16, నవంబర్ 2013, శనివారం

పేస్ బుక్ - ఫేట్ బుక్ !!!


ఈ మధ్య పేస్ బుక్ పిచ్చి ఎలా తయారు అయ్యింది అంటే !   పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే పక్కనే ఉన్నా ఫోన్ తీసుకోని ఒక్కసారి ఫేస్బుక్ ఓపెన్ చేసి ఏవయిన కొత్త  నోటిఫికేషన్ లు వచ్చాయ ? అని చూడటంతో రోజు మొదలు అవుతుంది.  ఎవరయినా నేను వేసిన పోస్ట్ ను లైక్ చేసారా? ఏదయినా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా? ఆత్రంగా చూస్తారు. కాని ఉన్నా ఒక్క నోటిఫికేషన్ ఏదో గేమ్ రిక్వెస్ట్ అని తెలుసుకొని అది పంపిన ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ ను బండ బూతులు తిట్టుకుంటూ రోజు మొదలు పెడుతారు. అది అమ్మాయి అయినా  అబ్బాయి అయినా. 

ఆపై "గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనో"  లేక "ఈ రోజు చాల పని ఉంది" అనో పోస్ట్ వేసి బాత్రూం లో దూరి పోతారు. అక్కడ కూడా అదే ఆలోచన "ఈపాటికి ఎవరయినా నా పోస్ట్ లైక్ చేసి ఉంటారు, లేదా ఏదయినా రాసి ఉంటారు" అని. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, ఏంటంటే ! ఒకవేళ ఆ పోస్ట్ అమ్మాయి వేస్తె కుప్పలు తెప్పలుగా రిప్లై లు ఉంటాయి. "వేరి గుడ్ మార్నింగ్" అని లేదా "అయ్యో పాపం, ఐ విష్ ఐ కుడ్ హెల్ప్ యు" అని. తనకు పెళ్లి అయ్యింది అని తెలిసిన కూడా! అదే అబ్బాయి వేస్తె అసలు ఎవడు రిప్లై ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా వెటకారాలు. 

ఇక విషయనికి వస్తే,  స్నానం చేసి వచ్చి మళ్ళి ఒక్కసారి చూసి, ఏమి రాక పొతే ఉసురుమని, ఎవరైనా లైక్ చేస్తే సంతోష పడి పోతారు.  టిఫిన్ చేసి, ఆఫీసు కో, కాలేజీ కో వెళ్ళె ముందు మళ్ళి చూసి ఇంటి నుండి బయట పడుతారు. 

ఇంకా బస్సులో లేదా ఆటో లో వెళ్ళె వారికీ పండగే పండగ . అదే ఫేస్బుక్ ను అటు ఇటు తిప్పి తిప్పి చూస్తూ ఉంటారు. ఎవరు ఆన్లైన్ లో ఉన్నారో చూసి తమకు దగ్గరి స్నేహితులయితే చాట్ చెయ్యటం మొదలు పెడుతారు. ఎవరయినా నచ్చని వారు ఆన్లైన్ లో కనిపిస్తే "వీడికి పనేమీ ఉండదా? ఎప్పుడు చూడు ఫేస్బుక్ లో పడి ఏడుస్తూ ఉంటాడు?" అని తిట్టుకుంటారు. కాని వారి గురించి కూడా మిగత వారు అలాగే అనుకుంటారని తెలుసు కోలేరు. 

ఇంకా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు అయితే పని చేసేది తక్కువ ఫేస్బుక్ లో పోస్ట్ లు వెయ్యటం ఎక్కువ. కనీసం ప్రతి ముప్పయి నిమిషలకయినా ఒక్కసారి ఫేస్బుక్ ఓపెన్ చేయ్యనిదే వారికీ లాజిక్ తట్టదు, పని సాగదు.  కాలేజీ లో క్లాసు మధ్యలో, క్యాంటీన్ లో అదే గోల, పేస్ బుక్ లీల. 

ఇంకో విషయం ఇక్కడ చెప్పుకోవలసింది ఏంటంటే, మీకు ఎక్కువ లైక్ లు రావాలంటే మీరు ఎక్కువ లైక్ లు చెయ్యాలి. అంతే మరి-గివ్ అండ్ టేక్ పాలసీ. ఎవరయినా మంచి ఫోటో పెట్టినా, విషయం పోస్ట్ చేసినా మేము లైక్ చెయ్యం. ఎందుకంటే ఇంతకూ ముందు నా పోస్ట్ వాడు లైక్ చెయ్యలేదు. ఎవరయినా మీ పోస్ట్ లైక్ చెయ్యక పొతే ఒక్కసారి వెనుకకు వెళ్ళి చూడండి, మీరు వారి పోస్ట్ ను లైక్ చెయ్యలేదు. రెండు రోజుల క్రితం వారు వేసిన పోస్ట్ లైక్ చేసి చూడండి! ఇప్పుడు వెంటనే మీ పోస్ట్ కు లైక్ వస్తుంది. 

ఫారిన్లో  ఉంటున్నా వారి సంగతి చెప్పాలంటే,  వారు ఎప్పుడు ఎం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఇండియా లో ఉండి చెప్పెయ్యచ్చు. ఏదయినా రెస్టారెంట్ కు వెలితే చెక్ ఇన్. ఏదయినా పార్క్ కు వెళితే చెక్ ఇన్. ఎక్కడికి వెళ్ళిన చెక్ ఇన్. జీవితం అంత అక్కడే ఉండబోతున్నట్లు! ఇంకా ఫోటో ల సంగతి  చెప్పతరం కాదు. ఫాల్ సీజన్లో ఫోటోలు, స్నో సీజన్లో ఫోటోలు, సన్నీ డే ఫోటోలు, రైన్ సీజన్లో ఫోటోలు. ఎ కొత్త డ్రెస్ కొన్న ఫోటో పెట్టెయ్యటం.  కొత్తగా పెళ్ళయి కాస్త మంచి పర్సనాలిటీ ఉన్నా పెళ్ళాం దొరికిందా! అంతే, రెండు రోజులకు ఒక పోస్ట్ ఉంటుంది ఫొటోలతో. అందరిలోకి తామే గొప్ప రొమాంటిక్ జంట అయిపోవాలన్న ఆత్రం దాచిన దాగదు.  SLR కెమరాలు థాంక్స్ గివింగ్ టైం లో కోనేయటం, జిడ్డు మొహాలు బాగా పడిన నాలుగు ఫోటోలు  వెతికి పట్టి అప్లోడ్ చేస్సేయ్యటం. 

ఇండియా లో ఉన్నా ఫ్రెండ్స్ లో కొందరు "అచ్చం హీరోలాగా ఉన్నావ్, సమంత లాగా ఉన్నావ్" అని కామెంట్స్ ఇచ్చేది చూసి "అనవసరంగా సాఫ్ట్వేర్ లోకి వచ్చాం, సినిమాల్లోకి వెళితే బాగుండేది" అని ఫీల్ అయిపోవటం కూడా జరుగుతుంది.  ప్రతి వారి ఫ్రెండ్స్ లో (అంటే లిస్టు లో) ఒక్క కుళ్ళు బ్యాచ్ ఉంటుంది. ఎదుటి వాడు ఏది పోస్ట్ చేసినా లైక్ చెయ్యరు కాని కుళ్ళు కుంటూ ఉంటారు.  "వీడికి అంత సీన్ ఉందా? దిని మొహానికి సమంత!" ఇలా సాగిపోతాయి వారి పేస్ బుక్  కష్టాలు.  మరో రకం ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడో పక్కోడు విరి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాడని, ఇప్పుడు వాడేదో కాస్త మెరుగయితే చూసి తట్టుకోలేక,  వాడు ఎ  పోస్ట్ వేసినా ఏదో వెటకారాలు అడి తమ కుళ్ళును భయట పెడుతుంటారు. 

ఇంకా కొందరు మమ్మీ లు చాల ఎమోషనల్ అయిపోతారు వారి పిల్లల గురించి  "ఐ మిస్ మై కిడ్ ! ఐ కాన్ నాట్ థింక్ అఫ్ మై లైఫ్ వితౌట్ మై క్యుటి" అని. అప్పుడప్పుడు భర్తల గురించి భార్యల  గురించి కూడా పోస్ట్ లు వేసి లైక్ ల కోసం చకోర పక్షుల్ల ఎదురు చూస్తుంటారు. ఇంకా ఇంట్లో ఏది వండిన దాని రుచి ఎలా ఉన్న, పోస్ట్ వేసి నోరు ఉరించాలని ఉవ్విలురి పోతుంటారు. 

పేస్ బుక్ తో  ఉన్నా ఇంకో లాభం ఏంటంటే! ఏదయినా నచ్చని విషయం ఉంటె దాని మీద పోస్ట్ వేసి తిట్టేయ్యటం. నచ్చిన విషయాని పోగిడేయ్యటం. సినిమా మీద, హీరోల మీద విరుచుకుపడి నోటి దూల తీర్చుకోవటం. రాజకీయ నాయకుల మిద, దేశం మీద దుమ్మెత్తి పోస్తూ తమ దేశ భక్తిని, విరక్తిని ప్రదర్శంచి ఉద్దరిస్తున్నట్లు ఫీల్ అయిపోవటం.

ఇంకా కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు ఏదయినా కొత్త టెక్నాలజీ గురించి అకస్మాత్తుగా చూసి పోస్ట్ వేసేస్తారు. ఎందుకంటే! అందరి ముందు తాము ఎంత గొప్పగా కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నామో చూపించటానికి. నిజానికి నూటికి 90 మంది ఏదో ఓపెన్ చేసి అనుకోకుండా దిన్ని చూసి,  పోస్ట్ వేసేవారే. 

ఎక్కడయినా రేప్ గాని, అన్యాయం  కాని జరిగితే చూడాలి! బండ బూతులతో పేస్ బుక్ నింపేస్తారు, తమ నిరసన తెలిపెస్తారు. ఒక గంట తర్వాత మళ్ళి తమ పోస్ట్ తామే చదివి "ఇదేంటి! మరి ఇంతలా బూతులు పెట్టేసాను?" అని పశ్చాతాప పడుతారు. 

ఇంకా పేస్ బుక్ లో ఫైటింగ్ లు కూడా ఉంటాయి! ఎలా అంటే, ఒకరు  తన వాల్ మీద ఏదో రాస్తారు పక్కొన్ని ఉద్దేశ్యించి.  దానికి వాడికి కాలి తన వాల్ మీద ఇంకేదో రాస్తాడు దానికి కౌంటర్ లాగ. అంతే అక్కడ మొదలు పెట్టి సాగి పోతుంది ఆ పోస్ట్ ల యుద్ధం. కాని ఇద్దరు ప్రత్యక్షంగా ఏమి అనుకోరు. అప్పటినుంచి ఒకరి పోస్ట్ ఒకరు లైక్ చెయ్యటం ఆగిపోతుంది. 

పేస్ బుక్ లో ఫ్రెండ్స్ ఎప్పుడు మాట్లాడుకోరు, ఆన్లైన్ లో కనిపించిన పలకరించు కోరు. కాని ఒకరి పోస్ట్ లు ఒకరు లైక్ మాత్రం చేసుకుంటారు. ఎందుకంటే వారికి కూడా లైక్ లు కావాలి మరి. అయితే విటిని అంత పట్టించుకోవాల? పేస్ బుక్ అయిన మరోటి అయినా, మంచిని స్వీకరించు,  చెడును త్రుణికరించు. అంతే  కాని పేస్ బుక్ మాత్రమే జీవితం అనుకుంటే జీవితం లో చాల కోల్పోవటం అతిశయోక్తి కాదు.  పేస్ బుక్ మన సోషల్ లైఫ్ ను పెంచాలి కాని మన వ్యక్తిత్వాన్ని చిన్న బుచ్చకూడదు.  ఇంటర్నెట్ ఉంది, కీ బోర్డు ఉంది కదా అని ఏది పడితే అది రాసేసి తర్వాత మనస్తాపం చెందటం శుద్ధ దండగ. 

మీ అభిప్రాయాలూ కోరుతూ, ఇక్కడితో ముగిస్తున్నాను. 


3 వ్యాఖ్యలు:

  1. కొంపదీసి మీరు ఫేస్ బుక్ ని ఎక్కువగా ద్వేషిస్తున్నారా ఏమిటి. ఊరికే అన్నానులెండి:-) నేను ఫేస్ బుక్ ఎక్కువగా వాడట్లేదు, అయితే కొందరు ఫ్రెండ్స్ ఎక్కువగా చెకిన్ చెయ్యడం గమనించాను. ఇంగ్లండు లో ఇలా అనవసరపు చెకిన్ లు చెయ్యడం ద్వారా తాము ఇంట్లో లేమని, దొంగలకు feel free అని చెప్పినట్లే అని పత్రికల ఉవాచ!

    ప్రత్యుత్తరంతొలగించు