16, జులై 2012, సోమవారం

టిచర్

(ఒక ఆంగ్ల కథకు స్వేచ్చానువాదం)

ఆటో దిగి స్కూలు ఆవరణలోకి అడుగు పెట్టింది శాంతి. ఎదురుగ పెద్ద బోర్డు "విశ్వ భారతి హైస్కూల్" అని. తనకు టీచరు గా  ఈ రోజు మొదటి రోజు ఆ స్కూల్ లో. ఇంతకూ ముందు వేరే స్కూల్స్ లో పనిచేసింది కాని అవి చిన్నవి  ఇంత  పెద్ద స్కూల్ లో పనిచేయటం ఇదే  మొదటిసారి.

డిగ్రి అయిపోవటం తోనే టిచరు  ఉద్యోగంలో చేరింది. చదివించే  స్తోమత తన తల్లితండ్రులకు ఉన్న చదివే తెలివితేటలూ తనకు ఉన్న తనకు ఏంతో ఇష్టమయిన ఈ ఉద్యోగంలో చేరింది శాంతి.
 
ప్రిన్సిపాల్ రూంలోకి  అడుగుపెట్టి "గుడ్ మార్నింగ్ మేడం" అంటూ విష్ చేసింది.

"వేరి గుడ్ మార్నింగ్ శాంతి" అంటూ ఆహ్వానించింది ప్రిన్సిపాల్. తనముందు ఉన్న కుర్చీ చూపించి కుర్చోమంటూ సైగ చేసింది.

"శాంతి నిన్ను 5th  క్లాస్,  క్లాస్ టిచరుగ ఆపాయింట్  చేస్తున్నాను. ఇక్కడ మేము ప్రతి స్టూడెంట్ విషయంలో ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటాము అందుకే చాల తక్కువ మందికి అడ్మిషన్స్ ఇస్తాము. ఏ  స్టూడెంట్ వెనుక బడిన నువ్వే భాద్యత తీసుకుని ఆ స్టూడెంట్ ఇంప్రూవ్ అయ్యేలా చూడాలి" అంది ప్రిన్సిపాల్.

"అలాగే మేడం,  I will try my best" అంటూ చెప్పి క్లాసుకు బయలు దేరింది శాంతి.

క్లాసులోకి అడుగు పెట్టగానే పిల్లలందరూ "గుడ్ మార్నింగ్ టిచర్" అంటూ లేచి విష్ చేశారు.

"వేరి గుడ్ మార్నింగ్ అండ్ సిట్ డౌన్" అంటూ తన కుర్చీలో కూర్చుంది.

 "డియర్ స్టూడెంట్స్, నా పేరు శాంతి. నేను మీ క్లాస్ టిచర్ ను.  అంతే కాకుండా  నేను మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్ చెప్తాను. మీకు ఏ  సబ్జెక్టు లో ఏ  సమస్య ఉన్న నన్ను అడగండి.  ఇంకా ఏవిషయం అయిన నాతొ డిస్కస్ చెయ్యండి. ఇప్పుడు  మీరందరూ మీ పేర్లు చెప్పి పరిచయం చేసుకోండి" అంటూ చెప్పింది శాంతి.

పిల్లందరూ ఒక్కొక్కరుగా లేచి  తమ పేర్లు చెపుతూ  పరిచయం చేసుకుంటున్నారు. చివర బెంచికి వచ్చేసరికి ఓ కుర్రాడు పైకి లేవటం లేదు. అతని పక్కన మరో కుర్రాడు దూరంగా కూర్చున్నాడు అదే బెంచి లో. 

శాంతి ఆ కుర్రాడి  దగ్గరికి వచ్చి "నీ పేరేంటి" అని అడిగింది.

ఉలుకు లేదు పలుకు లేదు. కొంపదీసి మూగవాడ అని అనుమానం వచ్చింది శాంతి కి.

మళ్ళి  "లేచి నిలబడు" అని రెట్టించింది.

అయినా ఎ స్పందన లేదు. ప్రక్కన ఉన్న కుర్రాడిని అడిగింది "ఏమయింది అతనికి" అని.

"వాడేప్పుడు అంతే  మేడం, ఏదో లోకం లో ఉంటాడు" అన్నాడు.

"ఇంతకూ అతని పేరేంటి" అని అడిగింది శాంతి.

"వికాస్ మేడం" అన్నాడు ఆ కుర్రాడు. 

అందరి పరిచయాలయ్యాక అందరు టిచర్ల లాగె తాను పెద్ద అబద్దం అడేసింది  పిల్లలతో "నాకు మీ అందరు సమానమే. ఎ ఒక్కరు ఎక్కువ కాదు ఎ ఒక్కరు తక్కువ కాదు" అని.

కాని తనకు మాత్రం తెలియదు వికాస్ లాంటి స్టూడెంట్స్ ను ఎలా సమానంగా చూస్తుంది. ఆ పిల్లాడిని చూస్తుంటేనే కంపరం వేస్తుంది. వారం రోజులుగా స్నానం చేయలేదేమో! ఆ బట్టలు అంత  మురికిగా ఉన్నాయి. 

వారం రోజులుగా చూస్తోంది మిగత పిల్లలతో కలిసే వాడు కాదు వికాస్. అతనితో వేరే పిల్లలు మాట్లడటం కూడా తను చూడలేదు. ఇప్పటికి ఏ  రోజు క్లాసు లో ఉషారుగా ఉండటం చూడలేదు. ఎప్పుడు నిద్ర మొహంతో ఉంటాడు లేదా నిర్లిప్తంగా శున్యంలోకి చూస్తుంటాడు. ఎప్పుడయినా కారిడార్లో ఎదురయితే అసలు విష్ కూడా చేయడు  మిగత పిల్లల లాగ. 

రెండు నెలలయినా ఇదే  వరస. ఏ ఒక్క నోట్స్ రాస్తునట్లు కనిపించడు. తను ఇదివరకు చేసిన చిన్న స్కూల్ లో అయితే వెంటనే తన పేరెంట్స్ ను పిలిచి మాట్లాడేది. కానీ ఇది పెద్ద స్కూలు కావటంతో హాఫ్ఇయర్లి దాక భరించక తప్పదు. 

ఓ మూడు నెలల తర్వాత ప్రిన్సిపాల్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి ప్రతి క్లాసు టిచరుకు. క్లాసు లో  ప్రతి స్టూడెంట్   రికార్డు స్టడీ  చేసి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు  చెయ్యమని. శాంతి అందరి రికార్డ్స్ చూస్తూ వికాస్ రికార్డ్ మాత్రం చివరలో పెట్టింది.

అందరు పిల్లలవి అయిన తర్వాత వికాస్ రికార్డ్ తెరిచిన శాంతి కి చాల ఆశ్చర్యం వేసింది. తన పస్ట్ క్లాసు టిచరు  రాసిన నోట్స్ చూసి,  "వికాస్ చాల తెలివయిన కుర్రాడు, తన నోట్స్ చాల నీటుగా, బాగా రాస్తాడు" అని.

ఆతర్వాత రెండవ క్లాసు టిచరు  నోట్స్ కూడా అంతే  ఉంది దాదాపుగా "వికాస్ చాల చురుకయిన కుర్రాడు, అతన్ని క్లాసు పిల్లలందరూ ఇష్టపడుతారు" అని.

ఆతర్వాత మూడవ క్లాసు టిచరు ఇలా రాసింది "వికాస్ తల్లి మరణంతో కృంగి పోతున్నాడు, ఇదివరకటిల చురుకుగా ఉండటం లేదు".

ఆతర్వాత నాలుగవ క్లాసు టిచరు ఇలా రాసింది "వికాస్ చదువు పట్ల శ్రద్ధ చూపటం లేదు, క్లాసులో నిద్ర పోతున్నాడు. ఇప్పుడతనికి పెద్దగ స్నేహితులు కూడా లేరు, ముందు ముందు తన  పరిస్తితిని చక్కదిద్దే మార్గాలు చూడాలి".  

ఇవ్వన్ని  చదివిన శాంతికి ఆ పిల్లాడి పరిస్తితి పూర్తిగా అర్థం అయింది. మరునాడు వికాస్ ను పిలుచుకుని అతని కుటుంబ విషయాలు అడిగి తెలుసుకుంది. తన తండ్రి ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాడని, తను మాత్రం తన అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటుంటే,  తండ్రి నెల నెల డబ్బులు పంపిస్తుంటాడని  చెప్పాడు. ఇలా  రెండు రోజులు తనతో వరుసగా మాట్లాడటంతో ఎదురయినప్పుడు కనీసం విష్ చేస్తున్నాడు వికాస్. 

ఓ రోజు శాంతి "పిల్లలు రేపు నా పుట్టిన రోజు మీ అందరికి నేను లంచ్ తెప్పిస్తాను మీరు మీ బాక్స్ లు తెచ్చుకోవద్దు" అని చెప్పింది.

మరునాడు పిల్లలందరూ ఏవో మంచి మంచి ప్యాకేట్స్ తో ఏవో గిప్ట్స్ తెచ్చారు. అన్ని ప్యాకేట్స్  చాల నీటుగా మంచి అందమయిన పేపర్లతో ఉన్నాయి. కాని వికాస్ తెచ్చిన ప్యాకెట్ మాత్రం ఏదో న్యూస్ పేపర్లో దారంతో ఉండ చుట్టినట్లుగా ఉంది. అది చూడగానే పిల్లలందరూ నవ్వటం మొదలు పెట్టారు. వికాస్ సిగ్గుతో తలదించుకున్నాడు. 

శాంతి ఆతి కష్టం మీద అ పేపరు విప్పింది, అందులో ఓ పైవ్ స్టార్ చాక్లెట్ చుట్టబడి ఉంది. అది చూసి పిల్లలందరూ ఘోల్లు మని నవ్వారు.

"ఎందుకు నవ్వు తున్నారు, అసలు నాకు పైవ్ స్టార్ చాక్లెట్ అంటే చాల ఇష్టం. ఇప్పటికి కూడా రోజుకోక్కటయిన ఖచ్చితంగా తింటాను" అంటూ వికాస్ దగ్గరికి వచ్చి "నా ఇష్టని బాగా తెలుసుకున్నావ్ వికాస్ చాల థ్యాంక్స్" అంటూ తల నిమిరింది.

దానికి వికాస్ "మేడం, మీరు అచ్చం మా అమ్మలాగే తలనిమురుతున్నారు" అన్నాడు.

శాంతికి ఒక్కసారిగా దుఃఖం పోంగుకోచ్చింది. క్లాసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ గంట సేపయినా  ఏడ్చి ఉంటుంది. 

ఆ రోజు నుంచి  తను వికాస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మొదలు పెట్టింది. వికాస్ తొందరగానే కోలుకోవటం మొదలు పెట్టి చురుకుగ మారసాగాడు. తను ప్రోత్సహిస్తున్న కొద్ది రెట్టించిన ఉత్సాహంతో చదవటం మొదలు పెట్టాడు. రెండు నేలలయ్యేసరికి మిగత పిల్లలతో సమానంగా తయారయ్యాడు.

ఆరు నేలలయ్యే సరికి క్లాస్ పస్ట్  రావటం మొదలు పెట్టాడు.  అంతే  కాకుండా శాంతికి ఇష్టమయిన స్టూడెంట్ గా మారి పోయాడు.  పై క్లాసులకు వెళ్ళిన కూడా వికాస్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేది శాంతి. తనకు తోచిన సలహాలు ఇస్తూ ఉండేది. 

ఆలా  హైస్కూలు చదువు ముగించుకుని వెళ్తున్న వికాస్ చివరి రోజు శాంతికి చెప్పకుండానే వెళ్ళి పోయాడు. శాంతి చాల భాద పడింది.

వారం తర్వాత ఓ ఉత్తరం వచ్చింది అందులో ఇలా రాసిఉంది "ప్రియమయిన మేడం కు వికాస్ రాయునది, మీకు చెప్పకుండా వచ్చినందుకు నన్ను క్షమించండి. కాని మిమల్ని వదిలి వెళ్తున్నాననే నిజని తట్టుకొనే శక్తి నా మనసుకు లేదు. అందుకే మీరింకా నా వెన్నంటే ఉన్నారన భావన తోనే నా మనసును మభ్యపెట్టి పై చదువులకు వెళ్తున్నను. ఎప్పటికి మీలాంటి టిచరు నా జీవితంలో తరసపడక పోవచ్చు. ఒక్క వెళ్ళ తరస పడితే మీకు తప్పకుండ తెలియ చేస్తాను".

ఆ ఉత్తరం చదివిన శాంతి మనసు గర్వంతో నిండి పోయింది. 

కాల చక్రం గిర్రున తిరిగి పోయింది. శాంతి కి పెళ్లి అయిపొయింది,  పిల్లలు పుట్టారు. తనకు రిటైర్మెంట్ వయసు కూడా వచ్చెసింది. ఆ రోజు తన పుట్టిన రోజు అంతే  కాకుండా రిటైర్ అవుతున్న రోజు. మనసులో దుఖం పోగుకొస్తుంది.  అయినా  సంతోషంగా ఉండాలని,  ఎప్పటిలాగే ఉండాలని ప్రయత్నిస్తోంది.

అటో దిగి స్కూల్ ఆవరణ లోకి అడుగు పెట్టగానే చాల ఆశ్చర్య పోయింది. స్కూల్ అంత అందంగా అలంకరించబడింది, స్కూల్ డే నాడు కూడా అంత  అందంగా ముస్తాబు కాలేదేమో. 

స్టాప్ రూంలోకి  అడుగు పెట్టగానే టీచర్లు అందరు ఒక్క సారిగా  "హ్యాపి బర్త్ డే టుయు"   అంటూ విష్ చేసారూ.

ప్రేయర్ మీటింగ్ కు వెళితే అక్కడ కూడా పిల్లలందరూ కోరస్ గా "హ్యాపి బర్త్ డే టుయు, హ్యాపి బర్త్ డే  టుయు మేడం" అంటూ విషేష్ చెప్పారు. మనసంతా సంతోషంతో పులకరించి పోతోంది. క్లాసులన్ని అయిపోయాక సాయంత్రం తన రిటైర్మెంట్ పార్టి ఏర్పాటు చేసారు.

స్టేజ్ మీదికి సీనియర్ టీచర్స్  అందరిని పిలిచారు. "తర్వాత శాంతి మేడం గారి ప్రియ శిష్యుడు వికాస్ ను స్టేజ్ పైకి ఆహ్వానిస్తునం" అనగానే శాంతి గుండె వేగం పెరిగింది.

ఆత్రుతగా జనంలోకి చూడసాగింది. ఓ కుర్రాడు నడుచుకుంటూ వచ్చి స్టేజ్ ఎక్కి తన దగ్గరికి వచ్చి "హ్యాపి బర్త్ డే  మేడం" అంటూ విష్ చేసాడు. శాంతి కి  పట్టరాని సంతోషం వేసింది. 

వికాస్ క్లాస్ మేట్స్ ఒక్కోకరుగా వచ్చి తన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరిని వికాస్ పోగుచేసి ఉంటాడని శాంతికి అర్ధం అయిపొయింది.  చివరగా వికాస్ ను పిలిచారు మాట్లాడమని. మాటలు తడబడుతయేమోనని కాగితంలో రాసుకొచ్చాడు తన స్పిచు. మైక్ ముందుకు రాగానే గొంతు పెగలలేదు తనకు. కళ్ళలోంచి  కన్నీరు కారి పోతున్నాయ్.

చివరగా "నన్ను క్షమించండి" అంటూ స్టేజ్ దిగి పోయాడు. అయిదు నిముషాలు చప్పట్లతో మారు  మ్రోగిపోయింది ఆ ప్రాంతం. 

చివరగా శాంతిని మాట్లాడమని పిలిచారు. "నాకు ఏమి మాట్లడాలో ఆర్థం కావటం లేదు. కాని నాకు తెలిసిన,  ఇక్కడున్న మీ అందరికి తెలిసిన ఓ గొప్ప నిజన్ని మీకు చెప్పదలచు కున్నాను. ఎ స్టుడెంటయిన  సరిగా   చదవక పొతే దానికి ఏదో కారణం ఉండి  తీరుతుంది. వారిని ఆప్యాయంగా చేరదీసి వారి సమస్యలు తెలుసుకుని ప్రోత్సహిస్తే తప్పకుండ ప్రయోజకులవుతారు. అందుకు చక్కని ఉదాహరణ వికాస్. తనకు నేను చేసిందేమీ లేదు భుజం తట్టి ప్రోత్సహించటం తప్ప. నన్ను అబిమానించి  ఈ రోజును  ఇంత  ప్రత్యేకంగా మార్చిన మీ అందరికి కృతఙ్ఞతలు" అంటూ ముగించింది. 

అంత అయిపోయాక  వచ్చి కలిసాడు వికాస్. తను ఇప్పుడు డాక్టర్ నని అమెరికాలో సెటిల్ అయినట్టుగ చెప్పాడు. తన రిటైర్మెంట్ కోసం గత మూడేళ్ళుగా ప్లాన్ చేస్తునట్లు చెప్పాడు.

"మీకు ఏ  విధమయిన అవసరం ఉన్న నాకు ఒక్క పోన్ చెయ్యండి" అంటూ చెప్పి వెళ్తున్న వికాస్ ను ఆలాగే  చూస్తూ ఉండి పోయింది శాంతి.

(సమాప్తం)