6, సెప్టెంబర్ 2014, శనివారం

టెక్నాలజీ (హాస్యం) -1

"గంట నుండి తిప్పుతున్నావ్ కాలనీ లో!  ఎక్కడ చుశావె ఇల్లు?" భార్యను విసుగు పడుతూ అడిగాడు గోవిందు. 

"ఇక్కడె  చూశానండి. ఆ ఇంటి పైన ఎర్ర చీర ఆరేసి ఉంది. నేను బాగ గుర్తు పెట్టుకున్నాను కూడ" రమణి గొంతులో గర్వం తోనికిస లాడింది. 

అది వినగానే గోవిందు మెదడు మొద్దుబారి పోయింది! భార్య తెలివికి పట్ట పగలే చుక్కలు కనిపించాయి. 

 "ఎర్ర చీర అరెసినా ఇల్లు అని గుర్తుపెట్టుకున్నవా! ఇంకా నయం నల్ల కాకి వాలింది అని  గుర్తు పెట్టుకోలేదు" అన్నాడు వెటకారంగా. 

"మా ఊర్లో ఇదే ఎక్కువ. అసలు అడ్రస్ గుర్తు పెట్టుకోవటం లో నేనే నెంబర్ వన్ మా ఫ్రెండ్స్ లో"  అంది నిష్ఠుర పడుతూ. 

గోవిందుకు కోపం నషాళానికి అంటి పోయింది. కార్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేక పొతే కోపంతో చిందులు వెసేవాడు.  చిరాకు తట్టుకోలేక-ఇప్పుడిప్పుడే ఉడి పోతూ, నెత్తి మిద బట్టతలకు పునాదులు వేస్తున్నా జుట్టును కసిగా పిక్కున్నాడు.  గుప్పెడు మందం ఉడి వచ్చేసింది ! అంతే కెవ్వుమని అరిచాడు.

"యిలా కాలు కాలిన పిల్లిలా కార్లో తిరగక పొతే ఆ బ్రోకర్ అబ్బాయికి ఫోన్ చెయ్యొచ్చు కదా!" ఉచిత సలహా పడేసింది రమణి.

"మీ ఊర్లో పిల్లులు కార్లో కూడా తిరుగుతయ్యా? అడ్రస్ గుర్తుపెట్టుకొనే తెలివి లేదుగాని సలహాలు ఇస్తోంది" అంటూ పట పట పళ్ళు నురాడు.

"పళ్ళు మరీ  అంత నూరకండి . అరిగిపోయి, విరిగి పోగలవు"  అంది రమణి దిగులుగా.

భార్య  నిజంగానే చెపుతోందో లేక తన మీద జోక్ లు వేస్తోందో తెలియక మళ్ళి జుట్టు పిక్కున్నాడు గోవిందు.

ఈ సారి రెండు గుప్పెళ్ళు ఉడి వచ్చింది జుట్టు. అది చూడగానే గోవిందు వెర్రిగా కేకేసి, కారు సడన్ బ్రేక్ వేసి ఆపేసాడు.

"జుట్టు పెరిగితే కటింగ్ చేసుకోవచ్చు కదా ! ఎందుకండీ అలా పిక్కుంటారు" అంది రమణి భాదపడుతూ.

గోవిందుకు ఏం మాట్లడాలో తెలియలేదు. తల బాదుకుంటూ "నాకు పిచ్చి లేచి  నిన్ను చేసుకున్నా" అన్నాడు భార్యతో.

"ఆ విషయం నేను అప్పుడే గ్రహించాను! కాని  మా అమ్మ నాన్న భాధపడుతారని ఎం  మాట్లాడలేదు" అంది  రమణి ఉడికిస్తూ.

భార్య మాటకారి తనానికి సంతోషపడుతున్నా పైకి కోపం నటిస్తూ బ్రోకర్ కు ఫోన్ చేశాడు.

"హూ అర్ యు, హూ అర్ యు" అని కాలర్ టోన్ మొదలయింది. "ఫోన్ ఎత్తితే కదరా తెలిసేది" అనుకుని వెయిట్ చేయ్యసాగాడు.

 లైన్ కట్ అవుతుందనగా  "హలో" అని వినబడింది అవతలి గొంతు.

"ఏంటయ్యా ఫోన్ ఎత్తటానికి ఇంత సేపు" అన్నాడు గోవిందు కాస్త చిరాకుగా .

"సార్!  కాలర్ టోన్ మహేష్ బాబు సాంగ్ వస్తుందా? ఇప్పుడే మార్చిన. మీరే ఫస్ట్ చేసిండ్రు" అన్నాడు ఆ బ్రోకర్ ఉత్సాహంగా.

తాను కూడా మహేష్ బాబు ఫాన్ కావటంతో సరిపోయింది. లేక పొతే తనకు వస్తున్నా కోపానికి మళ్ళి జుట్టు పిక్కునే వాడు.

"చాల బాగుంది. ఫోన్ చేసినవాడిని ఫోన్ ఎత్తకుండానే హూ అర్ యు  అనడం వెరైటిగా ఉంది. ఇంతకూ-పొద్దున మా ఆవిడకు చూపించిన ఇల్లు అడ్రస్ ఒకసారి చెపుతావ?" అన్నాడు  గోవిందు సౌమ్యంగా.

"మీ ఆవిడా ఎవరన్నయ్య" అన్నాడు బ్రోకర్ పోకిరి మహేష్ బాబుల.

"ఎంత మందికి చూపించావ్ ఏంటి ఈ రోజు ఇల్లు" అన్నాడు గోవిందు  వెటకారంగా.

"అవి మా బిజినెస్ సిక్రేట్స్  ఎవరికి చెప్పం. మీ డీటెయిల్స్ చెప్పండి ముందు" అన్నాడు నిర్లక్ష్యంగా.

"ఓరిని నీ సిక్రేట్స్ తగ్గలెయ్య. రేపటి నుండి నేను సాఫ్ట్వేర్ జాబు మానేసి నీకు పోటిగా ఇళ్ళ బ్రోకర్ అవుతానా? నీ ఉద్దేశ్యం" అని వాపోయాడు గోవిందు.

అయినా సర్దుకుని "అలాగే సార్! మా ఆవిడా పేరు రమణి. ఈ రోజు పొద్దున 11 గంటల ప్రాంతంలో మీరు తనకు ఒక ఇల్లు చూపించారు. దాని అడ్రస్ ఒక్కసారి చెప్పండి ప్లీజ్" అన్నాడు వెటకారంగా.

"అరె గా మేడమా?  అడ్రస్ పంపుతున్నా చూసుకొండ్రి"  అని ఫోన్ పెట్టేసాడు.

"అడ్రెస్స్ పంపాడు సరే ! కాని ఇంటికి దారి ఎలా కనుకుంటారు" అడిగింది రమణి కుతూహలంగా.

గోవిందు  గర్వంగా "ఐ ఫోన్ ఉండగా చెంత! ఎందుకు మీకు చింత?" అని ఫోన్ తీసాడు జేబులోంచి.

"ఇప్పుడు ఎవరికీ ఫోన్ చేస్తారు దారి కోసం" వెటకారం తోణికిసాలడింది రమణి గొంతులో.

"ఐ ఫోన్ కు ల్యాండ్ ఫోన్ కు తేడా తెలియని పల్లెటూరి గబ్బిలం. దారి నా ఐ ఫోన్ చూపిస్తుంది" అన్నాడు గోవిందు పరవశంగా.

"అబ్బో! మొబైల్ ఫోన్ లు మేము చూశాము. మరి వెటకారం కాకపోతే ఫోన్ ఎక్కడయినా దారి చూపిస్తుందా? మాట్లాడుతుంది కాని" అంది ఉక్రోషపడుతూ.

"చూడండి గబ్బిలం గారు. ఇది మొబైల్ ఫోన్ కాదు, ఐ ఫోన్. దీనితో ఏదయినా చెయ్యచ్చు" అన్నాడు గోవిందు వెక్కిరిస్తూ.

"ఐ ఫోనో లేక యు ఫోనో. ఏదయినా చెయ్యచ్చు అంటున్నారు కాద! వంట చెయ్యచ్చ దీనితో" రమణి గొంతులో హేళన కొట్టొచ్చినట్లు పలికింది.

"నువ్వు చేసే పెంట వంట ఎవరయినా చేస్తారు లే" గోవిందు కూడ ఎక్కడ తగ్గటం లేదు.

సమయం వచ్చినప్పుడు చెబుదాం లే అని ఉరకుండి పోయింది. ఐ ఫోన్ టేక్ లెఫ్ట్, టేక్ రైట్ అని చెపుతుంటే ఆశ్చర్యంగా చూస్తు ఉండి పోయింది రమణి.

అద్దె ఇల్లు చేరుకోగానే ముందుగా వంట ఇంట్లో కి దారి తీసింది రమణి. ఆ అపార్ట్ మెంట్ లో ఏది ఎ దిక్కో తెలియక తికమక పడసాగింది. అది గమనించిన గోవిందు విషయం అడిగాడు.

"వంట ఇల్లు వెస్ట్ లో ఉంటె వంట చేసే వారికి ఆరోగ్యం బాగుండదని మా అమ్మమ్మ ఎప్పుడో చెప్పినట్లు గుర్తు" అంది చిన్నగా భయపడుతూ.

"తినే వాళ్ళు బాగుండాలంటే ఏ   దిక్కు ఉండాలో చెప్పలేదా?" అడిగాడు గోవిందు ఆటపటిస్తూ.

తర్వాత జేబు లోంచి ఐ ఫోన్ తీసి కంపాస్ అప్లికేషన్ తో దిక్కులు గుర్తు పట్టి చెప్పాడు. అప్పుడు కానీ రమణి మనసు శాంతించలేదు.

భర్త చెప్పినట్లు ఇన్ని పనులు చేస్తున్నా ఐ ఫోన్ భాగ నచ్చింది రమణికి. ఎలాగయినా తాను కూడా ఒక్కటి కొనిపించు కోవాలని అనుకుంది. ఆ రాత్రే ఆ విషయం గోవిందుకు  చెప్పాలనుకుంది.

"ఏమండి! నాకు మీలాంటి ఫోన్ కొని  ఇవ్వండి" అంది గోముగా.

"ల్యాండ్ ఫోన్  వాడటం రాదు,  నీకెందుకు ఐ ఫోన్? ముందు కంప్యూటర్ నేర్చుకో తర్వాత ఐ ఫోన్ కొనుకోవచ్చు" అన్నాడు గోవిందు తప్పించుకుంటూ.

"కంప్యూటర్ కు ఫోన్ కు సంబంధం ఏంటి? నేను  బియాస్సి కంప్యూటర్ అని మార్చి పోయార?" అంది అసహనంగా రమణి.

"చాల్లే ఇంత వరకు మెయిల్ చెయ్యటం రాదు. మళ్ళి బియాస్సి కంప్యూటర్ అని డిగ్రీ ఒక్కటి. అసలు ఎప్పుడయినా కంప్యూటర్ ల్యాబ్ లో అడుగు పెట్టావ?" అన్నాడు గోవిందు హేళనగా.

ఇలా కాదు, ఈయనకు సరయిన డోస్ ఇస్తే గాని ఐ ఫోన్ కొనివ్వడు అనుకుంది మనసులో. గోవిందు మాత్రం అటు తిరిగి పడుకున్నాడు.


(ఇంకావుంది)

రెండవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి