24, సెప్టెంబర్ 2014, బుధవారం

టెక్నాలజీ (హాస్యం) - 2

(మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

గోవిందు ఆఫీసు లో బాస్ తో తన అప్రైసల్ గురించి ధీనంగా మొర పెట్టుకుంటున్నా సమయం లో "డిస్తుర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, కల్లో కోస్తున్నాడు రేతిరంతా ఇడు" అని రింగ్ టోన్ తో ఫోన్ మోగింది,  బాస్ మూడ్ చెదిరింది. 

"నేను మాట్లడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి, ఇంకా ఏది పని చేసినా నీకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఉండదు" అని బలంగా నమ్మే ఆ మేనేజర్ మనోడ్ని తినేసేలా చూశాడు.  

"నాకు వేరే పనుంది తర్వాత మాట్లాడుదాం" అని మొఖం మీద క్యాబిన్ తలుపెస్తుంటే బిక్క మొఖం వేసుకుని బయటకు వచ్చాడు గోవిందు. ఆ టైం లో ఫోన్ చేసినా అడ్డ గాడిద ఎవడ్రా అని చూస్తే భార్య రమణి. 

కోపం నషాళానికి అంటుకుంది. "ఏంటే! ఏదో కొంపలు మునిగి పోయినట్లు ఈ టైం లో చేశావ్?" అన్నాడు మండి పడుతూ. 

"ఈ టైం లో చెయ్యకూడదు అని మీ ఆఫీసు లో రూల్ ఏమయినా ఉందా?" అంది అమాయకంగా రమణి. 

"పంచ్ లు వెయ్యటం ఆపి ముందు అసలు సంగతి ఏడువు" 

"విండోస్  ఓపెన్ కావటం లేదు. అందుకే మీకు చేశాను"

"ఎంటే ! విండోస్ ఓపెన్ కాకపోయినా నాకు ఫోన్ చేసేస్తావా? ఏదో కాస్త కొబ్బరి నూనో లేక మంచి నూనో వేస్తె సరిపోయేదానికి, నాకు ఫోన్ చేస్తే నేనేం చేస్తాను ఆఫీసు లో ఉండి?"

"ఆ మాత్రం మాకు తెలియక కాదు. ఏ బొక్కలో వెయ్యాలో తెలుసుకుందామని ఫోన్ చేశాను. లేక పొతే, ముందు చెప్పేది వినండి" వెటకారంగా గద్దిస్తూ అంది రమణి. 

"బొక్క తొక్క అని బూతులు మాట్లాడుతున్నావ్. అసలు ఓపెన్ కానివి ఏ విండోస్? బెడ్ రూమ్, కిచెన్ దా? లేక కిచెన్,  హాల్ దా?" అసహనం పెరిగి పోతోంది గోవిందు లో. 

"రెండు కాంబినేషన్స్ కాదు. మీ లాప్టాప్ లో ఓపెన్ కావటం లేదు. ఎం చెయ్యాలో చెపుతారని ఫోన్ చేశాను. నూనె వెయ్యమంటారా? ఇప్పుడు" 

"ఓరి దేవుడోయ్. నీ కాళ్ళు  పట్టుకుంటాను. దయచేసి దాంట్లో ఏ  నూనే వెయ్యకే తల్లి" గోవిందు కంగారులో  గట్టిగా అరిచేసరికి సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకొచ్చారు. వారికి సర్ది చెప్పి పంపేశాడు. 

"మరి అంత దద్దమ్మలాగ కనిపిస్తున్నానా? ముందు ఇది ఎందుకు రావటం లేదో చెప్పు" రమణికి అవమానంగా ఉంది. 

"నువ్వు ఎంత దద్దమ్మవో నీకు తెలిసినంత నాకు తెలియదు గాని, దాంట్లో బ్యాటరి అయిపోయి ఉంటుంది ఛార్జింగ్ పెట్టు" అన్నాడు గోవిందు వెక్కిరిస్తూ. 

రమణి తలపట్టుకుంది. ఇంత చిన్న విషయం తనకు తట్టలేదే అని.

"కంప్యూటర్ డీగ్రీ హోల్డర్ అయినా తనను కంట్రీ లేడీ లాగ చూస్తున్నాడు. ఎలాగయినా ప్రూవ్ చెసుకుని ఐ ఫోన్ కొనిపించుకోవాలి" అనుకుంది మనసులో. 

అప్పటినుండి  రోజు కంప్యూటర్ లో ఏది పడితే అది కేలకటం,  గోవిందు సాయంత్రం బాగు చెయ్యటం.

ఏజ్ బార్ అవుతున్నా టీచర్ గ్రూప్ పరిక్షలకు  ప్రిపేర్ అయ్యేంత సీరియస్ గా, న్యూస్ పేపర్లలో, వార పత్రికలలో కంప్యూటర్ గురించి వ్యాసాలు చదువుతూ బాగా నాలెడ్జ్ పెంచ సాగింది.

అది చూసి గోవిందు "మరి అంత కష్ట పెట్టకు మెదడును. ఏదయినా అయితే నేను చావాలి మళ్ళి" అన్నాడు.

"మీకే అర్ధం కాగా లేనిది! నాకు అర్ధం కదా?" అంది రమణి వెటకారంగా.

"అది కాదె. పాపం ఎప్పుడు అలవాటు లేని పని చేస్తే ఎవరికయినా కష్టం కదా! ఎప్పుడు వాడని నీ మెదడును ఇప్పుడు విపరీతంగా వాడి ఇబ్బంది పెడితే, చితికి పోయి నీకు మతిపోతే ఎలా?" అని గట్టిగా నవ్వాడు.

