27, డిసెంబర్ 2014, శనివారం

అనగనగా ఒక ఫ్రెండ్ !!!

"ఒరేయ్ మామ! ఒక్క అయిదు లక్షలు సర్దురా. నెల తిరగకుండానే ఇచ్చేస్తాను నీకు" ఫోన్ లో స్నేహితుడిని బ్రతిమలుతున్నాడు రవి. కానీ అవతల నుండి మాత్రం సరయిన స్పందన లేదు. 

"ఏంట్రా నా దగ్గర ఎప్పుడో డబ్బులు దాచి పెట్టినట్లు! ఏదో నా పెరట్లో డబ్బుల చెట్టు ఉన్నట్లు అంత జిడ్డులా పట్టుకున్నావ్? నా దగ్గర లేవు అంటే లేవు. నన్ను ఇంక డబ్బులు డబ్బులు అని ఇబ్బంది పెట్టకు. బై" అని చిరాకుగా ఫోన్ పెట్టేసాడు అవతలి వ్యక్తీ. 

రవి కి చాల భాదగా ఉంది. ఏవో  షేర్స్ కొని  తొందరగా డబ్బులు సంపాదించలనుకున్నాడు. కాని తను కొన్న షేర్స్ అన్ని ఒక్కసారిగా పేక మేడల కుప్ప కూలి పోతయానుకోలేదు. ఎల్లుండి లోగ పది లక్షలు కట్టాలి. లేక పొతే బార్ క్లోజ్ అయిపోతుంది. 

అదెగనక జరిగితే తాను కుటుంబం తో సహా రోడ్డున పడాలి. సమయానికి ఒక్కడంటే ఒక్కడు సహాయం చెయ్యటం లేదు. కాలేజీ లో చదువు కునేటప్పుడు, ప్రతి వాడు  తన డబ్బులతోనే జల్సాలు చేశాడు. అమ్మ నాన్నను రాచి రంపాన పెట్టి తన జల్సాలతో ఏమాత్రం సేవింగ్స్ లేకుండా చేశాడు. గుడ్డిలో మెల్ల సొంత ఇల్లయినా ఉంది ఇప్పుడు. 

ఇలా ఆలోచిస్తున్నా తనకు, తన ఇంజనీరింగ్ క్లాస్ మేట్ అగర్వాల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. వాడి దగ్గర డబ్బులకు లోటు లేదు. వాళ్ళ ఫ్యామిలీ కి ఎన్నో కోట్ల బిజినెస్ లు ఉన్నాయ్. వాడిని అడిగితె తప్పకుండా ఇస్తాడు. కాని ఫోన్ లో అయితే పని జరగటం లేదు అందుకే నేరుగా వాడి ఆఫీస్ కు వెళ్ళి పోతా-అనుకుని బయలు దేరాడు రవి. 

ఆఫీసు కు వెళ్ళగానే లోపల ఎవరితోనో మాట్లాడుతూ చాల బిజీ గా ఉన్నాడు అగర్వాల్. ఒక అరగంట తర్వాత లోపలి నుండి పిలుపు వచ్చింది. రవిని చూడగానే చైర్ లోంచి లేచి వచ్చి కౌగిలించు కున్నాడు అగర్వాల్. 

"ఏంటి మామ ఇలా కలిగింది మా మీద దయ" అన్నాడు అగర్వాల్ నవ్వుతు. 

"సూపర్ మామ. తెలుగు బాగానే మాట్లాడుతున్నావ్. ఇంజనీరింగ్ లో భలే కామెడీ గా ఉండేది నీ తెలుగు" అని పాత రోజులు గుర్తు చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు రవి. 

"తప్పదు కదా మామ. ఇక్కడే  బిజినెస్, ఇక్కడే  ఉండటం. అందుకే కష్టపడి నెర్చినా"

"నువ్వు తలచుకుంటే ఏదయినా చేస్తావ్ మామ"

"అబ్బో ఇంకా చాలు మామ. చెప్పు ఏంటి పని? ఏదయినా పార్టీ ఇస్తున్నావా?" అదో రకంగా నవ్వుతు అడిగాడు అగర్వాల్. 

"పార్టి ఎంతసేపు మామ. నీతో కొంచెం పని పడింది అందుకే వచ్చినా" డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాడు రవి. 

"నాతొ పని పడినద. సరే ఏంటో చెప్పు" అగర్వాల్ గొంతు మారటం  గమనించాడు రవి.

"నా బార్  లిక్కర్ లైసెన్స్ కు అర్జెంటు గా పది లక్షలు  కట్టాలి. ఒక్క అయిదు లక్షలు సర్దవంటే ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఇచ్చేస్తాను మామ" అని నమ్మబలికాడు రవి.

"అయిదు లక్షలా!  ఏంటి మామ నువ్వు మరీను. అంత డబ్బు బ్లాక్ చెయ్యటం నా వాళ్ళ కాదు రా. పైగా మా భయ్యా, డాడీ ఉండగా నా పెత్తనం నడవదు" అన్నాడు అగర్వాల్ నిస్సహాయతగా.

రవి ఏదో మాట్లాడే లోగ తన ఫోన్ మోగింది. ఏదో తెలియని నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఎత్తి "హలో" అన్నాడు. "అలాగే,  అలాగే.  ఇంకో గంటలో బార్ దగ్గర ఉంటాను" అని చిరాకుగా ఫోన్ పెట్టేసాడు.

"ఏంటి మామ ఫుల్ బిజీ పర్సన్ అయిపోయావ్. నీకు అప్పు పుట్టక పోవటం ఏంటి రా" అన్నాడు అగర్వాల్ వెటకారంగా.

"పనికి వచ్చే ఫోన్ కాదులే మామ. మన ఇంజనీరింగ్ సునీల్  గాడు గుర్తున్నాడా? కలుస్తాను ఎక్కడికి రావాలి అంటున్నాడు" అన్నాడు రవి నీరసంగా.

"నీ జాన్ జబ్బ, జిగ్రి దోస్త్ కదరా వాడు" అన్నాడు అగర్వాల్ ఆటపటిస్తూ.

"ఏదో మన దగ్గర పడి ఉంటాడు అని అప్పుడప్పుడు హెల్ప్ చేసాం. వాడి దగ్గర ఎం ఉంటాయి రా  నోట్సు, పెన్సిల్లు  తప్ప" అని నవ్వాడు  రవి  జోక్ చేస్తూ.

అగర్వాల్ పట్టించు కోకుండా "సరే మామ. నేను కొంచెం బిజీ ఉన్నాను. మళ్ళి కలుద్దాం" అని చెయ్యి చాచాడు విడుకోలుగా.

"ఏంటి మామ! నీ దగ్గరే డబ్బులులేవంటే వరల్డ్ బ్యాంకు దగ్గర లేనట్లే. ప్లీజ్ మామ కొంచెం చూడురా" అన్నాడు రవి బ్రతిమాలుతూ.

"ఎవరు పడితే వాళ్ళకు డబ్బులు ఇవ్వటానికి నేను చారిటి వర్క్ చెయ్యటం లేదు రా. ఇప్పుడు నాకు కుదరదు కాని,  దయచేసి నన్ను ఇబ్బంది పెట్టి,  నువ్వు ఇబ్బంది పడోద్దు" అని బయటకు దారి చూపించాడు.

రవికి ఎక్కడలేని దుఖం వచ్చింది. "ఒకప్పుడు  నా డబ్బులతో ఎంజాయ్ చేశారు. ఒక్కడికయినా విశ్వాసం ఉందిరా?" అన్నాడు కోపంగా.

"ఏంటి బాబు! నీ డబ్బులతో ఎంజాయ్ చేశామా? నిన్ను ఎవడయినా అడిగాడ? మందు పార్టీ ఇవ్వమని. నిన్ను ఎవడయినా అడిగాడ? లాంగ్ డ్రైవ్ లు తిసుకెళ్ళమని.  నిన్ను ఎవడయినా అడిగాడ? గోవా ట్రిప్ తిసుకెళ్ళమని. నిన్ను ఎవడయినా అడిగాడ? సెకండ్ షో లు తిసుకెళ్ళమని. అసలు అదంతా నువ్వు ఎందుకు చేశావో చెప్పనా? నీ ఇన్సెక్యూరిటీ దాచుకోవటానికి లేదా నీ సూపిరియారిటి పెంచుకోవటానికి" అన్నాడు అగర్వాల్ వెటకారంగా.

ఆ మాటలు వినగానే రవికి నోట మాట రాలేదు. "నా ప్రెండ్సె  కదా అని చేశాను రా. అయినా అందులో నా  ఇన్సెక్యూరిటీ, సూపిరియారిటి ఎం ఉంది రా" అన్నాడు  ఆశ్చర్య పోతూ.

"డబ్బున్న మేము నువ్వు చెప్పినట్లు వింటాం అని కావచ్చు  లేకపోతె  నువ్వు ఏదో పెద్ద రీచ్ పర్సన్ అని కలరింగ్ ఇవ్వటానికి కావొచ్చు. నా ఫ్రెండ్స్ అని చేశాను అన్నావు! ఫ్రెండ్స్ అంటే డబ్బులు ఖర్చు పెట్టటం అని నీకు ఎవరు చెప్పారో కాని నాకు మాత్రం కాదు" అన్నాడు అగర్వాల్ ఆవేశంగా.

రవికి దిమ్మ తిరిగి పోయింది  స్నేహితుడి మాటలకు. "ఫ్రెండ్షిప్ అంటే డబ్బులు ఖర్చు పెట్టటం కానపుడు, నేను ఖర్చు పెడుతూ, ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఎందుకు వచ్చావ్ రా?" అని నిలదిస్తూ అడిగాడు రవి అంతే  ఆవేశంగా.

"చిల్ మాన్. ఫ్రీగా పీచు మిఠాయి వస్తుందంటే,  షుగరు పేషెంట్ కూడా వదిలి పెట్టని జనం  లో ఉంటున్నాం మనం. అలాంటిది ఫ్రీగా పికప్ చేసుకుని బార్ కు తీసుకెళ్ళి మందు పోయించి, బిర్యానీ పెట్టి, హాస్టల్ లో వదిలేస్తే రాక పోవటానికి నేనేం సన్నాసిని కాదు" అన్నాడు అగర్వాల్ గర్వంగా నవ్వుతూ.

"అంతే కాని! నా ఫ్రెండ్ పిలిస్తే పార్టీ కి వెళ్తున్నాను  అనుకోలేదన్న మాట!" రవి గొంతు దుఖం తో వణుకుతోంది.

"మరి అంత ఫ్రాంక్ నెస్ బిజినెస్ కు పనికిరాదని  చెపుతాడు మా డాడీ. కొంచెం డిప్లొమాటిక్ గా చెప్పాలంటే నువ్వు నేను ఒకే సంవత్సరం ఇంజనీరింగ్ చదివినా ఇద్దరు వ్యక్తులం, మరోలా చెప్పాలంటే జస్ట్ క్లాస్ మేట్స్ అంతే" అన్నాడు అగర్వాల్ జాలి చూపిస్తూ.

స్నేహితుడి ఒక్కోమాట గుండెలో గునపంలా దిగుతుంటే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ది కాలేదు రవికి. తన బార్ కు ఎలా వచ్చాడో తెలియదు. వచ్చేసరికి సునీల్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. రవిని చూడగానే ఉషారుగా వెళ్ళి కౌంగిలించుకున్నాడు.  రవికి మాత్రం పెద్ద సంతోషం ఏమి లేదు.  ఇంజనీరింగ్ చేసేటప్పుడు తన డబ్బులతో ఎంజాయ్ చేసినా వాళ్ళల్లో సునీల్ కూడా ఒక్కడు. మిగత వారికి, సునీల్ కు ఒక్కటే తేడా ఏంటంటే సునీల్ పేదవాడు, మిగత వారు డబ్బుండి పేదవారు.

తన జాల్సాలతో పాటు, ఎన్నో సార్లు బుక్స్ కోసం, ఎగ్జామ్స్ ఫీజు కోసం సహాయం చేసేవాడు సునీల్ కు. మళ్ళి ఎ అవసరం కోసం వచ్చాడో వీడు అనుకుని మనసులో చిరాకు పడసాగాడు రవి. సునీల్ ఏవో కాలేజీ రోజులు గుర్తు చేస్తు నవ్వుతున్నాడు. కాని రవి కి నవ్వు రావటం లేదు. బలవంతంగా ఏదో మాట్లాడుతున్నాడు, కాని సునీల్ మాటల్లో  రవి తమను  ఎన్ని సార్లు  టూర్ కు తీసుకెళ్ళింది, ఎంత ఎంజాయ్ చేసింది  వింటూంటే రవికి ఆనందంగా అనిపించింది.

రవి లో ముభావతను గమనించిన సునీల్ "రవి! ఏంట్రా మన వాళ్ళను ఎవడిని  నీ గురించి  అడిగినా వాడిని ఇప్పుడు కలవకు  డబ్బులు డబ్బులు అని చంపేస్తాడు అంటున్నారు. ఏంటి మామ ప్రాబ్లం?" అని అడిగాడు.

"ఇన్నాళ్ళు  ఎక్కడ ఉన్నావ్ రా. సడన్ గా వచ్చి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నావ్? నువ్వేం చెయ్యగలావ్ చెప్పు" అన్నాడు రవి చిరాకు పడుతూ.

"ఇన్ని రోజులు నేను ఇండియా లో లేను మామ. వారం క్రితమే అమెరికా  నుండి వచ్చాను. మన వాళ్ళను టచ్ లోకి తెచ్చుకోవటానికి కొంచెం టైం పట్టింది. ప్రాబ్లం ఏంటో చెప్పు మామ ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం" అన్నాడు సునీల్ సౌమ్యంగా.

"ఏంటి సాల్వ్ చేస్తావా? అయితే నాకు అయిదు లక్షలు కావాలి ఇస్తావా?" అన్నాడు రవి వెటకారంగా.

"ఇంత చిన్న ప్రాబ్లంక నువ్వు ఇంత  ఇదయి పోతున్నావ్. పక్కనే బ్యాంకు ఉంది కదా వెళ్ళి తెద్దాం" అన్నాడు సునీల్.

రవి ఆశ్చర్యంతో నోరు వెళ్ళ బెట్టాడు.  కాని తనకు సునీల్ సహాయం తీసుకోవటం ఇష్టం లేదు. "దేనికి రా అమెరికా లో కష్టపడి  చేసుకున్నా నీ సేవింగ్స్  నా కోసం  వృధా చెయ్యటం. నేను ఇల్లు తాకట్టు పెట్టి నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను" అన్నాడు.

"నీ కోసం వృధా చెయ్యటం ఏంటి మామ? నువ్వే లేక పొతే నా ఇంజనీరింగ్ లైపే వృధా అయిపోయేది. ఎన్ని సార్లు నా ఫీజు కట్టావ్? ఎన్ని సార్లు నా కోసం బుక్స్ కొన్నావ్?" అన్నాడు సునీల్ ఆవేశంగా.

"మామ! నేను అవ్వన్నీ చేసింది నువ్వు చదివి నాకు ఏదయినా చెపుతావని. ఎగ్జామ్స్ లో ఎప్పుడు నీ పక్క సీట్ లో పడే నేను,  నిన్ను చూసి కాపీ కొట్టచ్చు అని" అన్నాడు రవి నిర్లిప్తంగా నవ్వుతు.

"అది నాకు సంభందం లేని విషయం మామ. అసలు సినిమా హాల్ అంటేనే తెలియని నాకు ఎన్ని సార్లు  మొదటి రోజు సినిమా చూపించావ్? ఆ ఆనందం ముందు ఏ డబ్బులు సమానం కాదు మామ. పండగకు హాస్టల్ వదిలి మా ఉరు వెళ్ళాలంటేనే పది సార్లు ఆలోచించాలి నేను. అలాంటిది ఎన్ని సార్లు నన్ను టూర్ లకు తిసుకెళ్ళవ్ రా? ఆ అనుభూతి కి విలువ కట్టగలమా మామ?" అని  ప్రశ్నించాడు  సునీల్ కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా.

రవికి ఆనందంతో నోట మాట రావటం లేదు. తన గొంతు పుడుకు పోయింది. స్నేహితుడిని చూడలేక కిందికి తల దించుకున్నాడు.

"నువ్వు ఏది తింటే అది నాతొ తినిపించావ్. నువ్వు ఏది తాగితే అది నాతొ తాగించావ్. ఒక్కడికి పెడితే తిరిగి వాడు మనకు పెడుతాడో లేడో అని ఆలోచిస్తాం. అలాంటిది నేను నీకు తిరిగి పెట్టలేనని తెలిసి కూడా నాకు పెట్టావ్. నిన్ను మించిన గొప్ప స్నేహితుడు ఎవడు ఉంటారు మామ" అని రవిని  హత్తుకున్నాడు సునీల్.

రవికి చాల సిగ్గుగా అనిపిస్తోంది. ఒకప్పటి  తన ప్రవర్తన గుర్తుకొచ్చి తన మిద తనకే అసహ్యం వేసింది. సునీల్ ను విడిపించుకుని "ఏదో అందరితో పాటు నీకు ఖర్చు పెడుతున్నానని ఎంత దారుణంగా మాట్లాడే వాడిని రా నీతో.  నేను నీకు సహాయం చేసింది, ఖర్చు పెట్టింది నా ఇగో సాటిస్పై చేసుకోవటానికి. బాగా చదివే నిన్ను తిడుతూ నా అహం చల్లర్చుకోవటానికి మామ" అని  పూడుకు పోయిన గొంతుతో అతి కష్టంగా చెప్పాడు  రవి.

"పెట్టె వాడికే తిట్టే హక్కు ఉంటుంది రా. అప్పడప్పుడు నీ ప్రవర్తనకు భాధ పడ్డా! నేను నీ వల్ల  పొందినా ఆనందమే ఎక్కువ మామ. నువ్వు లేకపోతె నా ఇంజనీరింగ్ అంత ఏ  పేపర్ బాయ్ గానో, లేక పాల బూత్ లో పని చేస్తూ నో గడిచి పోయేది రా.  నీ వల్లే  నా ఇంజనీరింగ్ లో ఎన్నో అనుభూతులు, ఆనందాలు పొందాను" అన్నాడు సునీల్ ఆనందంగా.

రవికి సంతోషం తో దుఖం ఆగటం లేదు. గుండె అంత గర్వంతో నిండి పోయింది. తట్టుకోలేక సునీల్ ను గట్టిగా వాటేసుకున్నాడు.

"నేను నీ ఫేక్ ఫ్రెండ్ ను మామ. నాకు  సహాయం చేస్తున్నావ్. నీలాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటె చాలురా" అన్నాడు రవి సునీల్ ను అలాగే హత్తుకుని.

"నేను మాత్రం నీ రియల్ ఫ్రెండ్ నే మామ. ఇంకెప్పుడు ఏ  అవసరం ఉన్నా నన్ను మర్చిపోకు రా" అన్నాడు సునీల్ స్నేహితుడి కళ్ళు తుడుస్తూ.

ఫ్రెండ్ అంటే మనతో పార్టీ చేసేవాడు కాదు, మనతో షిఖార్లు చేసేవాడు కాదు, మన దగ్గర డబ్బులున్నప్పుడు దగ్గరికి వచ్చేవాడు అంతకన్నా కాదు. ఫ్రెండ్ అంటే ఒక భాధ్యత, ఫ్రెండ్ అంటే ఒక భరోసా, ఫ్రెండ్ అంటే ఒక ప్రేరణ. ఫ్రెండ్ అంటే మరో రూపం లో ఉండే మన మనసు.

(సమాప్తం)

4, నవంబర్ 2014, మంగళవారం

నా బ్లాగ్ అంధ్రజ్యోతి లో

ఎప్పుడు అనుకోనిది, ప్రయత్నించనిది  తలుపు తట్టింది. ఒక రోజు నా జిమెయిల్ కు ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధా కృష్ణ గారి పేరు తో ఉన్నా మెయిల్ వచ్చింది కింది విధంగా...... 

mee tech haasyam-3 nu nov 2, 2014 aadivaram andhrajyothi sanchikalo sankshipthamga prachuristhunnam gamaninchagalaru

-editor, aandhrajyothi


మొదట అనందం వేసిన, ఎవరయినా నన్ను అట పట్టిస్తున్నరేమో అనుకున్నా. కాని ఆన్లైన్ లో చూస్తే ఆంధ్రజ్యోతి  ఆదివారం స్పెషల్ లో నా బ్లాగ్ ను పరిచయం చేస్తూ, నేను రాసినా టెక్నాలజీ -3 పోస్ట్ ను సంక్షిప్తంగా ప్రచురించారు. 

ఇదిగో దాని లింక్ ఇదే

కాస్త సమయం తీసుకున్నా,  అందరిని రంజింప చేసే పోస్ట్ లు రాయాలని నిర్ణయించుకున్నా........నా బ్లాగ్ చదివి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి చాల కృతఙ్ఞతలు. ఇంకా విమర్శలు చెయ్య మనవి. 

2, నవంబర్ 2014, ఆదివారం

పాట ఎలా రాయాలి? (హాస్యం)

(ఇదంతా కేవలం కల్పితం మాత్రమే.)

రాజు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే తెలుగు అబ్బాయి. తానూ ఇండియా వెళ్తుంటే అదే ఫ్లైట్ లో చంద్రబోస్ గారు కలిసారు. ఇంకా అదృష్టం ఏంటంటే ఆయనది తన పక్క సీటే. ఇంకా మనోడి ఆనందానికి హద్దు లేదు. ఇక  ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టాడు.

రాజు: సార్ చంద్రబోస్ గారు నేను మీ అభిమానిని సార్. మీ పాటలంటే నాకు చాల ఇష్టం. 

చంద్ర బోస్: చాల సంతోషం. ఇంతకు నువ్వు ఎం చేస్తుంటావు? 

రాజు:సాఫ్ట్వేర్ జాబు చేస్తూ ఉంటాను.  సినిమాలు,  సాహిత్యం అంటే చాల ఇంట్రెస్ట్ సార్. 

చంద్ర: నా పాటల్లో మీకు బాగా నచ్చే పాట ఏది? 

రాజు: మొక్క పాట సార్. "మౌనంగానే ఎదగమని మొక్క మనకు చెపుతుంది.....".

చంద్ర: నా బెస్ట్ పాటల్లో అది ఒక్కటి.

రాజు: కాని మా ఫ్రెండ్ ఒక్కడు  తమిళం నుండి కాపి కొట్టారు  అంటాడు. నిజమేనా సార్? 

చంద్ర: ఇంకా ఏ పాట ఇష్టం? 

రాజు: ఫేర్వెల్ సాంగ్ సార్. "ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి...." అ పాట విన్నప్పుడల్ల నాకు మా కాలేజీ గుర్తు కొచ్చి ఏడుపొస్తుంది సార్. 

చంద్ర: ఆ  పాట నేను మా కాలేజీ ఫంక్షన్ కోసం రాస్తే తీసుకోలేదు. కాని సినిమాకు బాగా సరిపోయింది, అందుకే తీసుకున్నారు.  

రాజు: మీ మాస్ పాటలు అన్ని ఇష్టం సార్. "ఆంద్ర సోడా బుడ్డి...." పాట ఎంత ఉషారుగా ఉంటుంది సార్. బుడ్డి,  మిడ్డి, వడ్డీ, గడ్డి, రెడ్డి, కడ్డి అసలు ఎం పద జాలం సార్.

చంద్ర: ఏముంది! మాస్ పాటకు భావం తో పని లేదు. రైమింగ్ లో వచ్చే పదాలు ముందే రాసుకుని దానికి తగ్గట్లు పాట అల్లుకోవటమే. 

రాజు: మాస్ పాటలే కాదు సార్ . మీ రొమాంటిక్ సాంగ్స్ కేక. "ఒరేయ్ నువ్వు నాకు నచ్చావ్ రా...." పాట వింటే నాకు మా కాలేజీ డేస్ గుర్తుకొచ్చి ఏడుపొస్తుంది సార్. 

చంద్ర: ఫేర్వెల్  పాటకు ఏడిచావ్ ఓకే. మరి రొమాంటిక్ పాటకు ఎందుకు ఏడుపొస్తుంది? మీ లవర్ గుర్తుకొచ్చా?

రాజు: మీరు అ పాటలో ఎం రాసారు సార్? "ఆడపిల్ల  ఒరేయ్ అందంటే కచ్చితంగా అది ప్రేమే రా" అని. మా క్లోజ్ ఫ్రెండ్ నన్ను ఒరేయ్ అందని చెప్పి ఐ లవ్ యు చెపితే, చెంప పగల గొట్టి ఇంకా ఎప్పుడు నాతొ మాట్లడలేదు. 

చంద్ర: నా పాటలు అంతలా ఫాలో అవుతావ?

రాజు: మి పాటల్లో లాజిక్ కుడా చాల బాగుంటుంది సార్! 

చంద్ర: నా పాటల్లో నేను ఎప్పుడు ఫాలో అయ్యేది ప్రాస మాత్రమే. లాజిక్ ఎక్కడ నుండి వచ్చింది?

రాజు: మీకు తెలియదేమో. "వానొచ్చేనంటే వరదొస్తది! వయసొచ్చేనంటే వలపొస్తది" అదోస్తే ఇదొస్తది, ఇదొస్తే అదొస్తది అని లాజిక్ తో రాసారు. 

చంద్ర: అంటే ఒక్కరోజు పాట రాయటానికి కూర్చుంటే ఏమి తోచటం లేదు. అప్పుడే వర్షం మొదయింది. నాకు వెంటనే అనిపించింది "వర్షం వస్తే వరద వస్తుంది. వరద వస్తే బురద వస్తుంది. బురద తో దురద వస్తుంది." ఇ లాజిక్ తట్టింది పాట  రెడీ అయిపొయింది. 

రాజు: ఇంకా చాల సింపుల్ గా కూడా రాస్తారు. A వచ్చి B పై వాలే B వచ్చి C పై వాలే C వచ్చి D పై వాలిందే. ఏమి గ్రేట్ సార్! 

చంద్ర: శ్రీ శ్రీ గారు ఏమన్నారు? అగ్గిపుల్ల, అడ పిల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అని. నేను కాదేది పాటకు అనర్హం అనుకుని పాటలు రాస్తాను. 

రాజు: ఓహో! ఫ్యూచర్ లో ఇంకా దేనిమీద  రాస్తారో. కొన్ని సార్లు అసలు తెలుగు లో  రాసినా అర్థం కాదు సార్ మీ పాట. ఉదాహణకు "మీసం మొలిచెను మనసుకి. కోడి కూస్తే బద్రీనాథ్- లేడి లేస్తే బద్రీనాథ్" 

చంద్ర: కొత్త కొత్త ఉపమానాలు ఆవి. మొదటి దానికి  "నిన్ను చూసి నా మనసు పొంగి పోయింది"  అని,  అలాగే "పొద్దున్న లేచిన దగ్గరి నుండి నేను పరుగు పెట్టె దినమంతా బద్రీనాథ్ నె  తలచు కుంటాను"  అని రెండవదానికి అర్థం. 

రాజు: వాటిలో అంత అర్థం ఉందా సార్?  చిన్నప్పటినుండి ఎప్పుడు చదువు కోలేదు,  వినలేదు  ఇలాంటివి.

చంద్ర: పోగిడవా? తిట్టవా?

రాజు: తెలుగు పాటల్లో ఇంగ్లీష్ మాటలు ఎంత అందంగా రాస్తారు సార్. నాకు ఒక లిరిక్ బాగా గుర్తుంది? "ఏ పూలు పెట్టిన ఏమున్నది గర్వ కారణం! బాడీ లో ఓంపులే బ్యూటీ కి మూల కారణం" అని  రాశారు.  దిన్నె తెలుగు లో "ఒంటిలోని ఓంపులే అందానికి మూల కారణం" అని  రాయ్యోచ్చు. కాని మీరు రాయరు...... 

చంద్ర: అంటే... అంటే.... అప్పుడప్పుడు పాట తొందరగా రాయాలన్న ఒత్తిడిలో కొన్ని తెలుగు మాటలు తట్టక పొతే ఇంగ్లీష్ పదాలు వాడుతాను.  తప్పే ముంది? 

రాజు: మీ పాటలు వింటే సినిమా పాట రాయటం ఇంత ఈజీ అనిపిస్తుంది. ఏంటి సార్ సీక్రెట్? 

చంద్ర: పాట రాయటానికి నేను కొన్ని పద్దతులు ఫాలో అవుతాను. ఇవ్వు-ఇవ్వద్దు లేదా ఇస్తాను-ఇవ్వను  మొదటి పద్దతి. కాదు-అవును లేదా అవుతాను-కాను  రెండవ పద్దతి. 

రాజు: అసలు ఏంటి సార్ యివ్వి? 

చంద్ర: పాట రాయటానికి నేను  ఫాలో అయ్యే పద్దతులు. ఉదాహరణకు "నీ నవ్వుల తెల్లదనాన్ని నాగ మల్లి అప్పడిగింది.....ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు....." ఇది "ఇవ్వద్దు" అనే పద్దతి. అలాగే  "ఇవ్వు" పద్దతి లో పాట "జాబిలికి వెన్నేలలిస్తా,  మబ్బులకు మెరుపులనిస్తా.... " 

రాజు: సూపర్ సార్. మిగత పద్దతి మీద పాటలు కూడా చెప్పండి సార్!

చంద్ర: చెపుతా ఉండు. "దేశమంటే మతం కాదోయ్, గతం కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్" ఇది "కాదు" పద్దతి. అలాగే "అవును" పద్దతి లో   "పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మ- కదిలే దేవత అమ్మ- కంటికి వెలుగు అమ్మా" 

రాజు: వావ్! నిజమే సార్. ఆలోచిస్తుంటే   మీ పాటలన్ని అలాగే ఉన్నాయి. ఎంత ఈజీ గా పాట రాసే పద్దతి కనిపెట్టారు సార్. 

చంద్ర: ఒక్కోసారి రెండు పద్ధతులకు సరి పోనీ పాటలు ఉంటాయి. హీరో మీద సోలో సాంగ్స్. వాటిలో మన ఇష్టం వచ్చినట్లు రెచ్చి పోవచ్చు. 

రాజు: ఉదాహణకు రచ్చ టైటిల్ సాంగ్ కదా సార్. దాంట్లో మీరు వాడిన కొత్త కొత్త పదాలు సూపర్ సార్. గచ్చ, లచ్చ, గిగ స్టార్, యుగ స్టార్, గూగుల్ స్టార్. 

చంద్ర: కొన్ని సార్లు ఏదో విషయం మీద పాట  రాయాల్సి వస్తుంది. అప్పుడు  దాని ఉపయోగాలు చెప్పాలి, దాని వల్ల  జరిగే మంచిని చెప్పాలి, ఇంకా అది లేకపోతె ఏమవుతుందో చెప్పాలి.  అంతే పాట రెడీ అయిపోతుంది. 

రాజు: నాకు తెలిసి పోయింది. మీరు చీర మిద రాసినా పాట అలాంటిదే. చీరతో అన్ని ఉపయోగాలు ఉన్నాయని ఆ పాట విన్నాకే అర్థం అయింది సార్ నాకు. 

 చంద్ర: ఇలా రక రకాల పాటలు రాసేటప్పుడు కొన్ని సార్లు మనకు పదాలు దొరకవు. అలాంటప్పుడు కొత్త పదాలు కనిపెట్టేయ్యాలి. 

రాజు: పదాలు దొరకకా పోవటం ఏమిటి సార్!

చంద్ర: అంటే పాట రాసేటప్పుడు ప్రాస ఉండాలి. దాని కోసం తెలుగులో పదాలు తట్టక పొతే మనమే కొత్త పదాలు కని పెట్టెయ్యాలి.  నేను మాయాబజార్ సినిమా చూసినప్పటి నుండి కొత్త పదాలు కని పెట్టడం మొదలు పెట్టాను. 

రాజు: ఆ సినిమా కు  మీ బాష ఉద్దరణకు సంభందం ఏంటి సార్?

చంద్ర: అందులో పింగళి గారు ఒక మాట రాసారు. "ఎవరు కని పెట్టక పొతే మాటలు ఎలా పుడుతాయి" అని. నాకు నిజమే అనిపించింది. 

రాజు: నిజమే సార్. మీరు కని పెట్టిన ఒక్క మాట "సుమ్మ మాసురియా" 

చంద్ర: అది పదం  కాదు. ఉరికే సౌండింగ్ బాగుంటే పాట జనం లోకి వెళ్ళి పోతుంది అని పెట్టింది. అలాంటివే "రింగ రింగ, డియ్యాలో డియ్యాలో, జాజిరి జాజిరి, మారియా మారియా" 

రాజు: అవును సార్. వాటి అర్థలు తెలియక పోయినా బాగా చొచ్చుకు పోయాయి. ఇంతకూ మీరు కని పెట్టిన పదాలు ఏంటి సార్?

చంద్ర: "నిశ్శబ్దానికి" వ్యతిరేక పదం లాగ "కిశ్శాబ్దం". అంటే కిస్ శబ్దం అన్నమాట. "అయస్కాంతం" లాగా "వయస్కాంతం". ఇంకా "అన్న ప్రాసన" లాగా "వన్నె ప్రాసన". "అమాయకుడు" లాగా "అమ్మాయకుడు". "మధుమేహ వ్యాధి" లాగా "మధుమోహ వ్యాధి". ఇంకా ఎన్నో కొత్త మాటలు కని పెట్టాను.

రాజు: సూపర్ సార్. చూడబోతే మీ కోసం కొత్త డిక్షనరీ రాయాల్సి వచ్చేట్లుంది.

చంద్ర: ఆ రోజు వస్తే మంచిదే కదా!

రాజు: మీరు పాటల చంద్రుడు! ప్రసాలకు ఇంద్రుడు!  పదాలకు పుధ్యుడు! రాతలకు రాజ్యుడు

చంద్ర: ఏంటయ్యా అర్థం లేకుండా ఏదో అంటున్నావ్?

రాజు: మీరే కదా సార్! పదాలు తట్టక పొతే కొత్త పదాలు కని పెట్టాలి అని చెప్పారు!

చంద్ర: ఒహో! పదాలకు పుధ్యుడు అంటే పదాలు పుట్టించేవాడు! రాతలకు రాజ్యుడు అంటే రాతలకు రాజు లాంటి వాడు లేదా రాతలను పాలించే వాడు అని అర్థం! అంతేనా?

రాజు: సార్.....! ఎంత బాగా అర్థం చేసుకున్నారు. ఇవ్వన్ని వింటుంటే నాలోని కవి రాక్షసుడు లేచి తెలుగు పాటను ఇంగ్లీష్ వర్డ్స్ తో, కొత్త కొత్త పదాలతో నింపి  ఉక్కిరి బిక్కిరి చెయ్యాలని  ఉబలాట పడుతున్నాడు.

చంద్ర: మనం రాసింది మహా కావ్యం అని మనం తీవ్రంగా నమ్మాలి. అందరిని మెప్పించి, ఒప్పించాలి.  మనకు తప్పు అనిపిస్తున్నా సరే ఇంత కన్నా గొప్పగా ఎవడు రాయలేడని నర నరాల్లో జిర్ణించుకోవాలి. అంతె! తెలుగు పాటలు రాయటం చాలా తెలిక.

రాజు: చాల థాంక్స్ సార్. ఇకనుండి నేను అదే ఫాలో అవుతా.

చంద్ర: అల్ ది బెస్ట్.

గమనిక: ఇది తెలుగు పాటలు రాయాలనుకునే ఔత్సాహిక రచయితలకు ప్రోత్సాహకరంగా ఉండాలని రాసిందే తప్ప! చంద్రబోస్ గారిని విమర్శించాలని రాసింది కాదు.


7, అక్టోబర్ 2014, మంగళవారం

ఉప్పు - తీపి?


సురేష్ కు అంత కొత్తగా ఉంది, నిజం చెప్పాలంటే చాల  అనిజిగా ఉంది. ఇలాంటి పార్టీలకు రావటం తనకు చాల కొత్త.  ఏదో డబ్బులున్నా కిషోర్ గాడు "అమెరికా వీసా వచ్చింది పార్టి ఇస్తాను రమ్మంటే" వచ్చాడు.

తనకు ఇలాంటివి అసలు అలవాటు లేదు.  అడ మగ తేడా లేకుండా ఒకరి  మిద ఒకరు పడి చిందులేస్తున్నారు. ఇవన్ని తాను సినిమాల్లో చూడటమ కాని నిజ జీవితంలో చూడటం ఇదే మొదటిసారి.  అసలే బిడియస్తుడు అయినా  తను  అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడి ఎరుగడు.

కాని ఎప్పటికయినా ఎవరయినా అమ్మాయితో ఒక్కసారయిన డేట్ కు వెళ్ళాలని కోరిక మాత్రం బలంగా ఉంది మనసులో.  ఇన్నాళ్ళు చదువు చదువు అంటూ టైం వేస్ట్ చేశాడు, ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నా ఒక్క అమ్మాయి తో మాట్లాడి ఎరుగడు.

అటుగా వచ్చిన మరో ఫ్రెండ్ కిరణ్ సురేష్ తో  "ఒక్క అమ్మాయి కూడా ఖాళీగా ఉన్నట్లు లేదు కదరా?" అన్నాడు.

దానికి సురేష్ "ప్రేమించి పెళ్ళి చేసుకుని, పెళ్ళాన్ని  డెలివరీ కి ఇంటికి పంపిన నీకెందుకు రా ఇంకా అమ్మాయి!" అన్నాడు ఆశ్చర్య పోతూ.

కిరణ్ బిగ్గరగా నవ్వి "ఇల్లు ఉంది కదా  అని పార్క్ కు వెళ్ళరా? పార్క్ కు వెళ్ళి పూలు, వాటి అందాలూ చూస్తే  తప్పు లేదురా.  ఆ  పూలు కోసుకోవాలను కుంటేనే తప్పు. పెళ్ళయిన వాడు అమ్మాయిలతో సరదాగా మాట్లాడితే తప్పు కాదు, వారిని అనుభావించాలను కుంటే తప్పు" అన్నాడు జ్ఞాన బోధ చేస్తున్నట్లుగా.

సురేష్ వెకిలిగా నవ్వి  "నీ సోది డైలాగులు వద్దు కాని ఇక్కడి నుండి వెళ్ళి పోరా. ఒక్కడయిన పోటి తగ్గింది అనుకుంటాను" అన్నాడు.

దానికి కిరణ్ "అబ్బా ఛా ! నేను వెళ్ళి పొతే అమ్మాయిని పడేస్తావా ?" అన్నాడు వెటకారంగా, అక్కడనుండి  వెళ్ళి పోతు.  

"ప్రతి ఒక్కడు మంచి పిజిక్ తో మోడల్ లాగా ఉన్నాడు. ఆవరేజ్ గా  ఉన్నా తనను ఎ అమ్మాయి చూస్తుంది? ఆశకయినా హద్దు ఉండాలి" అనుకున్నాడు మనసులో.

"అసలు విడు పార్టీ ఏదో రెస్టారెంట్ లోనో, గెస్ట్ హౌస్ లోనో ఇవ్వకుండా ఈ పబ్ లో ఇవ్వటం ఏంటో? అసలు ఎవరు కిషోర్ గాడి పార్టీ కి వచ్చారో? ఎవరు ఎవరి తాలుకో తెలియటం లేదు. అంత కలిసి గ్లాసులు పట్టుకుని చిందులేయ్యటం తప్ప" అని విసుగుకున్నాడు సురేష్.

అతని భాద ఏంటంటే పబ్ లో కాకుండా వేరే చోట అయితే మంచి అమ్మాయిని చూసి మాటల్లో దింపే వాడు. కానీ ఇప్పుడు ఎవరు ఎవరో తెలియక అంత కన్ఫ్యూషన్ గా ఉంది. 

ఇలా ఆలోచిస్తూ ఏమి తోచక అటు ఇటు చూస్తుంటే  పక్కనే ఎవరో అమ్మాయి వచ్చి నిలబడింది. బాగా డాన్సు చేసి అలసి పోయినట్లు ఉంది.  ఒళ్ళంతా చెమట పట్టి ముత్యాల్లా మెరుస్తోంది తన వంటి మిద.  అందమయిన ముఖం, బంగారు రంగు, ఎత్తు,  దానికి తగ్గ బరువు. చూడబోతే మంచి పోటి ఉన్నట్లు ఉంది తన కోసం. ప్రతి వాడు  ఆమెనే  తినేసేలా చూస్తున్నాడు.

ఎంత ఆపుకున్నా తనతో మాట్లాడాలన్న కోరికను అణుచుకోలేక పోయాడు సురేష్. తన దగ్గరకు వెళ్ళి "హలో! మీరు డాన్సు చాల బాగా చేశారు" అన్నాడు నిజంగా చూసినట్లు.

వెంటనే ఆ అమ్మాయి "మీరు చూశారా? నేను డాన్సు చెయ్యటం!" అంటూ అడిగింది ఆశ్చర్యంగా.

"అవును చూశాను. ఇందాకే కదా ఫ్లోర్ దిగారు మీరు అలసి పోయి. అందుకే కదా ఒళ్ళంతా చెమటలు"

"వావ్ మీరు చాల గ్రేట్ అండి! అందరు డే డ్రీమ్స్ లేదా నైట్ డ్రీమ్స్ చూస్తారు. మీరు కొత్తగా ఈవెనింగ్ డ్రీమ్స్ చూస్తున్నారు! నాకు అసలు డాన్సు రాదు. మా ఫ్రెండ్స్ బలవంత పెడితే ఫస్ట్ టైం వచ్చాను పార్టీ కి. ఉక్క పోసి చెమటలు పట్టాయి అందుకే ఈ ఫ్యాన్ కిందికి వచ్చాను."

మనోడి మొఖంలో నెత్తురు చుక్కలేదు. సిగ్గు తో తల దించుకుని "సారి అండి ! మీతో ఏదయినా మాట్లాడాలని ఉరికే అబద్దం ఆడాను" అన్నాడు అమాయకంగా.

"అమ్మాయి తో మాట్లాడటానికి అబద్దం దేనికండి? అసలు ఎం చేస్తుంటారు మీరు" అంది కాస్త చిరాకుగా.

"ఇంజనీరింగ్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను"

 "ఒక అమ్మాయి కోసం అబద్దాలు ఆడటం మరి సిల్లీగా ఉంది" తన గొంతులో అసహ్యం పలుకుతోంది.

"ఎంటండి మీరు నేను ఏదో పెద్ద నేరం చేసినట్లు మాట్లాడుతారు. ఇంత అందమయిన అమ్మాయితో ఏదో కారణం తో మాట్లాడాలని అబద్దం ఆడాను! ఉరికే మాట్లాడితే మీరు ఊరుకుంటారా !"  దీనంగా అడిగాడు సురేష్.

"మీరు మాములుగా మాట్లాడి పరిచయం చేసుకుంటే నేను మాములుగానే మాట్లాడే దాన్ని. ఇందులో ఏముంది పెద్ద విషయం" అంది నిర్లక్ష్యంగా.

"అమ్మాయిలు చాల పాస్ట్ అవుతున్నారు అని సినిమాల్లో చూపిస్తే అంత సుత్తి అనుకున్నాడు తను , కానీ నిజమే" అని మనసులో అనుకుని.

"సరే నండి! నా పేరు సురేష్. మరి మీ పేరు" అన్నాడు దైర్యంగా.

"నా పేరు తెలుసుకుని ఏం  చేస్తారు? వదిలేయండి"

 "వార్తలు చూసే వారు వాతారణం గురించి తెలుసుకుని ఏం చేస్తారండి! వాళ్ళు చెప్పటం లేదా? మీరు కూడా పేరు చెప్పండి".

"హలో! వాతావరణం తెలుసు కోవటం,  నా పేరు తెలుసుకోవటం రెండు  ఒక్కటేనా?" అంది చిరాకుగా.

"మీరే కదండీ మీ పేరు తెలుసుకుని ఏమి చెయ్యలేను అన్నారు, అలాగే వాతావరణం తెలుసుకుని ఎవరు మాత్రం ఏం చేస్తారు? అందుకే మీ పేరు కూడా చెప్పండి.  ప్లీజ్!" అన్నాడు బ్రతిమాలుతూ.

అతని లాజిక్ పిచ్చిగా ఉన్నా మాట్లాడే ధైర్యం నచ్చింది,  "నా పేరు ఇందు. ఇప్పుడేంటి?" అంది కొంటెగా నవ్వుతూ.

"మీ పేరు పాతగా ఉన్నా, మీరు మాత్రం చాల కొత్తగా ఉన్నారు" అన్నాడు ఇంకాస్త దైర్యం చేసి.

"ఏంటి ఫ్లర్టింగా? అంత సిన్ లేదు కాని లైట్ తీసుకో" అంది నిర్లక్ష్యంగా.

"సిన్ ఎంటండి! మీకు పెద్ద సినిమానే ఉంది. ఒక్కసారి నాతో కాఫీ తాగటానికి వస్తారా?" అన్నాడు భయాన్ని లోపల దాచి ఉషారుగా.

"దైర్యం కొంచెం ఎక్కువే మీకు. కాని ఎందుకు రావాలి" అంది లోపల సిగ్గుపడుతూ.

"ఇంతకు ముందు ఎవరయినా మిమల్ని పిలిచార నాలాగా? " అడిగాడు  సురేష్.

"లేదు" అని తల అడ్డంగా ఉపింది ఇందు.

"ఎందుకో నేను చెప్పనా? మీరు ఇంత అందంగా ఉంటారు కాబట్టి ప్రతి వాడు,  మనకు పడదు అని వదిలేసారు. కాని ఎవడు దైర్యం చెయ్యలేదు" అన్నాడు చిలిపిగా నవ్వుతూ.

తన అందాన్ని పొగిడితే పడి పోనీ ఆడది ఈ లోకంలో లేనట్లే ఈ అమ్మాయి కూడా మినహాయింపు కాదు.అందుకే ఎక్కడికి రావాలి, ఎన్నింటికి అని చెప్పి వెళ్ళి పోయింది.

కాని ఇక్కడితో ఇతన్ని కట్ చెయ్యాలి, దిన్ని పొడిగించకుండా అనుకుంది ఇందు మనసులో.  ఇక్కడ సురేష్ మాత్రం ఎలాగయినా తనను ఇంప్రెస్స్ చెయ్యాలి, ఏ  మాత్రం తప్పు జరుగకుండా జాగ్రత్తగా తనను ప్రేమలో దింపాలి అనుకున్నాడు.

మరునాడు ఇందు చెప్పిన కాఫీ షాప్ కు వెళ్ళిన సురేష్ కు చాల టెన్షన్ గా ఉంది. తాను వస్తుందో, రాదో అని ఒక పక్క టెన్షన్,  మొదటి సారి ఒక అమ్మాయి తో డేట్ కు వచ్చాడు అని ఉద్రేకం తో గుండె నిమిషానికి వంద పైన కొట్టుకోసాగింది.

కొద్ది సేపటికి ఇందు కాఫీ షాప్ కు వచ్చింది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. కానీ ఇందు మాత్రం ఏదో ఆ ఇష్టంగా కూర్చుంది, ఎందుకు వచ్చాను రా దేవుడా అన్నట్లు ఉంది తన ప్రవర్తన.

ఈ విషయం అర్ధం అయిపొయింది సురేష్ కు. అందుకే ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపొయింది తనకు. వెయిటర్ ను పిలిచి కాఫీ ఆర్డర్ చేశాడు. తర్వాత ఏదో మాట్లాడుతున్నాడు కాని ఇందు ఏ మాత్రం ఇంటరెస్ట్ చూపించటం లేదు. కొద్ది సేపటికి వెయిటర్ కాఫీ తెచ్చాడు. ఇద్దరు తాగటం మొదలు పెట్టారు. ఇందు అయితే తొందరగా తాగి భయటపడలని ఆత్రంగా తాగుతోంది.

సురేష్ వెయిటర్ ను పిలిచి "కొచెం సాల్ట్ తీసుకురా" అన్నాడు.

అంతే చుట్టూ ఉన్నా అందరు వారి వైపే చూశారు. వెయిటర్ "ఏంటి సార్ ! కాఫీ లోకి  సాల్ట్ కావాలా? " అన్నాడు ఆశర్యంగా నవ్వుతూ.

ఇందు సిగ్గుతో తలదించుకుంది.

సురేష్ వెయిటర్ వంక కోపంగా చూసి "అవును సాల్టే తీసుకురా" అన్నాడు.

ఇందు కోపంగా  చూసి "కాఫీ లో సాల్ట్ ఏంటి? సంబంధం లేకుండా" అంది.

"మాది సముద్రం పక్కన ఉండే ఇల్లు. చిన్నప్పుడు మా కుటుంబం, స్నేహితులు  అంత కలిసి సముద్రంలో ఆడుకునే వాళ్ళం. కాని ఒకనాడు సునామి వచ్చి మా ఇల్లు ను ముంచేసింది. మా అమ్మ, నాన్న, స్నేహితులు ఎవరు మిగల లేదు. నేను ఇక్కడే మా అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాను ఆ సమయంలో.  అప్పటినుండి మా వాళ్ళ జ్ఞాపకార్ధంగా నాకు ఎంతో ఇష్టమయిన కాఫీలో ఉప్పు కలుపుకుని తాగుతున్నాను" అన్నాడు కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా.

ఇదంతా విన్నా ఇందు మనసు  తల్లడిల్లి పోయింది. "ఇంత మంచి వాడి గురించ? ఎందుకు వచ్చానో అని  భాదపడింది! అసలు ఇలాంటి సున్నిత మనస్కులు ఇంకా ఉన్నారా?" అని ఆశ్చర్య పోయింది.

అతని సున్నితత్వం, మంచితనం ఆమెను కదిలించాయి. ఇద్దరు చెట్ట పట్టాలేసుకుని తిరగటం మొదలయింది. దానితో పాటు వారి మధ్య ప్రేమ పెరిగి పెద్దదయి  పెళ్ళికి దారి తీసింది.

ఇందు, సురేష్ కు ఇష్టమయిన సాల్ట్ కాఫీ ఇవ్వటంతోనే సురేష్ రోజు ప్రారంభం అయ్యేది. ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండేవారు. ఏ ఒక్కరోజు కూడా చిన్న మాట అనుకుని ఎరుగరు. అలా వారి కాపురం సాపిగా సాగి ముసలి వారు అయిపోయారు.

కొద్ది రోజులకు సురేష్ ఆరోగ్యం బాగాలేక కన్ను మూసాడు. అయితే అతని డైరీలో ఒక్క ఉత్తరం భయట పడింది. దాన్ని విప్పి చదవటం మొదలు పెట్టింది ఇందు.

"నా ఇందు! నిన్ను వదిలి వెళ్ళినందుకు నన్ను క్షమించు. కాని నేను ఇప్పుడు  చెప్పే నిజం వింటే నువ్వు నన్ను క్షమిస్తావో లేదో తెలియదు. నాకు కాఫీ అంటే ఇష్టం లేదు. అందులోను  ఉప్పు కలిపినా కాఫీ అస్సలు ఇష్టం లేదు. ఆ రోజు కాఫీ షాప్ లో కంగారులో నేను షుగర్ అనబోయి సాల్ట్ అన్నాను. అప్పుడు నువ్వు ఇబ్బందిగా సిగ్గుపడటం  చూసి, నన్ను వదిలి పోతావని అర్ధం అయింది. అందుకే నిన్ను దూరం చేసుకోవటం ఇష్టం లేక అప్పటికప్పుడు ఒక కట్టు కథ అల్లాను, నిన్ను ఇంప్రెస్ చేశాను. మా వాళ్ళు సునామీలో చనిపోవటం నిజమే కాని నేను ఉప్పు కాఫీ తాగటం అబద్దం. "

ఇందు కళ్ళు ఉత్తరం వెంట పరుగు పెడుతున్నాయి, కన్నీటి  ధార మాత్రం  ఆగటం లేదు.

"ఎప్పటికప్పుడు నీకు నిజం చెప్పాలనుకుని నన్ను ఎక్కడ వదిలి పోతావో అని చెప్పలేక పోయాను. పెళ్ళి అయిన తర్వాత నాకు కాఫీ ఇస్తూ, నువ్వు గర్వంగా ఫీల్ అవ్వటం గమనించి దాన్ని నీకు దూరం చేయటం ఇష్టం లేక అలాగే ఆ అబద్దాన్ని నిజంగా నిలబెట్టాను. కాని బంగారం నా ప్రేమ మాత్రం అబద్దం కాదు.  నేను తాగే  ఉప్పు కాఫీ నువ్వు ఇచ్చింది అని తలచు కోగానే తియ్యగా మారి  పోయేది. నిజం రా,  నీ మిద ఒట్టు. ఈ పిచ్చివాణ్ణి అసహ్యించు కోకుండా క్షమిస్తావు కదూ?"

అది చదివినా ఇందు గుండెలు అవిసేలా ఏడ్చింది. తన సంతోషం కోసం ఇన్నాళ్ళు ఇంత భాధను తియ్యగా మార్చుకున్న ఒక గొప్ప ప్రెమికుణ్ణి పొందినందుకు గర్వంతో పొంగి పోయింది ఆమె మనసు. అప్పటి నుండి తను కూడా  ఉప్పు కలిపినా కాఫీ తాగటం మొదలు పెట్టింది.

ఎవరయినా "ఉప్పు కలిపినా కాఫీ ఎలా ఉంటుంది" అని అడిగితె

"చాల తియ్యగా ఉంటుంది" అని చెప్పేది.

మనసులో మాత్రం "నా సురేష్ తియ్యని ప్రేమ నాతొ ఉండగా, ఎ ఉప్పు నాకు చేదు కాదు" అనుకునేది.

(సమాప్తం)

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

టెక్నాలజీ (హాస్యం) - 3

(రెండవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రమణి కి ఐ ఫోన్ రావటంతో కొత్తగా రెక్కలు  వచ్చినంత ఆనందంగా ఉంది. ఆ ఫోన్ ఎప్పుడు తనతో పాటు ఉండాల్సిందే, ఎప్పుడు పేస్ బుక్ లో అప్డేట్ పెట్టాల్సిందే. ఇంట్లో ఏది వండినా, దాని  రుచి ఎలా ఉన్నా  పేస్ బుక్ లో పిక్చర్ పెట్టి,  పిండం పెట్టేవారు కాకుల కోసం ఎదురు చూసినట్లుగా,  లైక్ ల కోసం ఎదురు  చూడటం అలవాటు చేసుకుంది. 

పొద్దున్న బెడ్ మిద నుండి లేవటం తోనే ఫోన్ చెక్ చెయ్యటం, "గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్" అని మెసేజ్ పెట్టి కాని పనులు మొదలు పెట్టదు. 

"అన్ని సార్లు పేస్ బుక్ అప్డేట్ లు పెట్టి,  పిక్చర్ లు అప్లోడ్ చెయ్యటానికి, నువ్వేమన్న కాజల్, కత్రినా, సామంత అనుకుంటున్నావా?" గోవిందు కోపం లోను వెటకారం ఒలక పోశాడు. 

"అబ్బో! మీ మొహానికి నేనే ఎక్కువ? ఇంకా హీరోయిన్ లు కూడా కావాలా?" రమణి మూతి మూడు వంకరలు తిప్పింది. 

"నీలాంటి బుర్ర తక్కువ ఉన్నవాళ్ళకు ఎలా చెప్పితే అర్ధం అవుతుంది. ఇంటర్నెట్ లో ఫోటో లు పెట్టడం మంచిది కాదు అంటున్నా" 

"నిజమే మీరు చాల తెలివయిన వారు అందుకే నన్ను చేసుకున్నారు. నేను తెలివితక్కువదన్ని  కాబట్టే మిమల్ని చేసుకున్నాను"

"నేను ఎం మాట్లాడితే నువ్వేం మాట్లాడుతున్నావ్?  రైతు బజార్ వెళ్ళిన కూడా చెక్ ఇన్ చేసి, కూరగాయల రెట్లు అప్డేట్ పెట్టాలా?"

"పది మందికి తెలుస్తుందని, వారు కొనుకునేటప్పుడు బేరం అడి తీసుకుంటారని. రైతు బజార్ వెళ్ళేది నేను, కష్టపడి టైపు చేసేది నేను, మధ్యలో మీకు వచ్చిన కష్టం ఏంటి అంట?"

"నిన్ను అందరు పిచ్చి పీనుగు అనుకుంటారు"

"ఇప్పుడు కొత్తగా అనుకునేదేమిటి. మిమల్ని పెళ్ళి చేసుకున్నపుడే అనుకున్నారు" 

భార్యతో వాదించే శక్తి లేక, తనను ఒప్పించలేక  ఆఫీస్ కు వెళ్ళి పోయాడు గోవిందు. 

మరోసారి పేస్ బుక్ ఓపెన్ చేసిన రమణికి తన ఫ్రెండ్ విజయ  అప్డేట్ కనిపించింది "ఫీలింగ్ వేరి సాడ్" అని. వెంటనే తనకు ఫోన్ చేసింది. 

"మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళె, ప్రేమంటే ఏమిటో తెలీదే. ఈడు  కూడా ఇంతే" అని కాలర్ టోన్ మోగిన కొద్దిసేపటికి ఫోన్ ఎత్తింది విజయ. 

"ఎయ్ విజి! నీ పేస్ బుక్ అప్డేట్ చూశాను. ఎం అయిందిరా" రమణి ఆత్రంలోను ఆప్యాయత ఒలక పోసింది. 

"మా అయన ఉన్నాడే పరమ అనుమానం పీనుగు. చెపితే చిదరించు కుంటావ్" విజయ గొంతు కోపంతో రగిలి పోయింది. 

"అలాగే చిదరించు కుంటాను గాని ముందు ఎం జరిగిందో చెప్పు" 

"మా పక్క అపార్ట్ మెంట్ లోకి ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ దిగింది. రాగానే మా అయన తో ఆ నార్త్ అయన బాగా కలిసి పోయాడు. నేను కూడా వాళ్ళావిడతో బాగానే కలిసి పోయాను. నిన్న ఎం మాయ రోగం పుట్టిందో ఆ నార్తోడికి, మా ఆయనకు మెసేజ్ పెట్టాడంట" 

"ఏమని!"

"ఐ యాం వేరి సారీ, ఐ యాం యుసింగ్ యువర్ వైఫ్ డే అండ్ నైట్. సారీ ఫర్ ది ట్రబుల్ అని. అది చూడగానే మా అయన కారం తిన్న కోతిలా చిందులేస్తూ నన్ను తిట్టటం మొదలు పెట్టాడు" 

"ఏమని!"

"వాడు నిన్ను యూస్ చేసుకుంటున్నడట! ఎందుకే! ఇలా నాకు ద్రోహం చేస్తున్నావ్ అని"

"తర్వాత?"

"ఏముంది! తర్వాత ఎప్పుడో మెసేజ్ చూసుకుని పొరపాటు తెలుసుకుని సారీ చెప్పాడు ఆ నార్త్ అయన. సారీ ! నేను చెప్పాలనుకున్నది వైఫై  కాని వైఫ్ అని స్పెల్లింగ్ మిస్టేక్  టైపు చేశానని"

"హా హా హా...లెక పొతే నీకు పడిపోయిన వాడు ఎవడబ్బా అనుకున్నాను, ఇంకా నేను" 

ఫోన్ కట్ అయ్యింది. 

రమణి వంట పని ముగించుకుని టివి ముందు కూర్చుంది. డోర్ బెల్ మోగటం తో  తలుపు తీసేసరికి గోవిందు. 

"ఏంటి ఇంత తొందరగా వచ్చేశారు ఆఫీసు నుండి" కుతులహలంగా అడిగింది. 

"మా మేనేజర్ గాడు, గో టూ హెల్ అన్నాడు. అందుకే వచ్చేశాను" గోవిందు నింపాదిగా చెప్పాడు. 

కొద్ది సేపటికి కాని అర్ధం కాలేదు రమణికి గోవిందు అంతర్యం. 

"ఈ చమత్కరలకేం తక్కువ లేదు.  వారెవ్వా డాట్ కామ్ లో  చూసి మంచి స్పెషల్ కూర చేశాను. చేతులు కడుకొస్తే వడ్డిస్తా"

"నీకు తెలిసిన వంటలతో శిక్షించటం సరిపోలేదా? ఎంత ఐ ఫోన్ ఉంటె మాత్రం, నెట్ లో కొత్త కొత్త వంటలు చూసి మరి కక్ష సాధించల?" 

"జోకులు ఆపి ముందు ముద్ద నోట్లో పెట్టండి"

"పెడుతా ఉండు. పెళ్ళి చేసు కోవటానికి రిస్క్ చేసిన వాణ్ణి పెళ్ళాం వంట తినటానికి రిస్క్ చెయ్యలేనా? ఛి ఛీ....ఇది వంట? పెంట  రుచికి ఎ మాత్రం తీసిపోదు"

"పెంట రుచి తెలిసినా మీకు నా వంట రుచి ఎం తెలుస్తుంది. పేస్ బుక్ లో దీనికి ఎన్ని లైక్ లు వచ్చాయో తెలుసా?"

"అడ్డమయిన పోస్ట్ లకు లైకు లు కొడితే, ఇలా అడ్డంగా మనకు కూడా  లైకు లు కొడుతారు. వాటిని పట్టుకుని వంట అదిరి పోయింది అంటే ఎలాగే?"

రమణి ఏమి మాట్లడకుండా అక్కడనుండి లేచి వెళ్ళి పోయింది.

ఒక్కరోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన గోవిందు తో రమణి "ఏమండి! ఈ రోజు ఎందుకో కాస్తా జ్వరం గా ఉంది. కొంచెం గిన్నెలు తొమ్మి కూరగాయలు కోసిస్తే వంట చేస్తా" అంది నీరసంగా.

"చాల్లే నువ్వు మరీను. నాకు ఆఫీసు లో భయంకరంగా ఉంది వర్క్. లంచ్ చేసే తీరిక కూడా లేదు. చాల అలసి పోయాను, అందుకే పడుకోవటానికి బెడ్ రూమ్ కు వెళ్తున్నా" అని చెప్పి నీరసంగా లోపలికి  వెళ్ళి పోయాడు గోవిందు.

రమణి చేసేది లేక ఓపిక తెచ్చుకుని పనిలో మునిగి పోయింది. గిన్నెలు అరగంటలో తోమేసి, తన ఫోన్ తీసుకుని ఏదో చూసి  బెడ్ రూం కు వెళ్ళింది. పాపం గోవిందు చాల అలసి పోయి, చిన్న పిల్లాడిలా పడుకున్నాడు, గురక పెడుతూ.

అది చూసిన రమణి కి  ఎక్కడలేని కోపం వచ్చింది. బలంగా గోవిందు చెంప చెళ్ళుమనిపించింది.  అదిరి పోయి ఇంత ఎత్తున ఎగిరాడు గోవిందు.

"ఎంటే! జ్వరం తో నీకు మతిగాని పోయిందా? నిద్ర పోతుంటే అలా చెంప పగుల గొట్టావ్" అన్నాడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.

"దొంగ నిద్రలు పొతే, ఇలాగే పగిలి పోతుంది" అంది రమణి ఆవేశంతో ఉగిపోతూ.

"నీకు కల గాని వచ్చిందా! లేక  మంత్రాలేమన్న వచ్చా? నేను నిద్ర పోవటం లేదని ఎలా చెప్పగలవ్"

"ఇంతోటి దానికి మంత్రాలూ రావాల? నీ వాట్స్ అప్ అప్లికేషన్ చూడు, లాస్ట్ సీన్ 1 మినిట్ బ్యాక్ చూపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరితోనో సొల్లేసి, నేను రాగానే గురక పెట్టి మరి నిద్ర పోతున్నావ్"

గోవిందు నోరు వెళ్ళ బెట్టి చూస్తూ ఉండి పోయాడు.  రమణి ఏడుస్తూ, లొ లోపల సంభర పడుతూ  వెళ్ళి పోయింది.

ఎప్పుడు ఎ రకంగా కొంప మునుగుతుందో, ఎలా దొరికి పోతానో తెలియక గోవిందు పిచ్చి వేషాలన్ని కట్టిపెట్టేసాడు. అక్కడ రమణి ఇంకా ఏదో నేర్చుకోవాలని అస్తమానం నెట్ లో కాలక్షేపం చేయసాగింది.

ఒకరోజు గోవిందు రమణి కి ఫోన్ చేసి "డార్లింగ్ నాకు ఈ రోజు ఆఫీసు లో కొంచెం పని ఎక్కువగా  ఉంది, రావటం లేట్ అవుతుంది. నువ్వు భోజనం చేసి పడుకో" అన్నాడు.

"సరే" అని ఫోన్ పెట్టేసినా రమణికి ఎప్పుడు లేనిది డార్లింగ్ అని అంత ప్రేమగా పిలుస్తున్నాడు అని అనుమానం వచ్చింది.

"పెళ్ళాని మొగుడు ప్రేమగా పిలిచేది తప్పు చేసినప్పుడు, లేదా తప్పుకు ఒప్పించాలనుకున్నపుడు" అని ధృడంగా నమ్మిన సగటు భార్య.

అలా అనుకోగానే తనలో టెక్నాలజీ భూతం ఒళ్ళు విరుచుకుని లాప్టాప్ ముందు కూర్చుంది. నెట్ లో సెర్చ్ చేసి,  ఏదో చదవసాగింది.

కొద్దిసేపటికి "గోవిందు నువ్వు అయిపోయావ్" అని బిగ్గరగా అరిచింది సంబరంగా. తర్వాత లాప్టాప్ లో ఏదో తెలుసుకుని  భర్తకు ఫోన్ చేసింది.

"ఏమండి! ఆఫీసు లో పని చాల ఎక్కువగా ఉందా? ఎంత లేట్ అవుతుందో తెలియటం లేదా?" అడిగింది ప్రేమగా జాలి పడుతూ.

పెళ్ళాం ప్రేమ చూసి గోవిందుకు ఎక్కడో అనుమానం మొదలయింది. ఈ రోజు ఏ రకంగా హింస పెడుతుందో అని లోపల భయపడుతూ, పైకి మాత్రం "పని ఎక్కువ ఉంటె మాత్రం, నువ్వు ఆరుస్తావ? తిరుస్తావ? టీవీ చూస్తూ ఇంట్లో కూర్చోక, నీకు ఎందుకు చెప్పు" అని మందలించాడు.

"అవును నేను ఇంట్లో టీవీ ముందు కూర్చుని పిచ్చి దానిలాగా సీరియల్స్ చూస్తుంట. అక్కడ నువ్వు పబ్ లు,  బార్లు తిరుగుతు  ఉండు" రమణి గొంతులో వెటకారం, కోపం, అసహ్యం అన్ని నిండుగా, దండిగా పలుకుతున్నాయి.

గోవిందు కు సాయంత్రమే చుక్కలు కనిపించాయి. "తను ఆఫీసు లో లేని విషయం, పబ్ కు వచ్చిన విషయం ఈ తింగరి దానికి ఎలా తెలిసాయి" అనుకుని  ఇలా బుకయించాడు "చీకట్లో బాణం ఎస్తె తగలదమ్మా లేడి డిటెక్టివ్. నేను నిజంగానే ఆఫీసులో ఉన్నాను" అని కామెడీ మూడ్  లోకి రప్పించాలని చూస్తున్నాడు.

"చీకట్లో బాణం వేసేది నీలాంటి పల్లెటూరి గబ్బిలాలు. నాలాంటి టెక్నికల్ పర్సన్స్ కాదు. నీ ఐ ఫోన్ ఎక్కడ ఉందొ తెలుసుకోవటానికి ఒక చిన్న సాఫ్ట్వేర్ చాలు. దానితోనే నీ గుట్టు బయట పెట్టా" రమణి గొంతులో గర్వం తోనికిసలాడింది.

గోవిందుకు మందు తాగకుండానే మత్తు ఎక్కినా భావన. అలాగే కూర్చిలో కుప్ప కూలి పోయాడు.

వాట్స్ అప్ లో రమణి మెసేజ్ "ఆడిన నాటకాలు చాలు. తొందరగా ఇంటికి రా". అది చూడగానే ఎవరికి  చెప్పకుండా ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి బయలు దేరాడు నేరుగా.

(అయిపొయింది)

24, సెప్టెంబర్ 2014, బుధవారం

ఆగడు! దూకుడు? (హాస్యం)

(ఈ మధ్యే రిలీజ్ అయిన ఆగడు చిత్రం పై కాస్త వెటకారంగా రాసిన చిన్న ప్రయత్నం)

యాంకర్: శ్రీను గారు ఆగడు సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. 

వైట్ల: చాల హ్యాపీ గా ఉంది. మళ్ళి ఇండస్ట్రీ కి ఒక బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చినా ఘనత దక్కినందుకు నిజంగా వెరీ హ్యాపీ. 

యాంకర్: ఈ మధ్య అన్ని సినిమాలు మొదటి రోజే బ్లాక్ బ్లాస్టర్ అవుతున్నాయి. రెండో రోజు నుండి డిసాస్టర్ అవుతున్నాయి. 

వైట్ల: పబ్లిసిటీ తో లేపుతాం. అందుకే గా ఇంటర్వ్యూ కి వచ్చింది. 

యాంకర్: మీ సినిమాలో డైలాగ్ ఉంది, కంటెంట్ లేక పొతే పబ్లిసిటీ అవసరం అని.  అది దీనికి వర్తిస్తుందా?

వైట్ల: కలెక్షన్స్ ప్రభావం జనాల మీద ఎంత  ఉంటుందో  తెలియదు కాని పబ్లిసిటీ ప్రభావం మాత్రం గట్టిగా ఉంటుంది. 

యాంకర్: డైలాగులు మరి ఎక్కువ అయిపోయాయి అని టాక్. దీనికి మీరేం అంటారు. 

వైట్ల: అంటే ! నా పాత టీం గొడవ పడి వెళ్ళి పోయాక, నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలని పంచ్  డైలాగులు విపరీతంగా రాసేసాను. 

యాంకర్: డైలాగుల మీద పెట్టిన శ్రద్ధ స్టొరీ మిద పెడితే బాగుండేది అంటున్నారు. 

వైట్ల: కథ లేదని ఎవరు చెప్పారు. ఇందులో ఒక మంచి సెంటిమెంట్ థ్రెడ్ ఉంది. 

యాంకర్: కాని ఆ థ్రెడ్ అంత గట్టిగా, కొత్తగా లేదని టాక్. 

వైట్ల: నా ముందు సినిమాలు చూస్తే మీరు ఇలా మాట్లాడరు. డీ, రెడీ, కింగ్, దూకుడు ఇవ్వని ఒకే రకం కథలు. ఇప్పుడు కొత్తగ కొత్తగా లేదని అంటూంటే నాకంత కొత్తగా ఉంది,  పరమ చెత్తగా ఉంది. 

యాంకర్: సార్ ఒక పంచ్ డైలాగ్ చెప్పేశారు నాకు.   

వైట్ల: పంచ్ డైలాగులు ఎముందమ్మ,  అవి రాయటం పరమ ఈజీ.  జస్ట్ రైమింగ్, కాస్త టైమింగ్ పంచ్, డైలాగు రెడీ. 

యాంకర్: ఒక్క డైలాగు చెప్పండి సార్. 

వైట్ల: దాహం వేస్తె నీరు తాగు,  వేడిగా  ఉంటె బీరు తాగు. అంతే కాని పేదల కన్నీరు తాగితే, నీ  రక్తం తాగుతా. 

యాంకర్: వావ్! పంచ్ రాయటంలో మీకు మీరే సాటి, లేరు ఎవరు పోటి. సినిమాల మిద పంచ్ డైలాగులు బాగా రాసినట్లు ఉన్నారు. 

వైట్ల: బేసిక్ గా నాకు పంచ్ అంటే ప్రాణం. పంచ్ కోసం సినిమాలను, పక్కవాళ్ళను విచ్ఛల విడిగా వాడేస్తుంటా. అదే బాగా వర్కౌట్ అయ్యింది. 

యాంకర్: మహేష్ కు ఏమని చెప్పి ఈ స్టొరీ ఒప్పించారు. 

వైట్ల: ముందు  ఆగడు అని  టైటిల్  చెప్పాను. దాంతో సగం ఒప్పుకున్నాడు బాబు. తర్వాత నాలుగయిదు పంచ్ డైలాగులు చెప్పాను. 

యాంకర్: టైటిల్ చెప్పగానే ఎందుకు ఒప్పుకున్నాడు సార్?

వైట్ల: బాబు సినిమాలు ఒక్కసారి చూడండి, మురారి,  ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, ఆగడు. బాబు కు మూడు అక్షరాలు కలిస్తే బాక్సాఫీస్ కు మూడినట్లే . 

యాంకర్: టైటిల్ చూసి టెంప్ట్ అవ్వకపోతే ఈ సినిమా ఖచ్చితంగా చేసేవాడు కాదేమో మహేష్. 

వైట్ల: మీకెందుకు అలా  అనిపించింది. 

యాంకర్: దూకుడు సినిమానే మీరు మళ్ళి తీస్తున్నారని తెలిసి పోయేది కదా!

వైట్ల: నా సినిమాల నుండి జనం అదే కోరుకుంటారు. అందుకే అవే  తీస్తున్నా. 

యాంకర్: అంతే లెండి. మనకు చేతగాని పని చెయ్యకూడదు. వచ్చిన పని  ఆపకూడదు. 

వైట్ల: అంటే! నాకు అర్ధం కాలేదు. 

యాంకర్: ఉరికే,  పంచ్ డైలాగ్ ట్రై చేశాను సార్. 

 వైట్ల: ఎయ్ నువ్వు ఎసేసావ్. 

యాంకర్: ఇందులో బ్రహ్మానందం క్యారెక్టర్ అంత బాగా లేదనిపించింది. 

వైట్ల: ఈ మధ్య బ్రహ్మానందం గారి కామెడీ  జనానికి ఎంత అలవాటయి పోయిందంటే, దాహం వేస్తె మంచి నీళ్ళు తాగినంత. 

యాంకర్: పంచ్ ల రూపంలో కాకుండా మాములుగా చెప్పండి సార్!

వైట్ల: అయన ఎంత కామెడీ చేసిన నవ్వు రానంతగా జనానికి ఎక్కేసారు అంటున్నా.  

యాంకర్: ఇదేదో కొత్త లాజిక్ లాగా ఉంది సార్. మహేష్ అభిమానులు మిమల్ని గట్టిగా ఎసుకున్నట్లు ఉన్నారు. 

వైట్ల: వారు చాల హ్యాపీ గా ఉన్నారు. మహేష్ ను 100% వాడుకున్నాను ఈ సినిమాలో. 

యాంకర్: నిజమే. పాపం అయన మీపై పెట్టుకున్న నమ్మకాన్ని 100% వాడుకుని మీకు తెలిసినా పరిధిలో ఒక బ్లాక్ బ్లాస్టర్ తీసి పారేసారు. సినిమా కూడా తొందరలోనే తిసేసేలా ఉన్నారు థియేటర్స్ లోంచి. 

వైట్ల: ఈ రోజుల్లో 50 రోజులు, 100 రోజులు ఎక్కడ ఆడుతాయి. వారం ఆడితే డబ్బులు వచ్చేస్తాయి. 

యాంకర్: యాడాది మొత్తం మెపిన పుంజు ఫస్ట్ దెబ్బకు పడిపోయినట్లు , మొదటి వారానికే తిరిగి వచ్చేసింది. 

వైట్ల: అయితే మీరు చెప్పండి! వాట్ టూ డు వాట్ నాట్ టూ డు? 

యాంకర్: ఈ మధ్య మన హీరోలందరూ గజినిలు అయిపోతున్నారుల ఉంది సార్. 

వైట్ల: దెనికమ్మా?

యాంకర్: అందరు తీసిన సినిమాలే మళ్ళి మళ్ళి తీస్తున్నారు. ఎన్టీఆర్ రభస అని చెప్పి బృందావనం తీసాడు. రవితేజ పవర్ అని చెప్పి విక్రమార్కుడు తీసాడు. మహేష్ ఆగడు అని చెప్పి దూకుడు తీసాడు. వీళ్ళకు మతి మరుపు వచ్చిందా? లేక మేము ఎం తీసినా చూస్తారు అని ఓవర్ కాన్పిడేన్సా? 

వైట్ల: మీరు మీ ఇంటికి ఎలా వెళ్తారు. నా ఉద్దేశ్యం ఎ రూట్ లో అని. 

యాంకర్: నేను ఉండేది కూకట్ పల్లి కాబట్టి. సోమాజిగూడ నుండి వెళ్ళాలంటే పంజాగుట్ట, అమీర్ పెట్ ఈ రూట్ లో వెళ్తాను. 

వైట్ల: అంటే వేరే రూట్ లేదా? 

యాంకర్: నాకు బాగా తెలిసినా దారి రిస్క్ ఉండదు అని వెళ్తాను. 

వైట్ల: సినిమా కూడా అంతే. తెలిసినా కథ, హిట్ అయినా కథ తీస్తే రిస్క్ తక్కువ, అందుకే అలా తీస్తాం. 

యాంకర్: సినిమాల్లో అప్డేట్ అవ్వండ్రా! అని డైలాగ్ రాస్తారు కాని మీరు అప్డేట్ అవ్వరన్న మాట. 

వైట్ల: ప్రతి వాడికి  కొత్తధనం, వెరైటి అని చెప్పటం ఫాషన్ అయిపొయింది. 

యాంకర్: డైరెక్టర్ కి సినిమా మీద ఉండాల్సింది కమాండ్ కాదు పాషన్ అని ఎప్పుడు తెలుకుంటారో. 

వైట్ల: నువ్వు డైలాగ్ ఎస్తె పంచ్ వెయ్యటానికి నాకు మూడ్ లేదు గాని. వస్తా. 

(అధ్బుతమయిన నటుడు మహేష్ తో హిట్ సినిమా తియ్యలేదు  అంటే ఆ డైరెక్టర్ వర్త్ లెస్ అన్న అయి ఉండాలి లేదా తగిన పరిశ్రమ అయిన చెయ్యకుండాలి. ఒపెన్ హార్ట్ విత్ RK ప్రోగ్రాం లో వైట్ల శ్రీను చెప్పిన మాటలివి. మహేష్ చేసిన అభినయం ముందు సినిమాలో లోటుపాట్లు పెద్దగా తెలియలేదు. కాని సినిమాకు కావలసిన అసలు మూడి సరుకు కథను  విస్మరిస్తే నవ్వులు ఉన్నా నవ్వులపాలు అవుతుంది అని మరోసారి రుజువు అయింది.)

టెక్నాలజీ (హాస్యం) - 2

(మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

గోవిందు ఆఫీసు లో బాస్ తో తన అప్రైసల్ గురించి ధీనంగా మొర పెట్టుకుంటున్నా సమయం లో "డిస్తుర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, కల్లో కోస్తున్నాడు రేతిరంతా ఇడు" అని రింగ్ టోన్ తో ఫోన్ మోగింది,  బాస్ మూడ్ చెదిరింది. 

"నేను మాట్లడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి, ఇంకా ఏది పని చేసినా నీకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఉండదు" అని బలంగా నమ్మే ఆ మేనేజర్ మనోడ్ని తినేసేలా చూశాడు.  

"నాకు వేరే పనుంది తర్వాత మాట్లాడుదాం" అని మొఖం మీద క్యాబిన్ తలుపెస్తుంటే బిక్క మొఖం వేసుకుని బయటకు వచ్చాడు గోవిందు. ఆ టైం లో ఫోన్ చేసినా అడ్డ గాడిద ఎవడ్రా అని చూస్తే భార్య రమణి. 

కోపం నషాళానికి అంటుకుంది. "ఏంటే! ఏదో కొంపలు మునిగి పోయినట్లు ఈ టైం లో చేశావ్?" అన్నాడు మండి పడుతూ. 

"ఈ టైం లో చెయ్యకూడదు అని మీ ఆఫీసు లో రూల్ ఏమయినా ఉందా?" అంది అమాయకంగా రమణి. 

"పంచ్ లు వెయ్యటం ఆపి ముందు అసలు సంగతి ఏడువు" 

"విండోస్  ఓపెన్ కావటం లేదు. అందుకే మీకు చేశాను"

"ఎంటే ! విండోస్ ఓపెన్ కాకపోయినా నాకు ఫోన్ చేసేస్తావా? ఏదో కాస్త కొబ్బరి నూనో లేక మంచి నూనో వేస్తె సరిపోయేదానికి, నాకు ఫోన్ చేస్తే నేనేం చేస్తాను ఆఫీసు లో ఉండి?"

"ఆ మాత్రం మాకు తెలియక కాదు. ఏ బొక్కలో వెయ్యాలో తెలుసుకుందామని ఫోన్ చేశాను. లేక పొతే, ముందు చెప్పేది వినండి" వెటకారంగా గద్దిస్తూ అంది రమణి. 

"బొక్క తొక్క అని బూతులు మాట్లాడుతున్నావ్. అసలు ఓపెన్ కానివి ఏ విండోస్? బెడ్ రూమ్, కిచెన్ దా? లేక కిచెన్,  హాల్ దా?" అసహనం పెరిగి పోతోంది గోవిందు లో. 

"రెండు కాంబినేషన్స్ కాదు. మీ లాప్టాప్ లో ఓపెన్ కావటం లేదు. ఎం చెయ్యాలో చెపుతారని ఫోన్ చేశాను. నూనె వెయ్యమంటారా? ఇప్పుడు" 

"ఓరి దేవుడోయ్. నీ కాళ్ళు  పట్టుకుంటాను. దయచేసి దాంట్లో ఏ  నూనే వెయ్యకే తల్లి" గోవిందు కంగారులో  గట్టిగా అరిచేసరికి సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకొచ్చారు. వారికి సర్ది చెప్పి పంపేశాడు. 

"మరి అంత దద్దమ్మలాగ కనిపిస్తున్నానా? ముందు ఇది ఎందుకు రావటం లేదో చెప్పు" రమణికి అవమానంగా ఉంది. 

"నువ్వు ఎంత దద్దమ్మవో నీకు తెలిసినంత నాకు తెలియదు గాని, దాంట్లో బ్యాటరి అయిపోయి ఉంటుంది ఛార్జింగ్ పెట్టు" అన్నాడు గోవిందు వెక్కిరిస్తూ. 

రమణి తలపట్టుకుంది. ఇంత చిన్న విషయం తనకు తట్టలేదే అని.

"కంప్యూటర్ డీగ్రీ హోల్డర్ అయినా తనను కంట్రీ లేడీ లాగ చూస్తున్నాడు. ఎలాగయినా ప్రూవ్ చెసుకుని ఐ ఫోన్ కొనిపించుకోవాలి" అనుకుంది మనసులో. 

అప్పటినుండి  రోజు కంప్యూటర్ లో ఏది పడితే అది కేలకటం,  గోవిందు సాయంత్రం బాగు చెయ్యటం.

ఏజ్ బార్ అవుతున్నా టీచర్ గ్రూప్ పరిక్షలకు  ప్రిపేర్ అయ్యేంత సీరియస్ గా, న్యూస్ పేపర్లలో, వార పత్రికలలో కంప్యూటర్ గురించి వ్యాసాలు చదువుతూ బాగా నాలెడ్జ్ పెంచ సాగింది.

అది చూసి గోవిందు "మరి అంత కష్ట పెట్టకు మెదడును. ఏదయినా అయితే నేను చావాలి మళ్ళి" అన్నాడు.

"మీకే అర్ధం కాగా లేనిది! నాకు అర్ధం కదా?" అంది రమణి వెటకారంగా.

"అది కాదె. పాపం ఎప్పుడు అలవాటు లేని పని చేస్తే ఎవరికయినా కష్టం కదా! ఎప్పుడు వాడని నీ మెదడును ఇప్పుడు విపరీతంగా వాడి ఇబ్బంది పెడితే, చితికి పోయి నీకు మతిపోతే ఎలా?" అని గట్టిగా నవ్వాడు.

రమణి చిన్నబుచ్చుకుని లాప్టాప్ లో మునిగి పోయింది.

భార్య ఉత్సాహం చూసి గోవిందు కు ముచ్చటేసింది. ఒక్క రోజు ఏదో వెబ్ సైట్  దొరికితే  తనకు  ఫోన్ చేశాడు. 

"నీ తెలుగు కంప్యూటర్ పాఠాలు ఎన్ని సార్లు చదివినా దండగే కాని, నాకు  బేసిక్స్ మీద  ఒక వెబ్ సైట్ దొరికింది. దాన్ని కూడా చదువు ఒక్కసారి" అన్నాడు గోవిందు. 

తానూ డీగ్రీ లో సి లాంగ్వేజ్ కు తెలుగు లో కోచింగ్ పోయినా విషయం అంతరాత్మ గుర్తు చేసినా అణగదోక్కేసాడు. 

"అలాగే చదువుతాను, మెయిల్ చెయ్యండి" అంది రమణి  ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లా. 

"మెయిల్ చెయ్యటం దేనికి. ఫేవరెట్స్  లో పెట్టాను. క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ లింక్ క్లిక్ చెయ్"

"మీ ఆఫీసు సిస్టం లో ఫేవరెట్స్ లో పెడితే నాకు ఎందుకు కనపడతుంది!"

"క్రోమ్ లో ఉన్నది నా లాగిన్ కాబట్టి, నేను ఎ సిస్టం  లో ఏది పెట్టినా, చూసినా అన్ని సిస్టమ్స్ లో కనబడుతుంది" గోవిందు గొంతులో గర్వం, భార్య ముందు తన ప్రతిష్ట పెరిగిందన్నా సంభరం. 

రమణి కుతుహాలంగా ఓపెన్ చేస్తే, గోవిందు పెట్టిన సైట్ లింక్ ఉంది. సంబరంగా అనిపించింది తనకు. రెట్టించిన ఉత్సాహంతో చదవటం మొదలుపెట్టింది. 

ఒక వారం  తర్వాత-ఆఫీసు లో ఉన్నా గోవిందు ఫోన్ మోగింది "రారా వస్తావా అడిగింది ఇస్తావ". ఎవరా? అని చూస్తే తన  భార్య. ఒక నిట్టూర్పు విడిచి ఫోన్ ఎత్తాడు. 

"ఎం చేస్తున్నారండి?" నెమ్మదిగా అడిగింది. 

"కంప్యూటర్ లో కర్ర బిళ్ళ ఆడుతున్నా.  అసలే ఆఫీసు లో చచ్చేంత వర్క్ ఉంటే నీ గోలేంటి" గోవిందు గింకరించాడు. 

"కంప్యూటర్ లో మీరు ఎం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. క్రికెట్ మ్యాచ్ లైవ్ చూస్తూ, చచ్చేంత పని అని మేనేజర్ ముందు కొట్టే పోజులు,  నా ముందు కొడుతున్నారు"  రమణి గొంతులో వెటకారం. 

"అందుకే చెప్పేది. మెదడుకు లేని పోనీ కష్టాలు పెట్టి మతి పోగొట్టుకోవద్దు అని. క్రికెట్ చూస్తున్నానని ఉహించుకొంటున్నావా?" అన్నాడు గోవిందు గొంతులో జాలి ఒలకబోస్తూ.

"బూకయించాలని చూడకు. నేను నీ  క్రోమ్ లో హిస్టరీ చూస్తున్నా" అంది గద్దిస్తూ.

గోవిందుకు విషయం లీలగా అర్ధం అవుతోంది,  "ఈ తింగరిది కక్కుర్తికి పోయి  క్రోమ్ గురించి కూడా చదివినట్లు ఉంది" అనుకుని "నేను ఆఫీసు లో చూస్తే ప్రాబ్లెమ్  ఏంటి" అన్నాడు బెట్టుగా.

"చిఛీ! ఇంట్లో ఎలాగు టీవీ ముందు కూర్చుని మాట ముచ్చట లేకుండా అదే క్రికెట్ గోల, ఆఫీసు లో కూడా అదే పనిగా క్రికెట్ చూస్తూ, నాకు ఇంక్రిమెంట్ రావటం లేదు అని ఎంత ఏడిస్తే మాత్రం ఎవడు ఇస్తాడు" రమణి రెచ్చి పోతోంది. 

"పని చేస్తూ మధ్య మధ్య లో చూస్తున్న. అందరు చేసే పనే" గోవిందు సమర్థించు కుంటున్నాడు.

"అందరు ఎన్నో చేస్తారు. అలా అని మీరు చేస్తారా? సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఎప్పటికయినా అమెరికా వెళ్ళచ్చు అని పెళ్ళి  చేసుకుంటే, ఉద్యోగం ఉడగొట్టు కుంటున్నాడు"  రమణి ఎడుస్తూ ఫోన్ పెట్టేసింది.

"మెయిల్ పెట్టండి అన్నప్పుడు మూసుకుని పెట్టచ్చుగా. పెద్ద పొటుగాడిలా దానికి లేని పోనీ నాలెడ్జ్ ట్రాన్స్ ఫర్ చేశాను. అందుకే, అతిగా ఎవడికి నాలెడ్జ్ షేర్ చెయ్యకూడదు. రేపు మన జాబు  కె ఎసరు పెడుతారు" మనసులో అనుకుని ఆఫీసు నుండి మొబైల్ షాప్ కు బయలుదేరాడు ఐ ఫోన్ కొనటానికి. అలాగయిన భార్య శాంతిస్తుందని. 

(ఇంకావుంది)

(మూడవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

6, సెప్టెంబర్ 2014, శనివారం

టెక్నాలజీ (హాస్యం) -1

"గంట నుండి తిప్పుతున్నావ్ కాలనీ లో!  ఎక్కడ చుశావె ఇల్లు?" భార్యను విసుగు పడుతూ అడిగాడు గోవిందు. 

"ఇక్కడె  చూశానండి. ఆ ఇంటి పైన ఎర్ర చీర ఆరేసి ఉంది. నేను బాగ గుర్తు పెట్టుకున్నాను కూడ" రమణి గొంతులో గర్వం తోనికిస లాడింది. 

అది వినగానే గోవిందు మెదడు మొద్దుబారి పోయింది! భార్య తెలివికి పట్ట పగలే చుక్కలు కనిపించాయి. 

 "ఎర్ర చీర అరెసినా ఇల్లు అని గుర్తుపెట్టుకున్నవా! ఇంకా నయం నల్ల కాకి వాలింది అని  గుర్తు పెట్టుకోలేదు" అన్నాడు వెటకారంగా. 

"మా ఊర్లో ఇదే ఎక్కువ. అసలు అడ్రస్ గుర్తు పెట్టుకోవటం లో నేనే నెంబర్ వన్ మా ఫ్రెండ్స్ లో"  అంది నిష్ఠుర పడుతూ. 

గోవిందుకు కోపం నషాళానికి అంటి పోయింది. కార్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేక పొతే కోపంతో చిందులు వెసేవాడు.  చిరాకు తట్టుకోలేక-ఇప్పుడిప్పుడే ఉడి పోతూ, నెత్తి మిద బట్టతలకు పునాదులు వేస్తున్నా జుట్టును కసిగా పిక్కున్నాడు.  గుప్పెడు మందం ఉడి వచ్చేసింది ! అంతే కెవ్వుమని అరిచాడు.

"యిలా కాలు కాలిన పిల్లిలా కార్లో తిరగక పొతే ఆ బ్రోకర్ అబ్బాయికి ఫోన్ చెయ్యొచ్చు కదా!" ఉచిత సలహా పడేసింది రమణి.

"మీ ఊర్లో పిల్లులు కార్లో కూడా తిరుగుతయ్యా? అడ్రస్ గుర్తుపెట్టుకొనే తెలివి లేదుగాని సలహాలు ఇస్తోంది" అంటూ పట పట పళ్ళు నురాడు.

"పళ్ళు మరీ  అంత నూరకండి . అరిగిపోయి, విరిగి పోగలవు"  అంది రమణి దిగులుగా.

భార్య  నిజంగానే చెపుతోందో లేక తన మీద జోక్ లు వేస్తోందో తెలియక మళ్ళి జుట్టు పిక్కున్నాడు గోవిందు.

ఈ సారి రెండు గుప్పెళ్ళు ఉడి వచ్చింది జుట్టు. అది చూడగానే గోవిందు వెర్రిగా కేకేసి, కారు సడన్ బ్రేక్ వేసి ఆపేసాడు.

"జుట్టు పెరిగితే కటింగ్ చేసుకోవచ్చు కదా ! ఎందుకండీ అలా పిక్కుంటారు" అంది రమణి భాదపడుతూ.

గోవిందుకు ఏం మాట్లడాలో తెలియలేదు. తల బాదుకుంటూ "నాకు పిచ్చి లేచి  నిన్ను చేసుకున్నా" అన్నాడు భార్యతో.

"ఆ విషయం నేను అప్పుడే గ్రహించాను! కాని  మా అమ్మ నాన్న భాధపడుతారని ఎం  మాట్లాడలేదు" అంది  రమణి ఉడికిస్తూ.

భార్య మాటకారి తనానికి సంతోషపడుతున్నా పైకి కోపం నటిస్తూ బ్రోకర్ కు ఫోన్ చేశాడు.

"హూ అర్ యు, హూ అర్ యు" అని కాలర్ టోన్ మొదలయింది. "ఫోన్ ఎత్తితే కదరా తెలిసేది" అనుకుని వెయిట్ చేయ్యసాగాడు.

 లైన్ కట్ అవుతుందనగా  "హలో" అని వినబడింది అవతలి గొంతు.

"ఏంటయ్యా ఫోన్ ఎత్తటానికి ఇంత సేపు" అన్నాడు గోవిందు కాస్త చిరాకుగా .

"సార్!  కాలర్ టోన్ మహేష్ బాబు సాంగ్ వస్తుందా? ఇప్పుడే మార్చిన. మీరే ఫస్ట్ చేసిండ్రు" అన్నాడు ఆ బ్రోకర్ ఉత్సాహంగా.

తాను కూడా మహేష్ బాబు ఫాన్ కావటంతో సరిపోయింది. లేక పొతే తనకు వస్తున్నా కోపానికి మళ్ళి జుట్టు పిక్కునే వాడు.

"చాల బాగుంది. ఫోన్ చేసినవాడిని ఫోన్ ఎత్తకుండానే హూ అర్ యు  అనడం వెరైటిగా ఉంది. ఇంతకూ-పొద్దున మా ఆవిడకు చూపించిన ఇల్లు అడ్రస్ ఒకసారి చెపుతావ?" అన్నాడు  గోవిందు సౌమ్యంగా.

"మీ ఆవిడా ఎవరన్నయ్య" అన్నాడు బ్రోకర్ పోకిరి మహేష్ బాబుల.

"ఎంత మందికి చూపించావ్ ఏంటి ఈ రోజు ఇల్లు" అన్నాడు గోవిందు  వెటకారంగా.

"అవి మా బిజినెస్ సిక్రేట్స్  ఎవరికి చెప్పం. మీ డీటెయిల్స్ చెప్పండి ముందు" అన్నాడు నిర్లక్ష్యంగా.

"ఓరిని నీ సిక్రేట్స్ తగ్గలెయ్య. రేపటి నుండి నేను సాఫ్ట్వేర్ జాబు మానేసి నీకు పోటిగా ఇళ్ళ బ్రోకర్ అవుతానా? నీ ఉద్దేశ్యం" అని వాపోయాడు గోవిందు.

అయినా సర్దుకుని "అలాగే సార్! మా ఆవిడా పేరు రమణి. ఈ రోజు పొద్దున 11 గంటల ప్రాంతంలో మీరు తనకు ఒక ఇల్లు చూపించారు. దాని అడ్రస్ ఒక్కసారి చెప్పండి ప్లీజ్" అన్నాడు వెటకారంగా.

"అరె గా మేడమా?  అడ్రస్ పంపుతున్నా చూసుకొండ్రి"  అని ఫోన్ పెట్టేసాడు.

"అడ్రెస్స్ పంపాడు సరే ! కాని ఇంటికి దారి ఎలా కనుకుంటారు" అడిగింది రమణి కుతూహలంగా.

గోవిందు  గర్వంగా "ఐ ఫోన్ ఉండగా చెంత! ఎందుకు మీకు చింత?" అని ఫోన్ తీసాడు జేబులోంచి.

"ఇప్పుడు ఎవరికీ ఫోన్ చేస్తారు దారి కోసం" వెటకారం తోణికిసాలడింది రమణి గొంతులో.

"ఐ ఫోన్ కు ల్యాండ్ ఫోన్ కు తేడా తెలియని పల్లెటూరి గబ్బిలం. దారి నా ఐ ఫోన్ చూపిస్తుంది" అన్నాడు గోవిందు పరవశంగా.

"అబ్బో! మొబైల్ ఫోన్ లు మేము చూశాము. మరి వెటకారం కాకపోతే ఫోన్ ఎక్కడయినా దారి చూపిస్తుందా? మాట్లాడుతుంది కాని" అంది ఉక్రోషపడుతూ.

"చూడండి గబ్బిలం గారు. ఇది మొబైల్ ఫోన్ కాదు, ఐ ఫోన్. దీనితో ఏదయినా చెయ్యచ్చు" అన్నాడు గోవిందు వెక్కిరిస్తూ.

"ఐ ఫోనో లేక యు ఫోనో. ఏదయినా చెయ్యచ్చు అంటున్నారు కాద! వంట చెయ్యచ్చ దీనితో" రమణి గొంతులో హేళన కొట్టొచ్చినట్లు పలికింది.

"నువ్వు చేసే పెంట వంట ఎవరయినా చేస్తారు లే" గోవిందు కూడ ఎక్కడ తగ్గటం లేదు.

సమయం వచ్చినప్పుడు చెబుదాం లే అని ఉరకుండి పోయింది. ఐ ఫోన్ టేక్ లెఫ్ట్, టేక్ రైట్ అని చెపుతుంటే ఆశ్చర్యంగా చూస్తు ఉండి పోయింది రమణి.

అద్దె ఇల్లు చేరుకోగానే ముందుగా వంట ఇంట్లో కి దారి తీసింది రమణి. ఆ అపార్ట్ మెంట్ లో ఏది ఎ దిక్కో తెలియక తికమక పడసాగింది. అది గమనించిన గోవిందు విషయం అడిగాడు.

"వంట ఇల్లు వెస్ట్ లో ఉంటె వంట చేసే వారికి ఆరోగ్యం బాగుండదని మా అమ్మమ్మ ఎప్పుడో చెప్పినట్లు గుర్తు" అంది చిన్నగా భయపడుతూ.

"తినే వాళ్ళు బాగుండాలంటే ఏ   దిక్కు ఉండాలో చెప్పలేదా?" అడిగాడు గోవిందు ఆటపటిస్తూ.

తర్వాత జేబు లోంచి ఐ ఫోన్ తీసి కంపాస్ అప్లికేషన్ తో దిక్కులు గుర్తు పట్టి చెప్పాడు. అప్పుడు కానీ రమణి మనసు శాంతించలేదు.

భర్త చెప్పినట్లు ఇన్ని పనులు చేస్తున్నా ఐ ఫోన్ భాగ నచ్చింది రమణికి. ఎలాగయినా తాను కూడా ఒక్కటి కొనిపించు కోవాలని అనుకుంది. ఆ రాత్రే ఆ విషయం గోవిందుకు  చెప్పాలనుకుంది.

"ఏమండి! నాకు మీలాంటి ఫోన్ కొని  ఇవ్వండి" అంది గోముగా.

"ల్యాండ్ ఫోన్  వాడటం రాదు,  నీకెందుకు ఐ ఫోన్? ముందు కంప్యూటర్ నేర్చుకో తర్వాత ఐ ఫోన్ కొనుకోవచ్చు" అన్నాడు గోవిందు తప్పించుకుంటూ.

"కంప్యూటర్ కు ఫోన్ కు సంబంధం ఏంటి? నేను  బియాస్సి కంప్యూటర్ అని మార్చి పోయార?" అంది అసహనంగా రమణి.

"చాల్లే ఇంత వరకు మెయిల్ చెయ్యటం రాదు. మళ్ళి బియాస్సి కంప్యూటర్ అని డిగ్రీ ఒక్కటి. అసలు ఎప్పుడయినా కంప్యూటర్ ల్యాబ్ లో అడుగు పెట్టావ?" అన్నాడు గోవిందు హేళనగా.

ఇలా కాదు, ఈయనకు సరయిన డోస్ ఇస్తే గాని ఐ ఫోన్ కొనివ్వడు అనుకుంది మనసులో. గోవిందు మాత్రం అటు తిరిగి పడుకున్నాడు.


(ఇంకావుంది)

రెండవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

24, ఏప్రిల్ 2014, గురువారం

అడవిలో ధ్రువతారఆకాశాన ఉదయించే ద్రువతార
మహనీయుల జన్మకు ప్రతీకగా
అందమయిన పల్లెలో
పుట్టెను బాలుడు
ఎరుక కులంలో
అడవి పువ్వోలే
అందమయిన వాడు
పుట్ట తెనేలాగా తియ్యని
మనసున్న వాడు
అతనె  ఏకలవ్యుడు

వెటాడుటలో మహా నేర్పరి
అబ్యాసించుటలో మహా ఓర్పరి
పెరుగుతున్న అతనిలో పెరిగే
అభిలాష అస్త్రములపై
ఓ శుభధినాన  బయలు దేరె
ఆచార్యుడయిన ద్రోణున కడకు

విద్యపై గల వాంచ పట్టుదల నింప
విరిసే ఆశాలు మనస్సంతా పరిమళింప
తిరబోయే కోరికతో ఒళ్ళంత పులకరింప
అడవిలో తిరుగాడు నెలరాజు వలె
వినయ కాంతులు చిందుతూ
ప్రార్థించెనాచార్యుని
విధ్య  దానం చెయుమని

కుళ్ళి పోయిన  కులతత్వం
అమానుషమయిన అంటుతనం
తన గురుతత్వానికి అడ్డుపడగా
మరలి పొమ్మనే ఎరుక తనయుని
వీలుకాదని ద్రోణుడు

ముందు నిలిచిన పిరికితానన్ని
నిందించ లేదు
ఎందుకిలా అని ఎదురాడలేదు
సెలవు కోరెను భక్తిగా
దీవెనలు అడిగే ఆర్తిగా

నిరాశ దరిచేరని మతి
మార్చింది అతనిని ఓ యతి
ప్రతికూలించిన గురువు
నిలిచాడు ప్రతిమగా
ప్రతిమకు ప్రణమిల్లి
పాఠాలు మొదలెట్టే ప్రతిభవంతుడు

సాధనకు రూపం అనాడే
మనిషి మహానియిడు అనాడే
సాదించెను సరస్వతిని శూరుడు
ఉదయించెను ఓ గొప్ప వీరుడు
పులకించే అడవి తల్లి తన పుత్రుని చూసి
ప్రణమిల్లే విజయం తన మిత్రుని చూసి

జయించిన కృషి కిర్తినోందు సమయాన
సాద్రుష్యమయిన స్వార్థం
అడవి తనయుని చూసింది
అసూయతో మండింది
ఆచార్యుని కడకేగి
మొరపోయి మొక్కింది
తన కీర్తికి అడ్డుఅని తలిచి
అడవి రెడును తోక్కేయ నేంచింది
ప్రియ శిష్యుని మొరవిన్న
గురు మనసు తల్లడిల్లింది
అనామక శిష్యునికై అడవి కేగింది

ఎదుట నిలిచిన గురువుని చూసి
నిర్మలమయిన మనసు కడలివలె పొంగింది
కంటినుండి సంతోషం కన్నిరుగా వొలికింది
గురు పాదాలు కడిగింది
కపటమయిన మనసు గురుదక్షిణడిగింది
కల్మషం లేని మనసు కలవర పడింది
కలవాడిని కాను ఏమ్మివ్వగలనంది

కరుణ మరచిన కఠిన హృదయం
శరముల సందించు బొటన వేలిమ్మంది
మాట తప్పని మహానియత
ప్రేకిలించే బొటన వేలు
చెల్లించే గురు మాట

దూరమయిన వీరుని చూసి
విలపించెను విణపాణి
తన రూపం కరిగి పోయేనని
కృంగి పోయెను కృషి
తనయుని చూసి అడవి తల్లి తల్లడిల్లింది
ఎరుక వీరుని నైపుణ్యం నెల రాలింది
అతని కీర్తి మాత్రం గగనాన్ని దాటింది

17, ఏప్రిల్ 2014, గురువారం

అమ్మ, నాన్న, ఓ అబ్బాయి!


అవినాశ్ కు చాల భాదగా ఉంది. ఇంకా అవమానంగా కూడా ఉంది. ఇంటర్ లో 90 శాతం మార్కులు తెచ్చుకుని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఇలా ఫెయిల్ అవ్వటం ఉహించుకోలేక పోతున్నాడు. తన ఫ్రెండ్స్ కాంటీన్ లో ఉన్నారని తెలుసుకుని వెళ్ళాడు.

"హాయ్ రా" అంటూ పలకరించారు  నలుగురు కుర్రాళ్ళు.

ఖాళీగా ఉన్నా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఎదురుగా ఉన్నా  వికాస్ చేతిలో  సిగరెట్ లాక్కుని ఒక్క దమ్ము లాగాడు.

"ఏంటి రా! నువ్వెప్పటి  నుంచి మొదలు పెట్టావు?" అడిగాడు సంబ్రమాశ్చర్యాలతో.

"ఎం లేదు రా రిజల్ట్స్ మింగుడు పడటం లెదు. ఫెయిల్ అవ్వటం కొత్త కదా, అందుకే బాధగా ఉంది"  నీరసంగా పలికాడు.

"పర్లేదు మామ ఇకనుంచి అలవాటు అయిపోతుంది. దాని పేరు చెప్పి సిగరెట్ అలవాటు చేసుకోవటం ఎందుకు?" వెటకారం తొణికిస లాడింది అతని  గొంతులో.

అందరు ఘోల్లుమని నవ్వారు.

అసలే బాధలో ఉన్నా అవినాశ్ "ఓరేయ్-నేను ఫెయిల్ అవ్వటం ఎక్కడో పొరపాటు వల్ల జరిగింది. నా పేపర్లో చూసి రాసిన సలీం గాడు పాస్ అయ్యాడు" అన్నాడు ఉక్రోషంగా.

వికాస్ పెద్దగా నవ్వి "అదా నీ భాధ? బాబు వాడు ఒక్క అన్సర్ నీ  పేపర్ లో చూసి రాసాడు. మిగతావి పక్క వాళ్ళ దాంట్లో చూసి రాసాడు. అందుకె  పాస్ అయ్యాడు. నువ్వు మరి అంత ఫీల్ అయిపోకు" అన్నాడు మూతి తిప్పి  వెక్కిరిస్తూ.

అక్కడ ఉన్నా మిగత ఇద్దరు పడి పడి నవ్వ సాగారు.

అవినాశ్ ముఖం కంద గడ్డలా మారిపోయింది. ఉక్రోష పడుతూ "ఏంట్రా పెద్ద చూసినట్లు మాట్లాడుతున్నావ్" అన్నాడు కోపన్ని అణచుకుంటూ.

వికాస్  కు చాల సంబరంగా ఉంది. "దీనికి మళ్ళి చూడాలా! ఎవడ్రా వీడు, పిచ్చి పొంగలం గాడు" అన్నాడు నిర్లక్ష్యంగా చూసి జాలిపడుతూ.

అంతె  అవినాశ్ కోపం కట్టలు తెంచుకుంది. పక్కనే  ఉన్నా కూల్డ్రింక్ బాటిల్ అతని ముందు కూర్చున్న  వికాస్ మీదికి విసిరాడు. అది వెళ్ళి అతని  నుదుటిని తాకింది. వికాస్ స్పృహ కోల్పోయాడు. 

వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. ఇంకాస్త ఆలస్యం అయుంటే చనిపోయే వాడని చెప్పారు డాక్టర్స్. తోటి విద్యార్దిని తీవ్రంగా గాయపరచినందుకు అవినాశ్ ను వారం రోజులు  సస్పెండ్ చేసారు.

"వారం అయిన తర్వాత మీ నాన్న ను తీసుకొచ్చి నన్ను కలిపిస్తేనే అల్లౌ చేస్తాను" అన్నాడు ప్రిన్సిపాల్.

తన తండ్రి అంటే అవినాశ్ కు చాల గౌరవం,  ప్రేమ ఉండేవి. కాని రాను రాను అవి తగ్గిపోతున్నాయి.

ఆయనంటే విసుగు, కోపం పెరిగి పోతున్నాయి. ప్రతి దానికి నస పెడుతాడు, ఇలా ఉండకూడదు, అలా  చేయ కూడదు, అన్ని డబ్బులెందుకు, లెక్క చెప్పు అంటూ ఒక్కటే విసిగిస్తున్నాడు.

ఇక సస్పెండ్ అయ్యానంటే ఎలా రియాక్ట్ అవుతాడో. ఎక్కువగా మాట్లాడితే అసలు ఎదురు తిరగాలి! ఏంచేస్తాడో చూస్తాను అనుకుని ఇంటికి బయలు దేరాడు. 

ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ అమ్మ వసుందర మొదలు పెట్టింది.

"ఏంట్రా! కాలేజ్ లో సస్పెండ్ అయ్యావంటా?" అంది ఆశ్చర్యం, కోపం నిండిన గొంతుతో.

"వారం రోజులు సస్పెండ్ అయినంత మాత్రన ఎదో హత్య చేసి, జీవితం నాశనం అయినట్లు బిల్డప్ ఇస్తావేంటి" అన్నాడు చిరాకుగా.

"ఏంట్రా ఇలా తయారవుతున్నావ్? మీ నాన్న కష్టపడి చదివిస్తుంటే బాగా చదువుకోకుండా ఎందుకు రా ఈ గొడవలన్నీ" అంది బ్రతిమాలుతు.

"దయ చేసి అపు తల్లి. మీ అయన సూర్యనారాయణ గారు అంటే నిప్పు. ఆయనంత కష్టపడి పైకి వచ్చినవారు  ప్రపంచంలో లేరు. ఎన్నో త్యాగాలు చేసి చెల్లిని, నన్ను చదివిస్తున్నాడు. నేను జల్సాలు చేస్తూ పాడయి పోతున్నాను. అంతేనా? రోజు కాలేజ్ వెళ్ళటానికి బైక్ లేదు. కనీసం కాలేజ్ బస్సు కు ఫీజు కట్టలేదు. రోజు సిటి బస్సులో  అంత దూరం వెళ్ళి రావటానికే టైం  అయిపోతుంది. కనీసం ఒక గంట టీవీ చూస్తే ఆయనకు కోపం. క్రికెట్ ఉన్నప్పుడు ఎప్పుడయినా కాలేజ్ మానేస్తే ఎదో గొప్ప తప్పు చేసినట్లు చిందులేస్తాడు. నువ్వేమో అయన గారి త్యాగాలు వృధా  చేస్తున్నానని ఈ నస. ఇంకా అపు" అన్నాడు విసుగు, వెటకారం నిండిన గొంతుతో రెండు చేతులు జోడిస్తూ.

వసుందర నివ్వెర  పోయింది. తనకు ఏం  మాట్లాడాలో అర్ధం కావటం లేదు. తమ కుంటుంబ పరిస్థితులు  అవినాశ్ కు ఎలా వివరించాలో తెలియటం లేదు. ఎంతో కష్టపడి చదువుకుని గుమస్తా నుండి సుపరిండేంట్ గా ఎదిగి, నిజాయితికి మారు పేరయిన భర్తను తలచుకుంటే చాల గర్వంగా ఉంటుంది.

కాని వీడు! ఎవరో డబ్బున్న  స్నేహితులతో పోల్చుకుని ఇలా అసంతృప్తి పడుతూ, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. బాధతో నిట్టూరుస్తూ వంట గదిలోకి వెళ్ళి పోయింది. 

ఆఫీసు  నుండి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే హల్లో టీవీ చూస్తూ టిపిన్ చేస్తున్న అవినాశ్ ను చూడగానే కోపంతో రెచ్చిపోయాడు సూర్యనారాయణ.

"అంత తాపీగా టీవీ ఏలా చుడలనిపిస్తుందిరా నీకు? అసలు నోట్లోకి ముద్ద ఎలా దిగుతుందిరా?" అడిగాడు కోపంగా.

అవినాశ్ ఏమి పట్టించుకోకుండా చానెల్ మార్చటంలో బిజీ అయిపోయాడు. అంతే సూర్యనారాయణకు చిర్రెత్తుకొచ్చింది.

అవినాశ్  రెక్కపట్టుకుని లేపి "ఏంట్రా పొగరు! నేను మాట్లాడుతుంటే ఏమి పట్టించుకోకుండా" అంటూ రెండు చెంపలు వాయించాడు.

మళ్ళి కొట్ట బోతున్న తండ్రి చెయ్యి  పట్టుకుని "ఏయ్ అపు. ఇప్పుడు ఏం  చేశానని నన్ను తిడుతున్నావ్? ఇలా కొడుతున్నావ్? మర్డర్ చెయ్యలేదు, జస్ట్ గొడవ పడ్డాను. వారం రోజులు సస్పెండ్ అయ్యాను అంతే. నువ్వు ఇచ్చే సౌకర్యాలకు స్టేట్ ఫస్ట్ రావలనట్టు బిల్డప్ ఇస్తావేంటి. నువ్వేం చదివావ్? జస్ట్ ఇంటర్ మీడియట్. ఎదో లక్కీగా ఆఫీసర్ అయ్యావ్" అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ బయటకు వెళ్తున్న కొడుకును ఎం చేయాలో అర్ధం కాలేదు సూర్యనారాయణకు.

 దుఖం, కోపం ఒక్కసారిగా కలిగాయి అతనికి. 

సవతి తల్లి వద్ద ఉంటూ, ఆవిడా పెట్టె భాధలు భరిస్తూ, వర్షం పడితే, వాగు నుంచి ఈదుకుంటూ, పక్క ఉరికి వెళ్ళి పది వరకు చదువుకున్నాడు. కాలేజ్ లో చేరగానే ట్యూషన్ లు చెప్పుకుంటూ ఇంటర్ వరకు చదువుకున్నాడు. గుమస్తాగా గవర్నమెంటు జాబ్ సంపాదించి ఓపెన్ యూనివర్సిటీ లో డీగ్రీ పూర్తీ చేసి, డిపార్ట్మెంటు పెట్టిన పరిక్షలు పాస్  అయి సుపరిండేంట్ అయ్యాడు.

కాని వీడు!  చదువుకోవటానికి అది లేదు, ఇది లేదు అంటూ సాకులు చెపుతున్నాడు. తను సవతి తల్లిన్నే సొంత తల్లిలా చూసుకుంటున్నాడు. కాని వీడు! సొంత తల్లి, తండ్రి అయిన తమను అసలు చూసుకుంటాడ?  అనుకుంటూ  సోఫా లో కూలబడి పోయాడు.

చిన్నప్పుడే తన తల్లి చనిపోవటంతో తన తండ్రి మరో పెళ్ళి  చేసుకున్నాడు. వచ్చిన ఆవిడకు పిల్లలు పుట్టలేదు. కాని ఎప్పుడు  తనను చాల కష్టపెట్టేది. ఆదివారం వచ్చిందంటే చాలు గొడ్లు కాయటానికి, పొలం పనులకు పంపేది. కాని ఎ రోజు తన చదువుకు అడ్డు చెప్పలేదు. తాను ఈ రోజు ఉన్నా ఈ  స్తితికి ఆవిడే కారణం.

ఇలా ఆలోచిస్తున్న సూర్యనారాయణ భార్య పిలుపుతో ఈ  లోకం లోకి వచ్చాడు. 

"ఏమండి అత్తయ్యా పరిస్థితేం  బాగాలేదు. హాస్పిటల్ కు  తీసుకెళ్ళండి ఒక్కసారి" అని చెప్పి అవినాశ్ ను కేకేసింది వసుందర  "ఒరేయ్ అవి నాన్నకు తోడుగా వెళ్ళు".

"తల్లి కాని తల్లి కోసం ఏంటో? ఈ అనవసరమయిన ఖర్చులు. సొంత పిల్లలకు లేకుండా" అన్నాడు అవినాశ్  గొంతులో కోపం, చిరాకు ద్వనించే లాగ.

"ఆవిడే లేక పొతే ఈ రోజు ఇలా ఉండేవాడివి కాదురా.  మీ నాన్న పాలేరుగా మారిపోయే వాడు. నువ్వు పెడకాడులు ఎత్తుతూ చిన్న పాలేరు గా ఉండే వాడివి. అవును! ఆవిడా నన్ను ఎన్నో భాదలు పెట్టింది, పాచి పోయిన అన్నం పెట్టింది.  బండెడు చాకిరీ చెప్పేది.  కాని చదువు అనేసరికి ఏ  రోజు నన్ను ఆపలేదు. ఆవిడే గనుక మా నాన్నతో వాడి చదువు మానిపించండి అంటే ఖచ్చితంగా చేసేవాడు. కాని ఆవిడా ఆ పని చెయ్యలేదు. అందుకెరా, తల్లి కాని ఆ తల్లి కోసం అంత తపన" అన్నాడు సూర్యనారాయణ చెమర్చిన కళ్ళతో.

అవినాశ్ దీర్ఘంగా నిట్టూర్చి బయటకు దారి తీసాడు అటో తీసుకు రావటానికి. 

"ఆవిడకు వయసు అయిపోతుంది కదండీ, పైగా షుగర్ పేషెంటు. మీరు మాత్రం ఎంతని ఖర్చు పెడుతారు" అన్నాడు డాక్టర్.

"సాద్యం అయినంత వరకు పెడుతాను డాక్టర్. కాని మా పిన్ని వీలయినన్ని రోజులు  మా మద్య ఉండేలా చూడండి" అన్నాడు సూర్యనారాయణ బ్రతిమాలుతూ.

 "సరే మీ ఇష్టం" అంటూ ఏవో మందులు రాసిచ్చి వెళ్ళి పోయాడు డాక్టర్.

"బాబు నన్ను క్షమించరా" అంది సూర్యనారాయణ పిన్ని దుఃఖ పడుతూ.

"ఎందుకు పిన్ని? నాకు ఓపిక  ఉన్నంత వరకు నీకు ఎ లోటు రానివ్వను" సూర్యనారాయణ భరోసా ఇస్తూ పలికాడు.

"అది కాదురా-నీకు ఒక నిజం చెప్పాలి"ఆవిడ పెదాలు వణుకుతున్నాయి భయంతో.

అవినాశ్, సూర్యనారాయణ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆమెను. ఆమె తల దించుకుంది నోట  మాట రాక.

"నా దగ్గర సంకోచం ఏంటి పిన్ని. చెప్పు  ఏంటది?" అన్నాడు సూర్యనారాయణ ధైర్యం చెపుతూ.

"నిన్ను స్కూలుకు పంపింది వాగులో పడి కొట్టుకు పోతావని, నీ పీడ విరగడవుతుందని.  అంతే  కాని నీ  మిద ప్రేమతో కాదురా" అంది బోరుమని ఏడుస్తూ.

అవినాశ్ దిగ్బ్రాంతి కి లోనయ్యాడు, ఒక్క సారిగా కోపం పొంగుకొచ్చింది.

కాని సూర్యనారాయణ మాత్రం నవ్వుతూ "ఇప్పుడెందుకు చెపుతున్నావ్ అమ్మ?"  అడిగాడు సౌమ్యంగా.

"నీ  తల్లి ప్రేమ ముందు నా కుళ్ళు తనం కొట్టుకు పోయింది రా. నా కపటత్వాన్ని ప్రేమ అనుకుంటు ఉంటె తట్టుకోలేక పోతున్నాను. అందుకే నిజం చెప్పి నా మనసు తేలిక చేసుకున్నాను" అంది సూర్యనారాయణ రెండు చేతులలో మొఖాన్ని దాచుకుని  ఏడుస్తూ.

"అమ్మ! తల్లి, తండ్రి శాపాలు పిల్లలకు దీవెనలు అంటారు. అలా నీ శాపనర్దలే నాకు దివేనలయ్యాయి, నన్ను ఈ స్థితికి చేర్చాయి. నువ్వు ఇప్పుడు ఇలా భాదపడి నీ ఆరోగ్యం ఇంకా పాడు చేసుకుంటే ఎలా? నా ఉపిరి ఉన్నంత కాలం నీకు  ఏ లోటు లేకుండా చూసుకుంటాను. నువ్వు అస్సలు అధైర్య పడొద్దు" అంటూ గట్టిగా హత్తుకున్నాడు  అ తల్లి కాని తల్లిని. 

ఇదంతా చూస్తున్న అవినాశ్ కు తండ్రి నిర్మల మయిన మనసు కళ్ళకు కట్టింది. అయన ఔదార్యం తన పోకిరి తనన్ని చాచి కొట్టింది.

తల్లి, తండ్రి గొప్పతనం, వారి స్థానం తనకు తెలిసి వచ్చాయి. తన ప్రవర్తనకు తన మీదే అసహ్యం వేసింది.

అది లేదు, ఇది లేదు అంటూ ఫిర్యాదులు మానేసి, ఏమి లేకుండా ఉన్నత స్థితికి వచ్చిన తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలనుకున్నాడు. ఎప్పుడు అమ్మ నాన్న కు ఎదురు చెప్పకూడదని, చదువులో ఎప్పుడు ఫస్ట్ రావాలని ఆ క్షణమే  నిర్ణయించుకున్నాడు.

తండ్రి దగ్గరికి వెళ్ళి "సారి నాన్న" అని సిగ్గుపడుతూ నిలబడ్డ కొడుకును చేరదిసి  "నువ్వు పాడవుతుంటే  చూసి తట్టుకోలేను రా నాన్న" అన్నాడు సూర్యనారాయణ.

"ఇంకెప్పుడు అలా  చెయ్యను నాన్న" అంటూ తండ్రిని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి  ఏడ్చాడు అవినాశ్. 

నువ్వు ఏది నాటితే అదే కోతకు  వస్తుంది. నువ్వు నీ తల్లి, తండ్రిని గౌరవిస్తే, నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు. 

(సమాప్తం)

16, ఏప్రిల్ 2014, బుధవారం

తిమిర-సంహారంకాలానికి సారథి
రేపటికి వారధి
గ్రహాలకు ప్రతినిధి
ప్రకృతికి పెన్నిధి

వెలుగు రేఖల చైతన్యం
రాత్రికి  మిగిల్చే  శూన్యం
లోకాన్ని చేసే  ధన్యం
జాగయితే ఎంత దైన్యం?

పుడమి నుదుటన సింధూరం
స్తబ్దత పై సాగే  సమరం
పరుగులెడుతుంది రుధిరం
పారి పోతుంది శిశిరం

వెన్నేలకు ఆప్తుడు
మేఘాలకు ఆఢ్యుడు
వరుణుడికి ఆరాధ్యుడు
లోకానికి అసాధ్యుడు

తిమిరాల పరదాలు
కావేవి తన కష్టాలు
గ్రహణం తెలేదు నష్టాలు
కావవి అంతిమ ఘడియలు
అందుకే ఆదర్శం-తన చెష్టలు


15, ఏప్రిల్ 2014, మంగళవారం

ఎన్నికలు! ఎన్ని కలలు?పార్టీలు చేసే గారడీ
సాటి రాదు ఏ  పేరడీ 
అయిదేళ్ళు అసలు గడువు !
సర్కారు ఎన్నాళ్ళు నడువు? 
వస్తే మధ్యంతరం! 
యిక లేదు గత్యంతరం

అర చేతిలో స్వర్గాలు 
నోటికొచ్చిన వాగ్దానాలు 
ప్రేమతో తీస్తారు ప్రాణాలు 
దానికే పడుతారు జనాలు

వర్గాలకు అగ్ర తాంబూలం 
మతం అవుతుంది మరో గాలం 
ప్రాంతల మాయ జాలం 
దేనికయిన  అవుతారు గులాం!
ఆ తెలివి తెటలకు సలాం!

వెండి తెర బొమ్మలు ఆకర్షణ 
చూసేందుకు జనం నిరీక్షణ 
ప్రక్క పార్టీల దూషణ 
ఎవరు చేసేను విచారణ?

నల్ల డబ్బు వెలుగు చూస్తుంది 
ఓటర్ల కళ్ళు మూస్తుంది 
సారా తెలివిని ముంచుతుంది 
భవిష్యత్తును తుంచుతుంది 
బ్యాలెట్ లో యింకు నింపుతుంది 

ఇస్తారు మరో సెలవు దినం 
ప్రజాస్వామ్యానికి తద్ధినం 
టీవీ ముందు సగం జనం 
విద్యావంతులు మరీ హీనం! 
తలపించె దట్టని వనం 
అవినీతి చేసే గానం 

నోటు కు లోకువ ఓటు 
భవితకు చేయు చేటు 
అభివృద్దికి తీరని లోటు 
తగిలేను ధరల ఘాటు 
జనానికే పడె వేటు 
ఎక్కడుంది హక్కులకు చోటు 

మన దేశంలో ఎన్నికలు
తలపిస్తాయి తిరనాలు 
నిజంకావు  సామాన్యుని కలలు
తీరుస్తాయి తుచ్చ కోరికలు 
పేరుస్తాయి, సాలిడు వలలు 


12, ఏప్రిల్ 2014, శనివారం

అందానికి దాసోహం !!ఎందుకు నీకు ఇంత అందం 
నన్ను చిత్రవధ చెయ్యటానికి తప్ప 
నీ వంటి చాయ నా కళ్ళలో పడి 
మైకం కమ్ముతోంది నాకు 
నల్లని కురులు చూసి 
నా కళ్ళు వెలిగి పోతాయి  
పాల బుగ్గలు చూసి 
నా పెదవులు వణికి పోతాయి  
ఎర్రని పెదవులు చూసి 
నా నోటిలో తడి ఆరిపోతుంది 

నీ తేలికయిన అందాలు 
నా మనసు బరువు పెంచుతుంటే 
నీ కొంటె నవ్వులు 
నన్ను కలవర పెడుతుంటే 
అమృతం చిందే నీ  అదరలు 
అందకుండా నన్ను 
చావుకు దగ్గర చేస్తుంటే 
సున్నా నడుము
నాలో సునామి రేపుతుంటే 

నడుము మడత తో 
నా నిబ్బరం పై యుద్ధం ప్రకటించి 
ఎత్తయిన గుండెలు  ఎరగా వేసి 
నా కళ్ళను కట్టిపడేసి 
నన్ను పూర్తిగా నీ వశం చేశావు 
నిన్ను తప్ప ఇంకేమి చూడలేని 
అందుణ్ణి  చేశావు 
నీవే లోకమయిన 
పిచ్చి వాణ్ణి చేశావు 

లేలేత నీ అందాలూ చూసి 
నాకు నిదుర కరువయింది 
రోజుకు ఒక్కసారయిన 
నిన్ను చూడకుండా 
నా ప్రాణమే నిలవనంది 
నీ రూపం నా ముందు నిలిచి 
నన్ను ఎక్కడ నిలవనియ్యదు 

నీ మాటల్లో తియ్యదనం గుర్తొచ్చి 
నాలో తాపం రెట్టింపు చేస్తుంది 
నీపై  ఆరాధన ఇంకా పెరిగి పోతుంది 
ఓ నా ప్రియా !
నిండిపోయావు నా హృదయాన 
నీకు తెలిసేనా 
నా ఆరాధన ఎప్పటికయినా? 

6, ఏప్రిల్ 2014, ఆదివారం

చేతిలో భూతం !!! -4

(మూడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి.)

విక్టర్ చేతిలో నిజంగానే భూతం ఉందని ఋజూవు కావటంతో సైదులు కు కూడా కొంచెం భయంగానే ఉంది అతనితో ఉండాలంటే. కానీ తప్పదు ! ఇప్పుడు వాణ్ణి వదిలేస్తే లేని పోనీ విషయాలు భయట పడి అనవసరంగా ఇరుక్కుంటాడని తనకు తెలుసు. 

"మామ ! ఎలాగు రేపు, ఈ రోజు వీకెండ్  కాబట్టి , నువ్వు కూడా నాతొ పాటు మా ఉళ్ళొనె ఉండిపో" అడిగాడు విక్టర్ ను. 

"లేదు మామ - మా ఇంట్లో నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పలేదు. ఈ రాత్రికి నేను ఇంటికి వెళ్ళక పొతే ! లేని పోనీ ప్రొబ్లెమ్స్" అన్నాడు విక్టర్. 

"కాదు మామ, ఇంత రాత్రి పూట హైదరాబాద్ ప్రయాణం అంటే కష్టం రా. అసలే మధ్యలో అడవి"  సైదులు అతనిని ఆపాలని చూస్తున్నాడు. 

"దయచేసి విను మామ. మా డాడీ సంగతి నీకు తెలీదు. గంటలో హైదరాబాద్ లో ఉంటాం. నువ్వు నీ రూం లో ఉండి,  రేపు పొద్దున్నే వచ్చేద్దువు  గాని" విక్టర్ అతణ్ణి ఒప్పించాలని ప్రయత్నిస్తున్నాడు. 

చేసేది లేక సైదులు తన కారు లో విక్టర్ ను హైదరాబాద్ లో దింపటానికి బయలు దేరాడు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు అవుతోంది. అది పౌర్ణమి దగ్గర పడుతున్నా రోజులు కావటంతో !  ఆకాశంలో చంద్రుడు, తల తీసేసినా మోడెం మాదిరి పాతిక భాగం లేకుండా అసహ్యంగా వేలాడుతున్నాడు. 

వారి కారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో తారు రోడ్డు మిద దూసుకుని పోతోంది.  సైదులు నడుపు తుంటే విక్టర్ అతని పక్కనే కూర్చున్నాడు. కారు ఇంకా స్పీడ్ గా తోలడానికి లేదు ! ఎందుకంటే ఆ రోడ్డు సింగల్ లైన్ మాత్రమే. రోడ్డుకు అటు ఇటు దట్టమయిన చెట్లు, మరియు అడవి. 

స్టీరియో లో ఏదో పాట మోగుతోంది. సైదులు రిలాక్స్డ్ గా పాడుతూ  కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఎప్పుడో కాని ఏదో చిన్న ఉరు తప్ప పెద్దగా జన సంచరం ఉన్నా ప్రాంతం కాదు అది. అందుకే చాల సాఫీగా సాగుతోంది వారి ప్రయాణం. అర కొరగా  ఎదురయ్యే వాహనాల డ్రైవర్ లను తిడుతూ, తన కారు వేగం తగ్గకుండా చూస్తున్నాడు సైదులు. ఇవేవి పట్టించుకోని విక్టర్, మైసమ్మ తన ఎడమ చేతికి కట్టిన తాయ్యెత్తు వంక చూసుకుంటూ, బాధ పడుతున్నాడు.  తర్వాత చిన్నగా నిద్ర లోకి జారుకున్నాడు.

కారు ఉరు నుండి బయలు దేరి ఒక 30 కిలోమీటర్ల దూరం రాగానే విక్టర్ ఎడమ చెయ్యి పైకి లేచి స్టిరింగ్ మిద పడింది. ఆదమరచి నిద్ర పోతున్న అతనికి ఆ విషయం తెలియ లేదు. సైదులు ఒక్క సారిగా అదిరి పోయాడు. కంగారుగా విక్టర్ చెయ్యిని స్టిరింగ్ నుండి లేపెయ్యాలని చూశాడు. కాని అతని చెయ్యి చాల పట్టు తో స్టిరింగ్ ను రోడ్డు పక్కకు తిప్పుతోంది. సైదులు రోడ్డు మీదికి తిప్పాలని చూస్తున్నాడు. ఇద్దరి మధ్య పెనుగు లాట మొదలయింది.

సైదులు తన రెండు చేతులతో చాల బలంగా తిప్పుతున్నాడు. కాని దెయ్యం లాంటి బలం  ఉన్నావిక్టర్ చెయ్యి ముందు ఓడి పోయాడు. కారు తన అదుపు తప్పి రోడ్డు కు అవతల వెళ్తుందని గ్రహించి  తెలివయిన సైదులు సడెన్ బ్రేక్ వేసాడు. కాని కారు స్పీడ్ గా ఉండడంతో రోడ్డుకు దూరంగా వెళ్ళి ఒక చెట్టుకు గుద్దుకుంది. కారు ముందు భాగం అంత నజ్జు నజ్జు అయి డాష్ బోర్డు కూడా చెడి పోయింది. ఇంకా కాస్త స్పీడ్ గా వచ్చి ఉంటె వారి ఇద్దరి కాళ్ళకు డాష్ బోర్డు గుద్దుకుని విరిగి పోయేవి.

విక్టర్ అదిరి పోయి నిద్ర లేచాడు. సైదులు కాళ్ళు, చేతులు, ఒళ్లంతా తడిమి చూసుకున్నాడు ! ఎక్కడయినా దెబ్బ తగిలిందేమో అని. తర్వాత విక్టర్ వంక చూశాడు, అతని చెయ్యి మాములుగానే ఉంది.  తొందర తొందరగా కారు దిగి భయటకు వచ్చారు.

 "ఏమయింది రా ! అలా గుద్దేసావ్" ఆశ్చర్యంతో  అడిగాడు విక్టర్.

"నేను కాదురా గుద్దింది, నీ చేతిలో ఉన్నా దెయ్యం. స్టీరింగ్ బలవంతంగా తిప్పి ఇటు వైపు తీసుకొచ్చింది కారును"   సైదులు తన అసహనాన్ని, అశక్తతను  వ్యక్తం చేశాడు.

"అది దెయ్యం కాదురా ! మన గతం. నువ్వు చంపినా అమాయకురాలి ఆత్మ"  విక్టర్ లో కోపం రగిలి పోయింది. ఈ అనర్దానికి కారణం తానే కావొచ్చు - కాని దానికి మూల కారణం ఎవరు? వాడు ఆమెను చంపక పొతే తనకు ఈ దుస్థితి వచ్చేది కాదు.

వాదించు కుంటూ పొతే లాభం లేదని అర్ధం అయిపొయింది సైదులుకు. "ఈ మైసమ్మ గాడు మోసం చేశాడు. మళ్ళి వెళ్తే మరో అయిదు వేలు లాగుతాడు. కారు పూర్తిగా పాడయిపొయింది, అది కదలటం అసాద్యం. అసలే చుట్టు పక్కల అడవి ! ఈ చీకటికి ఎ జంతువో వచ్చి దాడి చేసిన తెలియదు. ఎలాగయినా ఇక్కడ నుండి భయట పడాలి" అనుకున్నాడు మనసులో.

కాని అక్కడ విక్టర్ పరిస్థితి మరోలా ఉంది. అతని చెయ్యి మరో సారి అతని మిద దాడికి దిగింది. మొహం మిద టప్ టప్ మని ఎక్కడ పడితే అక్కడ కొడుతోంది. విక్టర్ తట్టుకోలేక "సైదు ! కాపాడు రా. కాపాడు రా" అని అరుస్తున్నాడు.

సైదులు వెళ్ళి విక్టర్ ఎడమ చెయ్యిని లాగి పట్టుకున్నాడు అతని  మొహాన్ని కొట్టకుండా. కొద్ది సేపటికి మామూలు స్థితికి వచ్చింది అతని చెయ్యి. తర్వాత ఇద్దరు రోడ్డు మీదికి వచ్చి ఏదయినా వెహికల్ వస్తుందేమో లిఫ్ట్ అడుగుదాం అని ఎదురు చూస్తున్నారు. ఒక అయిదు నిమిషాల తర్వాత విక్టర్ ఎడమ చెయ్యి రోడ్డు పక్కనే  ఉన్నా ఒక పెద్ద కర్రను తీసుకుంది.

అటు తిరిగి ఉన్నా సైదులు తల మిద బలంగా కొట్టింది. ఆదమరచి ఉన్నా అతనికి అంత దెబ్బ పడే సరికి బిత్తర పోయి వెనుకకు తిరిగాడు. మరో దెబ్బ ముందు నుండి పడింది తల మిద. కుప్ప కూలి పోయాడు సైదులు. మరో దెబ్బ పడుతుండగానే లేచి పరుగులు మొదలు పెట్టాడు అడవి వైపు.

విక్టర్ చెయ్యి అతను ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగడం లేదు. సైదులు పరుగు పెడుతున్నా వైపు లాగుతోంది. చేసేది లేక విక్టర్ కూడా సైదులు ను అనుసరించాడు పరుగు పెడుతూ. తల మిద రెండు దెబ్బలు పడే సరికి దిమ్మ తిరిగి పోయిన కూడా ! అక్కడే ఉంటె చంపెస్తుందేమో అని లేని ఓపికను తెచ్చుకుని పరుగు పెడుతున్నాడు సైదులు.

పరుగు పెట్టి పరుగు పెట్టి ఒక చోట ఆగిపోయాడు. వెనుకకు చుస్తే విక్టర్ ఇంకా చాల దూరం లో ఉన్నాడు అతనికి. చుట్టూ చూస్తే ఎత్తయిన చెట్లు, మధ్యలో కాలి బాట,  అక్కడక్కడ ముళ్ళ పొదలు. అడవులు తనకు కొత్త కాదు, కానీ రాత్రి వెళ ఎప్పుడు లేడు. ఆది కాక ! ప్రాణ కోసం పరుగు పెట్టడం,  చాల భయకరంగా అనిపించింది అతనికి.

పైకి చూస్తే,  నల్లని ఆకాశంలో చంద్రుడు ఒంటరిగా కనిపించి భయ పెట్టాడు. ఉండుండి జివ్వుమని వీస్తున్న గాలికి చెట్ల మిది  ఆకులూ రాలి పడుతుంటే - వంటి మిద తేళ్ళు,  జెర్రులు పాకినట్లు కంపించి పోతున్నాడు. దూరంగా ఏవో జంతువులు  కోపంగా అరుస్తున్నాయి . "దెబ్బలాడు కుంటున్నయేమో బహుశ ! అసలు వాటి మధ్య దేబ్బలాటకు కారణం ఏమిటో? అవి ఎలా చస్తే నాకెందుకు" అనుకుని విక్టర్ ఎక్కడ ఉన్నాడో చూస్తున్నాడు.

అతను సమిపిస్తున్నాడని చూసి ఇంకా లోపలికి పరుగు పెట్టాడు సైదులు. "లోపలికి వెళ్తున్నాను కాని ! ఇందాక పోట్లాడుకున్న జంతువులూ కలిసి నా మీద పడితే ఏంటి పరిస్థితి" అనుకున్నాడు. "రాని ! ఈ నాకోడుకును వాటికి బలి చేస్తా" అనుకుని ఒక్క చెట్టు వెనుక నక్కి విక్టర్ కోసం ఎదురు చూడ సాగాడు.

అలా చూస్తున్న అతనికి కాలి మిద ఏదో గుచ్చి నట్లు అయి కిందికి చూసుకున్నాడు. చీకట్లో ఏదో నీడ కదులుతూ వెళ్తోంది. "అయ్యా బాబోయ్ ! పాము పాము" అని అరుచుకుంటూ విక్టర్ వైపు పరుగు పెట్టాడు. తన చేతిని నియంత్రించ లేక, సైదులును కొట్ట లేక బలవంతంగా నడుస్తున్నాడు విక్టర్.

"ఒరేయ్ మామ ! నాకు పాము కరించింది రా "  అని ఏడుస్తూ దగ్గరకు వస్తున్నా  సైదులును చూడగానే  విక్టర్ వణికి పోయాడు.

భయం తో "ఏంటి మామ నువ్వు అనేది" అని ఆశ్చర్యంగా  కేక పెట్టాడు.

కాని అతని అదుపు లో లేని అతని ఎడమ చెయ్యి సైదులు  తల మిద గట్టిగా కొట్టింది చేతిలో ఉన్నా కర్రతో.  కర్ర రెండు ముక్కలు అయ్యింది ! అతని చెయ్యి మాములు గా అయింది. సైదులు రెండు చేతులు తలకు పెట్టుకుని కూలబడి పోయాడు. తన తల  నుండి రక్తం కారు తోంది, నీరసం తో కళ్ళు మూతలు పడుతున్నాయి.  పాము కరిచింది అన్న నిజం తనను మెలకువగా ఉండేలా చేస్తోంది.

"డార్లింగ్ ! నన్ను బతికించు రా. ప్లీజ్" విక్టర్ ను బ్రతిమలుతున్నాడు అలాగే పడుకుని.

"మామ ! నీకేం కాదురా.  అది విషం ఉన్నా పాము కాక పోవచ్చు" విక్టర్ అతనిలో ధైర్యం నింపాలని చూస్తున్నాడు.

"తొందరగా ఫోన్ చేసి ఏదయినా వెహికల్ తెమ్మను రా ఎవరినయినా  ! నన్ను హాస్పిటల్ తిసుకేల్రా" సైదులు లేని ఓపికను తెచ్చుకుని లేవాలని చూస్తున్నాడు.

ఫోన్ తీసిన విక్టర్ కు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. ఫోన్ లో ఒక్క సిగ్నల్ కూడా లేదు.

తన దృష్టి మళ్ళించటానికి "మామ ! కాస్సేపు రెస్ట్ తీసుకో రా" అని అతని గుండెల మిద రుద్దుతు, తన ఒళ్ళో పడుకో బెట్టుకుని కర్చిప్ తో తలకు కట్టు కట్టాడు.

సైదులు కు తెలుస్తోంది ఏదో తెలియని మత్తు తనను అవహిస్తోంది.  తొందరగా హాస్పిటల్ వెళ్ళాలి , లేదంటే తన బ్రతుకు ఈ అడవిలోనే ముగిసి పోయేలా ఉంది. విక్టర్ ఒడి లో నుండి లేచి నిలబడ్డాడు. దబ్బుమని కూలబడి పోయాడు, నీరసంతో కళ్ళు తిరిగి.

"మామ ! రెస్ట్ తీసుకో అంటే అలా లేచి పోయి పడి పొతే ఎలా  రా?" విక్టర్ జాలి పడ్డాడు.

"రెస్ట్ తీసుకోవటానికి మనం పెళ్ళి కి వచ్చమా? నేను చావుకు దగ్గర అవుతున్నాను అని తెలియటం లేదురా నీకు" కోపంగా అనాలనుకుని  నీరసంగా పలికాడు సైదులు.

అది వినగానే విక్టర్ భయంతో వణికి పోయాడు. చుట్టూ ఉన్నా చీకటి, జంతువుల అరుపులు, కీచు రాళ్ళ రొదలు అడవి మొఖం చూడని అతన్ని మృత్యువు కు దగ్గర ఉన్నా భావన కలిగిస్తున్నాయి. నిమిషా నిమిషానికి సైదులు మారి పోతున్నాడు.

"నిజంగానే వీడు  చావుకు దగ్గర అవుతున్నాడు" అనుకుని సైదులును తన విపు మిద వేసుకుని రోడ్డువైపు రాసాగాడు విక్టర్.

కొద్ది దూరం వచ్చాక తన వీపుకు ఏదో తడిగా తగిలింది. సైదులు ను అలాగే పట్టుకుని వెనుకకు తిరిగాడు. సైదులు నోటి వెంట నురుగలు ! అతని మొఖం అంత పాలి పోయింది.

"అయ్యో జీసస్ ! నా ఫ్రెండ్ ను కాపాడు" అని గట్టిగా అరిచాడు పైకి చూస్తూ.

అతని అరుపు వినగానే దూరంగా ఏదో నక్క అరిచింది సమాధానంగా. ఒక్కసారిగా అదిరి  పోయాడు. ఎక్కడ ఆ నక్క తన దగ్గరకు వస్తుందో అనుకుని సైదులు ను అక్కడే వదిలేసి పరుగు పెట్టాడు రోడ్డు వైపు. అసలు వీడిని ఇక్కడే  వదిలేసి పారి పొతే ! కాని మనసు ఒప్పు కోలేదు. ఏదయినా వెహికల్ వస్తే సహాయం చేయ్యమందం అనుకుని ఎదురు చూడ సాగాడు.

ఇక్కడ సైదులు నురగలు కక్కడం ఎక్కువ అయింది. ఎంత ఆపుకున్నా మత్తు ఆగడం లేదు, కళ్ళు మూతలు పడుతున్నాయి. ఉపిరి తియ్యలేక మెలకువ తోనే గురక పెడుతున్నాడు. "ఎంత పని చేశావ్ రా విక్టర్ ! పిరికి వెధవ, నన్ను చావుకు వదిలేసి పారిపొయవ్ రా" అని మనసులో అనుకుంటున్నాడు.

"ఎంత మంది అమ్మాయిలను  అనుభవించాడు, ఒప్పుకోక పొతే చంపాడు. ఇప్పుడు చావుతో పోరాడు తున్నాడు. ఈ ఒక్కసారికి బతికి భయట పడితే ఇంకా ఎప్పుడు ఎలాంటి తప్పులు చెయ్య కూడదు" మనసులో అనుకున్నాడు సైదులు. కొద్ది సేపటికే  భళ్ళుమని వాంతి చేసుకుని స్పృహ కోల్పోయాడు.

అక్కడ రోడ్డు మిద వెయిట్ చేస్తున్న విక్టర్ "అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందో" అని జేబులో సెల్ తీసాడు. బ్యాటరి అయిపోయి ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయినట్లు ఉంది. సమయం గడుస్తుందే కాని ఒక్క వెహికల్ కూడా రావటం లేదు.  సైదులు పరిస్థితి ఎలా ఉందొ చూద్దాం అని అతని వైపు పరుగు పెట్టి అక్కడికి చేరుకున్నాడు.

స్పృహ కోల్పోయి కోన ఉపిరి తో కొట్టు కుంటున్న సైదులు ను చూడగానే భయంతో గట్టిగా అరవలనుకున్నాడు విక్టర్. కాని ఎక్కడ ఏ  జంతువు వచ్చి మిద పడుతుందో అని నెత్తి కొట్టు కున్నాడు రెండు చేతులతో. వెంటనే అతన్ని వెనుక విపు మిద వేసుకుని గబా గబా రోడ్డు వైపు నడక సాగించాడు.

రోడ్డుకు 5 అంగుళాలు ఉందనగా ! విక్టర్ ఎడమ చెయ్యి ఒక్కసారిగా సైదులు ను వదిలి,  అయిదు వేళ్ళు ముడుచుకుని అతని మొఖాని పిడి గుద్దులు గుద్ద సాగింది.  భయం తో అలసి పోయి ఉన్న విక్టర్ ప్రతిఘటించ లేక పోయాడు. ఆ దెబ్బలకు ముక్కు పగిలి రక్తం కారుతుంటే స్పృహ కోల్పోయాడు.

"ఓయ్ ! ఎవరయ్యా నువ్వు ఇక్కడ పడుకున్నావ్. నీ పక్కన ఉన్నది ఎవరు?" అని ఎవరో ఇద్దరు మనుష్యులు వచ్చి లేపుతున్నారు.

భారంగా కళ్ళు తెరిచినా విక్టర్ కు మసక మసక గా తెల్లవారు తున్నట్లు అర్ధం అయింది. పక్కన సైదులు దగ్గరికి వెళ్ళి "సైదు మామ ! సైదు  మామ. లేవురా హాస్పిటల్ వెళ్దాం" అని కదిపాడు.

ఉలుకు పలుకు లేదు. కంగారుగా చాతి మిద చెవి పెట్టి విన్నాడు. గుండె శబ్దం వినపడటం లేదు. "అంటే వీడు చనిపోయాడా" అని ప్రశ్నించుకున్నాడు.  "సార్ ! మా వాణ్ణి కొంచెం లేపండి. నాకు ఏదో భయంగా ఉంది" అన్నాడు ఆశగా.

అందులో ఒకతను సైదులు  చేయి పట్టుకుని నాడి చూసి "ఇతను చనిపోయిండు కదా" అన్నాడు విక్టర్ వంక అనుమానంగా చూస్తూ.

అతని రక్తం అంత జివ్వుమని తలలోకి ఎగబాకింది.  పైకి లేచి ఒక్కసారిగా  అతని ఎడమ చెయ్యితో  అందులో ఒకతని పీక పట్టుకుని పిసికెయ్య సాగాడు. రెండో అతను విక్టర్ ను గట్టిగా పట్టుకుని విడిపించాడు. తర్వాత ఆ ఇద్దరు కలిసి అతని కాళ్ళు చేతులు కట్టేసి దూరంగా ఉన్నా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.

లోపలికి  వెళ్ళి జరిగింది చెప్పారు. యస్ ఐ వచ్చి "ఎందుకు చంపావు రా వాణ్ణి" అడిగాడు కరకు గొంతుతో.

"నేను కాదు సార్ . పాము కరిచి చనిపోయాడు" అన్నాడు విక్టర్ భయ పడుతూ.

"మరి నువ్వేం చేశావ్? హస్పిటల్ తీసుకు రాకుండా" అడిగాడు యస్ ఐ అనుమానంగా చూస్తూ.

"నేను స్పృహ కోల్పోయాను సార్"  చెప్పాడు విక్టర్.

"ఏంట్రా ! ఒక్కొక్కటి చెపుతున్నావ్. అసలు జరిగిన విషయం మొత్తం ఒక్కసారే చెప్పు" యస్ ఐ చిరాకు పడ్డాడు.

"నా చేతిలో భూతం ఉంది సార్. అది నా మిద దాడి చేసింది, అందుకే స్పృహ కోల్పోయాను" విక్టర్ బిడియం నిండిన భయం తో చెప్పాడు.

ఒక్కసారిగా అందరు ఘొల్లుమని నవ్వారు పోలీస్ స్టేషన్ లో. యస్ ఐ కూడా నవ్వుతూ "భూతం నీ చేతి లో ఉండి నిన్నే కొట్టింది ! అప్పుడు నువ్వు స్పృహ కోల్పోయావ్ ! అంతేనా?" అడిగాడు వెటకారంగా.

"నిజం సార్. మైసమ్మ కూడా చూపించాడు నీళ్ళ లో" విక్టర్ నమ్మించాలని చూస్తున్నాడు.

మైసమ్మ గురించి తెలుసుకుని అతని దగ్గరికి ప్రయాణం అయ్యారు పోలీసులు విక్టర్ తో పాటు.

*************************************************

మైసమ్మ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు ధ్యానం చేస్తున్నట్లుగా. "ఏంట్రా నువ్వు ఏదో భూతం ఉందని ఋజువు చేశావట?" అడిగాడు యస్ ఐ తన సహజ దోరణి లో.

మైసమ్మ కళ్ళు  తెరవ కుండానే "చూపించాను, దాని జాడ చూపించాను. తేట నీటి లో దాని కదలిక చూపించాను" అన్నాడు రాగ యుక్తంగా ఉగిపోతూ.

అతని దొరణికి ఆక్కడున్న అందరు పోలీసులు పక్కున నవ్వారు యస్ ఐ తో  సహా.

"నవ్వకండ్రా ! నాశనం అయి పోతారు" అన్నాడు ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా కళ్ళు  మూసుకునే ఉగిపోతూ.

యస్ ఐ కి మండి  పోయింది. లాటి తీసుకుని ఒక్కటి తగిలించాడు మైసమ్మ కు. అదిరి పడి టక్కున కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఏదో విచిత్రమయిన భాష తో, ప్రవర్తనతో  వారిని భయ పెట్టాలనుకున్న అతనికి  అర్ధం అయిపొయింది తన ఆటలు సాగవని.

"చెప్పురా !  వీడి  చేతిలో దెయ్యం ఉందని ఎం మంత్రం వేసి చుపించావ్? " యస్ ఐ కోపంగా అడిగాడు.

మైసమ్మ భయపడుతూ "మంత్రం కాదు, ఏది కాదు సార్. వాటిని నమ్మే వాళ్ళను మోసం చెయ్యటానికి ఒక అడ మనిషిని,  కొందరు మనుష్యుల చేత దెయ్యం పట్టిందని నా దగ్గరికి రప్పించాను,  తర్వాత నేనే మంత్రాలతో బాగు చేసినట్లు ప్రచారం చేయించాను.  అప్పటినుండి జనం నా దగ్గరకు రావటం మొదలయింది. వాళ్ళ సమస్యలు ముందే తెలుసుకుని ఏదో ఒక ట్రిక్ తోని వాళ్ళకు ఋజువులు చూపించి, ఏవో తాయెత్తులు కట్టి పంపుతా. అంతే సార్ ! అంతే" అన్నాడు.

"వీళ్ళకు చూపించిన ట్రిక్ ఏందీ రా?" అడిగాడు యస్ ఐ విక్టర్ ను చూపిస్తూ .

"ఎడమ చెయ్యి లో ఏదో సమస్య ఉందని చెప్పగానే ఒక ట్రిక్ చేసిన సార్. కొన్ని మంచి నీళ్ళలో మిరియాల పొడి కలిపి, మంత్రాలూ చదువుతున్నట్లు  అతని చేతులు రుద్దుతూ  ఎడమ చెయ్యికి,  చేతులు కడుక్కునే సబ్బు రుద్దినా.  సబ్బు చెయ్యి నీళ్ళ మధ్య లో పెట్టగానే మిరియాల పొడి పక్కలకు జరిగి పోతది. దాన్నే దెయ్యం అని చెప్పి  ఋజువు చూపించిన" అన్నాడు మైసమ్మ గజ గజ వణికి పోతూ.

"నీకెలా తెల్సురా ఈ ట్రిక్కు" ఆశ్చర్య పోయాడు యస్ ఐ.

"ఒక అయన దగ్గర నేర్చుకున్నాను సార్" మైసమ్మ అలాగే భయపడుతూ చెప్పాడు.

ఇందంతా విన్న విక్టర్ కు  అవమానంగా అనిపించింది. సిగ్గు తో చితికి పోయి కిందికి మొఖం వేలడేసాడు.  కొద్ది సేపటికి అతని  ఎడమ చెయ్యి మైసమ్మ పీక పట్టుకుని పిసెకెయ్య సాగింది. మైసమ్మ పెనుగు లాడుతున్నాడు.  విక్టర్ భయంతో కుడి చేతితో దాన్ని లాక్కుంటున్నాడు, కాని రావటం లేదు. ఇదంతా చూస్తున్న పోలీసులు కొద్ది సేపు ఆశ్చర్య పోయి, విక్టర్ చేతిని విడిపించారు.

"ఏంట్రా నువ్వు ! నాటకాలు ఆడుతున్నావా?"  అడిగాడు యస్ ఐ విక్టర్ చెంప వాయించి .

"లేదు సార్ ! నిజంగానే నాకు ఏదో అయ్యింది. ఆ రోజు ప్రియమణిని సైదులు గాడు చంపినప్పటి నుండి నాకు ఇలాగె జరుగు తోంది" భయంతో వణికి పోతున్నాడు విక్టర్.

"సైదులు గాడు అంటే పాము కరిచి చనిపోయాడు అన్నావ్ ! వాడేనా? ఎవరిని ? ఎప్పుడు? ఎందుకు?  చంపాడు. జరిగింది మొత్తం చెప్పు" క్యురియాసిటి పెరిగి పోయింది యస్ ఐ కి.

అంత పూస గుచ్చినట్లు చెప్పాడు విక్టర్. అది వినగానే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాడు యస్ ఐ. అలాగే మైసమ్మను జీప్ లో తమ తో పాటు స్టేషన్ కు తెచ్చారు.

************************************************

"మా కళ్ళ ముందే జరిగింది డాక్టర్. వీడి చెయ్యి వాడి ప్రమేయం లేకుండా కొట్టటం మేం చూశాం" తన ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూ చెప్పాడు యస్ ఐ. 

డాక్టర్ విశ్వం ఒక సైకియాట్రిస్ట్.  విక్టర్ ను తన ఛాంబర్ లోకి తీసుకెళ్ళి ఆ రోజు జరిగిన ప్రతి విషయం చెప్పించుకున్నాడు. తర్వాత యస్ ఐ దగ్గరికి వచ్చి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు. 

"ఇది ఒక సైకలాజికల్ డిసార్డర్. దిన్ని ఎలియాన్ హ్యాండ్ (Alien Hand) అంటారు. తెలుగు లో భూతం చెయ్యి అనవచ్చేమో. దీనికి లోనయిన వ్యక్తీ తన  చెయ్యి మిద అధిపత్యం కోల్పోతాడు. తనకు తెలియ కుండానే ఆ చెయ్యి తో ఇతరులను కానీ, తనను తను కాని భాధ పెట్టుకుంటాడు. అలాగే తనకు తీరని కోరికలను ఆ చెయ్యి తో తిర్చుకుంటాడు. మళ్ళి కొద్ది సేపటికి ఆ చెయ్యి  మాములుగా అయిపోతుంది" ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నా డాక్టర్ ను ఆశ్చర్యంగా చూస్తున్నాడు యస్ ఐ. 

"విక్టర్ చెప్పిన ప్రకారం, ఆ రోజు రాత్రి పోలీస్ జీప్ సౌండ్ విని కంగారుగా పరుగు పెడుతున్నా తనకు,  ఎదురుగా ఎవరో ఉన్నారని తోచి ! వారిని తోసేయ్యలనుకున్నాడు. కాని అక్కడ ఎవరు లేక పోయేసరికి కింద పడ్డాడు. అప్పుడే తనకు ఈ డిసార్డర్ ఎటాక్ అయ్యింది" అన్నాడు డాక్టర్ వివరిస్తూ. 

"జస్ట్ ఎవరో ఉన్నారనుకుని ! లేకుండా పడి పొతే నే ! ఈ జబ్బు వచ్చిందా?" ఆశ్చర్యం వ్యక్తం చేశాడు యస్ ఐ. 

"సింపుల్ గా చెపుతాను. చర్యకు ప్రతి చర్య జరుగుతుంది ! అలా  జరిగి తీరాలి. ఉదాహరణకు మనం ఒక పామును చూస్తే దూరంగా జరగాలని అనుకుంటాం. అందుకు తగ్గట్లుగా మన మెదడు మన కాళ్ళకు పరుగు పెట్టామని ఇన్స్ స్ట్రక్షన్స్ ఇస్తుంది.వాటి ప్రకారమే మన కాళ్ళు పరుగు పెడుతాయి.  ఒక వెళ మనం అధిక ఒత్తిడి లో ఉన్నప్పుడు ఇన్స్ స్ట్రక్షన్స్ వచ్చి దానికి తగినా ప్రతి చర్య జరగక పొతే, మన మెదడు ఇచ్చిన ఆదేశాలను పాటించ లేక మన శరీరం లో నరాలు, తిరిగి అవే ఆదేశాలను పంపిస్తాయి మెదడుకు. అప్పుడు మెదడు లో నరాలు చితికి  పోయి ఈ జబ్బుకు గురయ్యే అవకాశం ఉంది. ఆ రోజు ఎంతో ఒత్తిడిలో ఉన్నా విక్టర్ ఎదురుగా  ఎవరో ఉన్నారనుకోగానే, అనుకూలంగా ఉన్నా ఎడమ చేతికి తోసేయ్యమని ఆదెశాలు పంపింది అతని మెదడు. కాని అక్కడ ఎవరు లేక పోయేసరికి చేసేదిలేక తిరిగి మెదడుకు అవే  ఆదెశాలు వెళ్ళెసరికి నరాలు చితికి పోయాయి. అందుకే అప్పుడప్పుడు తన ఎడమ చెయ్యి మిద పట్టు కోల్పోతూ ఉంటాడు. దాన్ని భూతం అనుకుని భ్రమ పడ్డాడు. " అంటూ వివరించాడు డాక్టర్. 

తర్వాత ప్రియమణి ని రేప్ చేసినందుకు విక్టర్ కు తగిన శిక్ష పడింది. 

(అయి పోయింది)

(ఇక్కడ  ఇచ్చిన Alien Hand వివరణ పూర్తిగా కాక పోయిన చెప్పినదంతా  నిజమే చెప్పాను. కాని అందులో టెక్నికల్ విషయాలు రాస్తే ఏదో సైన్స్ ఆర్టికల్ లాగ మారుతుందని సింపుల్ గా చెప్పటం జరిగింది. )