెడీ బాగుంటది బై. 

నేను: నాకు వేరే వ్యాపకాలు పెద్దగా లేవు. అందుకే సినిమా పరిజ్ఞానం ఎక్కువ. అందుకే దాని మీద ఏది రాసిన బాగా క్లిక్ అవుతుంది. 

యాదగిరి: సినిమా పిచ్చోడివి అన్నమాట. 

రాజు: కవితలు ఎక్కడ నుండి కాపీ కొడుతావ్? కొన్ని చాల బాగుంటాయి. 

నేను: ఇలాంటివి వింటున్నపుడు చాల హ్యాపీ గా ఉంటుంది. ఎందుకంటే అవి అంత బాగుంటేనే కదా ఎక్కడి నుండో కాపీ కొట్టాను అనుకుంటున్నారు. కాని నేను ఏది కాపీ కొట్టలేదు. ఒకవేళ కొడితే ముందుగా అనువాదం అని రాస్తాను. 

యాదగిరి: నువ్వో పెద్ద రచయిత మళ్ళి అనువాదం అని వేస్తే ఎవడో పట్టించుకోని దేనికి అనువాదం అని వెతికేస్తారు మరి. 

రాజు: పక్కవాడి పెళ్ళాం అనే స్టొరీ ఇంకా టాప్ లో ఉంది. అసలు దాని విషయం ఏంటి? 

నేను: ఏముంది! అన్ని స్టొరీల లాగే దాన్ని రాశాను. కాని అందరు ఆడవాళ్ళకు బాగా నచ్చేసింది, అందుకే టాప్ లో ఉంది. 

రాజు: ఓరిని యేషాలు. పెద్ద మహిళ సంస్కర్త బయలు దేరాడు. 

యాదగిరి: అంత  మంచి స్టోరీలు రాస్తూ,  మళ్ళి  దెయ్యాల స్టొరీ లు, బూతు స్టొరీ లు ఎందుకు రాస్తావ్ నువ్వు అసలు. 

నేను: రచయిత అంటే అన్ని రాయాలి కదా! అందుకే రాస్తాను. 

యాదగిరి: నిజామా ! నువ్వు పెద్ద డార్క్ మైండ్ గాడివి. అందుకే ఇలాంటి సాకులు చెప్పి నీ మైండ్ లో ఉన్న డార్క్ నెస్ అంత బయట పెడుతున్నావ్. 

నేను: దేవుడి మీద రాస్తే మంచి వాడు అయిపోతాడ?  అవి చదివే వాళ్ళు, నేను ఎప్పుడు నెక్స్ట్ పార్ట్ రాస్తానా అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. 

యాదగిరి: అవును మరి. నువ్వు పెద్ద యండమూరి వీరేంద్రనాథ్ అని.

రాజు: ఒక్కోసారి వరుసగా స్టొరీ మీద స్టొరీ రాస్తావ్. ఒక్కోసారి నెలలు నెలలు అయినా ఒక్కటి పోస్ట్ చేయ్యావ్. ఎం మాయ రోగం. 

నేను: కాపీ కొడితే వెంట వెంట వెంటనే రాయచ్చు. కానీ మనది సొంత క్రియేటివిటీ కదా! ఐడియా లు రావాద్దు. 

రాజు: నీకు బాగానే మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి. నువ్వు రాసే తొక్కలో స్టొరీ లకు మళ్ళి ఐడియా లు ఒక్కటి. 

రాజు: నీ బ్లాగ్ ఈ మధ్య ఆంధ్ర జ్యోతి సండే మాగజిన్ లో వచ్చిందంట? పెద్ద రచయిత అయిపోయా అనుకుంటున్నావా? 

నేను: అంత లేదు లే గాని. ఏదో వాళ్ళకు స్పేస్ మిగిలి పోయి నా స్టొరీ వేసారు. అంతే కానీ నేను ఏదో పెద్ద రైటర్ అని ఫీల్ అవటం లేదు. 

రాజు: గుడ్ వేరి గుడ్. ఇంతకూ మించి ఆలోచిస్తే అడ్రెస్స్ లేకుండా పోతావ్. 

యాదగిరి: కొంచెం తొందర తొందరగా రాయి కాని మంచి గా రాయి. 

నేను: ప్రయత్నిస్తాను. పాఠకులను రంజింప చేయటమే నాకు కావాల్సింది. 

యాదగిరి: ఈ పోజులే వద్దు అని చెప్పేది. నీకు పెద్ద పాఠకులు ఎం లేరు గాని మూసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకో రైటింగ్. 

రాజు: ఈ మధ్య మమల్ని వాడుకోవటం లేదు. కాస్త మమల్ని వాడుకుంటూ మంచి కామెడీ రాయి. పోజులు కొట్టటం మానేయ్. 

నేను: అలాగే. ఇంతవరకు నా రాతలను ఆదరించిన మీ అందరికి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. 

రాజు, యదరిగి: ఇవ్వే ! ఈ ఎకస్ట్ర పనులే మానేయ మనేది. 

నేను: (మూసుకుని కూర్చున్న!!!!)