27, డిసెంబర్ 2014, శనివారం

అనగనగా ఒక ఫ్రెండ్ !!!

"ఒరేయ్ మామ! ఒక్క అయిదు లక్షలు సర్దురా. నెల తిరగకుండానే ఇచ్చేస్తాను నీకు" ఫోన్ లో స్నేహితుడిని బ్రతిమలుతున్నాడు రవి. కానీ అవతల నుండి మాత్రం సరయిన స్పందన లేదు. 

"ఏంట్రా నా దగ్గర ఎప్పుడో డబ్బులు దాచి పెట్టినట్లు! ఏదో నా పెరట్లో డబ్బుల చెట్టు ఉన్నట్లు అంత జిడ్డులా పట్టుకున్నావ్? నా దగ్గర లేవు అంటే లేవు. నన్ను ఇంక డబ్బులు డబ్బులు అని ఇబ్బంది పెట్టకు. బై" అని చిరాకుగా ఫోన్ పెట్టేసాడు అవతలి వ్యక్తీ. 

రవి కి చాల భాదగా ఉంది. ఏవో  షేర్స్ కొని  తొందరగా డబ్బులు సంపాదించలనుకున్నాడు. కాని తను కొన్న షేర్స్ అన్ని ఒక్కసారిగా పేక మేడల కుప్ప కూలి పోతయానుకోలేదు. ఎల్లుండి లోగ పది లక్షలు కట్టాలి. లేక పొతే బార్ క్లోజ్ అయిపోతుంది. 

అదెగనక జరిగితే తాను కుటుంబం తో సహా రోడ్డున పడాలి. సమయానికి ఒక్కడంటే ఒక్కడు సహాయం చెయ్యటం లేదు. కాలేజీ లో చదువు కునేటప్పుడు, ప్రతి వాడు  తన డబ్బులతోనే జల్సాలు చేశాడు. అమ్మ నాన్నను రాచి రంపాన పెట్టి తన జల్సాలతో ఏమాత్రం సేవింగ్స్ లేకుండా చేశాడు. గుడ్డిలో మెల్ల సొంత ఇల్లయినా ఉంది ఇప్పుడు. 

ఇలా ఆలోచిస్తున్నా తనకు, తన ఇంజనీరింగ్ క్లాస్ మేట్ అగర్వాల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. వాడి దగ్గర డబ్బులకు లోటు లేదు. వాళ్ళ ఫ్యామిలీ కి ఎన్నో కోట్ల బిజినెస్ లు ఉన్నాయ్. వాడిని అడిగితె తప్పకుండా ఇస్తాడు. కాని ఫోన్ లో అయితే పని జరగటం లేదు అందుకే నేరుగా వాడి ఆఫీస్ కు వెళ్ళి పోతా-అనుకుని బయలు దేరాడు రవి. 

ఆఫీసు కు వెళ్ళగానే లోపల ఎవరితోనో మాట్లాడుతూ చాల బిజీ గా ఉన్నాడు అగర్వాల్. ఒక అరగంట తర్వాత లోపలి నుండి పిలుపు వచ్చింది. రవిని చూడగానే చైర్ లోంచి లేచి వచ్చి కౌగిలించు కున్నాడు అగర్వాల్. 

"ఏంటి మామ ఇలా కలిగింది మా మీద దయ" అన్నాడు అగర్వాల్ నవ్వుతు. 

"సూపర్ మామ. తెలుగు బాగానే మాట్లాడుతున్నావ్. ఇంజనీరింగ్ లో భలే కామెడీ గా ఉండేది నీ తెలుగు" అని పాత రోజులు గుర్తు చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు రవి. 

"తప్పదు కదా మామ. ఇక్కడే  బిజినెస్, ఇక్కడే  ఉండటం. అందుకే కష్టపడి నెర్చినా"

"నువ్వు తలచుకుంటే ఏదయినా చేస్తావ్ మామ"

"అబ్బో ఇంకా చాలు మామ. చెప్పు ఏంటి పని? ఏదయినా పార్టీ ఇస్తున్నావా?" అదో రకంగా నవ్వుతు అడిగాడు అగర్వాల్. 

"పార్టి ఎంతసేపు మామ. నీతో కొంచెం పని పడింది అందుకే వచ్చినా" డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాడు రవి. 

"నాతొ పని పడినద. సరే ఏంటో చెప్పు" అగర్వాల్ గొంతు మారటం  గమనించాడు రవి.

"నా బార్  లిక్కర్ లైసెన్స్ కు అర్జెంటు గా పది లక్షలు  కట్టాలి. ఒక్క అయిదు లక్షలు సర్దవంటే ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఇచ్చేస్తాను మామ" అని నమ్మబలికాడు రవి.

"అయిదు లక్షలా!  ఏంటి మామ నువ్వు మరీను. అంత డబ్బు బ్లాక్ చెయ్యటం నా వాళ్ళ కాదు రా. పైగా మా భయ్యా, డాడీ ఉండగా నా పెత్తనం నడవదు" అన్నాడు అగర్వాల్ నిస్సహాయతగా.

రవి ఏదో మాట్లాడే లోగ తన ఫోన్ మోగింది. ఏదో తెలియని నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఎత్తి "హలో" అన్నాడు. "అలాగే,  అలాగే.  ఇంకో గంటలో బార్ దగ్గర ఉంటాను" అని చిరాకుగా ఫోన్ పెట్టేసాడు.

"ఏంటి మామ ఫుల్ బిజీ పర్సన్ అయిపోయావ్. నీకు అప్పు పుట్టక పోవటం ఏంటి రా" అన్నాడు అగర్వాల్ వెటకారంగా.

"పనికి వచ్చే ఫోన్ కాదులే మామ. మన ఇంజనీరింగ్ సునీల్  గాడు గుర్తున్నాడా? కలుస్తాను ఎక్కడికి రావాలి అంటున్నాడు" అన్నాడు రవి నీరసంగా.

"నీ జాన్ జబ్బ, జిగ్రి దోస్త్ కదరా వాడు" అన్నాడు అగర్వాల్ ఆటపటిస్తూ.

"ఏదో మన దగ్గర పడి ఉంటాడు అని అప్పుడప్పుడు హెల్ప్ చేసాం. వాడి దగ్గర ఎం ఉంటాయి రా  నోట్సు, పెన్సిల్లు  తప్ప" అని నవ్వాడు  రవి  జోక్ చేస్తూ.

అగర్వాల్ పట్టించు కోకుండా "సరే మామ. నేను కొంచెం బిజీ ఉన్నాను. మళ్ళి కలుద్దాం" అని చెయ్యి చాచాడు విడుకోలుగా.

"ఏంటి మామ! నీ దగ్గరే డబ్బులులేవంటే వరల్డ్ బ్యాంకు దగ్గర లేనట్లే. ప్లీజ్ మామ కొంచెం చూడురా" అన్నాడు రవి బ్రతిమాలుతూ.

"ఎవరు పడితే వాళ్ళకు డబ్బులు ఇవ్వటానికి నేను చారిటి వర్క్ చెయ్యటం లేదు రా. ఇప్పుడు నాకు కుదరదు కాని,  దయచేసి నన్ను ఇబ్బంది పెట్టి,  నువ్వు ఇబ్బంది పడోద్దు" అని బయటకు దారి చూపించాడు.

రవికి ఎక్కడలేని దుఖం వచ్చింది. "ఒకప్పుడు  నా డబ్బులతో ఎంజాయ్ చేశారు. ఒక్కడికయినా విశ్వాసం ఉందిరా?" అన్నాడు కోపంగా.

"ఏంటి బాబు! నీ డబ్బులతో ఎంజాయ్ చేశామా? నిన్ను ఎవడయినా అడిగాడ? మందు పార్టీ ఇవ్వమని. నిన్ను ఎవడయినా అడిగాడ? లాంగ్ డ్రైవ్ లు తిసుకెళ్ళమని.  నిన్ను ఎవడయినా అడిగాడ? గోవా ట్రిప్ తిసుకెళ్ళమని. నిన్ను ఎవడయినా అడిగాడ? సెకండ్ షో లు తిసుకెళ్ళమని. అసలు అదంతా నువ్వు ఎందుకు చేశావో చెప్పనా? నీ ఇన్సెక్యూరిటీ దాచుకోవటానికి లేదా నీ సూపిరియారిటి పెంచుకోవటానికి" అన్నాడు అగర్వాల్ వెటకారంగా.

ఆ మాటలు వినగానే రవికి నోట మాట రాలేదు. "నా ప్రెండ్సె  కదా అని చేశాను రా. అయినా అందులో నా  ఇన్సెక్యూరిటీ, సూపిరియారిటి ఎం ఉంది రా" అన్నాడు  ఆశ్చర్య పోతూ.

"డబ్బున్న మేము నువ్వు చెప్పినట్లు వింటాం అని కావచ్చు  లేకపోతె  నువ్వు ఏదో పెద్ద రీచ్ పర్సన్ అని కలరింగ్ ఇవ్వటానికి కావొచ్చు. నా ఫ్రెండ్స్ అని చేశాను అన్నావు! ఫ్రెండ్స్ అంటే డబ్బులు ఖర్చు పెట్టటం అని నీకు ఎవరు చెప్పారో కాని నాకు మాత్రం కాదు" అన్నాడు అగర్వాల్ ఆవేశంగా.

రవికి దిమ్మ తిరిగి పోయింది  స్నేహితుడి మాటలకు. "ఫ్రెండ్షిప్ అంటే డబ్బులు ఖర్చు పెట్టటం కానపుడు, నేను ఖర్చు పెడుతూ, ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఎందుకు వచ్చావ్ రా?" అని నిలదిస్తూ అడిగాడు రవి అంతే  ఆవేశంగా.

"చిల్ మాన్. ఫ్రీగా పీచు మిఠాయి వస్తుందంటే,  షుగరు పేషెంట్ కూడా వదిలి పెట్టని జనం  లో ఉంటున్నాం మనం. అలాంటిది ఫ్రీగా పికప్ చేసుకుని బార్ కు తీసుకెళ్ళి మందు పోయించి, బిర్యానీ పెట్టి, హాస్టల్ లో వదిలేస్తే రాక పోవటానికి నేనేం సన్నాసిని కాదు" అన్నాడు అగర్వాల్ గర్వంగా నవ్వుతూ.

"అంతే కాని! నా ఫ్రెండ్ పిలిస్తే పార్టీ కి వెళ్తున్నాను  అనుకోలేదన్న మాట!" రవి గొంతు దుఖం తో వణుకుతోంది.

"మరి అంత ఫ్రాంక్ నెస్ బిజినెస్ కు పనికిరాదని  చెపుతాడు మా డాడీ. కొంచెం డిప్లొమాటిక్ గా చెప్పాలంటే నువ్వు నేను ఒకే సంవత్సరం ఇంజనీరింగ్ చదివినా ఇద్దరు వ్యక్తులం, మరోలా చెప్పాలంటే జస్ట్ క్లాస్ మేట్స్ అంతే" అన్నాడు అగర్వాల్ జాలి చూపిస్తూ.

స్నేహితుడి ఒక్కోమాట గుండెలో గునపంలా దిగుతుంటే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ది కాలేదు రవికి. తన బార్ కు ఎలా వచ్చాడో తెలియదు. వచ్చేసరికి సునీల్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. రవిని చూడగానే ఉషారుగా వెళ్ళి కౌంగిలించుకున్నాడు.  రవికి మాత్రం పెద్ద సంతోషం ఏమి లేదు.  ఇంజనీరింగ్ చేసేటప్పుడు తన డబ్బులతో ఎంజాయ్ చేసినా వాళ్ళల్లో సునీల్ కూడా ఒక్కడు. మిగత వారికి, సునీల్ కు ఒక్కటే తేడా ఏంటంటే సునీల్ పేదవాడు, మిగత వారు డబ్బుండి పేదవారు.

తన జాల్సాలతో పాటు, ఎన్నో సార్లు బుక్స్ కోసం, ఎగ్జామ్స్ ఫీజు కోసం సహాయం చేసేవాడు సునీల్ కు. మళ్ళి ఎ అవసరం కోసం వచ్చాడో వీడు అనుకుని మనసులో చిరాకు పడసాగాడు రవి. సునీల్ ఏవో కాలేజీ రోజులు గుర్తు చేస్తు నవ్వుతున్నాడు. కాని రవి కి నవ్వు రావటం లేదు. బలవంతంగా ఏదో మాట్లాడుతున్నాడు, కాని సునీల్ మాటల్లో  రవి తమను  ఎన్ని సార్లు  టూర్ కు తీసుకెళ్ళింది, ఎంత ఎంజాయ్ చేసింది  వింటూంటే రవికి ఆనందంగా అనిపించింది.

రవి లో ముభావతను గమనించిన సునీల్ "రవి! ఏంట్రా మన వాళ్ళను ఎవడిని  నీ గురించి  అడిగినా వాడిని ఇప్పుడు కలవకు  డబ్బులు డబ్బులు అని చంపేస్తాడు అంటున్నారు. ఏంటి మామ ప్రాబ్లం?" అని అడిగాడు.

"ఇన్నాళ్ళు  ఎక్కడ ఉన్నావ్ రా. సడన్ గా వచ్చి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నావ్? నువ్వేం చెయ్యగలావ్ చెప్పు" అన్నాడు రవి చిరాకు పడుతూ.

"ఇన్ని రోజులు నేను ఇండియా లో లేను మామ. వారం క్రితమే అమెరికా  నుండి వచ్చాను. మన వాళ్ళను టచ్ లోకి తెచ్చుకోవటానికి కొంచెం టైం పట్టింది. ప్రాబ్లం ఏంటో చెప్పు మామ ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం" అన్నాడు సునీల్ సౌమ్యంగా.

"ఏంటి సాల్వ్ చేస్తావా? అయితే నాకు అయిదు లక్షలు కావాలి ఇస్తావా?" అన్నాడు రవి వెటకారంగా.

"ఇంత చిన్న ప్రాబ్లంక నువ్వు ఇంత  ఇదయి పోతున్నావ్. పక్కనే బ్యాంకు ఉంది కదా వెళ్ళి తెద్దాం" అన్నాడు సునీల్.

రవి ఆశ్చర్యంతో నోరు వెళ్ళ బెట్టాడు.  కాని తనకు సునీల్ సహాయం తీసుకోవటం ఇష్టం లేదు. "దేనికి రా అమెరికా లో కష్టపడి  చేసుకున్నా నీ సేవింగ్స్  నా కోసం  వృధా చెయ్యటం. నేను ఇల్లు తాకట్టు పెట్టి నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను" అన్నాడు.

"నీ కోసం వృధా చెయ్యటం ఏంటి మామ? నువ్వే లేక పొతే నా ఇంజనీరింగ్ లైపే వృధా అయిపోయేది. ఎన్ని సార్లు నా ఫీజు కట్టావ్? ఎన్ని సార్లు నా కోసం బుక్స్ కొన్నావ్?" అన్నాడు సునీల్ ఆవేశంగా.

"మామ! నేను అవ్వన్నీ చేసింది నువ్వు చదివి నాకు ఏదయినా చెపుతావని. ఎగ్జామ్స్ లో ఎప్పుడు నీ పక్క సీట్ లో పడే నేను,  నిన్ను చూసి కాపీ కొట్టచ్చు అని" అన్నాడు రవి నిర్లిప్తంగా నవ్వుతు.

"అది నాకు సంభందం లేని విషయం మామ. అసలు సినిమా హాల్ అంటేనే తెలియని నాకు ఎన్ని సార్లు  మొదటి రోజు సినిమా చూపించావ్? ఆ ఆనందం ముందు ఏ డబ్బులు సమానం కాదు మామ. పండగకు హాస్టల్ వదిలి మా ఉరు వెళ్ళాలంటేనే పది సార్లు ఆలోచించాలి నేను. అలాంటిది ఎన్ని సార్లు నన్ను టూర్ లకు తిసుకెళ్ళవ్ రా? ఆ అనుభూతి కి విలువ కట్టగలమా మామ?" అని  ప్రశ్నించాడు  సునీల్ కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా.

రవికి ఆనందంతో నోట మాట రావటం లేదు. తన గొంతు పుడుకు పోయింది. స్నేహితుడిని చూడలేక కిందికి తల దించుకున్నాడు.

"నువ్వు ఏది తింటే అది నాతొ తినిపించావ్. నువ్వు ఏది తాగితే అది నాతొ తాగించావ్. ఒక్కడికి పెడితే తిరిగి వాడు మనకు పెడుతాడో లేడో అని ఆలోచిస్తాం. అలాంటిది నేను నీకు తిరిగి పెట్టలేనని తెలిసి కూడా నాకు పెట్టావ్. నిన్ను మించిన గొప్ప స్నేహితుడు ఎవడు ఉంటారు మామ" అని రవిని  హత్తుకున్నాడు సునీల్.

రవికి చాల సిగ్గుగా అనిపిస్తోంది. ఒకప్పటి  తన ప్రవర్తన గుర్తుకొచ్చి తన మిద తనకే అసహ్యం వేసింది. సునీల్ ను విడిపించుకుని "ఏదో అందరితో పాటు నీకు ఖర్చు పెడుతున్నానని ఎంత దారుణంగా మాట్లాడే వాడిని రా నీతో.  నేను నీకు సహాయం చేసింది, ఖర్చు పెట్టింది నా ఇగో సాటిస్పై చేసుకోవటానికి. బాగా చదివే నిన్ను తిడుతూ నా అహం చల్లర్చుకోవటానికి మామ" అని  పూడుకు పోయిన గొంతుతో అతి కష్టంగా చెప్పాడు  రవి.

"పెట్టె వాడికే తిట్టే హక్కు ఉంటుంది రా. అప్పడప్పుడు నీ ప్రవర్తనకు భాధ పడ్డా! నేను నీ వల్ల  పొందినా ఆనందమే ఎక్కువ మామ. నువ్వు లేకపోతె నా ఇంజనీరింగ్ అంత ఏ  పేపర్ బాయ్ గానో, లేక పాల బూత్ లో పని చేస్తూ నో గడిచి పోయేది రా.  నీ వల్లే  నా ఇంజనీరింగ్ లో ఎన్నో అనుభూతులు, ఆనందాలు పొందాను" అన్నాడు సునీల్ ఆనందంగా.

రవికి సంతోషం తో దుఖం ఆగటం లేదు. గుండె అంత గర్వంతో నిండి పోయింది. తట్టుకోలేక సునీల్ ను గట్టిగా వాటేసుకున్నాడు.

"నేను నీ ఫేక్ ఫ్రెండ్ ను మామ. నాకు  సహాయం చేస్తున్నావ్. నీలాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటె చాలురా" అన్నాడు రవి సునీల్ ను అలాగే హత్తుకుని.

"నేను మాత్రం నీ రియల్ ఫ్రెండ్ నే మామ. ఇంకెప్పుడు ఏ  అవసరం ఉన్నా నన్ను మర్చిపోకు రా" అన్నాడు సునీల్ స్నేహితుడి కళ్ళు తుడుస్తూ.

ఫ్రెండ్ అంటే మనతో పార్టీ చేసేవాడు కాదు, మనతో షిఖార్లు చేసేవాడు కాదు, మన దగ్గర డబ్బులున్నప్పుడు దగ్గరికి వచ్చేవాడు అంతకన్నా కాదు. ఫ్రెండ్ అంటే ఒక భాధ్యత, ఫ్రెండ్ అంటే ఒక భరోసా, ఫ్రెండ్ అంటే ఒక ప్రేరణ. ఫ్రెండ్ అంటే మరో రూపం లో ఉండే మన మనసు.

(సమాప్తం)