3, జనవరి 2018, బుధవారం

అభ్బా ఛ (మినీ నవల) - 3

ఆదిత్య రాగానే యస్ ఐ ఒక్కసారి తేరిపారా చూసి "పేరేంటి ?" అని అడిగాడు. 

"ఆదిత్య" అన్నాడు నింపాదిగా.

"దొంగను ఒక్క దెబ్బతో మూర్ఛ పోయేలా కొట్టవట ?" అడిగాడు యస్ ఐ ఆశ్చర్యపోతూ. 

"అంటే,  కంటి చూపుతో చంపే విద్య నాకు ఇంకా రాదు" అన్నాడు ఆదిత్య నవ్వుతు.  

"అరే ! సినిమా డైలాగు ! కానీ దొంగలను కొట్టటానికి నువ్వెవరమ్మా" యస్ ఐ వెటకారం ఆడాడు.  

"చెప్పాను  కదా ! ఆదిత్య.  మళ్ళి  మళ్ళి  అడుగుతున్నారంటే, మెమొరీ కార్డు ప్రాబ్లమా ?"  ఎగతాళిగా అడిగాడు ఆదిత్య. 

"నీ బాడీ లో చాల ఉందమ్మా  సిగ్నలు. ఒక్కసారి టవర్ రిపేర్ చేస్తే సెట్ అయిపోతుంది"  యస్ ఐ కోపంతో మీదికొచ్చాడు.

"అమ్మాయిని కాపాడితే కవరేజ్ రాకపోయినా పర్లేదు. కానీ క్లాస్ పీకుతుంటే బాధగా ఉంది" ఆదిత్య  బాధ నటిస్తూ అన్నాడు.

"నువ్వు ఒక్క దెబ్బ కొట్టగానే వాడు మూర్చపోతాడు. మేము అది నమ్మేసి, వెల్ డన్ !  నీ లాంటి హీరో లు ఇంకా రావాలి అని చెప్పి చప్పట్లు కొట్టి,  లాఠీలు పిసుక్కుంటూ పోతాం" యస్ ఐ ఆవేశంగా ఊగిపోయాడు.

"సార్ ! కొట్టే పంచ్ ఇంకా చోటు కరెక్ట్ గా ఉంటె అదేం పెద్ద కష్టం కాదండి.  మీకు నమ్మకం కుదరాలంటే ! అదిగో సూట్ అంకుల్,  ఒక్కసారి ఇలా రండి. ఇప్పుడే డెమో ఇస్తా మీకు" అని కన్మణి అంకుల్ ని పిలిచాడు  ఉషారుగా.

"దెబ్బలు డెమో ఇవ్వటానికి నేనేమన్నా సుమో నా ? ఎదో  తోచిన మాట  సహాయం చేస్తాం గాని, ఇలా యాక్షన్ సిన్ లు నాతో కాదు సార్"  అన్నాడు కన్మణి అంకుల్ ఏడుపు మొహం పెట్టి.

అక్కడే ఉన్న పెద్దావిడ "నువ్వే కదరా, బాబు మీద చాడీలు చెప్పింది. మళ్ళి నాతోని గాదు నీతోని గాదు అంటావ్" అంది గుడ్లురిమి చూస్తూ.

"సార్..... సార్.... సార్ దయచేసి కాపాడండి సార్. ఈ ముసల్ది ఇంతకూ ముందు కూడా రెండు చెంపలు వాయించింది. దెబ్బకు బస్సు లోనే చుక్కలు కనిపించాయి" అని రెండు చేతులు జోడించి  బ్రతిమాలాడు కన్మణి అంకుల్.

మిగత ప్రయాణికులు కొంతమంది "ఎదో రకంగా అమ్మాయిని కాపాడితే, ఆ కుర్రాణ్ణి  పటుకుంటారేంటి" అని ప్రశ్నించారు యస్ ఐ ని.

దానికి యస్ ఐ ఆదిత్య తో "బస్సు లో చాల మంది ఫాన్స్ ఉన్నట్లున్నారు" అన్నాడు  వెక్కిరింపుగా.

దానికి ఆదిత్య "అంటే,  దొంగోడొచ్చి హీరో అన్నాడు. అంతే ! అందరు నమ్మేసి ఫాన్స్ అయిపోయారు. ఈ మధ్య  పోలీసులకన్నా, దొంగలు చెబితేనే బాగా నమ్ముతున్నారు సార్ జనాలు" అన్నాడు అమాయకంగా.

"ఏంట్రా పోలీసుల మీదే కామెడీ చేస్తున్నావ్" అని కోపంగా చొక్కా పట్టుకుని లాగాడు యస్ ఐ.

"మన మీద మనమే జోకులేసు కోవాలి సార్. అప్పుడే పక్కోడికి ఛాన్స్ ఉండదు" అన్నాడు ఆదిత్య చొక్కా విడిపించుకుంటూ.

"మన మీద మనమే నా ? అంటే నువ్వు......" అని ఆశ్చర్యంగా ఆగిపోయాడు యస్ ఐ.

"కరెక్ట్ ! ఆదిత్య ఐ పి య స్ " అన్నాడు గర్వంగా కాలరెగరేస్తూ.

"ఆదిత్య ఐ పి య స్" అని ఆశ్చర్య పోయి ధడేల్ మని సెల్యూట్ చేశాడు యస్ ఐ.

"అంటే ! ఐ పి య స్ ఐస్ ఆన్ ది వే. ప్రస్తుతానికి ఓన్లీ యస్ ఐ మాత్రమే. ఐ పి యస్ ఎంట్రన్స్  రాయటానికె చెన్నై ఎల్తున్న. తప్పకుండా సెల్యూట్ చేసే అవకాశం మీకిస్తాను సార్" అన్నాడు ఆదిత్య చమత్కరిస్తూ.

యస్ ఐ మరియు మిగతా పొలిసు లు పగలబడి నవ్వారు.  కన్మణి అంకుల్ భయపడుతూ వెళ్ళి తన సీట్ లో నక్కాడు.

కొద్దీ సేపటికి గమిని ఆదిత్య పక్కకు వచ్చి కూర్చుంది. తర్వాత చిన్నగా  "వెరీ సారీ ఫర్ డౌటింగ్ యూ. అంత సూట్ అంకుల్ రైజ్ చేశాడు" అంది నొచ్ఛుకుంటు.

"అనుమానం ఎప్పటికయినా మంచిదే. ఎదో ఒక లీడ్ కి ఛాన్స్ ఉంటుంది. అనుమానం లేక పొతే ఏది ఉండదు, మిస్టరీ అలాగే ఉండి పోతుంది" అన్నాడు ఆదిత్య లెక్చర్ ఇస్తున్న ధోరణిలో.

"అర్థం అయింది. ఎక్సమ్ కు బాగా ప్రిపేర్ అయినట్లు ఉన్నారు. కానీ మీరు నిజంగా పోలిసెనా ?" అడిగింది గమిని ఆశ్చర్య పోతూ.

"నిజంగానే పోలీస్ అండి"

"యూ మీన్ ! అంకుశం రాజ శేఖర్, పోలీస్ స్టోరీ, విజయ శాంతి కర్తవ్యం. ఆ పోలీసేనా"

"దీనికి సినిమా పిచ్చి మరీ పీక్స్ లో ఉంది. దేన్నైనా సినిమాల్లోనే నేర్చుకునెలా ఉంది" అని మనసులో తిట్టుకుని "అయ్యో అవ్వన్నీ మమల్ని చూసి తీసిన సినిమాలండి. అంతే కానీ సినిమాలు చూసి మేము పోలీసులు కాలేదు" అన్నాడు సరదాగా నవ్వుతు.

"నాకింకా నమ్మ బుద్ది కావటం లేదు. మీ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని ఆశ్చర్యంగా ఉంది" అంది గమిని ఆదిత్య ను వింతగా చూస్తూ.

"పోలీస్ ప్రొఫెషన్ అంత బ్యాడ్ ప్రొఫెషన్ కాదండి. ఇట్ ఐస్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టింగ్" అని అంటుండగానే మధ్యలో ఆపేసింది గమిని.

"అయ్యాయో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ప్రొఫెషన్ గురించి తప్పుగా అనలేదండి. కానీ యంగ్ పోలీస్ లను నేను సినిమాల్లోనే చూడటం. బయట అంత అంకుల్ పోలీస్ లే కదా ఉంటారు " అంది గమిని ఎగతాళి చేస్తూ.

"పొలిసులు కూడా మనుష్యులేనండి. వాళ్ళు కూడా ముసలోళ్లు అవుతారు. సినిమాల్లో హీరోయిన్ లను చూసి అమ్మాయిలందరూ అందంగా ఉండలనుకోవటం ఎంత తప్పో, హీరోలను చూసి బయట పోలీసులు కూడా అలాగే సిక్స్ ప్యాక్ తో ఉండాలనుకోవటం అంతే తప్పు" అన్నాడు ఆదిత్య ఉక్రోషంగా.

"సారీ అండి నా ఉద్దేశ్యం అది కాదు. కానీ ఎవరయినా కుర్రాణ్ణి అడిగితె అమెరికా అంటాడు, సినిమా అంటాడు లేదా సాఫ్ట్ వేర్ అంటాడు. మీరు మాత్రం వెరైటీగా ఉన్నారు" అంది కుతూహలంగా.

"మనం చేసేది కావాలి వెరైటీ, దాంతో కొంతయినా బాగు పడాలి సొసైటీ. ఇది నేను ఎప్పుడో పదవ తరగతిలో రాసుకున్న నా సొంత కొటేషన్. దాన్ని బ్రతికించటం కోసమే నేను బ్రతుకుతున్నాను" ఆదిత్య సిరియస్ గా చెపుతున్నాడు.  గమిని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా వినసాగింది.

"ఇప్పటికి నా సాలరీ లో సగం ఛారిటీకె  పోతుందండి"

"తెలుసండి. దూకుడు లో మహేష్ బాబు  కూడా అంతే కదా" అప్రయత్నంగా అనేసింది గమిని.

"నిజానికి పోలీస్ అంటే,  ముందు తను మారి,  తర్వాత మార్పు కోరుకుంటాడు"

"తెలుసు !  కొమరం పులి లో పవన్ కళ్యాణ్ లా"

"ఏంటండీ నాకిది ! నేను నా అంబిషన్స్, ఐడియాలజీ గురించి చెపుతుంటే,  మీరు సినిమాల గురించి చెపుతారు. అవన్నీ నాలాంటి ఎందరో పొలిసు ల జీవితాలు కాపీ కొట్టి మీలాంటి వాళ్ళ మీదికి వదిలారు. ఇంకా రియల్ పోలీస్ కు ఐడెంటిటీ లేకుండా పోయింది" అన్నాడు  చిరాకు పడుతూ.

"హే హే సారీ సారీ. ఐ అం వెరీ లక్కీ టూ మీట్ యు. నా గురించి మీకు తెలుసుకోవాలని లేదా ?" అంది గమిని ఉషారుగా.

కాస్త శాంతించిన ఆదిత్య "కొంపదీసి మీరు హీరోయినా,  లేక మోడలా " అడిగాడు ఆశ్యర్యంగా.

"అంటే ! అమ్మాయి కొంచెం అందంగా ఉంటె హీరోయిన్ లేదా మోడల్ అని డిసైడ్ చేస్తారా ?" నొచ్చుకుంది గమిని.

"అలవాటు లో పొరపాటుగా గెస్ చేశాను గాని చెప్పండి"

"నేను డాక్టర్" అంది గమిని గర్వంగా.

"డాక్టర్ ! ఐ హేట్ డాక్టర్"

(ఇంకావుంది)