రమణి చిన్నబుచ్చుకుని లాప్టాప్ లో మునిగి పోయింది.

భార్య ఉత్సాహం చూసి గోవిందు కు ముచ్చటేసింది. ఒక్క రోజు ఏదో వెబ్ సైట్  దొరికితే  తనకు  ఫోన్ చేశాడు. 

"నీ తెలుగు కంప్యూటర్ పాఠాలు ఎన్ని సార్లు చదివినా దండగే కాని, నాకు  బేసిక్స్ మీద  ఒక వెబ్ సైట్ దొరికింది. దాన్ని కూడా చదువు ఒక్కసారి" అన్నాడు గోవిందు. 

తానూ డీగ్రీ లో సి లాంగ్వేజ్ కు తెలుగు లో కోచింగ్ పోయినా విషయం అంతరాత్మ గుర్తు చేసినా అణగదోక్కేసాడు. 

"అలాగే చదువుతాను, మెయిల్ చెయ్యండి" అంది రమణి  ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లా. 

"మెయిల్ చెయ్యటం దేనికి. ఫేవరెట్స్  లో పెట్టాను. క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ లింక్ క్లిక్ చెయ్"

"మీ ఆఫీసు సిస్టం లో ఫేవరెట్స్ లో పెడితే నాకు ఎందుకు కనపడతుంది!"

"క్రోమ్ లో ఉన్నది నా లాగిన్ కాబట్టి, నేను ఎ సిస్టం  లో ఏది పెట్టినా, చూసినా అన్ని సిస్టమ్స్ లో కనబడుతుంది" గోవిందు గొంతులో గర్వం, భార్య ముందు తన ప్రతిష్ట పెరిగిందన్నా సంభరం. 

రమణి కుతుహాలంగా ఓపెన్ చేస్తే, గోవిందు పెట్టిన సైట్ లింక్ ఉంది. సంబరంగా అనిపించింది తనకు. రెట్టించిన ఉత్సాహంతో చదవటం మొదలుపెట్టింది. 

ఒక వారం  తర్వాత-ఆఫీసు లో ఉన్నా గోవిందు ఫోన్ మోగింది "రారా వస్తావా అడిగింది ఇస్తావ". ఎవరా? అని చూస్తే తన  భార్య. ఒక నిట్టూర్పు విడిచి ఫోన్ ఎత్తాడు. 

"ఎం చేస్తున్నారండి?" నెమ్మదిగా అడిగింది. 

"కంప్యూటర్ లో కర్ర బిళ్ళ ఆడుతున్నా.  అసలే ఆఫీసు లో చచ్చేంత వర్క్ ఉంటే నీ గోలేంటి" గోవిందు గింకరించాడు. 

"కంప్యూటర్ లో మీరు ఎం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. క్రికెట్ మ్యాచ్ లైవ్ చూస్తూ, చచ్చేంత పని అని మేనేజర్ ముందు కొట్టే పోజులు,  నా ముందు కొడుతున్నారు"  రమణి గొంతులో వెటకారం. 

"అందుకే చెప్పేది. మెదడుకు లేని పోనీ కష్టాలు పెట్టి మతి పోగొట్టుకోవద్దు అని. క్రికెట్ చూస్తున్నానని ఉహించుకొంటున్నావా?" అన్నాడు గోవిందు గొంతులో జాలి ఒలకబోస్తూ.

"బూకయించాలని చూడకు. నేను నీ  క్రోమ్ లో హిస్టరీ చూస్తున్నా" అంది గద్దిస్తూ.

గోవిందుకు విషయం లీలగా అర్ధం అవుతోంది,  "ఈ తింగరిది కక్కుర్తికి పోయి  క్రోమ్ గురించి కూడా చదివినట్లు ఉంది" అనుకుని "నేను ఆఫీసు లో చూస్తే ప్రాబ్లెమ్  ఏంటి" అన్నాడు బెట్టుగా.

"చిఛీ! ఇంట్లో ఎలాగు టీవీ ముందు కూర్చుని మాట ముచ్చట లేకుండా అదే క్రికెట్ గోల, ఆఫీసు లో కూడా అదే పనిగా క్రికెట్ చూస్తూ, నాకు ఇంక్రిమెంట్ రావటం లేదు అని ఎంత ఏడిస్తే మాత్రం ఎవడు ఇస్తాడు" రమణి రెచ్చి పోతోంది. 

"పని చేస్తూ మధ్య మధ్య లో చూస్తున్న. అందరు చేసే పనే" గోవిందు సమర్థించు కుంటున్నాడు.

"అందరు ఎన్నో చేస్తారు. అలా అని మీరు చేస్తారా? సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఎప్పటికయినా అమెరికా వెళ్ళచ్చు అని పెళ్ళి  చేసుకుంటే, ఉద్యోగం ఉడగొట్టు కుంటున్నాడు"  రమణి ఎడుస్తూ ఫోన్ పెట్టేసింది.

"మెయిల్ పెట్టండి అన్నప్పుడు మూసుకుని పెట్టచ్చుగా. పెద్ద పొటుగాడిలా దానికి లేని పోనీ నాలెడ్జ్ ట్రాన్స్ ఫర్ చేశాను. అందుకే, అతిగా ఎవడికి నాలెడ్జ్ షేర్ చెయ్యకూడదు. రేపు మన జాబు  కె ఎసరు పెడుతారు" మనసులో అనుకుని ఆఫీసు నుండి మొబైల్ షాప్ కు బయలుదేరాడు ఐ ఫోన్ కొనటానికి. అలాగయిన భార్య శాంతిస్తుందని. 

(ఇంకావుంది)

(మూడవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

3 వ్యాఖ్యలు: