17, ఏప్రిల్ 2014, గురువారం

అమ్మ, నాన్న, ఓ అబ్బాయి!


అవినాశ్ కు చాల భాదగా ఉంది. ఇంకా అవమానంగా కూడా ఉంది. ఇంటర్ లో 90 శాతం మార్కులు తెచ్చుకుని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఇలా ఫెయిల్ అవ్వటం ఉహించుకోలేక పోతున్నాడు. తన ఫ్రెండ్స్ కాంటీన్ లో ఉన్నారని తెలుసుకుని వెళ్ళాడు.

"హాయ్ రా" అంటూ పలకరించారు  నలుగురు కుర్రాళ్ళు.

ఖాళీగా ఉన్నా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఎదురుగా ఉన్నా  వికాస్ చేతిలో  సిగరెట్ లాక్కుని ఒక్క దమ్ము లాగాడు.

"ఏంటి రా! నువ్వెప్పటి  నుంచి మొదలు పెట్టావు?" అడిగాడు సంబ్రమాశ్చర్యాలతో.

"ఎం లేదు రా రిజల్ట్స్ మింగుడు పడటం లెదు. ఫెయిల్ అవ్వటం కొత్త కదా, అందుకే బాధగా ఉంది"  నీరసంగా పలికాడు.

"పర్లేదు మామ ఇకనుంచి అలవాటు అయిపోతుంది. దాని పేరు చెప్పి సిగరెట్ అలవాటు చేసుకోవటం ఎందుకు?" వెటకారం తొణికిస లాడింది అతని  గొంతులో.

అందరు ఘోల్లుమని నవ్వారు.

అసలే బాధలో ఉన్నా అవినాశ్ "ఓరేయ్-నేను ఫెయిల్ అవ్వటం ఎక్కడో పొరపాటు వల్ల జరిగింది. నా పేపర్లో చూసి రాసిన సలీం గాడు పాస్ అయ్యాడు" అన్నాడు ఉక్రోషంగా.

వికాస్ పెద్దగా నవ్వి "అదా నీ భాధ? బాబు వాడు ఒక్క అన్సర్ నీ  పేపర్ లో చూసి రాసాడు. మిగతావి పక్క వాళ్ళ దాంట్లో చూసి రాసాడు. అందుకె  పాస్ అయ్యాడు. నువ్వు మరి అంత ఫీల్ అయిపోకు" అన్నాడు మూతి తిప్పి  వెక్కిరిస్తూ.

అక్కడ ఉన్నా మిగత ఇద్దరు పడి పడి నవ్వ సాగారు.

అవినాశ్ ముఖం కంద గడ్డలా మారిపోయింది. ఉక్రోష పడుతూ "ఏంట్రా పెద్ద చూసినట్లు మాట్లాడుతున్నావ్" అన్నాడు కోపన్ని అణచుకుంటూ.

వికాస్  కు చాల సంబరంగా ఉంది. "దీనికి మళ్ళి చూడాలా! ఎవడ్రా వీడు, పిచ్చి పొంగలం గాడు" అన్నాడు నిర్లక్ష్యంగా చూసి జాలిపడుతూ.

అంతె  అవినాశ్ కోపం కట్టలు తెంచుకుంది. పక్కనే  ఉన్నా కూల్డ్రింక్ బాటిల్ అతని ముందు కూర్చున్న  వికాస్ మీదికి విసిరాడు. అది వెళ్ళి అతని  నుదుటిని తాకింది. వికాస్ స్పృహ కోల్పోయాడు. 

వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. ఇంకాస్త ఆలస్యం అయుంటే చనిపోయే వాడని చెప్పారు డాక్టర్స్. తోటి విద్యార్దిని తీవ్రంగా గాయపరచినందుకు అవినాశ్ ను వారం రోజులు  సస్పెండ్ చేసారు.

"వారం అయిన తర్వాత మీ నాన్న ను తీసుకొచ్చి నన్ను కలిపిస్తేనే అల్లౌ చేస్తాను" అన్నాడు ప్రిన్సిపాల్.

తన తండ్రి అంటే అవినాశ్ కు చాల గౌరవం,  ప్రేమ ఉండేవి. కాని రాను రాను అవి తగ్గిపోతున్నాయి.

ఆయనంటే విసుగు, కోపం పెరిగి పోతున్నాయి. ప్రతి దానికి నస పెడుతాడు, ఇలా ఉండకూడదు, అలా  చేయ కూడదు, అన్ని డబ్బులెందుకు, లెక్క చెప్పు అంటూ ఒక్కటే విసిగిస్తున్నాడు.

ఇక సస్పెండ్ అయ్యానంటే ఎలా రియాక్ట్ అవుతాడో. ఎక్కువగా మాట్లాడితే అసలు ఎదురు తిరగాలి! ఏంచేస్తాడో చూస్తాను అనుకుని ఇంటికి బయలు దేరాడు. 

ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ అమ్మ వసుందర మొదలు పెట్టింది.

"ఏంట్రా! కాలేజ్ లో సస్పెండ్ అయ్యావంటా?" అంది ఆశ్చర్యం, కోపం నిండిన గొంతుతో.

"వారం రోజులు సస్పెండ్ అయినంత మాత్రన ఎదో హత్య చేసి, జీవితం నాశనం అయినట్లు బిల్డప్ ఇస్తావేంటి" అన్నాడు చిరాకుగా.

"ఏంట్రా ఇలా తయారవుతున్నావ్? మీ నాన్న కష్టపడి చదివిస్తుంటే బాగా చదువుకోకుండా ఎందుకు రా ఈ గొడవలన్నీ" అంది బ్రతిమాలుతు.

"దయ చేసి అపు తల్లి. మీ అయన సూర్యనారాయణ గారు అంటే నిప్పు. ఆయనంత కష్టపడి పైకి వచ్చినవారు  ప్రపంచంలో లేరు. ఎన్నో త్యాగాలు చేసి చెల్లిని, నన్ను చదివిస్తున్నాడు. నేను జల్సాలు చేస్తూ పాడయి పోతున్నాను. అంతేనా? రోజు కాలేజ్ వెళ్ళటానికి బైక్ లేదు. కనీసం కాలేజ్ బస్సు కు ఫీజు కట్టలేదు. రోజు సిటి బస్సులో  అంత దూరం వెళ్ళి రావటానికే టైం  అయిపోతుంది. కనీసం ఒక గంట టీవీ చూస్తే ఆయనకు కోపం. క్రికెట్ ఉన్నప్పుడు ఎప్పుడయినా కాలేజ్ మానేస్తే ఎదో గొప్ప తప్పు చేసినట్లు చిందులేస్తాడు. నువ్వేమో అయన గారి త్యాగాలు వృధా  చేస్తున్నానని ఈ నస. ఇంకా అపు" అన్నాడు విసుగు, వెటకారం నిండిన గొంతుతో రెండు చేతులు జోడిస్తూ.

వసుందర నివ్వెర  పోయింది. తనకు ఏం  మాట్లాడాలో అర్ధం కావటం లేదు. తమ కుంటుంబ పరిస్థితులు  అవినాశ్ కు ఎలా వివరించాలో తెలియటం లేదు. ఎంతో కష్టపడి చదువుకుని గుమస్తా నుండి సుపరిండేంట్ గా ఎదిగి, నిజాయితికి మారు పేరయిన భర్తను తలచుకుంటే చాల గర్వంగా ఉంటుంది.

కాని వీడు! ఎవరో డబ్బున్న  స్నేహితులతో పోల్చుకుని ఇలా అసంతృప్తి పడుతూ, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. బాధతో నిట్టూరుస్తూ వంట గదిలోకి వెళ్ళి పోయింది. 

ఆఫీసు  నుండి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే హల్లో టీవీ చూస్తూ టిపిన్ చేస్తున్న అవినాశ్ ను చూడగానే కోపంతో రెచ్చిపోయాడు సూర్యనారాయణ.

"అంత తాపీగా టీవీ ఏలా చుడలనిపిస్తుందిరా నీకు? అసలు నోట్లోకి ముద్ద ఎలా దిగుతుందిరా?" అడిగాడు కోపంగా.

అవినాశ్ ఏమి పట్టించుకోకుండా చానెల్ మార్చటంలో బిజీ అయిపోయాడు. అంతే సూర్యనారాయణకు చిర్రెత్తుకొచ్చింది.

అవినాశ్  రెక్కపట్టుకుని లేపి "ఏంట్రా పొగరు! నేను మాట్లాడుతుంటే ఏమి పట్టించుకోకుండా" అంటూ రెండు చెంపలు వాయించాడు.

మళ్ళి కొట్ట బోతున్న తండ్రి చెయ్యి  పట్టుకుని "ఏయ్ అపు. ఇప్పుడు ఏం  చేశానని నన్ను తిడుతున్నావ్? ఇలా కొడుతున్నావ్? మర్డర్ చెయ్యలేదు, జస్ట్ గొడవ పడ్డాను. వారం రోజులు సస్పెండ్ అయ్యాను అంతే. నువ్వు ఇచ్చే సౌకర్యాలకు స్టేట్ ఫస్ట్ రావలనట్టు బిల్డప్ ఇస్తావేంటి. నువ్వేం చదివావ్? జస్ట్ ఇంటర్ మీడియట్. ఎదో లక్కీగా ఆఫీసర్ అయ్యావ్" అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ బయటకు వెళ్తున్న కొడుకును ఎం చేయాలో అర్ధం కాలేదు సూర్యనారాయణకు.

