30, ఆగస్టు 2012, గురువారం

అమెరికా అమ్మాయి

(కథ చదివే ముందు, హీరోయిన్ అమెరికా అమ్మాయి, తను ఇంగ్లిష్ లో మాట్లాడినా, మన సుఖం కోసం నేను తెలుగు లోనే రాసాను.)

సంజయ్ చాలా టెన్షన్ గా వాచ్ లో టైమ్ చూసుకుంటూ  ఎదురు చూస్తున్నాడు. కేథరీన్ వస్తుందో రాదొ అని చాలా భయపడుతున్నాడు. చాలా రోజులు ప్రయత్నించిన తర్వాత నిన్ననే తనతో డేట్ కు ఒప్పుకుంది. అసలు కేథరీన్ చాలా పాపులర్ కాలేజ్ లో. తాను అమెరికా అమ్మాయి, చక్కని శరీర సౌష్టవం, అందమయిన ముఖం, తన తండ్రి మెక్సికన్ కావటం తో నల్లని జుట్టు  తో దేవత మూర్తిలాగే ఉంటుంది.

సంజయ్ ఎమెస్ చెయ్యటానికి అమెరికా వచ్చాడు. తనది ఇండియాలో ఆంద్రప్రదేశ్, సొంత ఉరు హైదరాబాద్. తనను చూసినప్పటినుండి మెల్ల మెల్లగా పరిచయం పెంచుకుని, సంవత్సరం నుంచి డేట్ కు రమ్మంటే ఈ రోజు ఒప్పుకుంది కేథరీన్.

అందుకే తనకు ఇష్టమయిన ఇండియన్ రెస్టారెంట్ వద్ద తన కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పటికే సమయం సాయంత్రం 6  గంటల ౩౦ నిమిషాలు, తాను వస్తానన్న సమయం 6 గంటలు. ఇంకా రాదేమోనని నిరాశపడుతుండగా దూరంగా తన కారు వస్తు కనిపించింది. 

ప్రాణం లేచి వచినట్లయింది, ఉషారుగా  పరుగెత్తి తన కారు డోర్ తెరిచి "వెల్ కామ్  బ్యూటీపుల్" అంటూ కొంటె గా నవ్వుతూ వంగి చేయితో దారి చూపించాడు.

"ఓ థాంక్స్" అంటూ చిన్న గర్వంతో చిలిపిగా నవ్వుతూ సంజయ్ ని అనుసరించింది కేథరీన్.

రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత "నాకు ఇండియన్ డిషస్ గురించి ఏమీ తెలియదు, పూడ్ నువ్వే ఆర్డర్ చెయ్" అంది కేథరీన్.

సంజయ్ తన కిష్టమయిన వాటిని ఆర్డర్ చేశాడు. ఆతర్వాత  ఇద్దరు కబుర్లలొ పడ్డారు.

"ఆ మద్య ఇండియా వెళ్తానన్నావు" అడిగింది కేథరీన్ .

"ప్లైట్ ఛార్జీలు పెరిగి పోయాయి. మళ్లీ ఎప్పుడయిన అని వాయిదా వేసుకున్న" అన్నాడు సంజయ్.

"మీ కుటుంబం గురించి చెప్పు అయితే" అంది కేథరీన్.

"అమ్మ, నాన్న చెల్లెలు, పిన్ని, బాబాయి, వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంకా తాతయ్య నాన్నమ్మ. ఇలా మాది చాలా పెద్ద కుటుంబం." అంటూ వివరించాడు.

ఆది వింటూనే కేథరీన్ ఆశ్చర్యంగా "ఏంటి ఇంతమంది ఒకే ఇంట్లో ఉంటారా ! అసలు ప్రైవసి దొరుకుతుందా?" అంది.

అప్పుడు సంజయ్ "ఎందుకో ప్రైవసి అనే మాటే మాకు గుర్తు రాదు. అందరం కలిసి ఉండటానికి అలవాటు పడిపోయాం" అన్నాడు.

"మీరు మాత్రమేనా లేక ఇండియాలో అందరు అంతే ఉంటారా" అంటూ ఆరాతీసింది కేథరీన్.

"ఈ రోజులో ఇండియాలో కూడా ఎవరు ఉమ్మడి కుటుంబాలు ఇష్టపడటం లేదు, కానీ అందరు కలిసి ఉండటంలో ఎంతో సుఖం ఉంటుందని నా అభిప్రాయం" అన్నాడు సంజయ్.

"ఎప్పుడో పండుగలకు, పంక్షన్స్ కు కలుసుకోవటం లో ఉన్న ఆనందం రోజు కలిసి ఉండటంలో ఉండదని నా అభిప్రాయం" అంది కేథరీన్. 

ఇంకా టాపిక్  మార్చక పోతే కొంప మునిగేలా ఉందనిపించింది సంజయ్ కు.

"ప్రేమ, పెళ్లి మీద ని అభిప్రాయం ఏంటి" అడిగాడు సంజయ్.

కేథరీన్ కు విషయం అర్థం అయి కొంటె గా నవ్వుతూ "ఇంకా ఏమీ ఆలోచించ లేదు, వాటి మీద ఏ అభిప్రాయం ఏర్పడా లేదు. ని విషయం ఏంటి !" అంది.

సంజయ్ సిగ్గు పడుతూ " మా ఇంట్లో అప్పుడే నాకు మ్యచెస్ చూస్తున్నారు. కానీ నాకు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుంది" అన్నాడు.

"అయితే ఇంకేం? ఎవరో ఒక్క అమ్మాయిని ప్రేమించెయ్. నీకేంటి మంచి ఎత్తు, రంగు అచ్చం మీ బాలీవుడ్ సినిమాల్లో హీరోల ఉంటావ్. ఎవరయినా ఒప్పుకుంటారు." అంది కేథరీన్.

"నిజంగానా! అయితే నువ్వు కూడా ఒప్పుకుంటవా?" అన్నాడు సంజయ్ అప్రయత్నంగా.

"ఏంటి?" అడిగింది కేథరీన్ ఆశ్చర్యంగా.

"సారి కేథరీన్. అనుకోకుండా నా మనసులో మాట బయట కొచ్చింది. కానీ నిన్ను మనస్పూర్తిగా ప్రేమించటం మాత్రం నిజం. కాలేజ్ కు వచ్చిన మొదటి రోజే నిన్ను చూసి ఇష్టపడ్డాను, నువ్వు మా క్లాసు కాదని తెలిసి చాలా భాధ పడ్డాను. మీ క్లాసు వాళ్ళతో ఆపార్టుమెంటు లో ఉంటూ ని పరిచయం కోసం ఆరు నెలలు ప్రయత్నించాను. నీతో మాట్లాడిన మొదటిసారి నా ఆనందానికి అంతే లేదు. ఆ తర్వాత చిన్న చిన్నగా నీతో స్నేహం పెంచుకొన్నాను. ఈ డేట్ కోసం సంవత్సరంగా ఎదురు చూస్తున్నాను" అన్నాడు.

ఆది చెప్పుతున్నపుడు సంజయ్ కళ్ళలో నీళ్ళు రావటం చూసి చలించి పోయింది కేథరీన్. అతని మాటల్లో, ప్రేమలో నిజాయితీ స్పష్టంగా తెలుస్తోంది. 

"సంజయ్ ఉమ్మడి కుటుంబంలో అందరి మధ్య ఉండటానికి అలవాటు పడిన వాడివి నువ్వు, ఒంటరిగా లేదా ప్రేండ్స్ తో ఆపార్టుమెంటులో ఉంటూ ప్రైవసికి అలవాటు పడిన వ్యక్తిని నేను" అంది కేథరీన్.

"ని కోసం నేను ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటాను, పెళ్లి అయిన తర్వాత మనిద్దరమే ఉందాం" అన్నాడు సంజయ్ దృడంగా.

"అది మాత్రమే కాదు సంజయ్, మన మద్య ఎన్నో తేడాలు ఉన్నయ్. సంస్కృతిలో, ఆహారపు అలవాట్లలో, జీవన విధానం లో. పెళ్లి అయిన తర్వాత మనం సుఖంగా ఉండలేం." అంది కేథరీన్ అతన్ని సముదాయిస్తూ.

"దయచేసి కాదనకు కేథరీన్, నన్ను నేను మార్చుకుంటాను. అంత నీ  ఇష్ట ప్రకారమే జరిగేలా చూస్తాను" అంటూ బ్రతిమాలాడు సంజయ్.

"సరే సంజయ్.  నేను ఇండియా వచ్చి మీ కుటుంబ పరిస్తితులూ చూసి నాకు నచ్చితే, నేను మీ వాళ్ళకు నచ్చి మన పెళ్లి వారికి ఇష్టమయితే ఒప్పుకుంటాను" అంది కేథరీన్  కరాకండిగా.

"యాహూ..... థాంక్యూ....... థాంక్యూ వెరీమచ్" అంటూ బిగ్గరగా అరిచాడు సంజయ్.

రెస్టారెంటులో అందరు తననే చూస్తున్న బిగ్గరగా నవ్వుతూ ఏదో ఏదో అరుస్తూనే ఉన్నాడు సంతోషంతో.

ఆతర్వాత పది రోజులకు ఇద్దరు ప్రయాణం అయి ఇండియా వెళ్లారు. ఎయిర్‌పోర్టుకు వాళ్ళ ప్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు ఇద్దరు ముసలి వాళ్ళు తప్ప.  అందరి పెద్దల కాళ్లకు నమస్కారం చేస్తున్నాడు సంజయ్, వాళ్ళు "ఆయుష్మణ్ భవ" అంటూ దివిస్తున్నారు. కేథరీన్ కు అదంతా వింతగా ఉంది.

ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క వృద్దుడు, వృద్దురాలు కుర్చీలో కూర్చుని ఉన్నారు హాల్లో. సంజయ్ ఇద్దరి కాళ్లకు నమస్కరించాడు, ప్రక్కనే ఉన్న కేథరీన్ ని కూడా చేయమని సైగ చేశాడు. కేథరీన్ కూడా ఇద్దరికి నమస్కారం చేసింది.

సంజయ్ నాన్నమ్మ తనను లేవనెత్తి నుదుటి మీద ముద్దు పెట్టుకుని "గాడ్ బ్లెస్ యు" అంటూ దీవించింది. ఆ మాట తాను ఎన్నో సార్లు వింది కానీ ఆవిడ మాటల్లో ఆప్యాయత, కళ్ళలో నిజాయితీ కేథరీన్ కు స్పష్టంగా కనిపించాయి.

స్నానాలు అయిన తర్వాత భోజనాలకు కూర్చున్నారు. చాలా రకాల వంటలు కనిపించాయి టేబులు మీద. అందరు కేథరీన్ కోసం ఎదురు చూస్తున్నారు.

"సారి మీరు మొదలు పెట్టవలసింది. నా కోసం అనవసరంగా ఎదురు చూడటం" అంది భాధ పడుతూ. 

"నువ్వు మా అథితివి, నువ్వు తిన కుండా మేము తినడం కలలో కూడా జరుగదు" అన్నాడు సంజయ్ తాతయ్య.

సంజయ్ అమ్మ, పిన్ని, నాన్నమ్మ అందరికి కొసరి కొసరి ప్రతి ఒక్కటి వడ్డిస్తున్నారు. వాళ్ళలా  ప్రేమగా వడ్డిస్తుంటే కేథరీన్ కూడా రోజుకన్నా ఎక్కువగా తినేసింది.

బోజానాలు అయిన తర్వాత అందరు సంజయ్ ను అమెరికా విషయాలు అడుగసాగారు. మద్య మద్య లో కేథరీన్ తో మాటలు కలుపుతూ. ముఖ్యంగా అతని చెల్లెలు వాళ్ళ పరిచయం, ప్రేమ గురించి అరాతిస్తు అతన్ని ఆట పట్టించ సాగింది.

ఎప్పుడు ప్రైవసి పేరుతో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడిన కేథరీన్ కు వారితో ఉంటే సమయమే తెలియ లేదు. ఇదంతా కొత్తగా, చాలా బాగుంది తనకు. తన దేశంలో ఇలాంటివి ఉండవు. కుటుంబం అంత కలిసి బోంచెయటానికి నెల రోజుల ముందు ప్లాన్ చేయాలి. ఏదో పండుగ లేదా సందర్బం వస్తే తప్ప సాద్యం కాదు. అలాంటిది వీళ్ళు ఇంత సంతోషంగా కలిసి ఉంటూ పండుగను గుర్తుకు  తెస్తున్నారు.

సాయంత్రం భోజనాలు అయిన తర్వాత ఇంటి డాబా మీద ఇద్దరు మాట్లాడుకుంటుండగా అడిగింది సంజయ్ ను కేథరీన్ "అసలు మీ మద్య గోడవలే రావ !" అని.

"ఎందుకు రావు, మేము మామూలు మనుషులమే కాద.  కానీ అలిగి మాట్లాడక పోవటం ఉండదు. వెంటనే ఎవరో ఒక్కరూ రెండో వారిని పలకరించేస్తారు, గొడవ మార్చిపోతారు" అన్నాడు సంజయ్.

"ఇదంతా నాకు కొత్తగా ఉంది" అంది కేథరీన్.

"ఏంటి మా అమ్మ, పిన్ని, నాన్నమ్మ వాళ్ల ఇంగ్లీషు తో నిన్ను భయపెడుతున్నార?" అంటూ నవ్వాడు సంజయ్.

"భాష ముఖ్యం కాదు. మన చేష్టలు, ఎదుటి మనిషి పట్ల ఆదరణ ముఖ్యం. అవన్నీ పుష్కలంగా ఉన్నాయి మీ వాళ్ళకు" అంది కేథరీన్ దృడమయిన స్వరంతో. 

అలా చూస్తూ చూస్తుండగానే రెండు వారాలు అంతే హాయిగా గడిచి పోయాయి.

"ఏమీ ఆలోచించవు కేథరీన్ మన పెళ్లి గురించి" అన్నాడు సంజయ్.

కేథరీన్ ఏమీ మాట్లాడ కుండా మౌనంగా ఉండి పోయింది.

మళ్లీ అడిగాడు "నీకు నచ్చక పోతే పర్వాలేదు, నాకు అదృష్టం లేదనుకుంటాను" అన్నాడు.

దానికి కేథరీన్ "అదృష్టం నీకు లేక పోవటం కాదు సంజయ్ నాకు లేదు" అంది.

"కాస్త అర్దం అయ్యేలా చెప్పు కేథరీన్" అన్నాడు సంజయ్ ఆత్రంగా.

"ఇక్కడకు వచ్చే ముందు నేను చాలా భయపడుతూ వచ్చాను. నిజానికి నీకు ఏదో కారణం చూపించి నో చెప్పాలని అనుకున్నాను. కానీ ఇక్కడకు వచ్చాక నో చెప్పటానికి నాకు ఏ కారణం దొరకలేదు. మీ సంస్కృతి, జీవన విదానం ఎంతో గొప్పవి. ఎవరికయినా నచ్చి తీరుతాయి. ప్రైవసి పేరు తో ఒంటరి తనానికి అలవాటు పడిన నాకు, మీ కుటుంబం కలిసి ఉండటంలో ఉండే సుఖం భాగా నేర్పించింది. మేము జీవితం లో కోల్పోతున్న విషయాలు బాగా గుర్తు చేసింది" అంటున్నపుడు కేథరీన్ గొంతులో తడి.

సంజయ్ విస్మయపడుతూ ఆమెనే చూస్తున్నాడు.

"పైకి అందంగా ఉంటాను తప్ప, నా మనసు అంత అందమయినది కాదు సంజయ్. డేటింగ్ పేరు తో హైస్కూలు నుంచే మగ పిల్లలతో తిరగటం అలవాటయిన నాకు, నీలాంటి నిజాయితీ ఉన్న ప్రేమికుడు దొరకటం నిజంగా అదృష్టమే. ప్లైటు ఛార్జీలు పెరిగి పోయాయని ప్రయాణం వాయిదా వేసుకుని, నా కోసం, నా ప్రేమ కోసం వెంటనే బయలు దెరావు. ఆ నిజాయితీ, ఆ నిర్మలమయిన  ప్రేమ నాలో లేవు" ఆమె కళ్ళలొ కనిళ్ళు కారిపోతున్నాయి.

"నీ  కుటుంబం నచ్చితేనే మన పెళ్లి అన్నాను. అలా అయినా  నీ నుంచి తప్పు కోవచ్చని. కానీ మీ వాళ్ల ముందు పూర్తిగా ఓడి పోయాను. తల్లి తండ్రి ఎప్పుడు ముసలి వాళ్ళు అవుతరా,  వెంటనే వారిని ఓల్డ్ ఏజ్ హోం లో చేర్పించి చేతులు దులుపుకునే మేమెక్కడ. వారికి పెత్తనం ఇచ్చి వాళ్ళను గౌరవించే మీరెక్కడ. నన్ను క్షమించు సంజయ్ నిన్ను పొందే అర్హత నాకు లేదు" అంటున్నపుడు కేథరీన్ గొంతు మూగపోయింది  దుఖం తో.

"అన్నట్టు చెప్పటం మరిచాను ఎళ్ళుండే నా అమెరికా ప్రయాణం. మీ వాళ్ళు అందరినీ చూశాక ఎప్పుడు లేనిది నాకు మా అమ్మ, నాన్న గుర్తుకొస్తున్నారు" అంటూ వెళ్తున కేథరీన్ ను వీస్తూపోతూ అలాగే చూస్తూ ఉండి పోయాడు సంజయ్.

ఎప్పటికయిన తను పెళ్ళికి ఒప్పుకుంటుందన్న ఆశతో.

(సమాప్తం)