6, మే 2009, బుధవారం

నిజాయితీ నీవెక్కడ ?

కూలి పనికి వెళ్లి అయ్యా
కూడబెట్టిన డబ్బు
కొట్టు కెళ్ళినప్పుడు మిగిలితే
పాత చీరలో అమ్మ దాచిన చిల్లర
ఉడ్చుకెళ్ళి ఉద్యోగానికై
దరఖాస్తు పెట్టాను
నా వారి కడుపు కొట్టాను

పగలంతా మట్టిపురుగాయి
రాత్రంతా గుడ్డిదిపం వద్ద
వెలుతురు పురుగాయి
పుస్తకాలు తోలిచేశాను
నా నిద్రను, అలసటను
అమ్మ నాన్నల అశాలకై బలి చేశాను

పరిక్ష సమయం వచ్చేసింది
పట్నం వెళ్లి కొడుకు
పరీక్షా రాయాలని
అప్పు కావాలని నాన్న తిప్పలు
చివరికి చెల్లి కాలి పట్టాలు
నా ప్రయాణానికి కరిగి పోయాయి
ఆవేళ నా చెల్లి కన్నీరు
ప్రవాహమై నన్ను ముంచేసిన బాగుండు

నా తల్లి పూజలు పాలించాయి
నా కష్టానికి చివరికి ఫలితం దక్కింది
నాకు మొదటి స్థానం వచ్చింది
ఆవేళ నా తల్లి అనందం ముందు
ఎ సముద్రం పనికి రాదేమో
నా తండ్రి గర్వం ముందు
ఎవరెస్టు ఎత్తు కాదేమో
నా చెల్లి ఉషారు ముందు
ఎ ప్రవాహం కోరగాదేమో

ఇంటర్వులో అన్నింటికీ
సమాదానం చెప్పాను
తెలివయిన వాణ్ని అని
పొగడ్తలు పొందాను, కాని
బల్లకు మొలిచిన చేతులు
నా కొచ్చే కొలువును వేలం వేశాయి
డబ్బున్న పశువులు గాలం వేశాయి
నన్ను మెడపట్టి బయటకు తోశాయి

నా తండ్రి కష్టానికి ఫలితం ఎక్కడ?
నా తల్లి అశాలకు ప్రాణం ఎక్కడ?
నా చెల్లి త్యాగానికి అర్థం ఎక్కడ?
నా చదువుకు సార్థకత ఎక్కడ?
ఓ నిజాయితీ నివెక్కడ?

4, మే 2009, సోమవారం

యాచకుడు
ఉదయమవ్వటంతో మొదలు
చితికిన బ్రతుకు వ్యధలు
మోటారు మోతలతో మొదలు
నిన్న అసంపూర్తిగా తీరిన ఆకలి అరుపులు

గుడిలోని సుప్రబాతం
అతనికి స్వాగత గీతం
గుడి మెట్ల పై
మఠం వేసుకుని
యోగిలా కూర్చుంటాడు
చిల్లర యివ్వగానే
చల్లగా ఉండని దీవిస్తాడు
ధర్మం తల్లి అతని మంత్రం
బువ్వ పొందేందుకదే అతని సూత్రం

చిల్లుల చిప్పలో భక్తులు వేసే
కొబ్బరి చిప్పలే అతనికి నైవేద్యం
అప్పుడేనేమో దేవునితో సారూప్యం
రెండయిన చెప్పులు
కష్ట సుఖాలకు చిహ్నాలు
అతని మురికి చొక్కా
మనసులో కుళ్ళుకు రూపం
అసార అయిన వెదురుకర్ర
మనిషిని నిలబెట్టే విజ్ఞానపు స్థూపం

చిరిగి పోయిన జోలె లో
ఎన్ని వేసిన నిలుపు కొదు
ఎంతకూ నిండు కొదు
తృప్తి లేని మనసుకు
అది ఆకృతి కాదా ?
తరచి చుస్తే జీవితమంతా
అతని వద్దే ఉంది
నిజంగా చదివితే
వేదమంతా అతనిలో ఉంది

పావలా పైసలకై
దినమంతా సంచరిస్తాడు
యిసడింపులే
యిందనంగా సాగిపోతాడు
ఆకలి శక్తిని అరగిస్తున్నా
వెచ్చని కన్నిటిలో
మనసు ఉడికి పోతున్నా
గొంతులో అర్థతను అంతం చెయ్యడు
నిజమయిన నటుడు

అశాల సాగర తీరంలో
జీవితాన్ని రేపటి ఇసుకతో
గుళ్ళుగా కట్టుకునే
పసివాడతాను
దురదృష్టం సూర్యరశ్మికి
రేపటి యిసుక పొడిగా మారి
జీవితపు గూడు కులితే మాత్రం
పసివాడిలా మారాం చేయడు
కట్టడాలు తిరిగి మొదలెడుతాడు
అర్థం చేసుకుని అనుసరిస్తే
అతనొక ఆదర్శం

సగం ఖాళి ఉన్న పేగులు
గోల పెడుతున్నా
అలసి పోయిన ఒళ్ళు
పాడే జోలకు లొంగిపోతాడు
చెట్టు ఒడిలో ఓడిగిపోతాడు
రాత్రి వడి వడిగా కదుల్తుంది
చంద్రుడు త్వర త్వరగా పరుగేడుతాడు
తొందరగా తెల్లవారాలని
రేపయినా అతని ఆకలిపూర్తిగా తిరుతుందేమోనని