 దుఖం, కోపం ఒక్కసారిగా కలిగాయి అతనికి. 

సవతి తల్లి వద్ద ఉంటూ, ఆవిడా పెట్టె భాధలు భరిస్తూ, వర్షం పడితే, వాగు నుంచి ఈదుకుంటూ, పక్క ఉరికి వెళ్ళి పది వరకు చదువుకున్నాడు. కాలేజ్ లో చేరగానే ట్యూషన్ లు చెప్పుకుంటూ ఇంటర్ వరకు చదువుకున్నాడు. గుమస్తాగా గవర్నమెంటు జాబ్ సంపాదించి ఓపెన్ యూనివర్సిటీ లో డీగ్రీ పూర్తీ చేసి, డిపార్ట్మెంటు పెట్టిన పరిక్షలు పాస్  అయి సుపరిండేంట్ అయ్యాడు.

కాని వీడు!  చదువుకోవటానికి అది లేదు, ఇది లేదు అంటూ సాకులు చెపుతున్నాడు. తను సవతి తల్లిన్నే సొంత తల్లిలా చూసుకుంటున్నాడు. కాని వీడు! సొంత తల్లి, తండ్రి అయిన తమను అసలు చూసుకుంటాడ?  అనుకుంటూ  సోఫా లో కూలబడి పోయాడు.

చిన్నప్పుడే తన తల్లి చనిపోవటంతో తన తండ్రి మరో పెళ్ళి  చేసుకున్నాడు. వచ్చిన ఆవిడకు పిల్లలు పుట్టలేదు. కాని ఎప్పుడు  తనను చాల కష్టపెట్టేది. ఆదివారం వచ్చిందంటే చాలు గొడ్లు కాయటానికి, పొలం పనులకు పంపేది. కాని ఎ రోజు తన చదువుకు అడ్డు చెప్పలేదు. తాను ఈ రోజు ఉన్నా ఈ  స్తితికి ఆవిడే కారణం.

ఇలా ఆలోచిస్తున్న సూర్యనారాయణ భార్య పిలుపుతో ఈ  లోకం లోకి వచ్చాడు. 

"ఏమండి అత్తయ్యా పరిస్థితేం  బాగాలేదు. హాస్పిటల్ కు  తీసుకెళ్ళండి ఒక్కసారి" అని చెప్పి అవినాశ్ ను కేకేసింది వసుందర  "ఒరేయ్ అవి నాన్నకు తోడుగా వెళ్ళు".

"తల్లి కాని తల్లి కోసం ఏంటో? ఈ అనవసరమయిన ఖర్చులు. సొంత పిల్లలకు లేకుండా" అన్నాడు అవినాశ్  గొంతులో కోపం, చిరాకు ద్వనించే లాగ.

"ఆవిడే లేక పొతే ఈ రోజు ఇలా ఉండేవాడివి కాదురా.  మీ నాన్న పాలేరుగా మారిపోయే వాడు. నువ్వు పెడకాడులు ఎత్తుతూ చిన్న పాలేరు గా ఉండే వాడివి. అవును! ఆవిడా నన్ను ఎన్నో భాదలు పెట్టింది, పాచి పోయిన అన్నం పెట్టింది.  బండెడు చాకిరీ చెప్పేది.  కాని చదువు అనేసరికి ఏ  రోజు నన్ను ఆపలేదు. ఆవిడే గనుక మా నాన్నతో వాడి చదువు మానిపించండి అంటే ఖచ్చితంగా చేసేవాడు. కాని ఆవిడా ఆ పని చెయ్యలేదు. అందుకెరా, తల్లి కాని ఆ తల్లి కోసం అంత తపన" అన్నాడు సూర్యనారాయణ చెమర్చిన కళ్ళతో.

అవినాశ్ దీర్ఘంగా నిట్టూర్చి బయటకు దారి తీసాడు అటో తీసుకు రావటానికి. 

"ఆవిడకు వయసు అయిపోతుంది కదండీ, పైగా షుగర్ పేషెంటు. మీరు మాత్రం ఎంతని ఖర్చు పెడుతారు" అన్నాడు డాక్టర్.

"సాద్యం అయినంత వరకు పెడుతాను డాక్టర్. కాని మా పిన్ని వీలయినన్ని రోజులు  మా మద్య ఉండేలా చూడండి" అన్నాడు సూర్యనారాయణ బ్రతిమాలుతూ.

 "సరే మీ ఇష్టం" అంటూ ఏవో మందులు రాసిచ్చి వెళ్ళి పోయాడు డాక్టర్.

"బాబు నన్ను క్షమించరా" అంది సూర్యనారాయణ పిన్ని దుఃఖ పడుతూ.

"ఎందుకు పిన్ని? నాకు ఓపిక  ఉన్నంత వరకు నీకు ఎ లోటు రానివ్వను" సూర్యనారాయణ భరోసా ఇస్తూ పలికాడు.

"అది కాదురా-నీకు ఒక నిజం చెప్పాలి"ఆవిడ పెదాలు వణుకుతున్నాయి భయంతో.

అవినాశ్, సూర్యనారాయణ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆమెను. ఆమె తల దించుకుంది నోట  మాట రాక.

"నా దగ్గర సంకోచం ఏంటి పిన్ని. చెప్పు  ఏంటది?" అన్నాడు సూర్యనారాయణ ధైర్యం చెపుతూ.

"నిన్ను స్కూలుకు పంపింది వాగులో పడి కొట్టుకు పోతావని, నీ పీడ విరగడవుతుందని.  అంతే  కాని నీ  మిద ప్రేమతో కాదురా" అంది బోరుమని ఏడుస్తూ.

అవినాశ్ దిగ్బ్రాంతి కి లోనయ్యాడు, ఒక్క సారిగా కోపం పొంగుకొచ్చింది.

కాని సూర్యనారాయణ మాత్రం నవ్వుతూ "ఇప్పుడెందుకు చెపుతున్నావ్ అమ్మ?"  అడిగాడు సౌమ్యంగా.

"నీ  తల్లి ప్రేమ ముందు నా కుళ్ళు తనం కొట్టుకు పోయింది రా. నా కపటత్వాన్ని ప్రేమ అనుకుంటు ఉంటె తట్టుకోలేక పోతున్నాను. అందుకే నిజం చెప్పి నా మనసు తేలిక చేసుకున్నాను" అంది సూర్యనారాయణ రెండు చేతులలో మొఖాన్ని దాచుకుని  ఏడుస్తూ.

"అమ్మ! తల్లి, తండ్రి శాపాలు పిల్లలకు దీవెనలు అంటారు. అలా నీ శాపనర్దలే నాకు దివేనలయ్యాయి, నన్ను ఈ స్థితికి చేర్చాయి. నువ్వు ఇప్పుడు ఇలా భాదపడి నీ ఆరోగ్యం ఇంకా పాడు చేసుకుంటే ఎలా? నా ఉపిరి ఉన్నంత కాలం నీకు  ఏ లోటు లేకుండా చూసుకుంటాను. నువ్వు అస్సలు అధైర్య పడొద్దు" అంటూ గట్టిగా హత్తుకున్నాడు  అ తల్లి కాని తల్లిని. 

ఇదంతా చూస్తున్న అవినాశ్ కు తండ్రి నిర్మల మయిన మనసు కళ్ళకు కట్టింది. అయన ఔదార్యం తన పోకిరి తనన్ని చాచి కొట్టింది.

తల్లి, తండ్రి గొప్పతనం, వారి స్థానం తనకు తెలిసి వచ్చాయి. తన ప్రవర్తనకు తన మీదే అసహ్యం వేసింది.

అది లేదు, ఇది లేదు అంటూ ఫిర్యాదులు మానేసి, ఏమి లేకుండా ఉన్నత స్థితికి వచ్చిన తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలనుకున్నాడు. ఎప్పుడు అమ్మ నాన్న కు ఎదురు చెప్పకూడదని, చదువులో ఎప్పుడు ఫస్ట్ రావాలని ఆ క్షణమే  నిర్ణయించుకున్నాడు.

తండ్రి దగ్గరికి వెళ్ళి "సారి నాన్న" అని సిగ్గుపడుతూ నిలబడ్డ కొడుకును చేరదిసి  "నువ్వు పాడవుతుంటే  చూసి తట్టుకోలేను రా నాన్న" అన్నాడు సూర్యనారాయణ.

"ఇంకెప్పుడు అలా  చెయ్యను నాన్న" అంటూ తండ్రిని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి  ఏడ్చాడు అవినాశ్. 

నువ్వు ఏది నాటితే అదే కోతకు  వస్తుంది. నువ్వు నీ తల్లి, తండ్రిని గౌరవిస్తే, నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు. 

(సమాప్తం)

12 వ్యాఖ్యలు: