7, అక్టోబర్ 2014, మంగళవారం

ఉప్పు - తీపి?


సురేష్ కు అంత కొత్తగా ఉంది, నిజం చెప్పాలంటే చాల  అనిజిగా ఉంది. ఇలాంటి పార్టీలకు రావటం తనకు చాల కొత్త.  ఏదో డబ్బులున్నా కిషోర్ గాడు "అమెరికా వీసా వచ్చింది పార్టి ఇస్తాను రమ్మంటే" వచ్చాడు.

తనకు ఇలాంటివి అసలు అలవాటు లేదు.  అడ మగ తేడా లేకుండా ఒకరి  మిద ఒకరు పడి చిందులేస్తున్నారు. ఇవన్ని తాను సినిమాల్లో చూడటమ కాని నిజ జీవితంలో చూడటం ఇదే మొదటిసారి.  అసలే బిడియస్తుడు అయినా  తను  అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడి ఎరుగడు.

కాని ఎప్పటికయినా ఎవరయినా అమ్మాయితో ఒక్కసారయిన డేట్ కు వెళ్ళాలని కోరిక మాత్రం బలంగా ఉంది మనసులో.  ఇన్నాళ్ళు చదువు చదువు అంటూ టైం వేస్ట్ చేశాడు, ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నా ఒక్క అమ్మాయి తో మాట్లాడి ఎరుగడు.

అటుగా వచ్చిన మరో ఫ్రెండ్ కిరణ్ సురేష్ తో  "ఒక్క అమ్మాయి కూడా ఖాళీగా ఉన్నట్లు లేదు కదరా?" అన్నాడు.

దానికి సురేష్ "ప్రేమించి పెళ్ళి చేసుకుని, పెళ్ళాన్ని  డెలివరీ కి ఇంటికి పంపిన నీకెందుకు రా ఇంకా అమ్మాయి!" అన్నాడు ఆశ్చర్య పోతూ.

కిరణ్ బిగ్గరగా నవ్వి "ఇల్లు ఉంది కదా  అని పార్క్ కు వెళ్ళరా? పార్క్ కు వెళ్ళి పూలు, వాటి అందాలూ చూస్తే  తప్పు లేదురా.  ఆ  పూలు కోసుకోవాలను కుంటేనే తప్పు. పెళ్ళయిన వాడు అమ్మాయిలతో సరదాగా మాట్లాడితే తప్పు కాదు, వారిని అనుభావించాలను కుంటే తప్పు" అన్నాడు జ్ఞాన బోధ చేస్తున్నట్లుగా.

సురేష్ వెకిలిగా నవ్వి  "నీ సోది డైలాగులు వద్దు కాని ఇక్కడి నుండి వెళ్ళి పోరా. ఒక్కడయిన పోటి తగ్గింది అనుకుంటాను" అన్నాడు.

దానికి కిరణ్ "అబ్బా ఛా ! నేను వెళ్ళి పొతే అమ్మాయిని పడేస్తావా ?" అన్నాడు వెటకారంగా, అక్కడనుండి  వెళ్ళి పోతు.  

"ప్రతి ఒక్కడు మంచి పిజిక్ తో మోడల్ లాగా ఉన్నాడు. ఆవరేజ్ గా  ఉన్నా తనను ఎ అమ్మాయి చూస్తుంది? ఆశకయినా హద్దు ఉండాలి" అనుకున్నాడు మనసులో.

"అసలు విడు పార్టీ ఏదో రెస్టారెంట్ లోనో, గెస్ట్ హౌస్ లోనో ఇవ్వకుండా ఈ పబ్ లో ఇవ్వటం ఏంటో? అసలు ఎవరు కిషోర్ గాడి పార్టీ కి వచ్చారో? ఎవరు ఎవరి తాలుకో తెలియటం లేదు. అంత కలిసి గ్లాసులు పట్టుకుని చిందులేయ్యటం తప్ప" అని విసుగుకున్నాడు సురేష్.

అతని భాద ఏంటంటే పబ్ లో కాకుండా వేరే చోట అయితే మంచి అమ్మాయిని చూసి మాటల్లో దింపే వాడు. కానీ ఇప్పుడు ఎవరు ఎవరో తెలియక అంత కన్ఫ్యూషన్ గా ఉంది. 

ఇలా ఆలోచిస్తూ ఏమి తోచక అటు ఇటు చూస్తుంటే  పక్కనే ఎవరో అమ్మాయి వచ్చి నిలబడింది. బాగా డాన్సు చేసి అలసి పోయినట్లు ఉంది.  ఒళ్ళంతా చెమట పట్టి ముత్యాల్లా మెరుస్తోంది తన వంటి మిద.  అందమయిన ముఖం, బంగారు రంగు, ఎత్తు,  దానికి తగ్గ బరువు. చూడబోతే మంచి పోటి ఉన్నట్లు ఉంది తన కోసం. ప్రతి వాడు  ఆమెనే  తినేసేలా చూస్తున్నాడు.

ఎంత ఆపుకున్నా తనతో మాట్లాడాలన్న కోరికను అణుచుకోలేక పోయాడు సురేష్. తన దగ్గరకు వెళ్ళి "హలో! మీరు డాన్సు చాల బాగా చేశారు" అన్నాడు నిజంగా చూసినట్లు.

వెంటనే ఆ అమ్మాయి "మీరు చూశారా? నేను డాన్సు చెయ్యటం!" అంటూ అడిగింది ఆశ్చర్యంగా.

"అవును చూశాను. ఇందాకే కదా ఫ్లోర్ దిగారు మీరు అలసి పోయి. అందుకే కదా ఒళ్ళంతా చెమటలు"

"వావ్ మీరు చాల గ్రేట్ అండి! అందరు డే డ్రీమ్స్ లేదా నైట్ డ్రీమ్స్ చూస్తారు. మీరు కొత్తగా ఈవెనింగ్ డ్రీమ్స్ చూస్తున్నారు! నాకు అసలు డాన్సు రాదు. మా ఫ్రెండ్స్ బలవంత పెడితే ఫస్ట్ టైం వచ్చాను పార్టీ కి. ఉక్క పోసి చెమటలు పట్టాయి అందుకే ఈ ఫ్యాన్ కిందికి వచ్చాను."

మనోడి మొఖంలో నెత్తురు చుక్కలేదు. సిగ్గు తో తల దించుకుని "సారి అండి ! మీతో ఏదయినా మాట్లాడాలని ఉరికే అబద్దం ఆడాను" అన్నాడు అమాయకంగా.

"అమ్మాయి తో మాట్లాడటానికి అబద్దం దేనికండి? అసలు ఎం చేస్తుంటారు మీరు" అంది కాస్త చిరాకుగా.

"ఇంజనీరింగ్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను"

 "ఒక అమ్మాయి కోసం అబద్దాలు ఆడటం మరి సిల్లీగా ఉంది" తన గొంతులో అసహ్యం పలుకుతోంది.

"ఎంటండి మీరు నేను ఏదో పెద్ద నేరం చేసినట్లు మాట్లాడుతారు. ఇంత అందమయిన అమ్మాయితో ఏదో కారణం తో మాట్లాడాలని అబద్దం ఆడాను! ఉరికే మాట్లాడితే మీరు ఊరుకుంటారా !"  దీనంగా అడిగాడు సురేష్.

"మీరు మాములుగా మాట్లాడి పరిచయం చేసుకుంటే నేను మాములుగానే మాట్లాడే దాన్ని. ఇందులో ఏముంది పెద్ద విషయం" అంది నిర్లక్ష్యంగా.

"అమ్మాయిలు చాల పాస్ట్ అవుతున్నారు అని సినిమాల్లో చూపిస్తే అంత సుత్తి అనుకున్నాడు తను , కానీ నిజమే" అని మనసులో అనుకుని.

"సరే నండి! నా పేరు సురేష్. మరి మీ పేరు" అన్నాడు దైర్యంగా.

"నా పేరు తెలుసుకుని ఏం  చేస్తారు? వదిలేయండి"

 "వార్తలు చూసే వారు వాతారణం గురించి తెలుసుకుని ఏం చేస్తారండి! వాళ్ళు చెప్పటం లేదా? మీరు కూడా పేరు చెప్పండి".

"హలో! వాతావరణం తెలుసు కోవటం,  నా పేరు తెలుసుకోవటం రెండు  ఒక్కటేనా?" అంది చిరాకుగా.

"మీరే కదండీ మీ పేరు తెలుసుకుని ఏమి చెయ్యలేను అన్నారు, అలాగే వాతావరణం తెలుసుకుని ఎవరు మాత్రం ఏం చేస్తారు? అందుకే మీ పేరు కూడా చెప్పండి.  ప్లీజ్!" అన్నాడు బ్రతిమాలుతూ.

అతని లాజిక్ పిచ్చిగా ఉన్నా మాట్లాడే ధైర్యం నచ్చింది,  "నా పేరు ఇందు. ఇప్పుడేంటి?" అంది కొంటెగా నవ్వుతూ.

"మీ పేరు పాతగా ఉన్నా, మీరు మాత్రం చాల కొత్తగా ఉన్నారు" అన్నాడు ఇంకాస్త దైర్యం చేసి.

"ఏంటి ఫ్లర్టింగా? అంత సిన్ లేదు కాని లైట్ తీసుకో" అంది నిర్లక్ష్యంగా.

"సిన్ ఎంటండి! మీకు పెద్ద సినిమానే ఉంది. ఒక్కసారి నాతో కాఫీ తాగటానికి వస్తారా?" అన్నాడు భయాన్ని లోపల దాచి ఉషారుగా.

"దైర్యం కొంచెం ఎక్కువే మీకు. కాని ఎందుకు రావాలి" అంది లోపల సిగ్గుపడుతూ.

"ఇంతకు ముందు ఎవరయినా మిమల్ని పిలిచార నాలాగా? " అడిగాడు  సురేష్.

"లేదు" అని తల అడ్డంగా ఉపింది ఇందు.

"ఎందుకో నేను చెప్పనా? మీరు ఇంత అందంగా ఉంటారు కాబట్టి ప్రతి వాడు,  మనకు పడదు అని వదిలేసారు. కాని ఎవడు దైర్యం చెయ్యలేదు" అన్నాడు చిలిపిగా నవ్వుతూ.

తన అందాన్ని పొగిడితే పడి పోనీ ఆడది ఈ లోకంలో లేనట్లే ఈ అమ్మాయి కూడా మినహాయింపు కాదు.అందుకే ఎక్కడికి రావాలి, ఎన్నింటికి అని చెప్పి వెళ్ళి పోయింది.

కాని ఇక్కడితో ఇతన్ని కట్ చెయ్యాలి, దిన్ని పొడిగించకుండా అనుకుంది ఇందు మనసులో.  ఇక్కడ సురేష్ మాత్రం ఎలాగయినా తనను ఇంప్రెస్స్ చెయ్యాలి, ఏ  మాత్రం తప్పు జరుగకుండా జాగ్రత్తగా తనను ప్రేమలో దింపాలి అనుకున్నాడు.

మరునాడు ఇందు చెప్పిన కాఫీ షాప్ కు వెళ్ళిన సురేష్ కు చాల టెన్షన్ గా ఉంది. తాను వస్తుందో, రాదో అని ఒక పక్క టెన్షన్,  మొదటి సారి ఒక అమ్మాయి తో డేట్ కు వచ్చాడు అని ఉద్రేకం తో గుండె నిమిషానికి వంద పైన కొట్టుకోసాగింది.

కొద్ది సేపటికి ఇందు కాఫీ షాప్ కు వచ్చింది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. కానీ ఇందు మాత్రం ఏదో ఆ ఇష్టంగా కూర్చుంది, ఎందుకు వచ్చాను రా దేవుడా అన్నట్లు ఉంది తన ప్రవర్తన.

ఈ విషయం అర్ధం అయిపొయింది సురేష్ కు. అందుకే ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపొయింది తనకు. వెయిటర్ ను పిలిచి కాఫీ ఆర్డర్ చేశాడు. తర్వాత ఏదో మాట్లాడుతున్నాడు కాని ఇందు ఏ మాత్రం ఇంటరెస్ట్ చూపించటం లేదు. కొద్ది సేపటికి వెయిటర్ కాఫీ తెచ్చాడు. ఇద్దరు తాగటం మొదలు పెట్టారు. ఇందు అయితే తొందరగా తాగి భయటపడలని ఆత్రంగా తాగుతోంది.

సురేష్ వెయిటర్ ను పిలిచి "కొచెం సాల్ట్ తీసుకురా" అన్నాడు.

అంతే చుట్టూ ఉన్నా అందరు వారి వైపే చూశారు. వెయిటర్ "ఏంటి సార్ ! కాఫీ లోకి  సాల్ట్ కావాలా? " అన్నాడు ఆశర్యంగా నవ్వుతూ.

ఇందు సిగ్గుతో తలదించుకుంది.

సురేష్ వెయిటర్ వంక కోపంగా చూసి "అవును సాల్టే తీసుకురా" అన్నాడు.

ఇందు కోపంగా  చూసి "కాఫీ లో సాల్ట్ ఏంటి? సంబంధం లేకుండా" అంది.

"మాది సముద్రం పక్కన ఉండే ఇల్లు. చిన్నప్పుడు మా కుటుంబం, స్నేహితులు  అంత కలిసి సముద్రంలో ఆడుకునే వాళ్ళం. కాని ఒకనాడు సునామి వచ్చి మా ఇల్లు ను ముంచేసింది. మా అమ్మ, నాన్న, స్నేహితులు ఎవరు మిగల లేదు. నేను ఇక్కడే మా అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాను ఆ సమయంలో.  అప్పటినుండి మా వాళ్ళ జ్ఞాపకార్ధంగా నాకు ఎంతో ఇష్టమయిన కాఫీలో ఉప్పు కలుపుకుని తాగుతున్నాను" అన్నాడు కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా.

ఇదంతా విన్నా ఇందు మనసు  తల్లడిల్లి పోయింది. "ఇంత మంచి వాడి గురించ? ఎందుకు వచ్చానో అని  భాదపడింది! అసలు ఇలాంటి సున్నిత మనస్కులు ఇంకా ఉన్నారా?" అని ఆశ్చర్య పోయింది.

అతని సున్నితత్వం, మంచితనం ఆమెను కదిలించాయి. ఇద్దరు చెట్ట పట్టాలేసుకుని తిరగటం మొదలయింది. దానితో పాటు వారి మధ్య ప్రేమ పెరిగి పెద్దదయి  పెళ్ళికి దారి తీసింది.

ఇందు, సురేష్ కు ఇష్టమయిన సాల్ట్ కాఫీ ఇవ్వటంతోనే సురేష్ రోజు ప్రారంభం అయ్యేది. ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండేవారు. ఏ ఒక్కరోజు కూడా చిన్న మాట అనుకుని ఎరుగరు. అలా వారి కాపురం సాపిగా సాగి ముసలి వారు అయిపోయారు.

కొద్ది రోజులకు సురేష్ ఆరోగ్యం బాగాలేక కన్ను మూసాడు. అయితే అతని డైరీలో ఒక్క ఉత్తరం భయట పడింది. దాన్ని విప్పి చదవటం మొదలు పెట్టింది ఇందు.

"నా ఇందు! నిన్ను వదిలి వెళ్ళినందుకు నన్ను క్షమించు. కాని నేను ఇప్పుడు  చెప్పే నిజం వింటే నువ్వు నన్ను క్షమిస్తావో లేదో తెలియదు. నాకు కాఫీ అంటే ఇష్టం లేదు. అందులోను  ఉప్పు కలిపినా కాఫీ అస్సలు ఇష్టం లేదు. ఆ రోజు కాఫీ షాప్ లో కంగారులో నేను షుగర్ అనబోయి సాల్ట్ అన్నాను. అప్పుడు నువ్వు ఇబ్బందిగా సిగ్గుపడటం  చూసి, నన్ను వదిలి పోతావని అర్ధం అయింది. అందుకే నిన్ను దూరం చేసుకోవటం ఇష్టం లేక అప్పటికప్పుడు ఒక కట్టు కథ అల్లాను, నిన్ను ఇంప్రెస్ చేశాను. మా వాళ్ళు సునామీలో చనిపోవటం నిజమే కాని నేను ఉప్పు కాఫీ తాగటం అబద్దం. "

ఇందు కళ్ళు ఉత్తరం వెంట పరుగు పెడుతున్నాయి, కన్నీటి  ధార మాత్రం  ఆగటం లేదు.

"ఎప్పటికప్పుడు నీకు నిజం చెప్పాలనుకుని నన్ను ఎక్కడ వదిలి పోతావో అని చెప్పలేక పోయాను. పెళ్ళి అయిన తర్వాత నాకు కాఫీ ఇస్తూ, నువ్వు గర్వంగా ఫీల్ అవ్వటం గమనించి దాన్ని నీకు దూరం చేయటం ఇష్టం లేక అలాగే ఆ అబద్దాన్ని నిజంగా నిలబెట్టాను. కాని బంగారం నా ప్రేమ మాత్రం అబద్దం కాదు.  నేను తాగే  ఉప్పు కాఫీ నువ్వు ఇచ్చింది అని తలచు కోగానే తియ్యగా మారి  పోయేది. నిజం రా,  నీ మిద ఒట్టు. ఈ పిచ్చివాణ్ణి అసహ్యించు కోకుండా క్షమిస్తావు కదూ?"

అది చదివినా ఇందు గుండెలు అవిసేలా ఏడ్చింది. తన సంతోషం కోసం ఇన్నాళ్ళు ఇంత భాధను తియ్యగా మార్చుకున్న ఒక గొప్ప ప్రెమికుణ్ణి పొందినందుకు గర్వంతో పొంగి పోయింది ఆమె మనసు. అప్పటి నుండి తను కూడా  ఉప్పు కలిపినా కాఫీ తాగటం మొదలు పెట్టింది.

ఎవరయినా "ఉప్పు కలిపినా కాఫీ ఎలా ఉంటుంది" అని అడిగితె

"చాల తియ్యగా ఉంటుంది" అని చెప్పేది.

మనసులో మాత్రం "నా సురేష్ తియ్యని ప్రేమ నాతొ ఉండగా, ఎ ఉప్పు నాకు చేదు కాదు" అనుకునేది.

(సమాప్తం)